ఇపుడు స్మార్ట్ మంత్రం బాగావినబడుతోంది. థింక్ స్మార్ట్ అని కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు జపం మొదలు పెట్టాయి.ఏంటా స్మార్ట్ నెస్? దీనివల్ల ఎవరికి లాభం? మోడీ సర్కారు స్మార్ట్ సిటీల వెనుక గుట్టేంటి? అంతే కాదు బడ్జెట్ లో 7వేల కోట్లు కేటాయించేశారు. ఇంతకీ ఈ స్మార్ట్ సిటీలు ఎవరికోసం? 
నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్ డ్యామ్. ఈ నగరంలో స్మార్ట్ సిటీ మొబైల్ అప్లికేషన్స్ ద్వారా తమ రహదారులపై రవాణా రద్దీ గురించి ముందస్తు సమాచారాన్ని పౌరులకు అందిస్తుంది. ఆసి్ట్రయా రాజధాని వియన్నా పలు ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రపంచ టాప్ 10 స్మార్ట్ సిటీ జాబితాలో చేరింది. ఇన్నోవేషన్ సిటీలో 5వ స్థానం, రీజనల్ గ్రీన్ సిటీలో 4వ స్థానం, క్వాలిటీ ఆప్ లైఫ్లో ప్రథమ స్థానం, డిజిటల్ గవర్నెన్స్లో 8వ స్థానం సంపాదించింది.  కెనడాలోని ఒంటారియా రాజధాని టొరంటో స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోవడంలో ఆధునిక టెక్నాలజీ వినియోగమే ప్రధాన కారణం. స్పెయిన్ దేశానికి బార్సిలోనా నగరం, దక్షిణ కొరియాకు సోంగ్ డో నగరం, పోర్చుగల్ దేశానికి ప్లాన్ ఐటి వాలీ నగరం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మస్ దర్ నగరం, ఉన్నట్టే భారత దేశంలో కొన్ని స్మార్ట్ సిటీలు నిర్మించుకోవటమే సర్కారు ఆలోచన.
ప్రభుత్వ పాలన, విద్యుత్ సరఫరా, రవాణా, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఆరోగ్య సేవలు ఇవన్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తాయి. అంటే స్మార్ట్ సిటీలో టా్రఫిక్ లైట్ల నుండి,  ఇండిపెండెంట్ హౌస్ లు, అపార్ట్ మెంట్ లు, కమర్షియల్ భవనాలు అన్నీ నెట్ వర్క్ తో కనెక్ట్ అయి ఉంటాయి. ఇక వైర్లెస్ సెన్సర్లు ఎప్పటికప్పుడు వాతావరణ, ఇతర పరిస్థితులను గమనిస్తూ ప్రజలకు, అధికారులకు సమాచారమిస్తాయి. నీటి పైపుల్లో లీకేజీలున్నా, చెత్త కుండి నిండినా కార్పొరేషన్ అధికారులకు సమాచారం వస్తుంది. టా్రఫిక్ జామ్ల గురించి ప్రజలకు తక్షణ సమాచారం వస్తుంది. టా్రఫిక్ రద్దీ, వాతావరణ పరిస్థితులను బట్టి టా్రఫిక్ లైట్ల వెలుతురులో హెచ్చు తగ్గులుంటాయి. మెటొ్ర, మోనో రైల్ లాంటి సౌకర్యాలుంటాయి. ఈ వ్యవస్థ అంతా సవ్యంగా నడిచేలా 24గంటల కరెంటు సరఫరా ఉంటుంది.  అంతే కాదు.  స్మార్ట్ సిటీల్లో కరెన్సీ నోట్లు అవసరం లేదు. స్మార్ట్ కార్డులతో పనులన్నీ పూర్తవుతాయి. ఇళ్లలో లైట్లు ఆన్ ఆఫ్ చేయటానికి స్మార్ట్ కార్డ్ మాత్రమే చాలు. ఇంటి తలుపు తీయాలంటే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పనిచేస్తుంది.  దొంగలు ఇంట్లోకి పొరపాటున కూడా ఎంటరయ్యే అవకాశం ఉండదు. ఆటోమేటిక్ బిల్డింగ్ వ్యవస్థలు 24గంటలు వెయ్యికళ్లతో పహారా కాస్తుంటాయి. ఇవీ స్మార్ట్ సిటీ లక్షణాలు. సింపుల్ గా చెప్పాలంటే స్మార్ట్ సిటీ అంటే  పర్యావరణంతో స్నేహపూర్వకంగా మెలిగే నగరం. ప్రణాళికాబద్ధమైన, సాంకేతిక సేవలు పుష్కలంగా అందించే నగరం.
గ్రామాల నుంచి నగరాలకు వలసలు పెరుగుతున్నాయి. ఇలా వలస వచ్చే వారికి అనువుగా నగరాలు అభివృద్ధి చెందాలి. లేకపోతే,  ప్రస్తుతం ఉన్న నగరాలు త్వరలోనే నివాసయోగ్యం కాకుండా పోతాయి. ఇదీ ఆర్థిక మంత్రి బడ్డెట్ ప్రసంగంలో ఆర్ధికమంత్రి జైట్లీ చెప్పారు.  కానీ,  ప్రభుత్వం వైపు నుంచి స్మార్ట్ సిటీ అంటే క్లియర్ డెఫినిషన్ లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అంతా అనుకుంటున్న  స్మార్ట్ నిర్వచనాన్నే ఇక్కడా వాడుతున్నారు.
ప్రజల జీవన ప్రమాణాలు పెరగకుండా, వాటిని పెంచే ప్రయత్నాలు చేయకుండా, స్మార్ట్ అంటూ ఊగిపోవటం సరైన పని కాదంటున్నారు విశ్లేషకులు. అసలు ఇంతటి ఆధునిక టెక్నాలజీతో నిర్మించే నగరాలలో అరుణ్ జైట్లీ చెప్పినట్లు గ్రామీణ వలస ప్రజలకు అవకాశం ఉంటుందా ? ఈ స్మార్ట్ సిటీలో రోజువారీ కార్మికులు, అసంఘటిత, పారిశుద్ధ్య కార్మికులు, నివాస ప్రాంతాల్లో పాలు, కూరగాయలు అమ్ముకుని పొట్టకోసుకునే వాళ్లు, ఇలా అనేక తరగతుల ప్రజలు ఉండగలరా? లేక వారి పొట్టగొట్టే నగరాలు కాబోతున్నాయా ? సామాన్య ప్రజల పేరుతో సంపన్న వర్గం కోసం నిర్మించే సుందర నగరాలుగా మిగిలిపోనున్నాయా ? ఈ ప్రశ్నలకు సర్కారు నుంచి ఎలాంటి సమాధానం లేదు. అంతే కాదు. సర్కారు నిర్మిస్తామని చెప్తున్న స్మార్ట్ సిటీలకు సంబంధించి మరిన్ని ప్రశ్నలు చర్చకొస్తున్నాయి. ప్రతిపాదిత స్మార్ట్ సిటీ నిర్మాణానికి ఫాలో అవుతున్న విధి విధానాలు ఏంటి ? ఎంత భూమి అవసరం ? ఏఏ సేవలు అందుబాటులోకి తెస్తారు ? ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఎవరి పాత్ర, బాధ్యతలు ఏమిటి ? ప్రైవేట్ భాగస్వామ్యం ఏఏ రంగాల్లో అనుమతిస్తారు ? ఇలాంటి వివరాలు ప్రకటించాల్సిన అవసరం ఉంది.  అప్పుడే స్మార్ట్ సిటీలపై ప్రజలకు ఒక అవగాహన వచ్చే అవకాశం వుంది.
మింగమెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె సామెత పాతదే. కానీ, సందర్భం మాత్రం లేటెస్ట్.  సర్కారు ప్రకటనలు చూస్తుంటే, ఏదో అద్భుతం జరగబోతోంది. మాయాబజార్ లో నిర్మించినట్లుగా   అద్భుత నగరాలేవో ఆవిష్కరించబడతాయి  అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏది భ్రమో ఏది వాస్తవమో తెలియనట్టు ప్రజలు అయోమయంలో పడుతున్నారు. కానీ సర్కారెన్ని మాటలు చెప్పినా, కొంచెం స్పష్టంగా పరిశీలిస్తే నిజానిజాలు అర్ధం కాక మానవు. భారత దేశంలోని నగరాలు ఇప్పటికే మురికి వాడలతో నిండిపోయి ఉన్నాయి. ఒక్కో నగరంలో లక్షలాది మంది జనాలు దుర్భర జీవితం గడుపుతున్నారు. మురికివాడల్లో, చిన్న చిన్న గుడిసెల్లో, వేల కుటుంబాలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్నారు. మరో పక్క పల్లెలు నానాటికీ శిధిలాలుగా మారుతున్నాయి. గ్రామీణ భారతం నీరసించిపోతోంది. వ్యవసాయం పడకేస్తోంది. రైతులు పొలాలను వదిలి పట్టణాల వైపు, కూలి పనులకోసం వలస వస్తున్నారు. ఈ క్రమంలో అటు మురికివాడల ప్రజల బతుకులను బాగు చేయకుండా, ఇటు నాశనమౌతున్న గ్రామీణ భారతానికి చికిత్స ఇవ్వకుండా నగరాలను స్మార్ట్ చేస్తామనటం అర్థం లేని పని అనే విమర్శలు వినిపిస్తున్నాయి.  ముందు ప్రజలను స్మార్ట్ గా తయారు చేయాలి. ఆ తర్వాత స్మార్ట్ సిటీల ఏర్పాటు సంగతి ఆలోచించాలి. కానీ, మన ప్రభుత్వాలు పలుపుని కొన్న తర్వాత ఆవును కొన్నట్టుగా చేస్తున్నాయనే  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటింటికీ నీరు, సరైన డ్రైనేజీ సౌకర్యాలు,  24గంటల విద్యుత్తు,  గతుకులు లేని రోడ్లు,  చెత్తకుప్పలు లేని వీధులు ఇవన్నీ ఏర్పాటు చేయలేని ప్రభుత్వాలు స్మార్ట్ ప్రభుత్వాలు అంటూ కబుర్లు చెప్పటం బూటకమనే వాదన కూడా  వినిపిస్తూ ఉంది.  అసలీ స్మార్ట్ సిటీ అంశాన్ని తెరపైకి తెచ్చింది కేవలం రియల్ వ్యాపారస్తుల కోసమే అని కొందరు  వాదిస్తున్నారు. ఇప్పుడున్న పట్టణాలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తే చాలని, స్మార్ట్ పేరుతో విధ్వంసం అవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
స్మార్ట్ నగరాలు భారత్ సమస్యలను తీర్చగలవా.. ?
భారత దేశ పట్టణ జనాభా 2001లో 27.8శాతం ఉందని, 2026 నాటికి 38.2శాతానికి చేరుతుందని వెంకయ్య నాయుడు చెప్తున్నారు. 2011 జనాభా లెక్కల్లో పట్టణ ప్రజలు 31.6శాతం ఉన్నారు. పెరుగుతున్న పట్టణ జనాభా నివసించటానికి వీలుగా కొత్త నగరాలు నిర్మించకపోతే కొద్ది కాలంలో నివాసానికి పనికిరాకుండా పోతాయని అరుణజైట్లీ ఆల్రెడీ సెలవిచ్చారు. ఈ లెక్కలన్నీ వినటానికి కన్విన్సింగ్ గా ఉన్నా లోగుట్టు మాత్రం అంత సుందరంగా ఏ మాత్రం కనిపిచంటం లేదని పరిశీలకుల వాదన. బడా కంపెనీలు, రియల్ వ్యాపారులు కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్తలు కలలుకంటున్న ఈ స్మార్ట్ సిటీల కాన్సెప్ట్ ప్రస్తుతం భారత దేశ నగరాల్లో ఉన్న సమస్యలను ఏ మాత్రం తీర్చలేదని తెలిసిపోతోంది. బుల్లెట్ టె్రయిన్ లు, స్మార్ట్ సిటీలు నిర్మించటం కంటే, ఉన్న వనరుల్ని ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్పించటానికి వినియోగిస్తే, ఆర్థిక అసమానతలు పోగొట్టడానికి ఉపయోగిస్తే దేశమే స్మార్ట్ గా మారిపోతుంది