ఏ కొద్దిమందివోతప్ప జర్నలిస్టుల జీవితాలు బాగోలేవు


ఏ కొద్దిమందివోతప్ప జర్నలిస్టుల జీవితాలు బాగోలేవు…రాజమండ్రిలో ఆంధ్రప్రభ రిపోర్టర్ జానకి నిన్న చనిపోయాడు. నలభై ఏళ్ళ చిన్న వయసులో మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి అపస్మారకంలోకి వెళ్ళిపోయి వారం తరువాత భార్యని కూతురుని అనాధలుగా వదిలేసి వెళ్ళిపోయాడు. జీతం రాని దిగులు, అడ్వర్టయిజుమెంట్లు సంపాదించలేని దిగులు, పెన్నేసుకుని/నోరేసుకు పడిపోలేని సౌమ్యస్వభావం తప్ప నల్లా జానకీ శ్రీరామ్ కి అనారోగ్యకారకాలైన ఏఅలవాట్లూ లేవు.

మరణం అనివార్యమే అయినా ప్రశాంతంగా చనిపోయే అవకాశాలు లేని జీవితాలు జర్నలిస్టులవి…నెలనెలా జీతాలు సజావుగా ఇచ్చే ఈనాడు, సాక్షి పేపర్లలో పనివత్తిడి మోయలేనంతగా పెరిగిపోయింది. పది వార్తలను చూసి ప్రచురణకు కాపీ సిద్ధం చేయవలసిన సమయంలో ముప్పైనలభై వార్తలు మీదపడేస్తున్నారు. చిన్న తప్పు వస్తే ఉద్యోగం సఫా అనే కత్తికింద పనిచేయ వలసి వస్తోంది.

వేజ్ బోర్డు సిఫార్సులను ఎగవేయడానికి ఈనాడు హైదరాబాద్ కార్యాలయాన్ని ఫిలింసిటికి మార్చేసింది. సిటీనుంచి రానూపోనూ రోజూ సగటున 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఐదారుగంటలు బస్సుల్లోనే మగ్గిపోయే నరకాన్ని రామోజీరావు తనవద్ద సంవత్సరాల తరబడి పనిచేసిన ఉద్యోగులకు బోనస్ గా ఇచ్చారు..ఐదారేళ్ళ సర్వీసు వుంది. ఇల్లుకోసం, పిల్ల పెళ్ళికోసం చేసిన అప్పుతీరలేదు. ఇది మానేసి ఇంకో పని చేయలేను. రోజూ రామోజీ రక్తనాళాలు తెంపేస్తున్నాడు అని ఇద్దరు మిత్రులు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు

సాక్షిపరిస్ధితీ ఇంతే పోగబెట్టి పంపించేస్తున్నారు. మరియాదగా వెళ్ళిపోతే ఏడాది సర్వీసుకి 15 రోజుల జీతం వస్తుంది. లేదంటే మేమే పంపేసి అదే మొత్తం పరిహారంగా ఇస్తాం. పోతారా గెంటెయ్య మంటారా అని సాక్షి మేనెజర్లు వత్తిడి పెడుడున్నారు

రామోజీరావు ఎంచుకున్న సమయాల్లో పరిమితమైన వేదికల మీద మంచిమాటలు చెబుతారు. మానవ ఉద్వేగాలను ప్రేరేపించి విరాళాలు సేకరించి బాధితులకు ఇస్తారు. జగన్ అయితే బాధిత కుటుంబాలను ఓదార్చడమే పనిగా పెట్టుకున్నారు. రాజధానికోసం భూములిచ్చే రైతులకోసం మెరుగైన పాకేజీలు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని హెచ్చరికలు చేస్తున్నారు. అయితే సామదాన బేధ దండోపాయాలతో ఉద్యోగులను సాగనంపుతున్న తీరు దారుణంగావుంది. వ్యాపారవేత్త అయిన రామోజిరావు అపుడపుడూ చెప్పే ఉదాత్తమైన మాటల్ని ఉద్యోగుల్ని ఊడగొడుతున్న పద్ధతుల్ని గమనిస్తే దెయ్యాలు వేదాల్ని వల్లించడం ఇదేనని అర్ధమౌతోంది. ప్రజాజీవితంలో ఉన్నత స్ధానానికి ఎదిగే లక్ష్యంతో పాలకుల మీద విమర్శలు, ప్రజలకు హామీలూ గుప్పించే జగన్ తన ఉద్యోగులకు చూపిస్తున్న నరకాన్ని గమనిస్తే ఏసుప్రభువు కి సైతాను పూజలు చేస్తున్నట్టుంది.

జగన్ రామోజీ లమధ్య విరోధం వ్యాపార పరిధిని దాటి వ్యక్తిగత స్ధాయికి చేరింది. అయితే వయసు మీరిన నిస్సహాయుల్లో మెదడు చిట్లిపోయేలా నరాలను వత్తిడి పెట్టే నరహింసలో మాత్రం ఇద్దరూ ఏకసూత్రంతో పోటీపడుతున్నారు.

చట్టాలు వద్దు, న్యాయంకూడా వద్దు ధర్మమైనా లేకపోతే ఎలా? ఉద్యోగుల బరువు మోయలేమనుకున్నప్పుడు, అలా తొలగించిన వారు కొత్తజీవితాల్లో కుదురుకునే వరకూ గౌరవంగా జీవించడానికి రెండులక్షల రూపాయలు చేతిలో పెట్టి వీడ్కోలు చెప్పగలిగే సంస్కారం స్తోమతా వీళ్ళకి లేవా? ఐదేసివందల మందిని పంపించాలనుకుంటే ఈ లెక్కన పదేసి కోట్లు కావాలి..జగన్, రామోజీ ఈ మొత్తాలు సర్దుబాటు చేసుకోని దరిద్రులని నమ్మగలమా?

చాలాకాలం జీవించవలసిన జర్నలిస్టు జానకి చిన్నతనంలో చనిపోవడం (వత్తిళ్ళు తట్టుకోలేక జానకి ఈ మధ్యే పాత్రికేయం వదిలేసి బట్ల దుకాణంలో పనికి కుదిరాడు. అయినా అప్పటికే శరీరంలో ప్రవేశించిన హైబిపి ఆయన్ని తీసుకుపోయింది) దుఃఖంగా వుంది…కష్టంగా వుంది…ఆయన మెదడులో నరాలు తెగి మరణించారు…జీవించే వున్న వందలాది జర్నలిస్టుల్ని వారి కుటుంబాల్ని అభద్రత అశాంతి ప్రతిరోజూ మెలితిప్పేస్తున్నాయి.

ఈపాపం, బాధ్యతా కూడా మీడియామార్కెట్ లీడర్లయిన రామోజీ, జగన్ గార్లదే!

One response to “ఏ కొద్దిమందివోతప్ప జర్నలిస్టుల జీవితాలు బాగోలేవు”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: