నీళ్ళు…చేలు…తోటలు…రకరకాల ఛాయల్లో పచ్చదనాలు…రికార్డుల కోసమే సరిహద్దులు తప్ప ఊరూ ఊరూ కలిసిపోయినంత చిక్కగా వుండే గోదావరి డెల్టాలో ఏప్రయాణమూ విసుగుకాదు…బస్సులో మనుషుల మాటలు వింటూంటే ప్రపంచం అర్ధమౌతుంది. కిటికీలోంచి కనుచూపు మేరా కాటన్ దొర కరుణ, గోదావరి తల్లి దయ కనబడుతాయి. సోమవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రిలో నా ప్రయాణం మొదలైంది. ఆ రూట్ లో అరగంటకో బస్సు. ఎందువల్లో అంతకుముందు రెండు బస్సులు లేవు. బస్సు రాగానే ఆ రెండు బస్సుల రద్దీ దానిమీద పడిపోయింది. చివరి సీటు దొరికింది.

నోరు తెరిస్తే గోదావరి యాస…వేషమేమో ప్రపంచ పోకడ.ముతక మనుషులు..నాజూకుతనం పులుముకున్న అమ్మాయులు…సౌకర్యవంతమైన హెయిర్ స్టయిళ్ళ అమ్మలు…పంచెలు…డ్రెస్సులు…జీన్ పాంట్లు…జరీ చీరలు…మట్టివాసనల భూమిపుత్రులు, పుత్రికలు… అసలు బస్సే తెలుగునేలలావుంది. ఒకతెలుగు దేశం ఆసామీ సభ్యత్వాల నమోదు గొప్పల లెక్కలు చెబుతున్నాడు…’ఆ సోది ఎవడికి గావాల, రోడ్డు కమ్ రైలు బ్రిడ్జిని బాగుజేయించమను’అని ఓ పెద్దాయన ఎద్దేవా చేశాడు…’మరే’ అని ఓ ముసలమ్మ వత్తాసు పలికింది. అపుడు బస్సు బ్రిడ్జిమీద నడుస్తోంది. వాళ్ళంతా రోజూ/తరచు ఆ బ్రిడ్జిమీద రాకపోకలు సాగించేవారేనని అర్ధమైంది. నిజమే! ప్రపంచస్ధాయి రాజధానో, టెక్నాలజీతో తుపానుని ఆపెయ్యడమో వారికి ‘ఎదవ సోదే’ మరి. వాహనాల్ని మనుషుల్నీ ఎత్తికుదేసే మూడు కిలోమీటర్ల నరకం నుంచి విముక్తే ఆ రూటు జనం తక్షణావసరం.

కండక్టరమ్మ కాస్త మెతక మనిషి. పాసింజర్లు లోకువకట్టేశారు. బస్సు బాగోలేదని, డబ్బులు పుచ్చుకోవడమే తప్ప ఆర్టీసీకి బాగుచేయించడం తెలీదా అనీ ఆవిడే బాధ్యురాలైనట్టు వాళ్ళు వాళ్ళు తలోమాటా అంటున్నపుడల్లా కండక్టరెస్ కిటికీలోంచి పచ్చతనాన్ని చూస్తూండిపోతోంది.

నిలబడి, చంకన పసిదాన్ని ఎత్తుకుని రెండో చేత్తో రాడ్డుకి వేలాడుతున్న బెల్టుని అందుకుని కుదుపుల్లో పడిపోకుండా తూలిపోతూ బేలెన్స్ చేసుకుంటున్న ఓతల్లికి పాపను ఇవ్వమని సైగచేశాను..ఓ నవ్వు నవ్వేసింది..’ఏడుస్తాది’ అని చిన్నగా అంది. తరువాత ఐదారు నిమిషాలకు నా బుర్ర వెలిగింది. నేను లేచి సీటు ఇవ్వవచ్చునని…మళ్ళీ సైగ చేశాను. ఈ సారి గట్టిగా నవ్వినట్టనిపించింది. పెద్ద సంసారాన్ని ఈదుతున్న నాకు బస్సులో బేలెన్స్ చేసుకోవడం ఓ లెఖ్ఖా అనే లెక్కలేనితనం ఆ నవ్వులో వుందనిపించింది.

ఉళ్ళు పచ్చగా వున్నాయు. దుమ్ముతో మాసిపోయిన పాత డిజైన్ల మేడలు డాబాలు, బంగాళా పెంకుల ఇళ్ళు డెల్టా మనుషుల ధీమాకి సాక్షులుగా నిలబడ్డాయి. అయితే ప్రతి ఉరికీ మొదట్లో చివర్లో చెత్తగుట్టలు పేరుకుపోతున్నాయి. అవన్నీ ప్లాస్టిక్ సంచుల గుట్టలన్నట్టు వున్నాయి. నాగరికతకు అభివృద్దికి ఇండికేటర్లు అన్నట్టు మురికి మడుగులు కుళ్ళు వాసనలు లేని ఊరేలేదు. వానపల్లి విజ్జేస్వరం, మద్దూరు, డి ముప్పవరం, కానూరు, మోర్త, ఉండ్రాజవరం, వగైరా ఊళ్ళను డొక్కు బస్సులో గతుకుల సింగిల్ తార్రోడ్డు మీదుగా దిగవలసిన ఊరు చేరుకున్నాను…

అదేరూటులో సాయంత్రం ఐదున్నరకి తిరుగు ప్రయాణం మొదలైంది. బస్సు పట్టనంత మంది కాలేజి అమ్మాయులు అబ్బాయులు భలే సర్దేసుకున్నారు. ఈ బస్సులో కండక్టరమ్మ నోరున్న మనిషి. అబ్బాయిల అరుపులు కేకల్ని కంటో్రల్లో పెట్టేసింది..దిగిపోయేటప్పుడు చాలా మందికి చిల్లర ఎగ్గొట్టేసింది.
మన ఆహారం కడుపునింపుకోవడం కాదు, అది ఒక రుచి సంక్కృతి…ఒక వ్యాధినివారణా/చికిత్సా విధానంకూడా…ముక్కు దిబ్బడ వల్ల శరీరం నెమ్ముగా అనిపించడం వల్లా సోమవారం నిర్ణయమైన కార్యక్రమానికి రాలేకపోవచ్చని ఆదివారం రాత్రే నిర్వాహకులకు చెప్పాను. తెల్లవారాక కొంత నయమనిపించి ప్రయాణమయ్యాను. సమావేశం ముగిశాక ఒక ఫ్రండ్ ఇంట్లో భోజనం…

ముందుగా మిరియాల అన్నం కమ్మగా, ఘాటుగా…సగం వొలిచిన / చిదిమిన వెల్లుల్లి రేకల మధ్య బంగారం రంగులో వేగి కరకరలాడిన వెల్లుల్లి పాయ..మాడిపోకుండా అలా వేయించడం గొప్ప నైపుణ్యమనిపించింది…తరువాత పలుచగా వున్న ముద్దపప్పులో నెయ్యి పోసి పక్కనే ఓ కప్పు వుంచారు. అందులో వుప్పు కలిపిన నిమ్మరసం, చిన్న చక్రాల్లా తరిగిన సన్న పచ్చి మిరపకాయలు, బుల్లి బుల్లి మామిడల్లం ముక్కలు నానుతున్నాయి. పప్పన్నానికి ఈ ఆధరువు కలుపుకుని తినాలి. ఇవి రుచిగా వుండటం మాత్రమే కాదు. కొన్ని గంటల్లోనే వొంటిని యధాప్రకారం చురుకైన స్ధితికి తెచ్చాయి. నన్ను పిలిచిన వారి పక్షాన శ్రీమతి కుమారి ఇచ్చిన ఆతిధ్యంలో ఒక కొత్త వంటకాన్ని కూడా రుచిచూపించారు. టమోటా, పాలకూర, మామిడికాయ లలు కందిపప్పుతో కలిపి వండటం..(కాలంతో సంబంధం లేని హైబ్రీడ్ పంటలు మినహా) సాధారణంగా మామిడి కాయ, పాలకూరా ఒకే సమయంలో వుండవు..ఆరెండూ వుండే ఈ పరిమిత కాలపు వంటను కరీంనగర్ స్నేహితురాలొకరు నేర్పించారని ఇది ఆప్రాంతపు ప్రత్యేక వంటకమని శ్రీమతి కుమారి చెప్పారు. పులుపుతో జతపడిన వగరు రుచే కొత్తగా వుంది. ఇందులో కూడా ఏదో ఆరోగ్య ప్రయోజనం వుండే వుండాలి. అందుకు ఆమెకు కృతజ్ఞతలు

అసలు ఏ ప్రయాణమైనా ఒక ఉత్సాహం…ఒక ఆనందం… పరిసరాల్ని గమనించి కొత్తవిషయాలు అర్ధం చేసుకోవచ్చు…చైతన్యం తో తొణకిసలాడే మనుషుల అందాల్ని రెప్పవేయకుండా చూడవచ్చు…’చూసింది చాల్లే ఇక అటు చూపు ఆపు’ అని ఇంటావిడ గిల్లేసేటంత రొమాంటిక్ గానే ఈ ప్రయాణం కూడా ముగిసింది.

IMG_0034.JPG

IMG_0505.JPG