పోలవరం బహుళార్ధ సాధక నీటిపారుదల పథకాన్ని కేంద్రమే చేపట్టి అమలు చేయాలని రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా పేర్కొనడంతో ప్రాజెక్టు అమలు బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై పడింది. అధికారం చేపట్టిప్పటి నుండి ముఖ్యమంత్రి యన్ చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు సత్వరమే పూర్తి కానున్నట్లు ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికలలోగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చాలా వరకు పూర్తి చేసి తమ ప్రభుత్వం సాధించిన ఘన విజయంగా ప్రజల ముందు ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ విషయంలో ముఖ్యమంత్రి రాజకీయ ప్రయోజనాలకోసం ఇస్తున్న ప్రాధాన్యతను- ఇందులో ఇమిడి ఉన్న గిరిజనుల సామాజిక స్థితిగతులు, రాగల న్యాయపరమైన ఇతర సమస్యల పరిష్కారం పట్ల చూపడం లేదు. గతంలో వై యస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పై సుప్రీం కోర్టు నుండి అవరోధాలను అధిగామించినట్లు భావిస్తున్నా సుప్రీం కోర్టు కొన్ని షరతులు విధించిందని గమనించడం లేదు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం- ముంపునకు గురయ్యే ఏడు మండలాలు తెలంగాణ రాషా్టన్రికి చెందినవి కావడంతో, భవిష్యత్తులో రాగల అంతర్ రాష్ట్ర వివాదాలను ఊహించి, ఆ ఏడు మండలాలను ఆంధ్ర ప్రదేశ్ కు బదిలీచేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్సు ద్వారా నిర్ణయం తీసుకోవడం- తెలంగాణ రాష్ట్రం నుండి తీవ్ర ప్రతిఘటనకు దారి తీసింది. పోలవరం ఆనకట్ట ఎత్తు తగ్గించి ముంపు ప్రమాదాలను తగ్గించి ఈ ప్రాజెక్టు ను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన డిమాండ్ను కేంద్రం పట్టించుకోలేనే లేదు.

మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాంశంగా, రాజకీయ వివాదంగా మారింది. గతంలో ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఒడిషా ముఖ్యమంత్రుల సమష్ఠి ఆమోదం తో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం అయినా, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మినహా ఒడిషా, చత్తిస్గఢ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వాటిని పట్టించుకొనే, పరిష్కరించే ప్రయత్నం జరగడం లేదు. ఈ సందర్భంగా ముంపునకు గురవుతున్న గిరిజనులు, వారి మనోభావాలు, వారి జీవనాలపై చూపగల ప్రభావాల గురించి ఎవరూ పట్టించుకోక పోవడం విచారకరం. ఇటువంటి ప్రాజెక్టు లు చేపట్టడానికి రాజ్యాంగమే కొన్ని నిర్దిష్ఠ విధానాలు నిర్ణయించింది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలల్లో నివసించే గిరిజనులకు గల రాజ్యంగపర హక్కులను దృష్టిలో ఉంచుకొని ప్రభుతం వ్యవహరించ వలసి ఉన్నది. అయితే రాజకీయ లక్ష్యాలే గాని గిరిజనుల మనోభావాల గురించి ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు పట్టించుకోక పోవడం దురదృష్టకరం.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాషా్ట్రల్లో ప్రస్తుతం ప్రతిపాదనలలలో ఉన్న వివిధ సాగునీటి పథకాలు అమలు చేయాలి అంటే, సుమారు ఇదు లక్షల మంది గిరిజనులు నిరాశ్రాయులు అవుతారని ఈ సందర్భంగా గమించాలి. పోలవరం ప్రాంతంలోనే రెండు లక్షల మందికి పైగా గిరిజనులన్నారు. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం అంచనా వేసిన గిరిజనుల వివరాలనే ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు.13 ఏళ్ళు గడిచాక ప్రస్తుతం వివిధ ప్రాజెక్టు ల ప్రతిపాదిత ప్రదేశాల్లో ఎంత మంది గిరిజనులు ఉన్నారు, వారి ఉపాధి, తదితర పరిస్థితులు ఏమిటి అనే అంశంపై ఖచ్చితమైన వివరాలు లేవు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నవారు సహితం గిరిజనులను అడ్డు పెట్టుకొని తమ ప్రయోజనాలు కాపాడు కోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు గాని గిరిజనుల ప్రయోజనాలు కాపాడాలని మాత్రం కాదని అర్ధం అవుతున్నది. ముఖ్యంగా ప్రస్తుతం తమకు లభిస్తున్న రాజ్యంగపరమైన హక్కులను పునరావాసం పేరుతో అపహరించే ప్రయత్నం జరుగుతున్నదనే భయాందోళనలు గిరిజనులల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై ఖచ్చితమైన హామీలను ప్రభుత్వం ఇవ్వలేక పోతున్నది.

అయితే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆపివేయాలని ఉన్నత న్యాయస్థానాల నుండి ఎటువంటి ఆదేశాలు లేనందున, న్యాయపరమైన అడ్డంకులు లేవని, నిధులు ఉంటే చాలు, వెంటనే అమలు చేయవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నట్లు కనబడుతున్నది. అయితే అభివృద్ధి విధానాల దిశను గాని, వాటి బాగోగులను గాని నిర్ణయించడానికి న్యాయస్థానాలు తగిన వేదికలు కావని సుప్రీం కోర్టు నర్మదా, బాల్కో కేసుల్లో స్పష్టం చేయడాన్ని ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఈ అత్యున్నత న్యాయస్థానమే నదుల అనుసంధానంపై ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయడం మరో అంశం. ముంపు ప్రాంతాలు, ఆనకట్టల ఎత్తులు, ఇతర సాంకేతిక అంశాలపై ప్రభుత్వాలలోనే కాకుండా ఇంజినీర్లలో సహితం భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నది నిర్వివాదాంశం. ఒక ప్రాజెక్టు ను వ్యతిరేకించే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అంతకన్నా తీవ్రమైన సమస్యలున్న ఇతర ప్రాజెక్టుల విషయంలో ఆసక్తిగా ఉండటాన్ని గమనిస్తున్నాము.

అసలు వీటి వల్లన సర్వం కోల్పోతున్న గిరిజనుల గురించి పట్టించుకోవడం లేదు. పునరావాసం, ఉపాధి వంటి అంశాల్లో గిరిజనుల, మైదానప్రాంత ప్రజల సమస్యలు ఒకే విధంగా ఉండవని మరచిపోకూడదు.

మైదాన ప్రాంత ప్రజలు నిత్యం పలు ప్రాంతాలకు వెడుతుండడం, ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు సహితం వెళ్ళగలగడం సర్వసాధారణం. అయితే గిరిజనులు ఒక గుహలో ఉన్నవారి వలె మైదాన ప్రాంతాలల్లో స్వేచ్ఛగా సంచరించలేరు. అక్కడ గల ప్రజలతో, వాతావరణంతో, సం„స్కృతి సంప్రదాయాలతో తేలికగా మమేకం కాలేరు. అందు వల్ల ఉన్న ప్రాంతం నుండి వలస వెళ్ళాలి అంటే వారికి జీవన్మరణ సమస్య కానున్నది. తమ నివాస ప్రాంతం ముంపుకు గురవుతుంది అంటే వారు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.

వారికి ప్రభుత్వం ఎన్ని ఘనమైన పునరావాస పథకాలు చెబుతున్నా, వారి పేరుతో ప్రభుత్వం ఇచ్చే అత్యధిక సదుపాయాలను గిరిజనేతరులే కైవసం చేసుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే, వారికి తమకు గల భూమిపై స్పష్టమైన హక్కు పత్రాలు ఉండవు. వారిలో అత్యధికులు స్థిరమైన ఆస్తులు ఉన్నవారు కాదు. ఇతరుల వలె వారు వివిధ పత్రాలు సేకరించి ప్రభుత్వం ఇవ్వచూపిన పరిహారాలను పూర్తిగా తీసుకోలేరు. అటువంటి నకిలీ పత్రాలను సృష్టించి గిరిజనుల పేరుతో ఇతరులు కైవసం చేసుకోవడం నేడు చాలా చోట్ల జరుగుతున్నది. పోలవరం పరిసరాలలో ఇప్పటికే కొన్ని ప్రాంతాలల్లో ప్రజలను ఖాళీ చేయించి పునరావాసం కల్పించారు. వారిలో ఎందరికి న్యాయంగా తగు పరిహారాలు లభించాయి, గౌరవనీయమైన ప్రత్యామ్నా్యయ వృత్తులు లభించాయి అనే అంశంపై ఒక అధ్యనయం చేస్తే గానీ వాస్తవాలు వెలుగులోకి రావు. అటువంటి ప్రయత్నాలు జరగడం లేదు. తర తరాలుగా కొనసాగుతున్న గిరిజన సముదాయాలను క్రోడీకరించి, వాటి కొనసాగింపుకు ప్రభుత్వం చట్టబద్ధ ప్రకటన చేయకుండా పోలవరం ఆనకట్ట నిర్మాణ విషయంలో ఎవరు ముందడుగు వేసినా గిరిజనులకు అన్యాయం చేసిన్నట్లు కాగలదు.

ప్రతి గిరిజన కుటుంబానికి సొంత భూమి, ఇల్లు కల్పించడంతో పాటు వారి సమాజానికి ఉన్న ఉమ్మడి హక్కులు, సాంప్రదాయ- సామాజిక సరిహద్దులు వంటి వాటిని గ్రామ సభ ఆధ్వర్యంలో నమోదు చేసి, వాటికి సాధికారికత కల్పించడానికి ప్రభుత్వం అంగీకరించి, ఆ మేరకు ప్రకటన చేయాలి. ప్రభుత్వాలు, నిపుణులు అందరూ గ్రామ సభల అభిప్రాయాలు తీసుకొన్న తరువాతనే, గిరిజన సమూహాలతో చర్చించిన తరువాతనే ఏవిధమైన ఒప్పందం అయినా చేసుకోవచ్చు. ఆ తరువాతనే పోలవరం ఆనకట్ట వద్ద నిర్మాణాలు చేపట్టాలి. అయితే నేడు దురదృష్టవశాత్తు ఆనకట్ట నిర్మాణం, దాని ఎత్తు, నీటి నిల్వ పరిణామం, లోతు, మొత్తం డిజైన్, నదీ జలాల పంపిణి వంటి అంశాలపై చర్చ- యావత్తు గిరిజనుల అస్తిత్వానికి సంబంధం లేకుండా కొనసాగుతున్నది. స్వతంత్ర భారత చరిత్రలో లక్షలాది ఎకరాలు సశ్యశ్యామలం చేస్తున్న ఆనకట్టలు అన్నీ గిరిజన సమూహాల జలసమాధి ఆక్రందనల క్రిందనే జరిగినాయని గుర్తుంచుకోవాలి. ఆనకట్టల కోసం ఇల్లు, వాకిలి, పొలం, అడవి వదిలి వెళ్లి దినసరి కూలీలుగా మారిన గిరిజనుల దుస్థితి గురించి సభ్య సమాజం పట్టించుకోవడం లేదు. ఇటువంటి భారీ ప్రాజెక్టు ను చేపట్టినప్పుడు, వాటి ద్వారా సృష్టించే విశేషమైన సంపద రీత్యా, అందుకోసం సర్వం కోల్పోయిన గిరిజనుల గురించి ఇప్పటికైనా పట్టించుకోకుండా ఆనకట్ట నిర్మాణం కోసం అర్రులు చాచడం అమానుషం కాగలదు.

ఇప్పటికే ఆనకట్ట స్థలంలో ఏడు గిరిజనగ్రామాల వారిని ఖాళీ చేయించి స్వాధీనం చేసుకున్నారు. ఆనకట్ట వస్తే అందులో చేపలు పెంచుకొంటూ గిరిజనులకు నూతన ఉపాధి అవకాశాలు లభించగలవు. అయితే అటువంటి అవకాశం లేకుండా సుదూర ప్రాంతాలలో నిరాశ్రయులైన గిరిజనులకు పునరావాసం కల్పించడం విచారకరం. ముందుగా ఇంటింటికి, గూడెం గూడెంకు బృందాలను పంపి, సమగ్ర సర్వే సరిపించి, సేకరించిన వివరాలను గ్రామా సభల్లో వెల్లడించి, నమోదు చేయాలి. తుది గెజిట్ ప్రకటన చేయాలి. గిరిజనులను తరిమి వేసి ఆనకట్ట కడతామనే అహంకార ప్రకటనలకు అవకాశం ఇవ్వకుండా వారి సమ్మతి, ఆమోదం తోనే, వారి అభీష్ఠం మేరకే పోలవరం భవిష్యత్ నిర్ణయం కావాలి. గిరిజనుల అస్తిత్వం గురించి దశాబ్దాలుగా పోరాటాలు జరుపుతున్న శక్తి సంస్థ అధినేత పి శివరామ కృష్ణ ఈ విషయమై గతంలోసుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. ఆ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ఇచ్చిన అనుమతిలో నిరాశ్రయులు అవుతున్న గిరిజనులకు పునరావాసం పూర్తి అయిన తరువాతనే ప్రాజెక్ట నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేసినది. ఈ విషయంలో ఎటువంటి పొరపాట్లు జరిగినా వారు తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొన్నది. పునరావాసం అంశంలో షెడ్యూల్ ఏరియాలోనే తిరిగి గిరిజనులకు పునరావాసం కల్పించాలి అన్నది ప్రధానమైన అంశం. అయితే ప్రాజెక్టు స్థలంలో నిరాశ్రయులైన కొన్ని గ్రామాల వారికి షెడ్యూల్ ఏరియా బయట పునారావాసం కల్పించారు.

ఈ ఒక్క అంశం చాలు, న్యాయస్థానం నుండి ఈ ప్రాజెక్టు నులు నిలిపి వేయించడానికి! ఇటువంటి అంశాలపై ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించాలి.

-పెద్దాడ నవీన్