చేతులతో తాకగలిగేది మోహం కావచ్చేమోకాని, చూపులతో పట్టుకోగలిగేదే అందం…అందుకేనేమో నాకు ప్రయాణమంటే పట్టరాని సంబరం…ఎందుకంటే అందమైన అనుభూతులతో తిరిగిరావడం, ఏదో కొత్త జీవ చైతన్యాన్ని ఇంకింపచేసుకోవడం బయటకు వెళ్ళకపోతే కుదరవుకదా?

ద్రాక్షారామ లో వివాహనిశ్చితార్ధానికి తప్పక రావాలని జక్కంపూడి రాజా (దివంగత ప్రజానాయకుడు జక్కంపూడి రామమోహనరావుగారి పెద్దబ్బాయి రాజా ఇంద్ర వందిత్) స్వయంగా పిలిచినపుడే వెళ్ళాలని దాదాపుగా నిర్ణయించుకున్నాను. ఇతిహాసాలమీద మమకారం వల్లో ఏమో ద్రాక్షారామ’మంటేనే లోపల ఒక ఇష్టం మెదులుతుంది మరి.

శివుడి 18 మహా క్షేత్రాల్లో ద్రాక్షారామ ఒకటన్న నమ్మకం వయసు కనీసం 15 వందల సంవత్సరాలయితే, అప్పటి శిల్పకళా వైభవం తూర్పు చాళుక్యుల నాగరికతా, వికాసాలకు ఇప్పటికీ ప్రత్యక్షసాక్షిగా వుందన్న ఆలోచన బాగుంది. అప్పటి సమాజదృశ్యం ఎలా వుండేదో ఊహిద్దామంటే ఎలా ప్రారంభించాలో తట్టలేదు.

కారు కాకినాడ కాల్వరోడ్డులో ప్రయాణిస్తూండగా ‘నీరుపల్లమెరుగు’ అంటే మహాజ్ఞానమని అర్ధమైంది. తెలిసిన విషయాల్ని అన్వయించుకుని జీవితాలను సఫలం చేసుకోవడమే జ్ఞానం. అనుకూల పరిస్ధితులను వెతుక్కుంటూ వలసలో జైత్రయాత్రలో చేసిన వివేకవంతులైన సాహసులవల్లే జాతులు విస్తరించాయి.వికసించాయి. అలా గోదావరి తూర్పుగట్టున తూర్పు చాళుక్యులు కనిపెట్టిన ద్రాక్షారామ కు వెళుతున్నామన్న భావన మరోసారి ఉత్సుకతను రేపింది.

పట్టని/నిండిన చోటునుంచి తొలగిపోడానికి నేలమీద నీరు ఏర్పరచుకున్న జాలు కాలక్రమంలో పశువులకు పుంతై, మనుషులకు దారై వర్షాకాలంలో పెద్ద అసౌకర్యమై, కాటన్ దొర చేతిలో గ్రావిటేషన్ కెనాలై, పర్యవేక్షణా నిర్వహణా యంత్రాంగాలకు రహదారులైన కాలక్రమంలో అందరికీ తార్రోడ్డయిన కాల్వగట్టు మీద గన్నికృష్ణ గారి కారులో ప్రయాణం హుషారనిపించింది.ఆయన అనుచరులు బాలనాగేశ్వరరావు, వెంకటరాజు గార్లు కూడా ఈ ప్రయాణంలో వున్నారు.

నీళ్ళు పచ్చని చెట్లు చాలాచోట్ల కోతలైపోయిన చేలు, ఇటుకల బట్టీలు, కలప అడితులు…దారిపొడవునా ఇవేదృశ్యాలు

నిశ్చితార్ధ వేదిక తూర్పుగోదావరి జిల్లా లో అతిముఖ్యుల తో కిక్కిరిసిపోయింది. రాజాను కలిసి అభినందించి తిరుగుప్రయాణం కాగానే వీరిభోజనాల సంగతి చూడాలని ఒకర్ని పురమాయించారు. మొగమాట పడకండి ‘మాటొచ్చేద్ది’అని ఇంకో పెద్దమనిషి హెచ్చరించారు. ఈజిల్లా యాస, తినకుండా వెళ్ళనిచ్చేదిలేదన్న కటువైన అభిమానం మాటొచ్చేద్ది అనేమాటలో వున్నాయి.

ద్రాక్షారామలో గొప్ప పాకశాస్త్ర ప్రవీణులున్నారు. మాంసాహార వంటకాల్లో వీరి ఖ్యాతి రాష్ట్రమంతటికీ పాకింది. నేను కేవలం శాఖాహారినే. ఏ ఆహారమైనా సరే వంటవారు తమ ప్రతిభను చాటుకోడానికో అత్యుత్సాహంవల్లో రుచులను కలగాపులగంచేసి వంటలు పాడుచేయడం పెరిగిపోతోందన్నది నా అభియోగం. అయితే ఈ వంటలో రుచులను యధాతధంగా వుంచి పండించారు. మొత్తం ఏంబియన్స్ కోసం స్ధానికంగా వున్న వనరులనే తప్ప బయటి వాటిని తెప్పించకపోవడం ఒక విశేషం. గ్రామీణ స్త్రీలలో మేకప్/మేకోవర్ , గ్రామీణ పురుషులలో ఖరీదుల్ని చూపుకోవాలన్న సృ్పహలు బాగా పెరిగాయని వందలమంది హాజరైన ఈ వేడుకలో అర్ధమైంది.

మధ్యతరగతి వర్గాల కొనుగోలు శక్తులు పెరగి కార్లు పెరగడం వల్ల కూడా రామచంద్రాపురం డివిజన్ లో సింగిల్ రోడ్లు ఇరుకై టా్రఫిక్ జాములు తప్పడంలేదు. రోడ్డు వైడనింగ్ కూడా అక్కడక్కడా జరుగుతూనే వుంది.

రామచంద్రాపురంలో గమ్మత్తయిన రుచితో కిళ్ళీలు చుట్టే శ్రీరాజాపాన్ షాప్ ఏసీనూలేనంత నిరాడంబరంగావుంది. ఊరినే పేరులో ఇముడ్చుకున్న తాపేశ్వరం కాజా దొరికే ‘సురుచి’ వ్యాపార వైభవం దాయాదిపోరులో ఏనాడో జయించింది.

వీటన్నిటికీ మించి నీలిశూన్యంలో పరిమళాలు అల్లుతున్న గాలి నన్నుతాకడం గొప్ప అనుభవం…ఒక్కడినే అయిన నాలో వున్న నీటినీ,నేలనీ,గాలినీ,నిప్పునీ, ఆకాశాన్నీ…మూడుగదుల ఇల్లుదాటి స్వచ్ఛమైన ఒక ‘స్పేస్’లోకి రాగానే పంచభూతాలు పలకరించడమే నా ఆనందోద్వేగమనీ అనుభవయ్యింది.

రాజా పెళ్ళినిశ్చితార్ధానికి 7/12/2014 ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి అదేసాయంత్రం తిరిగి వచ్చాక ఏర్పడిన ఈ భావోదయం ముప్పైగంటల తరువాత కూడా వెలుగుదారేమో అన్నట్టువుంది

IMG_1477.JPG

IMG_1479.JPG

IMG_1482.JPG

IMG_1485.JPG