నిశ్శబ్దానికీ, మౌనానికీ తేడా చాలా ఏళ్ళక్రితం బాపూగారిని చూసినపుడు అర్ధమైంది. మౌనం మహాసాధన అనీ, గొప్ప సంస్కారమనీ, ఉన్నతమైన జీవన విధానమనీ ఇవాళ బాపూగారి అబ్బాయి వెంకట రమణగారిని చూశాక అర్ధమైంది.

వెండితెరమీద బాపూగారు చిత్రీకరించిన గోదావరి డెల్టా అందాలను చూడటానికి వెంకటరమణ గారు, వారి అక్క శ్రీమతి భానుమతి గారూ సకుటుంబాలుగా కోనసీమలో పర్యటిస్తున్నారు. కొత్తపేటలో బాపూ గారి విగ్రహం చెక్కుతున్న వడయార్ గారి స్టూడియోకి వారందరూ వచ్చారు. అదేసమయానికి కీర్తిశేషులు గన్ని సత్యనారాయణ మూర్తిగారి విగ్రహాన్ని చూడటానికి వెళ్ళిన గన్నికృష్ణ గారితో పాటు నేనూ వున్నాను. వెంకట రమణ గారికీ, కృష్ణగారికీ మధ్య క్లుప్తంగా జరిగిన సంభాషణను విన్నాను. వెంకట రమణగారు చెన్నైలో బిజినెస్ కన్సల్టెంటు.

వెంకటరమణ గారి సమాధానాల్లో అనవసరమైన అక్షరం ఒక్కటికూడా లేదు. ఏమాత్రం అస్పష్టతలేదు. కొంచెంకూడా ఆడంబరం లేదు. హడావిడి, పటాటోపాలకు అతీతమైన సాదాసీదాతనం వ్యక్తిత్వంలో పరిపూర్ణత వల్లే సాధ్యమనిపించింది.

లోకంలో ఏదిచూసినా అందులో తనే కనబడటం పరిపూర్ణత్వం. రాగద్వేషాలు అంటని మనుషులకే ఇది సాధ్యమౌతుందేమో! అలాంటి వారిలో అలజడులు లేని ప్రశాంతత ఒక అద్భుతమనిపిస్తుంది. సంతృప్తిగా వుండే జీవన దృక్పధమే ఈ అద్భుతానికి మూలమని అర్ధమైంది.

నాతో ఏమీ మాట్లాడకుండానే నాకు ఇంత రియలైజేషన్ ఇచ్చిన బాపూగారి అబ్బాయి వెంకటరమణ గారికి ధన్యవాదాలు

IMG_0567.JPG

IMG_1607.JPG