రాషా్ట్రలకు రాషా్ట్రలే కాంగ్రెస్ చేజారిపోతున్నాయి, ఇందులో పార్టీ వైఫల్యంఉంది. నాయకుల తప్పిదాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో సంభవించిన పరాజయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్లయితే, రాషా్ట్రల అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతటి పరాజయం ఎదురయ్యేది కాదు. లోక్‌సభ ఎన్నికలు జరిగి ఆరు నెలలు కావస్తున్నా ఓటమి గురించి పార్టీలో ఇంత వరకూ సరైన చర్చ జరగలేదు. 2004 నుంచి 2014 వరకూ అధికారాన్ని అనుభవించిన నేతలు, నేడు ఎటుపోయారో అర్థం కాని పరిస్థితి

లోక్‌సభ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన బిజెపి- ఆగస్టులో జరిగిన అనేక రాషా్ట్రల ఉప ఎన్నికలలో ఓడిపోయింది. అయినప్పటికీ పరాజయ భారంతో కుంగిపోకుండా తట్టుకొని నిలబడి- మహారాష్ట్ర, హర్యానా రాషా్ట్రలలో విజయం సాధించింది.

రాషా్ట్రల వారీగా చూస్తే- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధికారం కోల్పోవడం స్వయంకృతమే. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీపై కోపం ఉండటం సహజం. అయితే తెలంగాణ ఇచ్చి కూడా ఆ ప్రాంతంలో ఓడిన హీన చరిత్రనే కాంగ్రెస్‌ మిగుల్చుకుంది. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది తామే అంటూ కాంగ్రెస్‌ ఎన్ని గొప్పలు పోయినా, ఆ రాష్ట్రంలో పార్టీని ప్రతిపక్ష హోదాకే పరిమితం చేశారు. తమ త్యాగాల ఫలితంగానే- కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందనీ, ఆ ఘనత తమదే అనీ అంటూ అధికారాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ఎగరేసుకుపోయింది. లోక్‌సభలో, నూతనంగా ఏర్పడిన శాసనసభలో, ఆ పార్టీకి దక్కింది నిండు సున్నా. అధికారం తమదేనంటూ, మొత్తం లోక్‌సభ సీట్లు గెలిచి సోనియాకు కానుగా ఇస్తామని బీరాలు పలికిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎక్కడున్నారో, పార్టీ కోసం ఏ మేరకు కృషి చేస్తున్నారో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొన్నది.

తమిళనాడులో పార్టీ అధికారం కోల్పోయి దశాబ్దాలు గడుస్తున్నాయి.1967 తరువాత తమిళనాడులో ద్రావిడ పార్టీలదే రాజ్యం. అయితే డీఎంకే, కాదంటే అన్నాడీఎంకే తప్పితే జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్‌, బిజెపి అధికారాన్ని అందుకోలేని పరిస్థితి. కీలక నాయకుడు అయిన జి.కె. వాసన్‌ పార్టీ నుండి బయటకు వెళ్లి, తన తండ్రి జి.కె. మూపనార్‌ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ దీన పరిస్థితికి ఈ సంఘటన అద్దం పడుతున్నది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బిజెపి వైఫల్యమే కానీ కాంగ్రెస్‌ ఘనత కాదని అర్థం అవుతున్నది. గత లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి-17, జెడిఎస్‌-2, కాంగ్రెస్‌-9 స్థానాలు సాధించాయి. కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు సాధించిన రాష్ట్రం కర్ణాటక కావడం విశేషం.

ఉత్తరప్రదేశ్‌ సంగతి చెప్పనక్కర్లేదు, ఒకనాడు ఈ రాష్ట్రం కాంగ్రెస్‌కు కంచుకోట, ప్రధానమంత్రుల రాష్ట్రం అని చెప్పుకునే ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెల్చింది కేవలం రెండే సీట్లు. అవి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రాతినిథ్యం వహించే రాయ్‌బరేలీ, అమేథీ. ఎస్పీ-5 స్థానాలు గెల్చుకుంటే, బీఎస్పీకి అదీ దక్కలేదు. సోనియా, రాహుల్‌ గెలుపు వెనుక సమాజ్‌వాది పార్టీ లోపాయికారీ ఒప్పందం ఉన్న అంశాన్ని విస్మరించరాదు.

బీహార్‌లో లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, ఆర్‌జేడీ కూటమికి దక్కింది-6 స్థానాలు, నితీశ్‌ పార్టీ గెలుచుకున్నవి రెండు స్థానాలు. మోడీ దెబ్బకు అన్ని పార్టీలు ఏకమై బీహార్‌లో జరిగిన ఉపఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధించినా, ఇక్కడ కూడా కాంగ్రెస్‌ కంటే లాలు, నితీశ్‌లదే పై చేయి.

ఒరిస్సాలో నవీన్‌ పట్నాయక్‌దే రాజ్యం. ఆయన వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టారు. మిత్రపక్షమైన బిజెపిని వదిలిన నవీన్‌ ఒంటరిగా బరిలోకి దిగి ఇటు అసెంబ్లీ, అటు లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించారు.

పశ్చిమబెంగాల్‌లో ఇప్పటికీ మమతదే రాజ్యం. అసెంబ్లీ ఎన్నికలలో మొదలైన తృణమూల్‌ జైత్రయాత్ర, గత లోక్‌సభ ఎన్నికలలోను కొనసాగింది. ఈ రాష్ట్రంలో బిజెపి తొలిసారి కాలుమోపింది. ఇక్కడ కాంగ్రెస్‌-4, బిజెపి-2, తృణమూల్‌ కాంగ్రెస్‌-34, కమ్యూనిస్టులు-2 స్థానాలు గెలుచుకున్నారు. ఇక్కడ సీపీఎం బలహీనపడటం జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ అని చెప్పాలి.

త్వరలో ఎన్నికలు జరగబోయే ఢిల్లీపై కూడా కాంగ్రెస్‌ నాయకత్వానికి పెద్దగా ఆశలు లేవు. గత లోక్‌సభ ఎన్నికలలో బిజెపి మొత్తం ఏడు స్థానాలను గెలుచుకుంది.

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌ వంటి రాషా్ట్రలు బిజెపి కంచుకోటలుగా మారాయి. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా పార్టీ పునర్వైభవం కోసం ఒంటరి పోరు సాగిస్తున్నా, ఫలించే సూచనలు కనిపించడం లేదు.

కాంగ్రెస్‌కి అత్యంత కీలక రాష్ట్రం అనదగిన మహారాష్ట్ర చేజారిపోయింది. మరో వైపు మిత్ర పక్షమైన ఎన్సీపి కాంగ్రెస్‌ను వదిలింది. దేశానికి ఆర్థిక రాజధాని అనదగిన ముంబాయిని కోల్పోవడం కాంగ్రెస్‌ చాలా నష్టం. సోనియా అల్లుడు రాబర్ట్‌వాద్రాపై వచ్చిన ఆరోపణలు కాంగ్రెస్‌ను నిలువునా ముంచాయి. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో పరాజయం ఖాయమని గత లోక్‌సభ ఎన్నికల్లో తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో ఓటమి సంపూర్ణమైంది.

కాంగ్రెస్‌కు బలం, బలహీనత గాంధీ కుటుంబమే. విధిలేని పరిస్థితులలో సోనియాగాంధీ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని చేపట్టారు. అన్నీ తానై ముందుకు నడిపించారు. రాజీవ్‌ మరణానంతరం పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని గాని, 2004, 2009 ఎన్నికలలో గెలుపు తరువాత ప్రధానమంత్రి పదవి చేపట్టాలని గాని సోనియా ఏనాడూ తొందరపడలేదు.

ఆమె సారథ్యంలోనే 1998, 1999, 2004, 2009 ఎన్నికలు జరిగాయి. పి.వి. నరసింహారావు సారథ్యం వహించిన 1996 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లభించింది 140 స్థానాలు. సోనియా సారథ్యం వహించిన 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దక్కినవి కేవలం-114 స్థానాలు. అప్పటికి అవే తక్కువ అనుకుంటే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దక్కినవి -44 స్థానాలు. అంటే కనీసం ప్రతిపక్ష హోదా సైతం దక్కని పరిస్థితి పార్టీ శ్రేణులను కుంగదీసింది. పండిట్‌ నెహ్రూ నాయకత్వంలో సోషలిస్టు విధానాలు ప్రారంభించిన పార్టీ, పి.వి. సారథ్యంలో లిబర్‌లైజేషన్‌, గ్లోబలైజేషన్‌, ప్రైవేటైజేషన్‌ విధానాలు ప్రారంభించిన పార్టీ కాంగ్రెస్‌. అయితే తాను ప్రారంభించిన విధానాలపై కాంగ్రెస్‌ పార్టీకే స్పష్టత లేదు.

1996, 1998 ఎన్నికల్లో ఓటమి తరువాత బిజెపి వ్యూహాన్ని మార్చింది. 1999 ఎన్నికల నాటికి మిత్రపక్షాల సహాయంతో అధికారంలోకి వచ్చింది. శివసేన, అకాలీదళ్‌, బిజెడి (అప్పట్లో) వంటి పార్టీలు బిజెపికి అండ‚గా నిలిచాయి. ఇదే వ్యూహాన్ని కాంగ్రెస్‌ 2004 ఎన్నికల్లో అనుసరించింది. పెద్ద పార్టీ అనే భేషజాన్ని వదిలి లౌకిక పార్టీలను కలుపుకొని యూపీఏగా అవతరించింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాధించినవి వరుసగా-145, 206 స్థానాలు. మిత్ర పక్షాల సహాయంతో పదేళ్లపాటు జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పింది కాంగ్రెస్‌ పార్టీ. కొంత మంది- ప్రియాంకా రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. అంటే కాంగ్రెస్‌ అంటే- గాంధీ కుటుంబమే, పార్టీని నడిపించాల్సింది ఆ కుటుంబ సభ్యులే తప్ప 128 ఏళ్ల కాంగ్రెస్‌లో పార్టీని నడిపించే నేతలే కరవయ్యారు.

కాంగ్రెస్‌ లో మాధవరావు సింధియా, రాజేష్‌పైలెట్‌, వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి వంటి నేతల అకాల మరణం కాంగ్రెస్‌కి తీరని నష్టం కలిగించింది వీరందరూ ఓటమి ఎరుగని నేతలు. సోనియాగాంధీకి అండగా నిలిచిన నేతలు. మాధవరావు సింధియా మధ్యప్రదేశ్‌లో తిరుగులేని నేత. గుణ, గ్వాలియర్‌ నియోజకవర్గాలు ఆయనకు కంచుకోటలు. మధ్యప్రదేశ్‌ వికాస్‌ కాంగ్రెస్‌ పార్టీ-ని స్థాపించినా అది పి.వి పై కోపంతోనే కాని, కాంగ్రెస్‌పై కోపంతో కాదు. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీలో తిరుగులేని నాయకుడు వై.ఎస్‌.ఆర్‌. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలిచిన లోక్‌సభ సీట్లే కారణమని చెప్పాలి. అటువంటిది ఆయన మరణానంతరం, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని, ఆయన తనయుడు జగన్మోహన్‌ రెడ్డిని పొమ్మనకుండా పొగ బెట్టారనే భావన కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలుగజేసింది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పతనానికి దారి తీసింది. నమ్మకమైన మిత్రులను కోల్పోవడం, ఉన్న మిత్రులు పరాజయం పాలవ్వడం, రాషా్ట్రల్లో రాజకీయాలను శాసించే కీల నాయకులు లేకపోవడం- కాంగ్రెస్‌ పతనానికి ప్రధాన కారణాలు.

గత ఎన్నికల్లో తొలిసారిగా ఓటర్లుగా నమోదు అయిన వారు మోడీ నాయకత్వానికి ఆకర్షితులయ్యారు. ఒక వైపు వరుస విజయాలతో బిజెపి దూసుకువెళ్తుంటే, మరో వైపు ఏ వ్యూహంతో ముందుకు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితి కాంగ్రెస్‌లో నెలకొన్నది. సీనియర్‌ నాయకుల మధ్య కుమ్ములాటలు, అవినీతి కుంభకోణాలు, వారసత్వ రాజకీయాలు పార్టీని ముంచాయి. ఇప్పటికైనా పార్టీ ఓటమిపై ఆత్మ విమర్శ జరిగిందా అంటే- జరగలేదని చెప్పాలి. రాషా్ట్రల్లో విలువలేని కాంగ్రెస్‌ నేతలు కేంద్ర స్థాయిలో పార్టీలో పదవులు సంపాదిస్తున్నారు. ఓట్లు సంపాదించలేని ఈ నేతలతో పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదు.

రాహుల్‌ 2004 ఎన్నికలలో అడుగు పెట్టింది మొదలు నేటికీ ఇంకా రాజకీయాలను అధ్యయనం చేస్తూనే ఉన్నారు. ఈ అధ్యయనం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. ఆయన గురువు , డిగ్గీ రాజా అని పిలిచే దిగ్విజయ్‌సింగ్‌ రాహుల్‌కి ఏం బోధిస్తున్నారో అంతకన్నా తెలియదు. రాహుల్‌ యంగ్‌ టీమ్‌ ఏం చేస్తోందో, ఆయనకు ఎటువంటి సలహాలు ఇస్తోందో ఎవరికీ తెలియని చిదంబర రహస్యం. ప్రజల్లో పలుకుబడిలేని నేతలను, సీనియర్‌ బ్యూరోక్రాట్‌లను తన టీమ్‌లో చేర్చుకొని ఏం సాధిస్తారో రాహుల్‌కే తెలియాలి. మాకు మోడీ- మరి మీకు? అని బిజెపి గత ఎన్నికల్లో వేసిన ప్రశ్నకు కాంగ్రెస్‌ దగ్గర నేటికీ సమాధానం లేదు. తమ నాయకుడు రాహుల్‌ అని చెప్పుకోలేని పరిస్థితులలో కాంగ్రెస్‌ పార్టీ ఉందంటే అంతకంటె దయనీయమైన పరిస్థితి మరొకటి ఉండదు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలైనా, జమ్ము- కాశ్మీర్‌, జార్ఖండ్‌ ఎన్నికలైనా రాహుల్‌ గాంధీవి అవే అవే ప్రసంగాలు, అతి పేలవంగా సాగుతున్నాయి. ఒక వైపు మోడీ- అమిత్‌ షా ద్వయం వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎన్నికల రణ రంగంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్‌ దిక్కులు చూస్తున్నది.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పాత్ర తగ్గిపోవడం వరుస పరాజయాలతో కుంగిపోవడం బిజెపి పాలనను నియంతృత్వానికి దారితీసే ప్రమాదం వుంది. ఎప్పుడైతే నియంతృత్వం, వ్యక్తి పూజ మొదలవుతుందో అది ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. జాతీయస్థాయిలో వామపక్షాలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాయంటే ఆ పార్టీకి ఉన్న లౌకిక స్వభావమే ప్రధాన కారణం. వరుస విజయాలతో ఎన్నికలలో జైత్రయాత్ర సాగిస్తున్న మోడీ కత్తికి ఎదురుండకూడదని కోరుకోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం . బిజెపి ఇంకా హిందుత్వ పిడివాదాన్ని వీడలేదని రాషా్ట్రల్లో ఆ పార్టీ ఎంపిక చేసిన ముఖ్యమంత్రుల ఎంపిక తీరు చెబుతున్నది. ఇక ఆర్థిక విధానాల్లో కాంగ్రెస్‌కు, బిజెపికి పెద్దగా తేడా లేదు. ప్రతి పక్షాలు అన్నీ ఏకమైతే బీహార్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురైన అనుభవమే బిజెపికి ఇతర చోట్ల ఎదురు కావచ్చు. సమర్థులైన నేతలను ప్రోత్సహించడం, రాష్ట్ర స్థాయిలో నాయకులకు స్వేచ్ఛను ఇవ్వడం, పార్టీ శ్రేణులకు ఎల్లవేళలా అండగా నిలవడం, నమ్మకమైన మిత్రులను సంపాదించడం, ఉన్న మిత్రులను కాపాడుకోవడం, బిజెపి అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పార్టీశ్రేణులను నడిపించడం- ఇవి కాంగ్రెస్‌ పార్టీ ముందున్న తక్షణ కర్తవ్యాలు.

నాయకత్వ మార్పు అనేది అర్థంలేని అంశం, నాయకత్వ బాధ్యతలు ప్రియాంక స్వీకరించినా, ఇవే సవాళ్లు ఆమెకూ ఎదురవుతాయి.గెలుపు ఓటములు సహజమని భావించాలే కాని ప్రియాంక వచ్చినంత మాత్రాన పరిస్థితి మెరుగవుతుందనుకోవడం భ్రమ. అసలు రాజకీయాలే వద్దనుకున్న సోనియా అనివార్యంగానైనా కాంగ్రెస్‌ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ రెండు సార్లు ఓటమి పాలైనా 2004, 2009 ఎన్నికలలో విజయపథంలో నడిపించారు. దేశంలోని అత్యంత శక్తిమంతమైన మహిళా నాయకురాలిగా ఎదిగారు. నాయకత్వ లక్షణాలు లేనప్పుడు ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? 2019 నాటికి పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయవలసిన బాధ్యత సోనియాగాంధీ పైనే ఉన్నది. డీలా పడ్డ పార్టీ శ్రేణులకు ఉత్సాహం కల్పించాల్సిన బాధ్యత సోనియాగాంధీ ముందున్న తక్షణ కర్తవ్యం.

చతికిలపడిపోయిన కాంగ్రెస్ సర్వశక్తులనూ కూడదీసుకుని లేచి నిలబడి సమర్ధవంతమైన ప్రతిపక్ష బాధ్యతలు స్వీకరించడం ప్రజాప్రయోజనాల రీత్యా ఎంతైనా అవసరం