Search

Full Story

All that around you

Month

February 2015

నమ్మకద్రోహం


ఉద్యమాలు, పోరాటాలే కానక్కరలేదు. కలిగించిన నమ్మకం, చేసిన వాగ్దానం, ఇవ్వజూపిన కానుక, కూడా ఒక పర్యాసానం కోసం, ఫలితం కోసం ఎదురుచూస్తూంటాయి. 

ప్రయాణం ప్రారంభమే కాకుండా వేసిన గొంగళిలాగే ఆశ మిగిలినప్పుడు, సాకారం దిశగా ఆకాంక్షలు అడుగు ముందుకి వేయనపుడు, సాగదీసి సాచివేసే నాయకత్వాలు జనంతోనే రాజకీయం చేస్తున్నపుడు రగిలిన ఆవేశాలు లక్ష్మణ రేఖలకు లోపలే పడిగాపులు పడివుండలేవు. 

నిరాశలోకి పరిణమించిన నిరీక్షణ, తెగింపుగా మారిన విచక్షణ 
వెన్నపూసి గొంతుకోసేవాడిని పడేసి మొహం మీద తొక్కెయ్యాలనుకుంటాయి. 

అది మంచిదా చెడ్డదా అన్నది కాదు ప్రశ్న 
అంత వరకూ రానిచ్చిందెవరన్నదే ప్రశ్న 

(ఐదేళ్ళు కాదు పదేళ్ళు ప్రత్యేక ప్రతిపత్తి ఉండాల్సిందే అని పార్లమెంటులో నటించిన వెంకయ్యనాయుడు గారికి, ఢిల్లీకి మించిన రాజధానిని మీకిస్తానని ఆంధ్రులకు  మాటల గారడి చూపించిన నరేంద్ర మోడీగారికి, వారికి వత్తాసుగా వున్న బిజెపి పార్టీకి ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీల ప్రస్తావనే లేని బడ్జెట్ సాక్షిగా ఈ పోస్టు అంకితం…) 

“ప్రత్యేక హోదా” వెంకయ్యకు గుదిబండ  రాష్ట్రంలో మనకబారుతున్న బిజెపి


ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పట్ల ఉత్సాహం తగ్గింది. గత ఏడాది కాలంగా వలసలతో హుషారుగా ఉన్న బీజేపీలో ఇపుడు స్తబ్దత ఆవరించింది. వరుస విజయాలను ఇంతవరకూ నమోదు చేసుకుని దేశంలో ఎదురులేని రాజకీయ శక్తిగా బలోపేతమవుతున్న కమలదళానికి ఢిల్లీ ఫలితాలు షాక్ ఇచ్చాయి. 2019 నాటికి ఏపీలోనూ పాగా వేయాలని గత కొంతకాలంగా ఆశలు పెంచుకున్న బీజేపీకి ఢిల్లీ ఫలితాలు నోట్లో వెలక్కాయగా మారాయి.

మరో వైపు మిత్రపక్షం టీడీపీ కూడా గుర్రుగా ఉండడం, కాంగ్రెస్ సమరభేరీ మోగించడం, వైసీపీ కూడా తనదైన బాణిలో ప్రజా పోరుకు సిద్ధం కావడంతో ఏపీలో తన స్ధానాన్ని వెతుక్కోవాల్సివస్తోంది. నిన్నటివరకూ టీడీపీ తరువాత మేమే అన్నట్లుగా ఉన్న బీజేపీ నేతల ధీమా మెల్లమెల్లగా సడలుతోంది. ఇప్పటికీ పదమూడు జిల్లాల ఏపీలో సంస్ధాగతంగా బీజేపీ బలపడలేదు, మరో వైపు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, హరిబాబు, మరో ఇద్దరు తప్ప బలమైన నాయకులు లేరు. ఈ పరిస్థితులలో ఏపీలో మళ్లీ మొదటికేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.. దీనికి తోడు అన్నట్లుగా టీఆర్‌ఎస్‌లో దోస్తీ వార్తలు కూడా ఎపి బిజెపిక ఇబ్బందికరంగా వున్నాయి.  విభజనకు కారకుడైన కేసీఆర్‌తో అంటకాగితే ఆంధ్రప్రదేశ్‌లో పుట్టగతులు ఉండవన్న భయం కూడా ఇక్కడ నేతలలో ఉంది. అంతే కాదు, విభజన చట్టంలోని ప్రధాన అంశాలను తొక్కి పెట్టడం, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ప్యాకేజీలను అటెకక్కించడం కూడా బీజేపీని ఇబ్బందులలోకి నెడుతోంది.

గత ఏడాదికీ, ఇప్పటికీ ఏపీలో బీజేపీ పట్ల జనంలో బాగానే మార్పు కనిపిస్తోంది. బీజేపీని నాడు అక్కున చేర్చుకున్న వారే ఇపుడు అదోలా ముఖం పెడుతున్నారు. అధికారంలోకి రాగానే ఏపీని స్వర్గధామం చేస్తామని, ప్రత్యేక ెదా కల్పిస్తామని, ఢిల్లీ కంటే పెద్ద రాజధాని నిర్మిస్తామని స్వయంగా మోడీ తిరుపతి సభలో చెప్పిన మాటలు చెవిలోనే ఉన్నాయి.

ఇక, ఏపీ బీజేపీకి సర్వం సహా అయిన కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు కూడా పదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని రాజ్యసభలో గట్టిగా నొక్కి వక్కాణించారు. ఇపుడు అదే వెంకయ్యనాయుడు అసాధ్యమంటున్నారు.

రానున్న రోజులలో బీజేపీ ఇదే తీరుగా వ్యవహరిస్తే తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు పడడం ఖాయమనడానిక ఢిల్లీ ఫలితం ఒక ఉదాహరణ అనుకోవచ్చు. ఏపీలో చూసుకుంటే సార్వత్రిక ఎన్నికల తరువాత బీజేపీ వైపు మొగ్గు చూపిన నేతల పరిస్థితి ఇపుడు అయోమయంగా ఉంది. దేశంలో మారిన రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి కమల శిబిరంలో చేరిన వారంతా తమ గతేం కానని ఆందోళన చెందుతున్నారు. వీరితో టచ్‌లో ఉంటున్న కాంగ్రెస్ నాయకులకు కూడా పార్టీలోకి రావద్దని వారే ఉచిత సలహా ఇచ్చేస్తున్నారు. దాంతో, మహామహులంతా బీజేపీ వైపు చూడడం మానుకున్నారు. మోడీ అంటే ఫీవర్ పెంచుకున్న వారంతా కూడా ఇపుడు వేరేగా ఆలోచన చేస్తున్నారు. గడచిన తొమ్మిది నెలల మోడీ పాలనలో దేశంలో ధరల నియంత్రణ జరగకపోవడం, యూపీఏ మూసగానే పాలన ఉండడం పట్ల కూడా సగటు జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా, విభజన తరువాత నానా రకాలుగా నష్టపోయిన ఏపీని ఆదుకోవడంలో మొండి చేయి చూపిస్తున్న మోడీ పట్ల కూడా ప్రజలలో నానాటికీ అసహనం పెరిగిపోతోంది. దీంతో, బీజేపీ బలపడాల్సిన చోట మరింతగా ఇబ్బందులు పడుతోంది.

ఏపీ బీజేపీలో పేరు మోసిన నేతగా ఉన్న వెంకయ్యనాయుడు ఇపుడు అందరికీ టార్గెట్ అయ్యారు. ఆయన చేసిన ఓ ప్రకటన వల్లనే ఇదంతా జరిగిందని కూడా అంటున్నారు. విజయవాడ నడిబొడ్డున జరిగిన ఓ వాణిజ్య సదస్సులో వెంకయ్యనాయుడు ప్రత్యేక ప్రతిపత్తి ఏపీకి రాదంటే రాదని తేల్చేశారు. దాని గురించి మరచిపోవడం మంచిదని కూడా హితవు పలికారు. దేశ రాజ్యాంగాన్ని మార్చాల్సినంత తతంగం దాని వెనక ఉందని, దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు ప్రత్యేక ప్రతిపత్తికి ఒప్పుకోవాలని, అందువల్ల అది కుదిరేది కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మిత్రపక్షం టీడీపీతో సహా, అన్ని రాజకీయ పార్టీలకు ఆయనే గురి అయిపోయారు.

స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు ఆర్ధిక సాయం, విభజన హామీల అమలు గురించి ప్రధానిని కలిసినా ఆయన నివేదికలు తీసుకోవడానికే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీకి సంబంధించి ఏం కావాలన్నా వెంకయ్యనాయుడుతోనే మాట్లాడాలంటూ ప్రధానే సూచించడంతో వెంకయ్య పని అడ కత్తెరలో పోక చెక్కలా మారింది, మొదట్లో తనకు ఈ గౌరవం బాగానే ఉందని వెంకయ్యనాయుడు అనుకున్నా చివరికి అది ఆయనేక ఇబ్బంది పెట్టేలా మారిందని బీజేపీలో గుసగుసలు పోతున్నారు.

ఇక, ప్రభుత్వానికి సంబంధించినంతవరకూ వెంకయ్యనాయుడు అనుభవాన్ని బాగానే వాడుకుంటున్న ప్రధాని మోడీ ఏపీ వ్యవహారాలలో తెలివిగానే ఆయనను ఇరికించారని అంటున్నారు. దీంతో, ప్రత్యేక ప్రతిపత్తి గుదిబండ వెంకయ్య మెడకు బాగానే చుట్టుకుంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పదేళ్లుగా పదవులు అనుభవించి చివరికి గత ఏడాది ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయినా కాంగ్రెస్ నాయకులు సైతం ఇపుడు వెంకయ్యను విమర్శలతో వేధిస్తున్నారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అయితే, ప్రతీ రోజూ నాయుడునే లక్ష్యంగా చేసుకుని ఘాటైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. ఇపుడు ఆ జాబితాలోకి తాజాగా అమలాపురం మాజీ ఎంపి జివి హర్షకుమార్ కూడా చేరారు. ఆయనైతే వెంకయ్యను ఏకంగా పొలిటికల్ బఫూన్ అంటూ నిందించారు. ఇదే తీరులో వామపక్షాలు, ఇతర పార్టీల నుంచి కూడా విమర్శలు వస్తూండడంతో వెంకయ్య గుక్క తిప్పుకోలేకపోతున్నారు. మరో వైపు మిత్రపక్షం టీడీపీ కూడా లోలోపల బీజేపీ తీరుపై గుర్రుగా ఉంటోంది.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె హరిబాబు స్వతహాగా మృదు స్వభావి. ఆంధ్ర విశ్వవిద్యాలయం అధ్యాపకునిగా పనిచేసిన ఆయన వెంకయ్యనాయుడు సహచరునిగా రాజకీయాలలో ఉన్నారు. గతంలో ఓ మారు శాసనసభ్యునిగా గెలిచిన ఆయన ఇపుడు విశాఖ పార్లమెంటు సభ్యునిగా గెలిచారు. ఆయనను ఏరీ కోరీ వెంకయ్య ఏపీ బీజేపీ అధ్యక్షునిగా నియమించారు. అయితే, హరిబాబు రాజకీయాలలో ఉండాల్సిన దూకుడును కనబరచడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మోడీ హవా బాగా ఉన్న సమయంలో ఆయన పార్టీని పదమూడు జిల్లాలలో బలోపేతం చేయడంలో పెద్దగా కృషి చేయలేదన్న ఆరోపణలూ ఉన్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా కోస్తా, రాయలసీమలలో పార్టీ బలాన్ని విస్తరించాల్సిన సమయంలో టీడీపీతో అనవసర మొహమాటాలో, మరే కారణాలో తెలియదు కానీ స్తబ్దుగా ఉండిపోయారు. అంతెందుకు విశాఖ జిల్లాలో పేరు మోసిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఆయన శిష్య గణాన్ని బీజేపీకి రప్పించడంలోనూ హరిబాబు చొరవ చూపించలేకపోయారన్నది కూడా కమలదళంలో చర్చగా ఉంది. విశాఖ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనా కూడా ఇంకా టీడీపీపైనే ఆధారపడడం రాష్ట్ర అధ్యక్షుని సంస్ధాగత నిర్వహణా లోపాన్నే తెలియచేస్తోంది.

విశాఖకు రైల్వే జోన్ సాధించే విషయంలోను, హుధ్‌హుధ్ తుపాను నిధులను కేంద్రం నుంచి విరివిగా రాట్టే విషయంలోనూ కూడా హరిబాబు విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన సామాజిక వర్గానికే చెందిన టీడీపీని నష్టపరచకూడదన్న ఏకైక అజెండాతోనే పార్టీ విస్తరణకు హరిబాబు నడుం బిగించలేదని, మనస్పూర్తిగా కృషి చేయలేదని పార్టీలోని మిగిలిన వారి ఆరోపణగా ఉంది.

ఏది ఏమైనా ఇటీవల కాలంలో ఏపీలో పర్యటించిన జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా పార్టీ పనితీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇపుడు బీజేపీ లోకి రమ్మని ఎవరిని పిలిచినా స్పందన అంతంత మాత్రంగా ఉంది.


ఏపీలో బీజేపీ పరిస్థితిని ఢిల్లీ ఫలితాలకు ముందు తరువాతగా చూడాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు ముందు బీజేపీలో చేరడానికి రాయబారాలు నడిపిన కాంగ్రెస్ మహామహులు ఇపుడు అదే పార్టీపై తిట్ల పురాణం లంకించుకోవడం బట్టే బీజేపీ స్థితి తెలిసిపోతోంది. బీజేపీలో చేరడానికి ఉవ్విళ్లూరిన పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇపుడు ఏపీసీసీ పిలుపు మేరకు ఇచ్చిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో జోరుగా పాలుపంచుకుంటున్నారు. అదే వరుసలో ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. బీజేపీ పని తొమ్మిది నెలలలోనే అయిపోయిందని, రానున్న రోజులలో ఏపీలో ఆ పార్టీని నమ్మి ఓట్లు వేయడం కష్టమన్న భావన రావడమే ఈ వలసల బ్రేక్‌కు కారణం.

మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కూడా ఓ దశలో బీజేపీ వైపు ఊగిసలాడినట్లుగా వార్తలు వచ్చినా ఇపుడు చిరంజీవి సినిమాలపైనే దృష్టి నిలిపారు. రానున్న రోజులో అప్పటి పరిస్థితి బట్టి రాజకీయంగా నిర్ణయం తీసుకోవచ్చునని ఆయన భావిస్తున్నట్లుగా మెగా క్యాంప్ చెబుతోంది.

ఇక, బీజేపీలో చేరి ఎటూ కాకుండా పోయామని మాజీ కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధేశ్వరి విలవిల్లాడుతున్నారు. అలాగే, గుంటూరుకు చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సైతం కమలం కండువా కప్పుకుని తొందర పడ్డారని ఆయన అనుచర గణం ఆక్రోసిస్తోంది. విభజన కారణమైన కేసీఆర్‌తో దోస్తీ చేస్తే రానున్న రోజులలో మరింతగా మునిగిపోతామని అపుడే కమలదళంలో ఆందోళన మొదలైంది. ఏది ఏమైనా బీజేపీ జోరు తగ్గడం మాత్రం మిత్రపక్షం టీడీపీలో ఆనందాన్ని కలిగిస్తోంది. తమకు పోటీగా తయారవుతుందనుకున్న పార్టీ ఇలా అయోమయంలో పడడం పసుపు పార్టీకి హుషారును ఇస్తోంది. అలాగే, కాంగ్రెస్, వైసీపీలలో కూడా బీజేపీ జోరు తగ్గడంపట్ల హర్షం వ్యక్తమవుతోంది.

మమ్మీ చంపేసిన అమ్మ భాష బతుకుతుందా? (విజయవాడలో ప్రపంచ తెలుగు మహా సభల సందర్భం)


భాషంటే అది మాట్లాడే ప్రజలు, వారి సంస్కృతీ, చరిత్రా….అవి ధ్వంసమయ్యాక భాష ఒక్కటే బతికి వుండటం సాధ్యం కాదు. (అమ్మని మమ్మీ నాన్నని డాడీ చంపేసినట్టు)

* భాషను జనం మాటగా మార్చి గిడుగురామ్మూర్తి పంతులుగారు తెలుగుకి వందేళ్ళు ఊపిరిపోశారు…

* ప్రపంచవ్యాపతంగా మరణిస్తున్న సగంభాషల్లో అనేక పరిణామాలవల్ల తెలుగు కూడా చేరిపోయింది

* యునెస్కో నివేదిక ప్రకారం 2025 నాటికి మనదేశంలో హిందీ బెంగాలీ మరాఠీ తమిళం మళయాళ భాషలు మాత్రమే వుంటాయి

* తెలుగు మాయమైపోతూండటం విచారకరమే అయినా ఇదొక పరిణామక్రమంగా స్వీకరిస్తున్నాను

* ఉన్నత రాజకీయాధికారంలో వున్నవారిలో మండలి బుద్ధప్రసాద్ గారికితప్ప ఎవరికీ తెలుగు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు లేవు…ఇందువల్ల తెలుగుని ఉద్ధరించేస్తామనే నాయకుల మాటలు మనకి వినబడవు…ఒక వేళ ఎవరైనా అలా చెబితే అవి దొంగమాటలే అని మరో ఆలోచనలేకుండా అనేసుకోవచ్చు.

* ప్రపంచంలో ఏమతమైనా తనను తాను ప్రచారం చేసుకోడానికి ప్రజల భాషను ఆశ్రయిస్తే మన వైదీకం జనం భాషకు దూరమై రహస్యంగా వుండిపోయింది

* సంసృ్కతాన్ని పక్కన పెట్టి గౌతమబుద్ధుడు, మహావీరుడు ప్రజలభాష “పాళీ”లో చేసిన బోధనలు శరవేగంతో దేశాన్ని చుట్టుముట్టాయి

* పండితుల సంస్కృత భారతాన్ని వందల ఏళ్ళతరువాతే నన్నయ తెలుగునేల మీదకు తీసుకురాగలిగారు

* తెలుగుదేశాన్ని ఎవరుపాలించినా సంస్కృతమో, పారశీకమో, ఊర్దోనో, ఇంగ్లీషో పాలకుల భాషగావుండిపోయాయి

* ఉద్యోగాలు కేంద్ర బిందువులై నైజాములో ఉర్దూ, ఆంధ్రాలో ఇంగ్లీషూ తెలుగుని టెలుగూ గా మార్చేశాయి

* తెలుగుకోసం ఉద్యమాలు చేసి రాషా్ట్రలు సాధించిన తెలుగువాడు కూర్చున్న కొమ్మను తానే నరికేసుకుంటున్నాడు

* ఇంగ్లీషువాళ్ళు , నిజాం స్కూళ్ళవరకూ తెలుగుని అనుమతించారు తెలుగువాడు తల్లఒడిలోనే మాతృభాషను తన్నేస్తున్నాడు

* మెకాలే ఊహలోనే లేని ఉగ్గుపాల నుంచే ఎబిసిడిలను అడుగులు పడనపుడే ఐఐటి కోచింగ్ లను తెలుగువాడు మోహిస్తున్నాడు

* ఉద్యోగాలు ఇస్తున్నపుడు, తల్లిదండ్రులే చదివించుకుంటున్నపుకు ఇంగ్లీషంటే నొప్పి ఎందుకని సుప్రీం కోర్టే ప్రశ్నిస్తోంది

* పక్కదారులనుంచి దేశంలో దూరిన బ్రిటీష్ వాడిని తరిమేసిన ఉద్యమ విలువలు అమెరికావాడికి ఎస్ బాస్ అనేలా తిరగబడ్డాక మాతృభాషకు చోటెక్కడ?

* మార్కెట్టే జీవిత సర్వస్వమైపోయాక డాలర్ గరగరలు తప్ప తెలుగు నాణాలు మోగుతాయా

* ఆత్మనే అమ్మకుకున్నాక అమ్మ భాష మీద మమకారముంటుందా?

* మాతృభూమిని ప్రేమించకుండా మాతృభాషను కాపాడుకోవడం కుదురుతుందా?

పనిసంస్కృతి లో సంతృప్తికి ఒక ప్రతీక దగ్గుబాటి రామానాయుడు గారు!


నాకు సినిమాల మీద తప్ప సినిమా వాళ్ళ మీద ఆసక్తి లేదు. అందువల్లే నాకు అవకాశాలు వున్నాకూడా సినిమా రంగంవాళ్ళు తారసపడినపుడు వెనక్కివెళ్ళిపోతూంటాను.

రామానాయుడు గారితో నాకు ‘గట్టి’ పరిచయమే వుంది. గన్ని కృష్ణగారు , మధుఫోమా్రగారితోపాటు ఆరోజు నేను కూడా పార్లమెంటులో వున్నాను. నేను అక్కడ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుతో మాట్లాడుతున్నప్పుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు వచ్చి మేము వెంకయ్య నాయుడు రూంలో వుంటాము నువ్వు అక్కడికి రా అని ఆఇద్దరితో వెళ్ళిపోయారు. నేను ఆరూమ్ కి వెళ్ళాక రామానాయుడుగారు అక్కడికి వచ్చారు. ఆయన చేతిలో లావుపాటి బౌండ్ బుక్కులు నాలుగు వున్నాయి. వాటికి టేబుల్ మీద పెడుతున్నపుడు ఒకటి జారి పడింది. నేను నేను తీసి ఇచ్చాను.

మండలాలవారీగా నా నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారమార్గాలు ఇందులో వున్నాయి. శాంక్షన్ల కోసం వీటిని పట్టుకుని తిరుగుతున్నాను. అవట్లేదు. సినిమా వాడిగా వున్నపుడే మెరుగు. అడిగితే పనులు చేసిపెట్టేవారు అని రామానాయుడు నవ్వుతూ చెప్పారు.

మీ కింకా గవర్నమెంటుతో పనులు చేయించే పట్టు దొరకలేదని యార్లగడ్డ కామెంటు చేశారు. ఇలా సంభాషణలు జరుగుతున్నపుడే టపాకాయలు కాలుస్తున్న చప్పుడు. ఎందుకో అర్ధంకాలేదు. అపుడు టివిలో వార్తల్ని బట్టి పార్లమెంటులో తీవ్రవాదులు జొరబడ్డారని పోలీసులకు వారికీ ఎదురు కాల్పులు జరుగుతున్నాయని అర్ధమైంది. మేమున్న విపత్కర పరిస్ధితిలో తీవ్రత అపుడు మాకు తెలియదు.

రామానాయుడుగారు డిస్కంఫర్ట్ ఫీలవుతున్నారు. గన్ని కృష్ణ, యార్లగడ్డ గార్ల సూచన ప్రకారం ఆయన షర్టువిప్పేశారు. మేము అక్కడున్న వెడల్పయిన టేకు బెంచీని ఫాన్ కిందకు జరిపాము. బనియన్ తో కాసేపు దానిమీద పడుకున్నాక ఆయన తేరుకున్నారు. రెండు గంటల తరువాత ఆయన్ని సాయంత్రానికి మమ్మల్నీ సెక్యూరిటీ వాళ్ళు క్షేమంగా పంపించేశారు.

తరువాత చాలాకాలానికి ప్రమోద్ మహాజన్ రాకసందర్భంగా హైదరాబాద్ లో ఒక లంచ్ ఏర్పాటైంది. అందులో నేనూ వున్నాను. రామానాయుడుగారే నన్ను పలకరించారు. మా సంభాషణల్లో ‘సినిమాలూ జర్నలిజమూ బాగోలేవు పాలిటిక్స్ అస్సలు బాగోలేవు’ అన్నారు.

సినిమాలని మీరు రిపేర్ చేయగలరు అన్నాను. వరదని ఏ మనిషో ఆపగలడా అని ప్రశ్న వేశారు.

ఎస్టాబ్లిష్ మెంట్లు పెరిగిపోయాయి. వాటిని మెయింటెయిన్ చేయ్యాలంటే ఏక్టివిటీ ఆగకూడదు. ఈప్రాసెస్ లో మేము కంఫర్ట్ బుల్ గా వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్నారు ఇదే సాటిస్ ఫాక్షన్ అన్నారు.

ఫలితాలు ఎలావున్నా అంకితమైన భావంతో పనిచేయలన్న భారతీయతత్వానికీ, పనిసంస్కృతిలో సంతృప్తికీ ఒక ప్రతీక దగ్గుబాటి రామానాయుడుగారు ఒక ప్రతీక.

ఏ మనిషికైనా ఆ సంతృప్తి ఎంత అమూల్యమో నిన్నా ఇవాళా టివిల్లో కనబడుతోంది.

తెలుగు రాషా్ట్రలకు బిజెపి సమన్యాయం?


మిత్రపక్షమైన బిజెపి ఆంధ్రప్రదేశ్ ఏదేదో ఒరగబెట్టేస్తుందన్న తెలుగుదేశం భ్రమలు సన్నగిల్లుతున్నాయి. ఏకపక్షంగా సీమాంధ్ర గొంతుకోసిన కాంగ్రెస్ మీద అసహ్య, ద్వేషాలతో బిజెపికి ఓటు వేసిన సామాన్యుల్లో కూడా కేంద్రప్రభుత్వం అందించే సహాయ సహకారాలమీద ఆశలు నీరౌతున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో బిజెపి మీద ఏదోవిధంగా అసంతృప్తి మొదలైంది.

అయిష్టంగానే అయినా బిజెపి కోరుకున్నది ఇదే. బిజెపికి తెలుగుదేశం నాయకత్వంలో వున్న ఆంధ్రప్రదేశ్ ‘ఎక్కువ’ అనే హైప్ ని తొలగించడమే ప్రధమ కర్తవ్యంగా దేశాన్ని పాలిస్తున్న పార్టీ నిర్ణయించుకున్నట్టు అర్ధమౌతోంది.

ఈ హైప్ కి తెలుగుదేశం అత్యుత్సాహం అసలు కారణమైతే, ఒకసారి చెబితే లక్షసార్లు చెప్పినట్టే అనే పిచ్చిపోటీ ధోరణితో పనిచేసే తెలుగు న్యూస్ టివిల బాధ్యతా రాహిత్యమే ప్రధానకారణం.

తెలంగాణా ఏర్పాటు అవసరాన్ని కుండబద్ధలు కొట్టినట్టు ప్రటటించిన చిన్నమ్మ సుష్మా స్వరాజ్ మాటలకంటే ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్, స్మార్ట్ సిటీస్ లాంటి వెంకయ్యనాయుడు హామీలే జనంలోకి విస్తృతంగా వెళ్ళిపోయాయి.ఆంధ్రప్రదేశ్ కి ఏంటి బిజెపి కొండంత అండ అనే సంకేతాలు తెలంగాణాతో సహా ముఖ్యంగా దక్షిణాది రాషా్డ్రలకు పాకిపోతున్న స్ధితిలో బిజిపి దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. పొడిపొడి తిరస్కారాలద్వారా ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తులను పక్కనపెట్టసాగింది.
తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఎపి ప్రజల్ని నిరాశా నిస్పృహలకు లోను చేసే వాతావరణం వల్ల ఈ రాషా్ట్రనికి స్పెషల్ స్టేటస్ ఇవ్వొద్దని అభ్యంతరాలు పెట్టిన తమిళనాడు, కర్నాటక రాషా్ట్రల కడుపుమంట/ఆక్రోశం తగ్గాయి.

మోడీయా గీడీయా అన్న మన దాయాది ముఖ్యమంత్రి కెసిఆర్ కి కూడా ఈ వాతావరణమే ప్రధానమంత్రి దర్శన ద్వారానికి తలుపుతీసింది. దర్శనమవ్వడమంటే పరస్పరం ముఖాముఖీ అవ్వడమే.ఆఇద్దరికీ అదే ముఖ్యం …ఆసమయంలో మీరు అంతగొప్పవారు లేరని పరస్పరం ప్రశంసలు వారివారి ప్రజలకు ముఖ్యం…ఇవి జరిగిపోయాయి కాబట్టి ఇక ఎపుడైనా టి ఆర్ ఎస్ కేంద్రంలో మంత్రిగా భాగస్వామి కావచ్చు. అలాగే బిజెపి ఎమ్మెల్యేలు తెలంగాణా ప్రభుత్వంలో చేరవచ్చు. ఈ రెండూ జరగవచ్చు…జరగకపోవచ్చు..అయితే టి ఆర్ ఎస్ కు బిజెపిలో వి ఐ పి గేట్ పాస్ దొరికింది.

బిజెపి నుంచి ఎన్నో నిరాశలను చవిచూసిన తెలుగుదేశానికి తాజా పరిణామాలను ఇముడ్చుకోగల నిబ్బరం సహజంగానే వచ్చేస్తూంది..బిజెపికి కావలసింది ఇదే.

నా అంచనా ప్రకారం ఇక మీదట కేంద్రప్రభుత్వం రెండు తెలుగు రాషా్ట్రలకూ (అవి కోరినట్టు కాక తాను నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం) సహాయ సహకారాలు అందించడం మొదలౌతుంది. ఆ కార్యక్రమాలు రెండు రాషా్ట్రల్లోనూ బిజెపి పట్టు విస్తరించే దిశగానే వుంటాయి.

ఇక్కడ దాయాది ముఖ్యమంత్రుల మీడియా సంబంధాలను కూడా ప్రస్తావించుకోవాలి.
ఏ రాజకీయవాదికైనా మీడీయా అవసరం వుంటుంది. అధికారంలో వున్న నాయకుడికి కావాలనుకున్నా, వొద్దనుకున్నా స్విచ్ వేసి తీసే పదవీ సౌలభ్యం సౌలభ్యం వుంది. కెసిఆర్ కి మీడీయాను వాడుకునే టైమింగ్ అద్భుతంగా వుంది.
చంద్రబాబుకి అది చేతకాదు. ఆయనకి మీడియా ఒక బలహీనత. అది 24/7 వుండవలసిందే. ప్రింట్ మీడియావల్ల పెద్ద ఇబ్బంది లేదు. విజువల్ మీడియా తోనే సమస్యంతా! అందులో ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్టే! అతి వెగటవ్వడం సాధారణమే కదా!

కేంద్రప్రభుత్వ విధానాలకు అనుగుణంగా తెలంగాణా ప్రభుత్వ కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు అని టివిలో వార్త వస్తుంది. అధికారులు ఆపనిలో నిమగ్నమైపోతారు.

ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడైతే ‘ అలాంటి కార్యక్రమాలే రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ అధికారులను ఆదేశించాను. ఊరుకోను ప్రతి ఒక్కరినీ మానిటర్ చేస్తాను’అని లైవ్ లో చెబుతారు. ఆపని చేయవలసిన అధికారులు ముఖ్యమంత్రి తదుపరి ఆదేశాలకోసం టివిల్లో కి చూస్తూనే వుంటారు.

మీడియా సంబంధాలూ, పర్యావసానాల్లో కెసిఆర్ కి బాబుకీ తేడా ఇదే!

కెసిఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐


‘చార్మినార్ కి ఎప్పుడైనా ఇంత సున్నం కొట్టించారా ఏం కాగ్రెస్ వాళ్ళయ్యా’ అని
కెసి ఆర్ అన్నపుడు అవును కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వస్తుందే తప్ప చార్మినార్ కీ కాంగ్రెస్ కి లంకె ఏమిటా అన్న ఆలోచనే మనకి రాదు ….

కెసిఆర్ గారు అంతటి మాటల మాంత్రికుడు.

భాష, సంస్కృతీ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు తెలంగాణా ఉద్యమంలో పొదిగి ప్రపంచవ్యాప్తంగా వున్న తెలంగాణీయుల్లో భావసమైక్యతను సాధించిన అపూర్వ రాజకీయ నాయకుడు కెసిఆర్ గారే !

టివిలో ఆయన మాటలు మిస్ అవ్వను! ఆయన డబాయించేస్తున్నారని చాలా సార్లు తెలిసిపోతుంది. అయినా ఆ మాటలు వినబుద్ధి అవుతుంది

ఆయన బాగా చదివే మనిషి …అలాంటివాళ్ళంటే నాకు ప్రేమ, గౌరవం!

కెసిఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐

‘పార్వతి’ అంటే అభిమానం ఇష్టం ప్రేమ గౌరవం కలుగుతున్నాయు.


‘పార్వతి’ అంటే అభిమానం ఇష్టం ప్రేమ గౌరవం కలుగుతున్నాయు.

ఇవి కలగడమంటే స్త్రీ లోకంలో ఎవల్యూషన్ ని సజావుగా అర్ధం చేసుకోగల జ్ఞానం నాకు వుందని నాకు తెలియడమే!

వాకింగ్ కి వెళ్ళిన దారిలో శివాలయం వుంది. శివాలయంకదా ! పటాటోపం లేదు. , దీపారాధనలు, అభిషేకాలు, కర్పూరం లాంటి పూజాద్రవ్యాలు కాలి పొగచూరిన ఆలయవాసన, గుడిగోడలను అలుముకున్న నూనె జిడ్డు…దానికి విరుగుడు అన్నట్టు విభూది పళ్ళు, రాశులు, పురోహితులకు దానాలు, ప్రదక్షిణలు….నిశ్శబ్దంగా సాగిపోతున్నాయి. మగవాళ్ళకంటే ఆడవాళ్ళు, యువతులే ఎక్కువగా వున్నారు. వైష్ణవాలయాల్లో సీన్లను గుర్తుచేసుకున్నపుడు శివుడికి ఆడ భక్తులే ఎక్కువని బోధపడింది.

విష్ణుమూర్తి అనుకోగానే పాములాంటి పరుపుమీద పడుకున్న మగవాడూ ఆయన పాదాలు వొత్తుతున్న ఆడమనిషీ కనిపిస్తారు. పనిచేయకుండా సదుపాయాలు, సౌకర్యాలు పొందడానికి “ఆమె”తన స్వాతంత్రాన్ని ఆత్మగౌరవాన్ని “అతని”కాళ్ళదగ్గర పెట్టేసిన కాలానికి -లక్ష్మి విష్ణువు ఐకాన్లు అన్నమాట!

స్త్రీ పురుషుల సమానత్వం వ్యాసాలు రాస్తేనో ఉపన్యాసాలు చెబితేనో రాదుకదా!
స్త్రీలకు ఆర్ధిక స్వాతంత్రం వుంటేనే ఇద్దరి మధ్యా సమానత్వానికి ప్రాతిపదిక అవుతుంది. ఈఆలోచనకి ఈ మార్పికి శివుడిని సగంపంచుకున్న పార్వతి అర్ధనారీశ్వరతత్వం ఒక సింబలేకదా!

మగవాళ్ళకు స్ధూలంగా కాళ్ళదగ్గర పడివుండే లక్షి్మ అంటేనే ఇష్టం, ఇదే సౌకర్యమనే పరాధీన భావన స్త్రీల్లో ఇంకా వుంది. ఇలాంటి రిలేషన్ షిప్ తెగిపోకూడదనేనేమో డబ్బుంటే లక్షి్మ అని పాపులర్ చేశారేమో!

డబ్బు లక్షి్మ అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మోహమే కదా!

స్త్రీపురుష సంబంధాల గురించి శివాలయంలో ఆలోచనలు వచ్చాక పట్టుచీర కట్టుకున్న లక్షి్మ నుంచి మోడరన్ డ్రెస్ వేసుకున్న పార్వతి వరకూ సోషల్ టా్రన్స్ఫర్మేషన్ అర్ధమైనట్టు అనిపించింది.

ఏమైనా అవమానాలు,కష్టాలు ఎదుర్కోని శివుడిలో సగమైపోయిన పార్వతి అందం ఆకర్షణా ఆమె ఆత్మబలమూ గుండెనిబ్బరాలే..అలాంటి శక్తి సామర్ధా్యలను పులుముకునే పనిలో ఆలయానికి వెళ్ళే వాళ్ళంతా శ్రమైక స్త్రీ సౌందర్యాలే!
వాళ్ళని చూడ్డానికైనా శివాలయాలకు వెళ్ళాలని డిసైడ్ అయిపోయా

కలగడమంటే స్త్రీ లోకంలో ఎవల్యూషన్ ని సజావుగా అర్ధం చేసుకోగల జ్ఞానం నాకు వుందని నాకు తెలియడమే!

వాకింగ్ కి వెళ్ళిన దారిలో శివాలయం వుంది. శివాలయంకదా ! పటాటోపం లేదు. , దీపారాధనలు, అభిషేకాలు, కర్పూరం లాంటి పూజాద్రవ్యాలు కాలి పొగచూరిన ఆలయవాసన, గుడిగోడలను అలుముకున్న నూనె జిడ్డు…దానికి విరుగుడు అన్నట్టు విభూది పళ్ళు, రాశులు, పురోహితులకు దానాలు, ప్రదక్షిణలు….నిశ్శబ్దంగా సాగిపోతున్నాయి. మగవాళ్ళకంటే ఆడవాళ్ళు, యువతులే ఎక్కువగా వున్నారు. వైష్ణవాలయాల్లో సీన్లను గుర్తుచేసుకున్నపుడు శివుడికి ఆడ భక్తులే ఎక్కువని బోధపడింది.

విష్ణుమూర్తి అనుకోగానే పాములాంటి పరుపుమీద పడుకున్న మగవాడూ ఆయన పాదాలు వొత్తుతున్న ఆడమనిషీ కనిపిస్తారు. పనిచేయకుండా సదుపాయాలు, సౌకర్యాలు పొందడానికి “ఆమె”తన స్వాతంత్రాన్ని ఆత్మగౌరవాన్ని “అతని”కాళ్ళదగ్గర పెట్టేసిన కాలానికి -లక్ష్మి విష్ణువు ఐకాన్లు అన్నమాట!

స్త్రీ పురుషుల సమానత్వం వ్యాసాలు రాస్తేనో ఉపన్యాసాలు చెబితేనో రాదుకదా!
స్త్రీలకు ఆర్ధిక స్వాతంత్రం వుంటేనే ఇద్దరి మధ్యా సమానత్వానికి ప్రాతిపదిక అవుతుంది. ఈఆలోచనకి ఈ మార్పికి శివుడిని సగంపంచుకున్న పార్వతి అర్ధనారీశ్వరతత్వం ఒక సింబలేకదా!

మగవాళ్ళకు స్ధూలంగా కాళ్ళదగ్గర పడివుండే లక్షి్మ అంటేనే ఇష్టం, ఇదే సౌకర్యమనే పరాధీన భావన స్త్రీల్లో ఇంకా వుంది. ఇలాంటి రిలేషన్ షిప్ తెగిపోకూడదనేనేమో డబ్బుంటే లక్షి్మ అని పాపులర్ చేశారేమో!

డబ్బు లక్షి్మ అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా మోహమే కదా!

స్త్రీపురుష సంబంధాల గురించి శివాలయంలో ఆలోచనలు వచ్చాక పట్టుచీర కట్టుకున్న లక్షి్మ నుంచి మోడరన్ డ్రెస్ వేసుకున్న పార్వతి వరకూ సోషల్ టా్రన్స్ఫర్మేషన్ అర్ధమైనట్టు అనిపించింది.

ఏమైనా అవమానాలు,కష్టాలు ఎదుర్కోని శివుడిలో సగమైపోయిన పార్వతి అందం ఆకర్షణా ఆమె ఆత్మబలమూ గుండెనిబ్బరాలే..అలాంటి శక్తి సామర్ధా్యలను పులుముకునే పనిలో ఆలయానికి వెళ్ళే వాళ్ళంతా శ్రమైక స్త్రీ సౌందర్యాలే!

వాళ్ళని చూడ్డానికైనా శివాలయాలకు వెళ్ళాలని డిసైడ్ అయిపోయా 😜

సహదేవుడికి


సహదేవుడికి,

నీకు ఉత్తరం రాయాలనిపించాక నీపేరు గుర్తు చేసుకోడానికి మొదలుపెట్టిన ప్రయత్నం ఎన్నసార్లు విసుగొచ్చినా ఆపలేకపోయాను.

మీ దుకాణం నుంచి దొంగిలించి తెచ్చిన మిఠాయిలో (నువ్వు ఒప్పుకునేవాడివికాదు నాన్నకుతెలియకుండా మిఠాయితేవడం దొంగతనం కాదని డబ్బులు తెస్తేనే దొంగతనమౌతుందని డబాయించేవాడివి) ఆ తీపి ఇప్పుడు కూడా నానోటికి అనుభవమౌతున్నట్టే వుంది.

టీచరుగారు వచ్చేలోపల నువ్వు మొదలుపెట్టిన కథ, ఔటు బెల్లులోనూ, అన్నం బెల్లు అయ్యాక మధ్యాహ్నం ఫస్టుబెల్లు లోపలా అవగొట్టేసేవాడివి. పలకమీద బొమ్మగీసి, కథచెబుతూ, ఉమ్మితో పలకతుడిచి, కథచెబుతూ, కొత్తబొమ్మగీసి, కథచెబుతూ సినిమా చూపించేవాడివి.

లవకుశలో లక్ష్మణ స్వామి సీతమ్మోరి ని అడవిలో వదలటానికి వెళ్ళేటప్పుడు నీనోటితో వినిపించిన గుర్రపు డెక్కల చప్పుడు ఇంకావినిపిస్తూనేవుంది.

వజ్రాలవేటకు వెళ్ళిన రాకుమారుడు రాకాసిలోయలో దారితప్పి పులివాగులో చిక్కుకుని అటుగా వచ్చిన గండభేరుండ పక్షిని గమనించి ఒడుపుగా రెక్కలో దూరి తలపాగాతో బంధించుకుని పక్షితోబాటే దేవలోకం చేరుకుని, రాకుమారిని పెళ్ళాడిన కథని పలకమీద ఎంత వేగంగా చెప్పావో జ్ఞాపకమొచ్చి నేనే ఆ రాకుమారుణ్ణన్నంతగా వెంటు్రకలు నిక్కబొడుచుకునేవి.

అదేదో తిరనాళ్ళకి వెళ్ళినపుడు మెడపైకెత్తి చూసినంత ఎత్తుగావున్న అమ్మోరి బొమ్మ మమ్మల్ని భయపెట్టినపుడు, నువ్వొక్కడివే ఎంటీవోడి లాగా (లవకుశలో రాములోరు) కత్తి కాంతారావులాగా భలేగనిలబడివున్నావుకదా!

ఇన్నిగుర్తువస్తున్నా, నువ్వు గుర్తొస్తున్నా, బక్కపలచటి నీ ఆకారం గుర్తొస్తున్నా, మీ మిఠాయిదుకాణం, గుర్తొస్తున్నా నీ పేరు గుర్తురాకపోవడం చికాకుగావుంది.

నువ్వేమిచేస్తున్నావో తెలియదుగాని నేను మాత్రం చాలా ఎదిగిపోయాను. ఈ ఎదుగుదల వెనుక నీ స్పూర్తి వుందని ఒప్పుకోనేమోగాని, నిన్ను మించిపోవాలన్న ఆశమాత్రం వుంది.

ఆశేమిటి నువ్వు ఆశ్చర్యపోతున్న ఈ లోకపు అద్భుతాల వెనుక వున్నదినేనే.

నువ్వు పలకమీద గీసి, కథచెబుతూ, సన్నివేశానికి తగిన చప్పుళ్ళు నోటితో వినిపిస్తూచెప్పిన కథలో అన్నీ ఏకకాలంలో చేసే మల్టీమీడియా గురించి, యానిమేషన్ గురించి, త్రీడి గురించి, ఇవన్నీ చేతిలో పెట్టుకు చూడ్డానికి పలకలాంటి ఐపాడ్ గురించీ తెలుసుకదా!

టివిలు శాటిలైట్ టివిలు మొబైల్ ఫోన్లు వీడియోగేములు ఒకటేమిటి …కాసేపు వినోదంకావలసిన వ్యాపకం పెద్దా చిన్నాతేడాలేకుండా అందరికీ అదేపనైపోయింది. వదలలేనివ్యసనమైంది.

ఇవన్నీనానుంచి వచ్చినవే. ఈ అద్భుతాలముందు నువ్వెక్కడ?

అపుడు
నాముందు నువ్వు విశ్వరూపం…
ఇపుడు
నీ ముందు నేను సమస్తలోకం

స్ధాయిలోకాకపోయినా స్నేహంలో నాకు సాటివాడివనిపిస్తున్న నీ పేరుకోసం ఇక వెతకదలచుకోలేదు. నేనే నీకు ‘సహదేవుడు’ అని పేరు ఖాయం చేశాను. అంటే…నీకు నేను చాలా పెద్దహోదా యిచ్చానని నీకు పెట్టిన పేరునిబట్టే నువ్వు అర్ధంచేసుకోవాలి.

నీజ్ఞాపకాలునాకు వున్నప్పటికీ నీ ఊహకందని నా విస్తరణ రీత్యా నువ్వనన్ను గుర్తుపట్టే అవకాశంలేదనుకుంటున్నాను.

నాసంతకం చూశాక నేనెవరో నీకు అర్ధం కావచ్చు.

వుంటాను
ఇట్లు
డిజిటల్ దేవుడు

సహదేవుడూ!ఎన్ని బింకాలుపోయినా అసలు సంగతి చెప్పకుండా వుండలేకపోతున్నాను. ముందుగా గొప్పలు చెప్పేసుకున్నాను కనుక ఇక అసలు సంగతికొచ్చేస్తాను

నువ్వు అసలైతే నేను నకళ్ళు నకళ్ళు గా లోకమంతా విస్తరిస్తున్నాను.

కానీ! ప్రపంచమంతా నువ్వే వున్నప్పుడు నీతోపాటు కుతూహలాలు, ఆశ్చర్యాలు, వైవిధ్యాలు, అన్వేషణలు, బుద్ధివికాసాలు, జ్ఞానకేంద్రాలు మనిషిమనిషిలో వికసించేవి !విలసిల్లేవి సాధించుకున్ననన్న సంతృప్తి తదుపరితరాలకు ఉత్తేజభరితమైన స్ఫూర్తిగా మిగిలేది

నావిస్తరణ పెరిగేకొద్దీ జీవన వైవిధ్యం అంతరించి ప్రపంచమే ఇరుకిరుకు గదుల్లో ఒంటరిదైపోయింది…కిక్కిరిసిపోతున్న జనారణ్యంలో మనుషులు ఏకాంత జీవులైపోతున్నారు

అన్నిటికీ మించి బాల్యం ఆటపాటల సహజవికాసానికి దూరమై నేనే ప్రపంచంగా,నాదేలోకంగా మగ్గిపోతోంది.ఇది నాకుకూడా చాలా బాధాకరంగా వుంది

నన్ను నేను ఉపసంహరించుకోలేనంతగా వ్యాపించడం వల్ల ఏమీచేయలేని నిస్సహాయుణ్ణయిపోయాను. నన్ను న్యూట్రలీకరించడానికి వందలు వేలమంది సహదేవుళ్ళు కావాలి!

డిజిటలులోకంలో మగ్గిపోతున్న పిల్లల విముక్తికి నీలాగే మరుగున పడిపోయిన సహదేవుళ్ళను సమీకరిస్తావా?

పిల్లల మనసుల్లో సహజమైన సంతోషాల్ని పూయిస్తావా?

మనలో మనమే మాట్లాడుకునే ఉద్వేగపు భాష – ప్రయాణం


కోరుకొండ, గోకవరం, సీతపల్లి, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు, ప్రాంతాల గిరిజనుల వేషధారణలో పెద్దమార్పు వచ్చింది. అబ్బాయులు జీన్ పాంట్లు, రెడీ మేడ్ షర్టుల్లో, అమ్మాయిలు వదులు వదులు పంజాబీ డ్రెస్సుల్లో గాగ్రాల్లో, అక్కడక్కడా లెగ్గింగ్స్ లో కనిపించారు. యువతీయువకుల మొహాల్లో బండతనం అంతరించి నున్నగా నాజూగ్గావున్నయి. టివిడిష్ లు మోటారు బైకులు విరివిగా కనిపించాయి. చవకైన రెడిమేడ్ దుస్తుల దుకాణాలు కూడావున్నాయి.

ఫిబ్రవరి 6, 2015 శుక్రవారం ఉదయం పదకొండున్నరకు రాజమండ్రిలో బయలుదేరి భద్రాచలం చేరుకునే వరకూ రోడ్డుకి ఇరువైపులా గమనించిన విశేషాలు ఇవి. డాక్టర్ గన్ని భాస్కరరావుగారి కారులో వారితోపాటు ఈ ప్రయాణం సాగింది. గోకవరం లో డాక్టర్ బదిరెడ్డి రామారావు గారి ఇంట్లో భోజనం చేసి వారిని కూడా వెంటబెట్టుకుని పన్నెండున్నరకు ప్రయాణం మొదలు పెట్టాము. ఈ ప్రయాణంలో రోడ్డుకి రెండువైపులా గమనించిన విశేషాలు ఇవి.

రోజూకంటే ముందు విందు భోజనం చేయడం వల్ల కునుకుతున్నపుడు ఎసి కారులోని చల్లదనాన్ని చలి ఆక్రమించుకున్నట్టు అనిపించింది. మారేడుమిల్లి జోన్ లో ఎంటరయ్యామని కళ్ళుతెరవకుండానే అర్ధమైంది. శ్రీమతి మణి ఆతిధ్యపు మగత కాసేపు కళ్ళు తెరవనీయలేదు. ఘాట్ రోడ్డుకి వచ్చాక వంపుల ప్రయాణానికి నిద్రతేలిపోయింది.

రోడ్డుని డబుల్ రోడ్డుగా విస్తరించారు. రోడ్డు బాగుంది. పనిచేస్తూ రెండు బుల్ డోజర్లు కనిపించాయి. పాతవాటిలా కాకుండా కాంపాక్టుగా వున్నాయు. రోలర్ లకు వైబ్రేషన్ వుంటటం వల్ల కంకర, ఇసుక, తారు ఖాళీలు లేకుండా సర్దుకుని సాలిడ్ రోడ్ అవుతుంది.

కొండవాలులు సరే చదునైన నేలలో ఎక్కడోగాని సారవంతమైన భూములు లేవు. జొన్న, బుడమ వొడ్లు లాంటి పైర్లు పలచగా కనిపించాయి. పొడిపారినట్టున్న ఎర్రమన్ను నేలమీద నానారకాల అడవి చెట్లు మొక్కలు పొదలు నల్లటి షేడ్లతో ముదురు ఆకుపచ్చ రంగులో గిడసబారిపోయినట్టు వున్నాయి. మనుషులేకాదు కుక్కలు, మేకలు, ఆవులు, ఎద్దులు కూడా సౌష్టవంగా లేవు. అలాగని బక్కచిక్కిపోయి కూడా లేవు. మొత్తం ఆప్రాంతపు జీవ చైతన్యంలోనే ఒక లాంటి గిడసబారినతనం వున్నట్టు అనిపించింది. జాళ్ళు అక్కడక్కడా గుంతల్లో పేరుకున్న కుళ్ళునీళ్ళు తప్ప పాములేరు, నాగులేరుల్లో ప్రవాహాలు లేవు. శబరినది మాత్రం మందమైన ప్రవాహంతో నిండుగా వుంది

చింతూరులో టీ తాగడానికి ఆగాము. ఒకప్పుడు వ్యాపారాలన్నీ గిరిజనేతరులవే..గిరిజనులు కూడా స్వయంగా వ్యాపారాలు చేసుకోవడం ప్రారంభమైంది. గిరిజనేతరుల వ్యాపారాల్లో పనిచేసే గిరిజనుల సంఖ్య పెరిగింది. అన్నిటికి మించి ఇరువురి మధ్యా ఆధిపత్య, పరాధీన భావనల్లో చనువు స్నేహభావాలు పెరిగాయి. ఒక గిరిజన యువకుడి (మొహం చూస్తే తెలిసిపోతుంది) టీదుకాణం ముందు నుంచుని పరిసరాలను పరిశీలించినపుడు ఇదంతా అవగతమైంది. ఆయువకుడు ఒక చెవికి పోగుపెట్టుకున్నాడు. ఫాషనా? మీ ఆచారమా అని అడిగితే ఫాషనే అన్నాడు. మూకుడులో వడల పిండి వేసేటప్పుడు ఆయువకుడు చెయ్యితిప్పడం ఒక నాట్య విన్యాసమంత కళాత్మకంగా కష్టంగా వుంది.

భద్రాచలం పట్టణంలో ప్రవేశించాక ఎడమవైపు కనిపించిన ‘తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ప్రయాణ ప్రాంగణం భద్రాచలం’…బోర్డు చూడగానే ఒక అనుబంధపు నరం మెలితిరిగినట్టు అనిపించింది. రాష్ట్రవిభజన తరువాత తెలంగాణాలోకి వెళ్ళడం ఇదే మొదటిసారి. ఊరి చివర పొలంలో వున్న మూర్తిరాజు గారి మకాం లోకి వెళ్ళి కాఫీ తాగుతూ తెలంగాణా లో ఎలావుంది పాలనబాగుందా అని అడిగినపుడు టౌను తెలంగాణా కిలోమీటరు లోపువున్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు.

అక్కడినుంచి ఆలయదర్శనం..నా మిత్రులు ప్రముఖులు కావడం మూలాన మేము క్యూలో వేచివుండకుండా నేరుగా గర్భగడిలోకి వెళ్ళే సదుపాయాన్ని స్ధానికులు కల్పించారు. గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నాము.

స్ధల, కాలాల పరిధిని దాటి అనంతంగా జీవించే స్మృతే దేవుడు…వందల తరాల తరువాత కూడా కొనసాగే ఎమోషనే భక్తి… సీత, లక్ష్మణ, హనుమంతుల తోడుగా రాముడు ఈ మాటే చెప్పాడనిపించింది ఏ పటాటోపమూ లేకపోవడం వల్లనేమో ఈయన ఫ్రెండ్లీ దేవుడయ్యాడని బోధపడింది. కాసేపైనా ఒక అలౌకిక ప్రశాంతత ఏప్రార్ధనా మందిరంలో అయినా వుంటుంది. గుడి, చర్చి, మసీదు ప్రతీచోటా ఇలాగేవుంటుంది. పోనీ దీన్నేదేవుడి మహిమ అనుకుందాం!

దారిలో “తానీషా కల్యాణ మండపం” ఓక్షణం గగుర్పరచిన మత సామరస్యపు స్ఫూర్తి అయింది. షాదీఖానాను కాకుండా ఓసంపన్నులైన నవాబుగారు కొన్నేళ్ళ క్రితమే ఈ కల్యాణ మండపాన్ని కట్టించారట!

టూరిజం హొటల్ లో చిన్నస్వామి రాజు గారి కి 84 వపుట్టిన రోజు అభినందన కార్యక్రమం. మేము వెళ్ళింది వారికి శుభాకాంక్షలు చెప్పడానికే…బుకేలు అందించి అడవిలో ఘాట్ లో ప్రయాణించవలసి వుందన్న వాస్తవాన్ని నైస్ గా మా హోస్టుల చెవిన వేసి కారెక్కేశాము.

మెలికలు తిరిగిన ఘాట్ రోడ్ లో ముందు ఎలాంటి రోడ్ వొంపు వుందో డ్రైవర్ కి తెలియడం ముఖ్యంగా రాత్రివేళ ఎంతైనా వుపయోగం సురక్షితమైన ప్రయాణానికి అదే దోహదకారి అవుతుంది. విశాలమైన బిఎం డబ్లూ్య – ఎస్ యువి కారు విశాలమైన డాష్ బోర్డుమీద జిపిఎస్ నావిగేటర్ ఇలా డ్రైవర్ అబ్బాస్ కి నిరంతరాయంగా దారి చూపిస్తూనే వుంది.

ఉదయం పదకొండున్నరకు రాజమండ్రినుంచి బయలుదేరి రాత్రి పదిన్నరకు ఇలా ఇల్లు చేరుకున్నాము.

సీతపేట కొండమీద దీపాలముగ్గు కనబడింది..గాలికి చెట్టూచెట్టూ రాసుకుని ఎండిన ఆకులు రాజుకుని గాలివీచిన మేరకు తగలబడిపోతూండటం దూరానికి దీపాల హారంలా కనిపిస్తూంది.

ఆకాశం నిర్మలంగా వుంది. పౌర్ణమి తరువాత మూడో రోజు కావడం వల్ల చంద్రుడు పూర్ణబింబమై వున్నాడు. దాదాపు ప్రయాణమంతా ఎడమ కిటికీ నుంచి చూస్తూనే వున్నాను. ఎక్కడోగాని నక్షత్రాలు కనిపించకపోవడంవల్లో, నేనేంటి అడవిగాచిన వెన్నెలనైపోయాను అనుకోవడవల్లో గాని తదియనాటి చంచమామ ఆయన కాస్తఎర్రగా వున్నాడు..

– పెద్దాడ నవీన్

Create a free website or blog at WordPress.com.

Up ↑