Search

Full Story

All that around you

Month

March 2015

Iఫోనేగా ఇవ్వనివ్వండి …పోయేదేమీలేదు 


మన పిల్లలు మారాంచేస్తే, మనకి మోజు పుడితే వేల రూపాయల స్మార్ట్ ఫోన్లు కొంటున్నాము. మనం ఎన్నుకున్న వారి సదుపాయం కోసం యాభై మూడు వేల చొప్పున ఖర్చుపెటి్ట  iPhone 6 కానుక ఇవ్వలేని దరిద్రగొట్టు స్ధితిలో ఆంధ్రప్రదేశ్ లేదు. 

అన్నీ ఫీచర్లూ వాడుకోగలిగితే స్మార్ట్ ఫోనంటే చేతిలో ఆఫీసే కాదు సమాచారలోకమే వున్నట్టు. ఆ ప్రయోజనాలతో పోల్చినపుడు స్మార్ట్ ఫోన్ల ఖరీదు అసలు ఖర్చేకాదు. టెక్నాలజీని వినియోగించుకునే ఎన్విరాన్ మెంటు తీసుకు రావడానికి గతంలో చంద్రబాబు ప్రయత్నం చేశారు. మనకు తెలియదు, ఎవరు చెప్పినా వినం కాబట్టి ఆయన్ని హైటెక్ బాబు అని వెటకరించి మూలన పడేశాం. 

దేశప్రజల సగటు వయసు 27 ఏళ్ళు..అంటే ఇది యువతీ యువకుల దేశం. అసలు స్మార్ట్ ఫోన్ అవసరమా కాదా అని పదిమంది యువతీ యువకుల్ని అడగండి. హెచ్చు మంది వద్దంటే ఈ చర్చే లేదు.

స్మార్ట్ ఫోన్లన్లన్నిటిలోకీ iPhone నాణ్యమైనదీ సురక్షితమైనదీ…ఎమ్మెల్యేలకు ఇప్పటికే iPad లు ఇచ్చి వున్నారు కాబట్టి iPhone కూడా జతైతే రెండిటి మధ్యా సమాచారమార్పిడి సుళువుగా వుంటుంది. ఫీచర్లువాడుకోవడం ఇప్పటికిప్పుడే రాకపోయినా క్రమంగా అన్నీ తెలుస్తాయి. అతవరకూ మన ఎమ్మెల్యేకి iPhone ఓ స్టేటస్ సింబల్ గా అయినా వుంటుంది…వుండనివ్వండి

ఇంకో పదివేలు ఎక్కువైతే అవుతుందికాని iPhone 6 కంటే బేటరీ హెచ్చు సమయం వచ్చే iPhone 6 Plus ఇవ్వడమే బెటర్ అని నా రికమెండేషన్ 

మహా అయితే కోటి రూపాయల ఖర్చయ్యే కానుక మీద పొద్దున్న టివిలో చర్చ చూస్తే అందులో పాల్గన్న వారూ యాంకర్లూ రిటైరైపోవడమే బెటర్ అనిపించింది. విషయం తెలియకపోవడం తప్పుకాదు. తెలుసుకోకుండా నోటికొచ్చింది లక్షలాది మంది ముందు మాట్లాడమే నేరం.

iPhone తో రాష్ట్రం దివాళాతీయదు…కానీ, టెక్నాలజీని వినియోగించుకోవడమంటే మనల్ని మనం అప్ గ్రేడ్ చేసుకోవడం కూడా అని గ్రహించకపోతే, దాని మీద మనం దుమ్మెత్తి పోస్తూ వుంటే కొయ్యగుర్రం మీద స్వారీ చేస్తూ మనమే ముందున్నామని భ్రమించడమే! 

పదే పదే మొదటికొస్తున్న కథ!మళ్ళీ మళ్ళీ చెట్టెక్కనున్న ‘పోలవరం’ బేతాళుడు? 


(శనివారం నవీనమ్)

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం శంకుస్ధాపన చేస్తున్న “పట్టిసీమ”ఎత్తిపోతల పధకంమీద ప్రశ్నలు, అనుమానాలూ వున్నాయి. ఎనభై టి.ఎమ్‌.సిల నీరు కేవలం కొన్ని పంపుల ద్వారా తోడి కృష్ణా డెల్టాకు సరఫరా చేసే పరిస్థితి ఉంటే పదహారు వేల కోట్లను వ్యయం చేసి పోలవరం పెద్ద ప్రాజెక్టు నిర్మించవలసిన అవసరం ఏమిటి? గోదావరిలోకాని, కృష్ణలో కాని ఒకే టైమ్‌ లో వరద వస్తే ఆ నీటిని ఎక్కడకు తరలిస్తారు? గోదావరి నుంచి నీటిని తీసుకువెళ్లి కృష్ణా డెల్టాలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేసే అవకాశం లేనప్పుడు ఎలా వినియోగి స్తారు? మోకాలికి, బోడిగుండుకు లింకు పెట్టినట్లు, పట్టిసీమకు, రాయలసీమ నీటికి లింకు పెట్టి ప్రాజెక్టుపై హడావుడిగా నిర్ణయం చేయవలసినంత పరిస్ధితి ఏమిటి?

కృష్ణా డెల్టాకు లిఘ్ట ద్వారా తరలించి, అప్పుడు కృష్ణనీటిని రాయలసీమకు వాడుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. వినడానికి బాగానే ఉంటుంది. కాని ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై స్పష్టత వుందా? శ్రీశైలం కాని, సాగర్‌ కాని రెండు రాష్ట్రాలకు సంబందించిన ప్రాజెక్టులు అన్న విషయం మర్చిపోకూడదు. నిజంగానే ప్రభుత్వం అనుకున్నట్లు జరిగితే కొంత ఉపయోగం ఉండవచ్చు. కాని అందుకు గ్యారంటీ ఏమిటి? అలాంటప్పుడు ప్రభుత్వం జారీ చేసిన జి.ఓలో రాయలసీమ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? గోదావరి డెల్టాల్లో రెండో పంటకు ఇప్పటికే చాలడంలేదు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం వల్ల ఈ సమస్య మరింత జటిలంకాదా?

పోలవరం మరో పదేళ్లకు కూడా పూర్తి అవుతుందన్న నమ్మకం లేకే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారా? అయితే ఆవిషయం బహిరంగంగా చెప్పగలుగుతారా?

ఆంద్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు ప్రాణప్రదమైంది. పోలవరం ప్రాజెక్టు వస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చాలా భాగానికి నీటి ఎద్దడి సమస్య తీరడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాని ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిజంగా పూర్తి అవుతుందా? లేక గందరగోళంగా మారుతుందా అన్నది పెద్ద ప్రశ్న.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టి.అంజయ్య (కాంగ్రెస్‌) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్లు గడచిపోయాయి. చివరికి అది వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పనిమొదలైంది. కిరణ్‌ కుమార్‌ రెడ్డి టైమ్‌లో కొంత ముందుకు వెళ్లింది.ఇప్పుడు అది నిధుల కొరత తో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.

అది ఎప్పటికి అవుతుందో తెలియని పరిస్థితిలో ఎపి ప్రభుత్వం హడావుడిగా మరో 1300 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టింది. భారీ ప్రాజెక్టులు వెంటనే ఫలితాలు ఇవ్వవని గతంలో చంద్రబాబు అంటూండేవారు. ఇది మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై అప్పట్లో ఆయన వైఖరి. ఇపుడు ఆయన స్టాండ్ మార్చకున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఎన్ టి ఆర్, వై ఎస్ ఆర్ లు ఈ రంగంలో తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతులే ఒక కారణం కావచ్చు.

ఎన్‌.టి.రామారావు పెద్ద ఎత్తున భారీ నీటి పారుదల ప్రాజెక్టులు చేపడితే, అంతకన్నా ఎక్కువ స్థాయిలో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చేపట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.వైఎస్ జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిపోయినా అసలు ప్రాజెక్టులు రాకపోవడం కన్నా ఏదోరకంగా అవి వస్తే మంచిదేనన్న సమర్ధన సామాన్యుల నుంచి కూడా వచ్చిందంటే సాగునీటి పారుదల రంగాన్ని గతపాలకులు ఎంతగా నిర్లక్ష్యం చేశారో అర్ధం చేసుకోవచ్చు.

పులిచింతల ప్రాజెక్టు రావాలని దశాబ్దాల తరబడి పత్రికలు ఎన్ని వందల వేల కధనాలు రాశాయో! పులిచింతల అవసరాన్ని నేనే ఈనాడులో పదిహేను సార్లయినా రాశాను.

చివరికి అది వైఎస్‌ హయాంలో ముందుకు రావడం, అది ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చి నీటినినిల్వ చేసే దశకు రావడం జరిగింది. అది లేకుంటే విభజన నేపధ్యంలో కృష్ణా డెల్టా తీవ్రమైన సమస్యలను ఎదుర్కునేది. అలాగే హంద్రీ నీవా ప్రాజెక్టు విషయంలో ఎన్‌.టిఆర్‌ చొరవ తీసుకున్నా, వైఎస్‌ రాజశేఖరరెడ్డి వచ్చాకే ఆ ప్రాజెక్టు బాగా ముందుకు వెళ్లింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆ స్కీము కింద నీటిని ఇచ్చి చెరువులు నిండేలా చేయడం హర్షణీయమే. అలాగే వెలిగొండను చంద్రబాబు టైమ్‌ లో ఆరంభించినా, రాజశేఖరరెడ్డి టైమ్‌ లో స్పీడ్‌ గా పనులు సాగాయి కాని ఇప్పుడు ఆ పనులు మందగించాయన్న భావన ఉంది. ఇవన్ని ఎందుకు ప్రస్తావించవలసి వస్తున్నదంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రాంతానికి ఇవి అన్ని ప్రాణాధారాలు అవుతాయి. వ్యవసాయం అధికంగా ఉన్న ఆ ప్రాంతానికి ఇవి జీవగర్రలు అవుతాయి. అందులోను రాష్ట్రం విడిపోయాక ఈ ప్రాజెక్టులన్ని చేపట్టడం దుస్సాధ్యం అయ్యేది.

ఈ తరుణంలో పోలవరం ప్రాజెక్టుకు సంబందించి నిధుల మంజూరు చూస్తే చాలా అధ్వాన్నంగా ఉంది. ఇప్పటికే నాలుగైదు వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టుకు కేవలం వంద కోట్లను కేంద్రం కేటాయించడం ఏమిటో అర్దం కాదు.

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత పోలవరం డామ్‌ కు ఏడాదికి కనీసం నాలుగువేల కోట్లు కేటాయించకపోతే, ఖర్చుచేసి పనులు వేగంగా జరిగేలా చూడకపోతే పదేళ్లయినా ఇది పూర్తి కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఏ ధైర్యంతో 2018 నాటికి పూర్తి అవుతుందని చెబుతున్నారో తెలియదు. చంద్రబాబు నాయుడు దేశంలోనే అతి సుదీర్ఘమైన అనుభవం కలిగిన తక్కువ మంది సి.ఎమ్‌.లలో ఒకరు. ఇప్పుడు ఆయన రాజనీతిజ్ఞతతో వ్యవహరించి మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప ప్రతి దానికి రాజకీయం ఆపాదించి నష్టపోకూడదు.

పట్టిసీమ ప్రాజెక్టుపై విపక్ష వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ సభ్యులు కాని,ఆ పార్టీ నేత జగన్‌ కాని మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా విని వారికి సంశయాలు తీర్చి ఉంటే సామాన్యుల సందేహాలుకూడా తొలగిపోయివుండేవి. కాని జగన్‌ మాట్లాడుతుంటే అసహనం చంద్ర బాబులో కనబడింది. పట్టిసీమపై చర్చలో మూడుసార్లు జగన్‌ మాటా ్లడుతున్నప్పుడు చంద్రబాబు అడ్డుకున్న తీరు, ఆయన మాట్లాడిన వైనం, వాడిన పదజాలం ఆశ్చర్యం కలిగిస్తాయి. సాక్షి తనకు వ్యతిరేకంగా వార్తను పట్టిసీమ చర్చకు లింకు పెట్టి అసలు జగన్‌ ను మాట్లాడ నివ్వకుండా చేయడంలోనే చంద్రబాబు కక్ష బయటపడింది. టిఆర్‌ ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ శాసనసభలో టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి అడ్డుపడిన తీరుకు, ఇక్కడ ఎపి శాసనసభలో జగన్‌ కు చంద్రబాబు అడ్డుపడిన తీరుకు పెద్ద తేడా లేదనిపిస్తుంది.  ఇది చంద్రబాబు, జగన్‌ ల సమస్య కాదు. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంలో ప్రజాప్రయోజనాలేమీలేవు.

చంద్రబాబు తన హయాంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి శాశ్వత కీర్తి ప్రతిష్టలు గడించుకోవాలని, తాత్కాలిక ప్రయోజనాలకోసం తెలుగుదేశం, బిజెపిలు పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచెయ్యకూడదని కోరుకుందామా?

తెలుగుదేశం అవమానానికి టీచర్ల ప్రతీకారం 


”చదువుకున్నవాళ్ళు టీచర్లయిపోయారు
చదువురాని వాళ్ళు స్కూళ్ళు పెట్టేశారు”

ఇది ఒక సినిమా లో డైలాగ్ శాసన మండలిలో గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఈ డైలాగ్ కి కొనసాగింపు కూడా వుంది… అలా కాలేజీలు పెట్టిన వాళ్ళు తమ లక్ష్యానికి అనుగుణంగా డబ్బు సంపాదించారు…అలాంటి వారిలో ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీ అయిపోవాలనుకున్నారు.  ఇది టీచర్లకు మండిపోయింది…ఆ ఇద్దరినుంచీ నుంచి ‘కట్నకానుకలు’ తీసేసుకుని ఇద్దర్నీ పక్కన పడేశారు. 

విద్యాబుద్ధులు తప్ప డబ్బులేని నిజమైన టీచర్ నే గెలిపించుకున్నారు. 

పరాజితులు సరే…ఇందులో భంగపడింది తెలుగుదేశం పార్టీ…గెలుపు గుర్రాల ఎంపిక పేరుతో అర్హులను విస్మరించి ఉపాధ్యాయులను అవమానించింది. అపూర్వమైన తీరులో 84 శాతం పోలింగ్ అయినప్పుడే ఇదంతా పాలకపక్షం మీద కసేనని వెల్లడైపోయింది. 

ఘనమైన బ్రాండ్ ఇమేజి వున్న ఇంజనీరింగ్ కాలేజీల యజమానులైన కృష్ణారావు, చైతన్యరాజు టీచర్ ఎమ్మెల్సీ పదవికి తెలుగుదేశం మద్దతుకోసం గట్టి ప్రయత్నం చేశారు. ఆ అవకాశం చైతన్యరాజుకి దక్కింది. ఉపాధ్యాయసంఘాల ప్రతినిధి స్వయంగా టీచర్ అయిన సూర్యారావు తో పాటు ఈ ఇద్దరూ నామినేషన్లు వేశారు. బ్రహాండమైన ప్రచారం జరిగింది. వెండి గ్లాసులు పంచుతూ చైతన్యరాజు మద్దతుదారులు, డబ్బు పంచుతూ కృష్ణారావు మద్దతు దారులు దొరకిపోయేటంట పటాటోపమైన కేంపెయిన్ రెండు వైపులా జరిగింది. 

చైతన్యరాజు కాంగ్రెస్ లో వున్నపుడు ఎమ్మెల్సీ అయ్యారు. ఆతరువాత ఆయన పెద్దబ్బాయి ఎమ్మెల్సీ అయ్యారు. తెలుగుదేశం గెలవడంతో  వచ్చాక రాజుగారు అధికారపార్టీ వేపు ఫిరాయించారు. కొడుకు ఎమ్మెల్సీ గా వుండగా రెండోసారి తండ్రికి అవకాశమా అని విమర్శలు సొంత పార్టీనుంచే వచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు. గోదావరి జిల్లాలు బాబుని నెత్తిన పెట్టుకున్నందుకు మితిమీరిన విశ్వాసంతో బాబుగారు రాజుగారిని మాకు అంటగట్టారు అని నాలుగురోజుల క్రితమే ఒక ఎమ్మెల్యే నాతో అన్నారు. ‘మా కేండిడేట్ పోతాడు సెకెండ్ ప్రిఫరెన్షియల్ ఓటుతో కృష్ణారావు గెలుస్తాడు’ అని వ్యాఖ్యానించారు. 

ఆ సీనియర్ నాయకుడి మాటల్లో విష్ ఫుల్ ధింకింగే తప్ప ఆయన కొద్ది మంది టీచర్లతో కూడా మాట్లాడలేదని నాకు అర్ధమైపోయింది.

‘నిజమైన టీచర్’ సూర్యారావు గెలిచిన ఫలితం వెలువడిన వెంటనే చంద్రబాబు చాలా బాధ్యతగా గోదావరి జిల్లాల ఎమ్మెల్యేల మీద విరుచుకు పడ్డారు. ఏ ఒక్కరినీ వొదిలిపెట్టేది లేదని కేకలేసివుంటారు. పార్టీకోసం తానొక్కడినే ఎంత కష్టపడుతున్నదీ  సుదీర్ఘంగా తప్పక చేప్పేవుంటారు.

ఉపాధ్యాయులకు కేటాయించిన స్ధానాన్ని వారికే విడిచిపెట్టకుండా అందులోకీ సంపన్నులనే దూర్చేయడం తెలుగుదేశం తప్పు. ఏపార్టీకీ లేనంతమంది సభ్యులున్న పార్టీగా గొప్పలు చెప్పుకునే తెలుగుదేశానికి గోదావరిజిల్లాలలో ఉపాధ్యాయుల్లో సరైన అభ్యర్ధే లేరంటే అంతకుమించిన దివాళా కోరుతనమే లేదు. నిజమైన టీచర్ కే మద్దతు ఇచ్చివుంటే ఒక వేళ ఓడినా కూడా ఉపాధ్యాయుల్లోకి తెలుగుదేశం విస్తరించి వుండేది. తమ అభ్యర్ధి గెలవక ఏమౌతాడన్న తెలగుదేశం అహంకారమే ఆ పార్టీని అవమానం పాలు చేసింది. 

ఈ ఎన్నికల్లో ఓడిపోయింది తెలుగుదేశం మాత్రమే కాదు…మీడియా కూడా.
రాగద్వేషాలకు అతీతంగా విలేకరులు వాస్తవస్ధితిగతులను అంచనావేస్తారు…వెయ్యాలి…ఎన్నికల గోదాలో సంపన్నుల వున్నపుడు బలాబలాలతో నిమిత్తంలేని తళుకు బెళుకుల పటాటోపమే చివరివరకూ సాగుతుంది..ఈ మేలిముసుగుల్ని అధికారపార్టీ రాజకీయాలే రాయడం మీద మోజు వొదులుకుని అసలు రూపాన్ని చూడటంలో జర్నలిస్టులు విఫలమౌతున్న వాతావరణం విస్తరిస్తోంది. 

చంద్రబాబు వాస్తవాల్ని చూడలేకపోతే ఆపార్టీకి నష్టం, ఆయన ముఖ్యమంత్రిగా కూడా వున్నారు కాబట్టి ఇదే స్ధితి అదే పనిగా సాగితే ఆయనది చూపుమందగించిన  ప్రభుత్వమే అవుతుంది. 

మీడియా కూడా అంతగానే దివాళా తీస్తే చూపులేని దృతరాషు్ట్రడికి చెవుడు కూడా వచ్చినట్టవుతుంది.  

కాలంలో హద్దే  – పండగ!


  ఫాల్గుణ మాసపు చివరి అమావాస్య నాడే ఆకస్మికంగా చీకటైపోదు. అంతకు ముందు నుంచీ క్రమంగా చీకటి కమ్ముకుంటూనే వస్తుంది.చైత్రమాసపు పాడ్యమినాడే వేసవి విరుచుకు పడిపోదు. అంతకు ముందునుంచీ ఎండలు ముదురుతూనే వుంటాయి.

ఆకులు రాల్చే శిశిరం లోకీ చిగుళ్ళు వేసే వసంతం చొచ్చుకు పోతుంది. పచ్చదనం మొదలయ్యే వసంతంలోకీ ఎండు రంగు శిశిరం సాగుతూనే వుంటుంది. ఇంతటి టాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ మధ్యలో ఒక హద్దు గీసుకోకపోతే నిన్నటికీ రేపటికీ మధ్య లెఖ్ఖ కుదరని గందరగోళం చతికిల పడేస్తుంది. 

అలాంటి హద్దులన్నీ పండగలే! 

అంటే…పండగంటే – ఎప్పటికప్పుడు తప్పొప్పుల్ని వొదిలించుకుని కొత్త సార్ధక్యాలు విధించుకునే హద్దుగా కాలంతో మనుషులు గీసుకున్న గీతే!

పండగంటే ఇల్లు పసుపుబట్ట అవుతుంది. కుంకుమతో రాగరంజితం అవుతుంది.పూలతో,పూజలతో మనసు లగ్నమై పరిమళిస్తుంది. నైవేద్యాలతో గాలి ఆకలిని వ్యాపిపజేస్తుంది. వేడికోళ్ళను దట్టించుకున్న కొబ్బరికాయలు మనిషికొకటిగా పగులుతాయి. 

పండగంటే చేసిన పాపాలన్నిటినీ కడిగేసే పూజగదే! 

 


కాలనాళికలో ఇవే మంచీచెడులు, పతనఔన్నత్యాలూ, మళ్ళీమళ్ళీ ముందుకొస్తూనే వుంటాయి. నిజానిజాలు ఆరునూరవ్వవుకానీ, చిత్తశుద్ధిలేని మొక్కుబడుల ముందు ప్రతిపండుగ నాడూ అసలు లక్ష్యాల సత్యమొక్కటే తేలిపోతూనే వుంది. పల్చబడిపోతూనే వుంది 

మీకు మన్మధనామ సంవత్సర శుభాకాంక్షలు! 

ధర్మమొకటి వుందని నమ్ముకుంటాం! 


ధర్మమొకటి వుందని నమ్ముకుంటాం! 

మాటని నమ్ముకుంటాం! చిటారుకొమ్మన వున్న పాలకుణ్ణి నమ్ముకుంటాం!
ఆశకూ ఆశాభంగానికీ మధ్య కొంత ప్రయాణం చేస్తాం. మాటతప్పాకే…గాయాల తరువాతే ‘మాయ’ మాయమైపోతుంది. అధర్మమే రాజధర్మమని తెలిశాక వేదన అరణ్య రోదన అవుతుంది. అపుడు….గత్యంతరం లేకపోవడమేమితో అర్ధమౌతుంది.
దిక్కులేనితనమేమిటో అనుభవమౌతుంది. ధర్మాగ్రహమొక్కటే మిగులుతుంది
తెగింపే ముగింపు అవుతుంది. తెగేదాకా లాగిన తరువాత తెగించిన వాడిని తప్పుపట్టి వుపయోగంలేదు. దేవుడే తప్పుకు తిరుగుతున్నపుటు  సైతాను ఎదురుతిరిగాడని ఏడ్చి ప్రయోజనం లేదు. 

ఇది ఉగాది వచనం (నాకు కవిత్వమే వచ్చి వుంటే భంగపడిన ఆంధ్రప్రదేశ్ మీద ఓ బ్రహ్మాండమైన కవితరాసి వుండేవాడిని) ఇది నరేంద్రమోదీగారికీ, ఆంధ్రప్రదేశ్ కీ, కేంద్రప్రభుత్వానికీ మధ్యవర్తిగా వున్న పెద్దమనిషి వెంకయ్యనాయుడు గారికీ, గల్లీనుంచి ఢిల్లీవరకూ వున్న బిజెపి నాయకులందరికీ అంకితం 

ఆమె వేట ఘనంగా సాగింది 


ఆమె వేట ఘనంగా సాగింది 
ఆమె తీవ్రంగా గాయపరచింది ‘ఒక ఆడది నోరెత్తకూడదన్న’ ఒక ఆధిపత్య ధోరణిని 

(శాసన సభలో నిన్న రోజా ప్రవర్తన తీరు అభ్యంతరకరమని టివిలు చూసిన వారు బాధపడుతున్నారు. వెటకరిస్తున్నారు. తీర్పులిస్తున్నారు. పాక్షిక ప్రత్యక్ష ప్రసారాల్లో ఆమె ఎక్స్ ప్రెషన్లు మాత్రమే కనబడ్డాయి. రోజూ రోజా పట్ల మాటరాకుండా అదేమిటో అర్ధమయ్యే విధంగా పెదవులు కదుపుతూ, బాడీ లాంగ్వేజితో పురుష ప్రతినిధులు కొందరు ఎంత అసభ్యంగా వ్యవహరిస్తున్నారో ప్రసారాలకు అందవని అసెంబ్లీ బీటులో వున్న పాత్రికేయ మిత్రులు చెబుతున్నారు. యాక్టివ్ గా ఎక్స్ ప్రెసివ్ గా వుండే ఏ మహిళ పట్ల అయినా కూడా ఇలాంటి ప్రవర్తనే వుంటుందంటున్నారు. 

ఇది వైరి పక్షాన్ని సహించలేని రాజకీయంకాదు…
సీ్త్ర తల ఎత్తకూడదన్న మగ అహంకారం
నేను ఇపుడు రోజా ఫాన్ ని)

ప్రజల జీవనం సజావుగా ప్రశాంతంగా వుండటానికి కుటుంబ సంబంధాల్లో, సాంఘిక సంబంధాల్లో, ఆర్ధిక సంబంధాల్లో, రాజకీయ సంబంధాల్లో సమతూకం ముఖ్యం. ప్రభుత్వాలు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఈ సంబంధాలన్నిటినీ ప్రభావితం చేస్తున్నాయి. ఇంకొక వైపు వైజ్ఞానిక, శాసీ్త్రయ అంశాల్లో వికాసం అనూహ్యంగా, మెరుపువేగంతో వుంది. వీటన్నిటితో పాటు, వీటన్నిటికీ మించి ఎప్పటికప్పుడు సాంక్కృతిక పునర్జీవం జరగకపోతే అన్ని రంగాలు, ఆయా రంగాల్లో వున్న ముఖ్యులు, బాధ్యులు సంస్కారాన్నే కోల్పోతారు. తెలుగు శాసనసభల్లో ఈ సంస్కారరాహిత్యమే కనబడుతోంది. 

ఇదే కొనసాగితే అంతిమంగా మానవీయ విలువలు కూడా మంచానపడతాయి.


యనమల హీరో


అదేపనిగా డబ్బుసంపాదించే పనిలో వుండే సుజనా చౌదరిగారికి ప్రత్యేక హోదా “హక్కు, గౌరవాల” కంటే 3000 కోట్ల రూపాయల ముష్టే ముఖ్యం. బహుశా డబ్బే ఆయన్ని అందలమెక్కించింది. అంతటి మనిషి గొంతు చించుకున్నా నాకేంతెలియదు పోఎహె అన్నట్టు గాలితీసేసిన యనమల రామకృష్ణుడుగారే హీరో…ఎందుకంటే ఆయన ప్రజలనుంచి వచ్చిన మనిషి…డబ్బుతో పదవులు కొనుక్కోని మనిషి…ఇలా తెల్లారింది…


-ఎండ భలే సుఖం అనిపించిన శీతాకాలం వెనక్కిపోయి నీడ ఎంత సౌకర్యమో అనిపించే వేసవి ప్రభాత/ప్రభావ సమయం శరీరాన్ని గుచ్చుతున్నట్టువుంది.

-సీ్ట్రట్ ఫుడ్ అమ్మే బళ్ళు, కాకాహొటళ్ళు కిటకిటలాడుతున్నాయి

వీపుకి సంచులతో బైకులకు ఆనుకుని టిఫెన్లు తింటున్న మార్కెటింగ్ కుర్రవాళ్ళ గుంపులు

-క్లినిక్కుల తలుపులుతీస్తున్న ఆయాలు/సిబ్బంది

-దాదాపు అన్ని మందులషాపులూ తెరచే వున్నాయి

-ఫొటో స్టాట్ కాపీలు తీసే యూనిట్లు తెరచే వున్నాయి

-గుడుల్లో ప్రదక్షిణలు చేస్తున్న కొద్దిపాటి భక్తులు, బద్దకంగా పూజారులు కనబడ్డారు

-ఒక్క కిరాణా దుకాణం కూడా తెరచిలేదు

(ఇదిరాజమండ్రి-ప్రకాశంనగర్&దానవాయిపేట ల్లో16-3-2015 సోమవారం ఉదయం 8-30 సమయంలో నేను స్కూటర్ మీద ”మార్నింగ్ వాక్” చేసినప్పటి సన్నివేశాలు)

రుచికరమైన భోజనం అంటే….?


తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు…రుచులున్న పదార్ధాలను ఎంచుకోవడం, లేదా ఎంచుకున్న పదార్ధాలకు ఆరు రుచులనూ ఆపాదించడమే వంట చేయడమంటే!
ఏ రుచి ఎన్ని పాళ్ళుండాలో నిర్ధారించడమే వంటలో ప్రావీణ్యం…షడ్రుచులూ సమ్మిళితమైన రుచుల సంవేదనని(సెన్స్) నాలుక మొన మెదడికి అందిస్తుంది. 
ఈ టేస్ట్, ఫ్లేవర్ రెండు గంటలుగా అలాగే వుందంటే దాన్ని రుచికరమైన భోజనంతిన్న సంతృప్తి అనుకోవచ్చు. 

ఉడకబెట్టి వేయించిన బంగాళాదుంపల్లో క్రిస్పీనెస్ కారాన్ని, ఉప్పటి కమ్మతనాన్నీ మెత్తగా నోట్లో బ్లాస్ట్ చేసిన అనుభవం. 

చిట్టి ఉల్లిపాయల పులుసులో ఉప్పూకారాలు సరే! చింతపండు గుజ్జులో ఉడికిన పచ్చిమిరపకాయల పుల్లటి ఘాటు, తీపి అని ప్రత్యేకంగా తెలియనంత తక్కువగా వేసిన బెల్లం కలిసి నాలుగు రుచులు స్పష్టంగానే తెలిశాయి

వేయించిన బూడిద గుమ్మడికాయ వడియాలూ…నూనెలో వేగి, పులుసులో నాని, మరిగిన ఆవాలు, జీలకర్ర, ధనియాలు వంటి ద్రవ్యాలు, నాలుకకు సూచనగానేతప్ప గాఢత లేని చేదు, వగరులను కూడా అందించి వుండాలి. అందుకే షడ్రుచుల సంవేదన హెచ్చు సమయం వుంది.

ఆయా రుచుల్లో గాఢత ఎక్కువైవుంటే అలాంటి టేస్టుని న్యూట్రలైజు చేసే ఏజెంటుగా కూడా  ఫైనల్ టచ్ తో పెరుగు రుచి అనుభూతిని ఫైన్ ట్యూన్ చేస్తుంది

నాకు వంట చేయడం రాదు. ఆసక్తివల్ల వంటగదిలోకి వెళ్ళినా, వెళ్ళూ అని నా భార్య పంపించేస్తుంది. మా కుటుంబానికి బాగా నచ్చేలా వండే తన ప్రావీణ్యం వయసు ముప్పై ఏళ్ళు.(ఇవే టేస్టులు అందరికీ నచ్చకపోవచ్చు).రుచి బాగోలేకపోయినా బాగున్నా చాలా చాలా బాగున్నా 30% కడుపు ఖాళీగా వుండే మేరకే పరిమితంగా /నిగ్రహంగా తినే ప్రావీణ్యాన్ని నేను సాధించడం మొదలు పెట్టి నాలుగునెలలే అయ్యింది. 
Blog at WordPress.com.

Up ↑