తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు…రుచులున్న పదార్ధాలను ఎంచుకోవడం, లేదా ఎంచుకున్న పదార్ధాలకు ఆరు రుచులనూ ఆపాదించడమే వంట చేయడమంటే!
ఏ రుచి ఎన్ని పాళ్ళుండాలో నిర్ధారించడమే వంటలో ప్రావీణ్యం…షడ్రుచులూ సమ్మిళితమైన రుచుల సంవేదనని(సెన్స్) నాలుక మొన మెదడికి అందిస్తుంది. 
ఈ టేస్ట్, ఫ్లేవర్ రెండు గంటలుగా అలాగే వుందంటే దాన్ని రుచికరమైన భోజనంతిన్న సంతృప్తి అనుకోవచ్చు. 

ఉడకబెట్టి వేయించిన బంగాళాదుంపల్లో క్రిస్పీనెస్ కారాన్ని, ఉప్పటి కమ్మతనాన్నీ మెత్తగా నోట్లో బ్లాస్ట్ చేసిన అనుభవం. 

చిట్టి ఉల్లిపాయల పులుసులో ఉప్పూకారాలు సరే! చింతపండు గుజ్జులో ఉడికిన పచ్చిమిరపకాయల పుల్లటి ఘాటు, తీపి అని ప్రత్యేకంగా తెలియనంత తక్కువగా వేసిన బెల్లం కలిసి నాలుగు రుచులు స్పష్టంగానే తెలిశాయి

వేయించిన బూడిద గుమ్మడికాయ వడియాలూ…నూనెలో వేగి, పులుసులో నాని, మరిగిన ఆవాలు, జీలకర్ర, ధనియాలు వంటి ద్రవ్యాలు, నాలుకకు సూచనగానేతప్ప గాఢత లేని చేదు, వగరులను కూడా అందించి వుండాలి. అందుకే షడ్రుచుల సంవేదన హెచ్చు సమయం వుంది.

ఆయా రుచుల్లో గాఢత ఎక్కువైవుంటే అలాంటి టేస్టుని న్యూట్రలైజు చేసే ఏజెంటుగా కూడా  ఫైనల్ టచ్ తో పెరుగు రుచి అనుభూతిని ఫైన్ ట్యూన్ చేస్తుంది

నాకు వంట చేయడం రాదు. ఆసక్తివల్ల వంటగదిలోకి వెళ్ళినా, వెళ్ళూ అని నా భార్య పంపించేస్తుంది. మా కుటుంబానికి బాగా నచ్చేలా వండే తన ప్రావీణ్యం వయసు ముప్పై ఏళ్ళు.(ఇవే టేస్టులు అందరికీ నచ్చకపోవచ్చు).రుచి బాగోలేకపోయినా బాగున్నా చాలా చాలా బాగున్నా 30% కడుపు ఖాళీగా వుండే మేరకే పరిమితంగా /నిగ్రహంగా తినే ప్రావీణ్యాన్ని నేను సాధించడం మొదలు పెట్టి నాలుగునెలలే అయ్యింది.