ఫాల్గుణ మాసపు చివరి అమావాస్య నాడే ఆకస్మికంగా చీకటైపోదు. అంతకు ముందు నుంచీ క్రమంగా చీకటి కమ్ముకుంటూనే వస్తుంది.చైత్రమాసపు పాడ్యమినాడే వేసవి విరుచుకు పడిపోదు. అంతకు ముందునుంచీ ఎండలు ముదురుతూనే వుంటాయి.

ఆకులు రాల్చే శిశిరం లోకీ చిగుళ్ళు వేసే వసంతం చొచ్చుకు పోతుంది. పచ్చదనం మొదలయ్యే వసంతంలోకీ ఎండు రంగు శిశిరం సాగుతూనే వుంటుంది. ఇంతటి టాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ మధ్యలో ఒక హద్దు గీసుకోకపోతే నిన్నటికీ రేపటికీ మధ్య లెఖ్ఖ కుదరని గందరగోళం చతికిల పడేస్తుంది. 

అలాంటి హద్దులన్నీ పండగలే! 

అంటే…పండగంటే – ఎప్పటికప్పుడు తప్పొప్పుల్ని వొదిలించుకుని కొత్త సార్ధక్యాలు విధించుకునే హద్దుగా కాలంతో మనుషులు గీసుకున్న గీతే!

పండగంటే ఇల్లు పసుపుబట్ట అవుతుంది. కుంకుమతో రాగరంజితం అవుతుంది.పూలతో,పూజలతో మనసు లగ్నమై పరిమళిస్తుంది. నైవేద్యాలతో గాలి ఆకలిని వ్యాపిపజేస్తుంది. వేడికోళ్ళను దట్టించుకున్న కొబ్బరికాయలు మనిషికొకటిగా పగులుతాయి. 

పండగంటే చేసిన పాపాలన్నిటినీ కడిగేసే పూజగదే! 

 


కాలనాళికలో ఇవే మంచీచెడులు, పతనఔన్నత్యాలూ, మళ్ళీమళ్ళీ ముందుకొస్తూనే వుంటాయి. నిజానిజాలు ఆరునూరవ్వవుకానీ, చిత్తశుద్ధిలేని మొక్కుబడుల ముందు ప్రతిపండుగ నాడూ అసలు లక్ష్యాల సత్యమొక్కటే తేలిపోతూనే వుంది. పల్చబడిపోతూనే వుంది 

మీకు మన్మధనామ సంవత్సర శుభాకాంక్షలు!