”చదువుకున్నవాళ్ళు టీచర్లయిపోయారు
చదువురాని వాళ్ళు స్కూళ్ళు పెట్టేశారు”

ఇది ఒక సినిమా లో డైలాగ్ శాసన మండలిలో గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఈ డైలాగ్ కి కొనసాగింపు కూడా వుంది… అలా కాలేజీలు పెట్టిన వాళ్ళు తమ లక్ష్యానికి అనుగుణంగా డబ్బు సంపాదించారు…అలాంటి వారిలో ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీ అయిపోవాలనుకున్నారు.  ఇది టీచర్లకు మండిపోయింది…ఆ ఇద్దరినుంచీ నుంచి ‘కట్నకానుకలు’ తీసేసుకుని ఇద్దర్నీ పక్కన పడేశారు. 

విద్యాబుద్ధులు తప్ప డబ్బులేని నిజమైన టీచర్ నే గెలిపించుకున్నారు. 

పరాజితులు సరే…ఇందులో భంగపడింది తెలుగుదేశం పార్టీ…గెలుపు గుర్రాల ఎంపిక పేరుతో అర్హులను విస్మరించి ఉపాధ్యాయులను అవమానించింది. అపూర్వమైన తీరులో 84 శాతం పోలింగ్ అయినప్పుడే ఇదంతా పాలకపక్షం మీద కసేనని వెల్లడైపోయింది. 

ఘనమైన బ్రాండ్ ఇమేజి వున్న ఇంజనీరింగ్ కాలేజీల యజమానులైన కృష్ణారావు, చైతన్యరాజు టీచర్ ఎమ్మెల్సీ పదవికి తెలుగుదేశం మద్దతుకోసం గట్టి ప్రయత్నం చేశారు. ఆ అవకాశం చైతన్యరాజుకి దక్కింది. ఉపాధ్యాయసంఘాల ప్రతినిధి స్వయంగా టీచర్ అయిన సూర్యారావు తో పాటు ఈ ఇద్దరూ నామినేషన్లు వేశారు. బ్రహాండమైన ప్రచారం జరిగింది. వెండి గ్లాసులు పంచుతూ చైతన్యరాజు మద్దతుదారులు, డబ్బు పంచుతూ కృష్ణారావు మద్దతు దారులు దొరకిపోయేటంట పటాటోపమైన కేంపెయిన్ రెండు వైపులా జరిగింది. 

చైతన్యరాజు కాంగ్రెస్ లో వున్నపుడు ఎమ్మెల్సీ అయ్యారు. ఆతరువాత ఆయన పెద్దబ్బాయి ఎమ్మెల్సీ అయ్యారు. తెలుగుదేశం గెలవడంతో  వచ్చాక రాజుగారు అధికారపార్టీ వేపు ఫిరాయించారు. కొడుకు ఎమ్మెల్సీ గా వుండగా రెండోసారి తండ్రికి అవకాశమా అని విమర్శలు సొంత పార్టీనుంచే వచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు. గోదావరి జిల్లాలు బాబుని నెత్తిన పెట్టుకున్నందుకు మితిమీరిన విశ్వాసంతో బాబుగారు రాజుగారిని మాకు అంటగట్టారు అని నాలుగురోజుల క్రితమే ఒక ఎమ్మెల్యే నాతో అన్నారు. ‘మా కేండిడేట్ పోతాడు సెకెండ్ ప్రిఫరెన్షియల్ ఓటుతో కృష్ణారావు గెలుస్తాడు’ అని వ్యాఖ్యానించారు. 

ఆ సీనియర్ నాయకుడి మాటల్లో విష్ ఫుల్ ధింకింగే తప్ప ఆయన కొద్ది మంది టీచర్లతో కూడా మాట్లాడలేదని నాకు అర్ధమైపోయింది.

‘నిజమైన టీచర్’ సూర్యారావు గెలిచిన ఫలితం వెలువడిన వెంటనే చంద్రబాబు చాలా బాధ్యతగా గోదావరి జిల్లాల ఎమ్మెల్యేల మీద విరుచుకు పడ్డారు. ఏ ఒక్కరినీ వొదిలిపెట్టేది లేదని కేకలేసివుంటారు. పార్టీకోసం తానొక్కడినే ఎంత కష్టపడుతున్నదీ  సుదీర్ఘంగా తప్పక చేప్పేవుంటారు.

ఉపాధ్యాయులకు కేటాయించిన స్ధానాన్ని వారికే విడిచిపెట్టకుండా అందులోకీ సంపన్నులనే దూర్చేయడం తెలుగుదేశం తప్పు. ఏపార్టీకీ లేనంతమంది సభ్యులున్న పార్టీగా గొప్పలు చెప్పుకునే తెలుగుదేశానికి గోదావరిజిల్లాలలో ఉపాధ్యాయుల్లో సరైన అభ్యర్ధే లేరంటే అంతకుమించిన దివాళా కోరుతనమే లేదు. నిజమైన టీచర్ కే మద్దతు ఇచ్చివుంటే ఒక వేళ ఓడినా కూడా ఉపాధ్యాయుల్లోకి తెలుగుదేశం విస్తరించి వుండేది. తమ అభ్యర్ధి గెలవక ఏమౌతాడన్న తెలగుదేశం అహంకారమే ఆ పార్టీని అవమానం పాలు చేసింది. 

ఈ ఎన్నికల్లో ఓడిపోయింది తెలుగుదేశం మాత్రమే కాదు…మీడియా కూడా.
రాగద్వేషాలకు అతీతంగా విలేకరులు వాస్తవస్ధితిగతులను అంచనావేస్తారు…వెయ్యాలి…ఎన్నికల గోదాలో సంపన్నుల వున్నపుడు బలాబలాలతో నిమిత్తంలేని తళుకు బెళుకుల పటాటోపమే చివరివరకూ సాగుతుంది..ఈ మేలిముసుగుల్ని అధికారపార్టీ రాజకీయాలే రాయడం మీద మోజు వొదులుకుని అసలు రూపాన్ని చూడటంలో జర్నలిస్టులు విఫలమౌతున్న వాతావరణం విస్తరిస్తోంది. 

చంద్రబాబు వాస్తవాల్ని చూడలేకపోతే ఆపార్టీకి నష్టం, ఆయన ముఖ్యమంత్రిగా కూడా వున్నారు కాబట్టి ఇదే స్ధితి అదే పనిగా సాగితే ఆయనది చూపుమందగించిన  ప్రభుత్వమే అవుతుంది. 

మీడియా కూడా అంతగానే దివాళా తీస్తే చూపులేని దృతరాషు్ట్రడికి చెవుడు కూడా వచ్చినట్టవుతుంది.