(శనివారం నవీనమ్)

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం శంకుస్ధాపన చేస్తున్న “పట్టిసీమ”ఎత్తిపోతల పధకంమీద ప్రశ్నలు, అనుమానాలూ వున్నాయి. ఎనభై టి.ఎమ్‌.సిల నీరు కేవలం కొన్ని పంపుల ద్వారా తోడి కృష్ణా డెల్టాకు సరఫరా చేసే పరిస్థితి ఉంటే పదహారు వేల కోట్లను వ్యయం చేసి పోలవరం పెద్ద ప్రాజెక్టు నిర్మించవలసిన అవసరం ఏమిటి? గోదావరిలోకాని, కృష్ణలో కాని ఒకే టైమ్‌ లో వరద వస్తే ఆ నీటిని ఎక్కడకు తరలిస్తారు? గోదావరి నుంచి నీటిని తీసుకువెళ్లి కృష్ణా డెల్టాలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేసే అవకాశం లేనప్పుడు ఎలా వినియోగి స్తారు? మోకాలికి, బోడిగుండుకు లింకు పెట్టినట్లు, పట్టిసీమకు, రాయలసీమ నీటికి లింకు పెట్టి ప్రాజెక్టుపై హడావుడిగా నిర్ణయం చేయవలసినంత పరిస్ధితి ఏమిటి?

కృష్ణా డెల్టాకు లిఘ్ట ద్వారా తరలించి, అప్పుడు కృష్ణనీటిని రాయలసీమకు వాడుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. వినడానికి బాగానే ఉంటుంది. కాని ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై స్పష్టత వుందా? శ్రీశైలం కాని, సాగర్‌ కాని రెండు రాష్ట్రాలకు సంబందించిన ప్రాజెక్టులు అన్న విషయం మర్చిపోకూడదు. నిజంగానే ప్రభుత్వం అనుకున్నట్లు జరిగితే కొంత ఉపయోగం ఉండవచ్చు. కాని అందుకు గ్యారంటీ ఏమిటి? అలాంటప్పుడు ప్రభుత్వం జారీ చేసిన జి.ఓలో రాయలసీమ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? గోదావరి డెల్టాల్లో రెండో పంటకు ఇప్పటికే చాలడంలేదు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం వల్ల ఈ సమస్య మరింత జటిలంకాదా?

పోలవరం మరో పదేళ్లకు కూడా పూర్తి అవుతుందన్న నమ్మకం లేకే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారా? అయితే ఆవిషయం బహిరంగంగా చెప్పగలుగుతారా?

ఆంద్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు ప్రాణప్రదమైంది. పోలవరం ప్రాజెక్టు వస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చాలా భాగానికి నీటి ఎద్దడి సమస్య తీరడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాని ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిజంగా పూర్తి అవుతుందా? లేక గందరగోళంగా మారుతుందా అన్నది పెద్ద ప్రశ్న.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టి.అంజయ్య (కాంగ్రెస్‌) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్లు గడచిపోయాయి. చివరికి అది వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పనిమొదలైంది. కిరణ్‌ కుమార్‌ రెడ్డి టైమ్‌లో కొంత ముందుకు వెళ్లింది.ఇప్పుడు అది నిధుల కొరత తో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.

అది ఎప్పటికి అవుతుందో తెలియని పరిస్థితిలో ఎపి ప్రభుత్వం హడావుడిగా మరో 1300 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టింది. భారీ ప్రాజెక్టులు వెంటనే ఫలితాలు ఇవ్వవని గతంలో చంద్రబాబు అంటూండేవారు. ఇది మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై అప్పట్లో ఆయన వైఖరి. ఇపుడు ఆయన స్టాండ్ మార్చకున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఎన్ టి ఆర్, వై ఎస్ ఆర్ లు ఈ రంగంలో తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతులే ఒక కారణం కావచ్చు.

ఎన్‌.టి.రామారావు పెద్ద ఎత్తున భారీ నీటి పారుదల ప్రాజెక్టులు చేపడితే, అంతకన్నా ఎక్కువ స్థాయిలో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చేపట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.వైఎస్ జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిపోయినా అసలు ప్రాజెక్టులు రాకపోవడం కన్నా ఏదోరకంగా అవి వస్తే మంచిదేనన్న సమర్ధన సామాన్యుల నుంచి కూడా వచ్చిందంటే సాగునీటి పారుదల రంగాన్ని గతపాలకులు ఎంతగా నిర్లక్ష్యం చేశారో అర్ధం చేసుకోవచ్చు.

పులిచింతల ప్రాజెక్టు రావాలని దశాబ్దాల తరబడి పత్రికలు ఎన్ని వందల వేల కధనాలు రాశాయో! పులిచింతల అవసరాన్ని నేనే ఈనాడులో పదిహేను సార్లయినా రాశాను.

చివరికి అది వైఎస్‌ హయాంలో ముందుకు రావడం, అది ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చి నీటినినిల్వ చేసే దశకు రావడం జరిగింది. అది లేకుంటే విభజన నేపధ్యంలో కృష్ణా డెల్టా తీవ్రమైన సమస్యలను ఎదుర్కునేది. అలాగే హంద్రీ నీవా ప్రాజెక్టు విషయంలో ఎన్‌.టిఆర్‌ చొరవ తీసుకున్నా, వైఎస్‌ రాజశేఖరరెడ్డి వచ్చాకే ఆ ప్రాజెక్టు బాగా ముందుకు వెళ్లింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆ స్కీము కింద నీటిని ఇచ్చి చెరువులు నిండేలా చేయడం హర్షణీయమే. అలాగే వెలిగొండను చంద్రబాబు టైమ్‌ లో ఆరంభించినా, రాజశేఖరరెడ్డి టైమ్‌ లో స్పీడ్‌ గా పనులు సాగాయి కాని ఇప్పుడు ఆ పనులు మందగించాయన్న భావన ఉంది. ఇవన్ని ఎందుకు ప్రస్తావించవలసి వస్తున్నదంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రాంతానికి ఇవి అన్ని ప్రాణాధారాలు అవుతాయి. వ్యవసాయం అధికంగా ఉన్న ఆ ప్రాంతానికి ఇవి జీవగర్రలు అవుతాయి. అందులోను రాష్ట్రం విడిపోయాక ఈ ప్రాజెక్టులన్ని చేపట్టడం దుస్సాధ్యం అయ్యేది.

ఈ తరుణంలో పోలవరం ప్రాజెక్టుకు సంబందించి నిధుల మంజూరు చూస్తే చాలా అధ్వాన్నంగా ఉంది. ఇప్పటికే నాలుగైదు వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టుకు కేవలం వంద కోట్లను కేంద్రం కేటాయించడం ఏమిటో అర్దం కాదు.

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత పోలవరం డామ్‌ కు ఏడాదికి కనీసం నాలుగువేల కోట్లు కేటాయించకపోతే, ఖర్చుచేసి పనులు వేగంగా జరిగేలా చూడకపోతే పదేళ్లయినా ఇది పూర్తి కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఏ ధైర్యంతో 2018 నాటికి పూర్తి అవుతుందని చెబుతున్నారో తెలియదు. చంద్రబాబు నాయుడు దేశంలోనే అతి సుదీర్ఘమైన అనుభవం కలిగిన తక్కువ మంది సి.ఎమ్‌.లలో ఒకరు. ఇప్పుడు ఆయన రాజనీతిజ్ఞతతో వ్యవహరించి మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప ప్రతి దానికి రాజకీయం ఆపాదించి నష్టపోకూడదు.

పట్టిసీమ ప్రాజెక్టుపై విపక్ష వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ సభ్యులు కాని,ఆ పార్టీ నేత జగన్‌ కాని మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా విని వారికి సంశయాలు తీర్చి ఉంటే సామాన్యుల సందేహాలుకూడా తొలగిపోయివుండేవి. కాని జగన్‌ మాట్లాడుతుంటే అసహనం చంద్ర బాబులో కనబడింది. పట్టిసీమపై చర్చలో మూడుసార్లు జగన్‌ మాటా ్లడుతున్నప్పుడు చంద్రబాబు అడ్డుకున్న తీరు, ఆయన మాట్లాడిన వైనం, వాడిన పదజాలం ఆశ్చర్యం కలిగిస్తాయి. సాక్షి తనకు వ్యతిరేకంగా వార్తను పట్టిసీమ చర్చకు లింకు పెట్టి అసలు జగన్‌ ను మాట్లాడ నివ్వకుండా చేయడంలోనే చంద్రబాబు కక్ష బయటపడింది. టిఆర్‌ ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ శాసనసభలో టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి అడ్డుపడిన తీరుకు, ఇక్కడ ఎపి శాసనసభలో జగన్‌ కు చంద్రబాబు అడ్డుపడిన తీరుకు పెద్ద తేడా లేదనిపిస్తుంది.  ఇది చంద్రబాబు, జగన్‌ ల సమస్య కాదు. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంలో ప్రజాప్రయోజనాలేమీలేవు.

చంద్రబాబు తన హయాంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి శాశ్వత కీర్తి ప్రతిష్టలు గడించుకోవాలని, తాత్కాలిక ప్రయోజనాలకోసం తెలుగుదేశం, బిజెపిలు పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచెయ్యకూడదని కోరుకుందామా?