Search

Full Story

All that around you

Month

April 2015

మనిషి ముగ్దుడైపోవటం అనుభవమయ్యింది! 


మనిషి ముగ్దుడైపోవటం అనుభవమయ్యింది! 

ఇరవైరెండు లక్షల ఎకరాల్లో నిత్య దుర్భిక్షాన్ని పచ్చటి బతుకుగా మార్చడానికి నందికొండలోయలో నీటి చెలిమై ఆగిన కృష్ణమ్మను చూశాక ఒక కృతజ్ఞతతో మనసు పొంగినట్టు అనిపించింది. 

నాగార్జునసాగర్ ప్రాజెక్టుని ముప్పైఏళ్ళక్రితం పుట్టిన ఆశ నిన్నతీరింది. ప్రాజెక్టు ఎడమకాల్వ కింద గుంటూరు ప్రకాశం జిల్లాలో చివరి భూములకు నీరందని అవకతవకలపై 1982 లో చీఫ్ ఇంజనీరు శ్రీనివాసరావుగారు విచారణ చేయగా నేనూ ఫాలో అయ్యాను. చాలావార్తలు రాశాను. ఎంక్వయిరీ రిపోర్టులో ఆ వార్తల్ని కూడా ఉటంకించారు. అసెంబ్లీలో పెద్ద దుమారమైంది. 27 మంది ఇరిగేషన్ ఇంజనీర్లు సస్పెండయ్యారు. ఆ సమయంలోనే సాగర్ ప్రాజెక్టుని చూడాలనిపించింది. అది ఇప్పటికి నెరవేరింది. 

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మక్తా్యల రాజాగారు, ఖోస్లాగారు చేసిన కృషిగురించి చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావుగారు చెప్పిన మాటలు చెవిలో వినిపిస్తున్నట్టే వున్నాయి. 

కృష్ణనీ పెన్ననీ కలిపి తమిళనాడు తరలింకుచుకు పోవాలని ప్రతిపాదించింది.నిజాం నవాబు తన రాజ్యంలోనే కష్ణపై ఆనకట్ట కట్టించే అవకాశాల్ని అధ్యయనం చేయించినపుడు నల్గొండజిల్లా నందికొండ అనువైనదని తేలింది. ఆనివేదికతో మక్తా్యల రాజాగారు ముందడుగువేసి స్వయంగా ఊరూరూ తిరిగి ప్రజల సంతకాలతో ప్రాజెక్టు డిమాండును ప్రభుత్వం ముందుంచారు. సొంత డబ్బు జీలాలిచ్చి సర్వే చేయించారు. ఇష్టం లేని మద్రాసు ప్రభుత్వం కాలయాపన ఉద్దేశ్యంతో ఖోస్లా కమిటీని వేసింది. దారీ డొంకాలేని నందికొండకు వెళ్ళెదెలా? ఏమీ చూడకుండానే పా్రజెక్టుని ఆమోదించేదెలా అని ఖోస్లా ప్రశ్నించినపుడు, రాజాగారు 25 గ్రామాల ప్రజల్ని కూడగట్టి రేయింబవళ్ళు శ్రమదానం చేయించి కచ్చారోడ్లు వేయించారు. ఖోస్లా కమిటీ నందికొండను చూసి ప్రాజెక్టు నిర్మాణానికి ఇంతకు మించిన చోటు వుండదనీ, ఇది దేవుడు మీకిచ్చిన గొప్పవరమనీ అన్నారట. ఆవిధంగా మంజూరైన ప్రాజెక్టుకి 1955 లో నెహ్రూగారు శంకుస్ధాపన చేశారు. 1969 లో నిర్మాణం పూర్తయింది. 

వేసవికనున ఇరవై ఆరు గేట్లూ మూసివున్న డ్యాము ఎత్తుని గంభీరతనీ చూస్తే సృష్టిలో చైతన్యానికి మనిషికి మించిన రూపం ఇంకేముందని వెంటు్రకలు నిక్కబొడుచుకుంటున్నట్టు వుంటుంది. జీవనదిని ఆపిన మనిషి మేధస్సుకి సముద్రంలోతైనా అందుతుందా అని అబ్బురమనిపిస్తుంది. ప్రకృతికి అర్ధంచేసుకుని సాగే మనిషి ప్రయాణం ఎప్పటికీ ఆగదని నిబ్బరమొస్తుంది. ప్రాజెక్టిని ప్రజలకిచ్చిన రాజాగారు, నిజాంగారు, నెహ్రూగారు, కెఎల్ రావుగారు ప్రొఫెసర్ ఎన్.జి.రంగా గారు, మోటూరు హనుమంతరావుగారు,  కొత్త రఘురామయ్యగారు మొదలైన మహాను భావుల పట్ల కృతజ్ఞతతో హృదయంలో చెమ్మగిల్లుతుంది. 

ప్రాజెక్టు దిగువ నదీగర్భంలో బండరాళ్ళు, ఎండు నేలా – మాయావుల పట్ల కృష్ణమ్మ ఆగ్రహంలా వున్నాయి. గ్రీష్మరుతువు ఇంతే కఠినమని గుర్తు చేస్తున్నట్టున్నాయి. 
అయినా, కరువుతో గుండె చెరువైనవారిని చూసి ఆతల్లి కరిగిపోతుంది. ఎండిన నేలనొకసారి పలకరించి, మనిషి, మేక, పశువూ తేడా లేకుండా నోరెండిన ప్రతిప్రాణి గొంతూ తడుపుతుంది.

మరి, కృష్ణవేణంటే నీరుకదా! నీరంటే అమ్మ కదా!!

తెలుగుదేశం మిత్రులను ఉద్దేశించి…


మాటనిలబెట్టుకోలేదని బిజెపి మీద సగటు ఆంధ్రప్రదేశ్ మండిపడుతూండడం నిజమే! కష్టకాలంలో మాట ఇవ్వడం తప్ప బిజెపికి ఈ రాషా్ట్రనికి ఎలాంటి ఎమోషనల్ అటాచ్ మెంటూ లేని మాటా కూడా నిజమే!! మరి ఆక్రోశాన్ని వెలిబుచ్చడానికి ఎవరున్నారు? కాంగ్రెస్ ని అందామా అంటే ఆంధ్రప్రదేశ్ వరకూ అది కుళ్ళిపోతున్న శవం…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనబలమే తప్ప నీతిబలమే లేదు. పాలనలో విధానాల్లో లోపాలు, లొసుగులు, లుకలుకలు కూడా కలగలిపిన తెలుగుదేశమే ప్రజల మంచి చెడులకు జవాబుదారీగా వుండాలి. 

ఏమి చేసినా చెల్లిపోతూందనే వైఖరినే తెలుగుదేశం కొనసాగిస్తే ఆదేసూత్రం కేంద్రప్రభుత్వానికికూడా వర్తిస్తుంది. తెలుగుదేశం పదేళ్ళు అధికారానికి దూరంగా వున్న సమయంలో పార్టీని ఆదుకున్నది సుజనాచౌదరి, సిఎంరమేష్, నారాయణ వగైరా లాభసాటి వ్యాపారులే కావచ్చు. అలాంటివారి పట్ల చంద్రబాబుకి ఎనలేని కృతజ్ఞతల భారం వుండటం తప్పుకాదు. కానీ, అలాంటి వారికి ప్రభుత్వంలో నేరుగా కీలక బాధ్యతలు అప్పగించడం సమంజసంకాదు. ఇది ప్రజల కష్టనషా్టల్లో ప్రజలతో ప్రయాణించిన పార్టీ సీనియర్లను అవమానించడమే.ఇది ప్రజాస్వామ్య దృక్పధంలో కి ధనస్వామ్యాన్ని చొప్పించడమే. ఈ ధోరణి సామాన్య ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడమే కాక క్రమంగా వాటిని చంపేయడం కూడా. ఇందులో ముందుగా నిర్వీర్యమయ్యేది పార్టీయే…అది ఇప్పటికే మొదలైందని నా నమ్మకం.

అందరితో మంచి అనిపించుకోవాలన్న అతి తాపత్రయం వల్ల చంద్రబాబు పిల్లి మెడలో గంటకట్టీ, అదితానేనని నిలబడలేకపోతూంటారు. వ్యవసాయం దండగమారి దని ముందుగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆయనే. విమర్శలు వెల్లువెత్తేసరికి వెనక్కి వెళ్ళిపోయారు. ఇపుడు వ్యవసాయం ఏమీ ఉద్దరించబడలేదుకదా!
రాష్ట్రవిభజన అనివార్యమని సామాన్యులకు కూడా అర్ధమైపోయిన నేపధ్యంలో కొత్తరాజధానికి నాలుగైదు లక్షలకోట్ల రూపాయలు అవసరమని చెప్పిన బాబు విమర్శలు రాగానే వెనక్కి వెళ్ళిపోయారు. అపుడే ఆయన గట్టిగా నిలబడి వుంటే నిరర్ధకమైన సమైక్య ఉద్యమం స్ధానంలో సీమాంధ్ర హక్కుల పరిరక్షణ ఉద్యమానికి ఆయనే ఆద్యుడైవుండేవారు. 

ఎవర్ని ఎంత తిట్టుకున్నా పొగుడుకున్నా వచ్చేనాలుగేళ్ళూ ఆంధ్రప్రదేశ్ బాధ్యత తెలుగుదేశానిదే! రాషా్ట్రనికి ప్రత్యేకహోదా రాదని తేలిపోయినందువల్ల బిజెపితో సంబంధాలు సహా బహిర్గత, అంతర్గత వైఖరులను సమీక్షించుకుని కొత్త ప్రయాణం ప్రారంభించడానికి తెలుగుదేశం పార్టీకి ఇది కీలకమైన సందర్భం! 

దీనితో సంబంధం, నిమిత్తం లేని రెండు అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి : ఒకటి-సీమాంధ్రలో బలంగా వున్నకాంగ్రెస్ తనను తాను పాతిపెట్టుకుంది…రెండు-ఆంధ్రప్రదేశ్ లో బాగా ఎదిగే అవకాశాలున్న బిజెపి పుట్టకముందే చచ్చిపోయింది 
వినియోగించుకోవడం చాతనైతే ఈ రెండూ తెలుగుదేశానికి మంచి అవకాశాలే!!

దగాచేసిన పెద్దకొడుకు (శనివారం నవీనమ్) 


నియమాలు ఒప్పుకోనందున ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇక రాదని స్పష్టమైపోయింది. రాజ్యాంగాన్నే అనేకసార్లు మార్చుకున్నాం! ప్రత్యేకహోదాకు అడ్డుపడే నిబంధల్నీ, చట్టాల్నీ సవరించుకోలేమా? ఇది బిజెపి ఇంగిత జ్ఞానానికి, విజ్ఞతకి ఒక సవాలు! బిజెపితో సంబంధాలను సమీక్షించకోడానికి తెలుగుదేశానికి కీలక సందర్భం!! 

అన్యాయమైపోయిన ఆంధ్రప్రదేశ్ తనకాళ్ళమీద తాను నిలబడటానికి హక్కు తెస్తానన్న బిజెపి, మాటమార్చింది. ముష్టెత్తుకుని బతికెయ్యమని తలుపులు మూసేసింది. పెద్దకొడుకునై అండగావుంటానన్న మోదీ దగా చేశారు. ధర్మాగ్రహాన్ని ప్రదర్శించిన వెంకయ్యనాయుడు పిట్టలదొరై చెవిలో మెదులుతున్నారు. 

ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేసిన నరేంద్ర మోదీ అప్పుడు ప్రధానంగా ఇచ్చిన హామీ రాష్ట్రానికి ప్రత్యేక…ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ అన్యాయంగా విడదీసిందని, ఒక ప్రాంతాన్ని దిక్కులేకుండా చేసిందని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఆ లోపాన్ని సరిదిద్దుతామని మోదీ విస్పష్టంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తనను తమ పెద్ద కొడుకులా చూడాలని తాను ఇంటి కష్టాలు తీరుస్తానని ప్రజల్ని ఆయన నమ్మించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడమే కాకుండా అంతకు మించిన మరిన్ని రాయితీలు కల్పించి ఆదుకుంటామని, తనను నమ్మాలని మోదీ బహిరంగ సభల్లో చెప్పారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ అన్యాయంగా చీల్చిందనే కోపంతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మోదీని గాఢంగా నమ్మారు. ఆయన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఘన విజయం చేకూర్చారు. అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కని తీర్పునిచ్చారు. 

ఈ పది నెలలూ ఇదిగో అదిగో ప్రత్యేక హోదా అంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రులు చెబుతూ వచ్చారు. ప్రత్యేక హోదాపై తాము వెనక్కి వెళ్లేది లేదని కూడా ప్రతీసారీ అనేవారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని తేలిపోయింది.14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇక ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా వుండదని కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇంద్రజిత్‌సింగ్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోరుతూ ఆంధ్రప్రదేశ్‌, తెలం గాణ రాష్ట్రాల నుంచి అభ్యర్థనలు అందాయని, అయితే 14 ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఆయన తేల్చేశారు.

ఇప్పటికే 11 రాష్ట్రాలకు (అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌, మణిపూర్‌, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌)లకు అప్పటి ఎన్డీసీ (జాతీయ అభివృద్ధి మండలి) ప్రత్యేక హోదా ఇచ్చింది. ప్రత్యేక హోదాకు ఇచ్చేందుకు కావాలసిన అర్హతలు ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలోగానీ లేవు కాబట్టి అందువల్ల ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా దక్కే అవకాశం లేదన్నారుస

మరి ఈ విషయం దేశాన్ని పదేళ్లు పాలించిన యుపిఏ ప్రభుత్వానికి తెలియదా? అప్పటి హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే కి, రాజ్యసభలో పదేళ్ళ ప్రత్యేక హోదాపై పట్టుపట్టిన వెంకయ్యనాయుడికి ఈ విషయాలు తెలియవా. వెంకయ్యనాయుడు సూచనను కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించడం అన్నీ తెలియకుండానే జరిగాయా? ఎన్నికల ప్రచార సభల్లో నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా అర్హతకు సంబంధించిన నియమ నిబంధనలు తెలియకుండానే హామీలు గుప్పించారా? 

ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఏం సమాధానం చెబుతారు? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనీ అదీ కూడా పది సంవత్సరాలు ఉండాలని గతంలోని యుపిఏ ప్రభుత్వంపై రాజ్యసభలో ఒత్తిడి తీసుకువచ్చి అప్పటి కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే నుంచి హామీ పొందిన ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు తల ఎక్కడ పెట్టుకుంటారు

ఆంధ్రప్రదేశ్‌తో బాటు తమ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం కోరింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్రానికి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ కూడా రాశారు. కర్నాటక, బీహార్‌ లాంటి రాష్ట్రాలు కూడా చాలా కాలంగా ప్రత్యేక హోదా కోరుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏ విషయం ఇప్పటి వరకూ తేల్చి చెప్పలేదు. ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం ఉండాలన్న నియమం వుండేది. అయితే జాతీయ అభివృద్ధి మండలిని ప్రధాని మోడీ రద్దు చేశారు. ఆ తర్వాత జాతీయ అభివృద్ధి మండలి స్థానే నీతీ ఆయోగ్‌ ఏర్పడింది. అయితే నీతీ ఆయోగ్‌కు ఈ రకమైన అధికారాలు దఖలు పరిచినట్లుగా లేదు.

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను విభజనకు అంగీకరింప చేయడానికి, రెండు ప్రాంతాలకు న్యాయం ఏ విధంగా చేయాలనే అంశాలపై చర్చించిన యుపిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై అప్పటిలో హామీ ఇచ్చింది. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఇన్ని నిబంధనలు ఉంటాయనే విషయాన్ని అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. 

అసలే లోటు బడ్జెట్‌తో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నెత్తిన మరో పిడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం. రెండుగా విడిపోయిన ఈ రాష్ట్రాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉండదా? నిబంధనల పేరు చెప్పి మళ్లీ ఒక ప్రాంతానికి తీరని అన్యాయం చేయడం ఎంత వరకూ సబబు? ప్రత్యేక హోదాపై తెలంగాణ ప్రభుత్వం పెద్దగా ఆశలు పెట్టుకోలేదు కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని అందరూ ఎదురుచూస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్‌ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం నిరాశనే మిగిల్చింది.

విభజన చట్టంలో ప్రత్యేక హోదాను చేర్చకపోవడం అప్పటి ప్రభుత్వం తపి్పదమని కొంతకాలంగా వెంకయ్య నాయుడు పాటఅందుకున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని చట్టంలో వుంది. బడ్జెట్టులో వందకోట్ల రూపాయలు చూపించి చట్టాన్ని తప్పక అమలు చేస్తాం కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఖర్చుపెట్టి బిల్లులిస్తే రీయంబెర్స్ చేస్తాం అని మెలిక పెట్టింది. లోటు బడ్జెట్టులో వున్న రాష్ట్రం వేలకోట్ల రూపాయలు ముందుగా ఖర్చుపెట్టగలిగే స్ధితిలో వుంటుందా అన్న ఇంగితాన్ని పక్కన పెట్టిన లౌక్యం ఇది. 

ఆ మధ్య ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు ఎంపిలు ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం కన్నా ఎక్కువ నిధులు ఇచ్చేందుకు కేంద్రం మొగ్గు చూపిస్తోందనే అనుమానం కూడా ఆయన ఆ సమావేశంలో వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గేది లేదని ఆ విషయాన్ని కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించాలని ఎంపీలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. 

అయితే ప్రత్యేక హోదా రాని నష్టాన్ని మాత్రం  ఆపలేకపోతున్నారు.

పాటలేని రోద 


కుటుంబ సందర్భాలు, వ్యక్తిగత సమయాలు, బహుశ పసితనపు కలలకూడా మార్కెట్ అయిపోయాయని అర్ధమౌతోంది. నగర జీవితమంటే పాట లేని రొద అనిపిస్తోంది.

నిన్న ఒక ఐ కేర్ సెంటర్ లో వేచి వున్నపుడు అక్కడున్న 26 మందిలో 17 మంది టెక్టి్సంగ్ లోనో కాలింగ్ లోనో కనిపించారు. ఇన్ ఆర్బిట్ మాల్ లో ఒక ఫుడ్ కోర్టులో తండ్రి వాయిస్ కాల్ లో, తల్లి డేటా కాల్ లో, చిన్నారి ఎలకా్ట్రనిక్ కారు రేసులో, వారు తినవలసిన ఫుడ్ పిచ్చి చూపులతో…

ఇదంతా కనిపించని పరుగులా వుంది…ఇందులో సహజమైన ఆనందం ఏదో మిస్ అయినట్టుంది…ఇదంతా అనుభవంలా లేదు…ఏదో వెంపర్లాటలా వుంది.

నా భార్య అన్నట్టు ఒక జీవనశైలిని వ్యాఖ్యానించడానికి నేనెవరిని? నా చేతి దురదని మీరు మన్నించాలి

ఇపుడు ఒక మాట మీకు తప్పక చెప్పాలి…గోదావరి జిల్లాలను “అమరావతి”గా మార్చాలన్న ఆలోచన రాని చంద్రబాబుగారికి నేను రుణపడి వున్నాను.
గమనిక : నేను అభివృద్ధి నిరోధకుణ్ణికాదు… బిడ్డ ఎదుగుదల సమతౌల్య పౌష్టికాహారంతోనే తప్ప స్టెరాయిడ్స్ తో కాదన్నదే నా అరణ్య రోదన 

(హైదరాబాద్ లో రెండో రోజు ఆలోచనలు – బుధవారం శుభోదయం) 

ఎర్ర గౌరవం! 


ఇపుడున్న ప్రపంచం అన్యామైనదని, దాన్ని మరమ్మతు చేయాలని నమ్మి, ఎంతో కొంత ప్రయత్నం చేసే కమ్యూనిస్టు పార్టీ లంటే నాకు గౌరవం. సర్వభ్రష్టత్వాన్ని సాధించి గౌరవాభిమానాలకు కమ్యూనిస్టేతర పార్టీలు అర్హతలు కోల్పోయిన సమయంలో కమ్యూనిస్టు పార్టీలవైపు ఒక మినహాయింపుతో కొంత ఆశగా చూసే జనంలో నేనూ ఒకడిని. ఇన్ని ఎన్నికల్లో వామపక్షాలకు ఓటు వేసే అవకాశం నాకు రెండేసార్లు దొరికింది. 


రాజకీయప్రయోజనాలు, ఎన్నికల లెక్కలు చూసుకోకుండా ప్రజలకు అవసరమైన చోట, కావలసిన తీరులో నిలబడటం సిపిఎం, సిపిఐల వల్లే అవుతుంది. 
సిపిఎం 21 ఆల్ ఇండియా మహా సభలు విశాఖలో ఆరురోజులుగా జరుగుతున్నాప్రజాశక్తి పేపర్ లోనో మినహా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా యేచూరి సీతారామ్ ఎన్నికౌతున్నారన్న ”స్కూపు”లు తప్ప మరే మీడియాలో కూడా ఆ విశేషాలు పెద్దగా రాలేదు. 

ప్రపంచీకరణ నేపధ్యంలో అస్ధిత్వ ఉద్యమాలన్నిటికీ మార్కెట్ ప్రోత్సాహం దొరుకుతుందని స్ధూలంగా విశ్లేషించే సిపిఎం – కేంద్రీకృత ప్రజాస్వామ్యం, ఉక్కు క్రమశిక్షణల పేరుతో పార్టీలో మైనారిటీల అభిప్రాయాలకు పడుతున్న గతి, పార్టీలో అగ్రకులాధిపత్యం, పురుషాధిక్యం ఎందుకు సాగుతున్నాయో ”ఆత్మవిమర్శ” చేసుకోవాలి.

40 ఏళ్ళుగా ఢిల్లీలో వుండిపోవడం వల్ల తెలుగు అనర్గళంగా మాట్లాడలేని కాకినాడ బిడ్డ యేచూరి సీతారామ్ కొత్త ప్రధాన కార్యదర్శి అయ్యాక విశాఖ సాగరతీరంలో చేసిన ఉపన్యాసం ఉత్తేజభరితంగా లేదుకాని హుషారుగా వుంది. 

జనతా పరివార్, మార్పుకు నమ్మదగ్గ ప్రతినిధేనా?


జనతా పరివార్, మార్పుకు నమ్మదగ్గ ప్రతినిధేనా?

(శనివారం నవీనమ్)

పునరావృతం కాదు కాని ఒకే విధమైన పరిణామాలముందు చరిత్ర తనను తాను అనుకరించుకుంటుంది. అదే వరుస, అవే పరిణామాలే పూర్వరంగమైనా పర్యావసానాలు మాత్రం వేరుగా వుంటాయి. కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకున్న స్ధితిలో, పార్టీ బయటా వెలుపలా ఏకపక్ష నియంతృత్వ పోకడలవల్లా, అదుపులేని కార్పొరేట్ మోజువల్ల, వాగ్దాన ఉల్లంఘనలవల్లా, సాధ్వులు, బాబాల మతచాందస కురుపుల వల్లా బిజెపి పదినెలలకే ఆత్మరక్షణ దిశగా అడుగులు వేస్తున్న నేపధ్యంలో జనహృదయాన్ని స్పృశించగలిగిన వివేకాన్నీ వ్యూహాన్నీ అనుసరించగలిగే పక్షాలదే రేపటి విజయమౌతుంది. 

కనీసం అధికార పక్షాన్ని నిలదీసే జనం గొడుగౌతుంది.

సార్వత్రిక ఎన్నికల్లో ఒడిసా, తమిళనాడు, పశ్చిమబంగాల్, తెలంగాణ దేశవ్యాప్తంగా మినహా మోడీ ప్రభంజనం వీచిన నాటి నుంచి వివిధ రాజకీయ పార్టీల నేతల్లో ఒక విధమైన అభద్రతా భావం తలెత్తింది. తమ రాజకీయ భవిష్యత్తుపై వారికి ఆందోళన కలిగింది. ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా బిజెపికి అనుకూలంగా రావడంతో మోడీ పదేళ్లపాటు ఢిల్లీ పీఠం వదలరని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఢిల్లీ అసెంబ్లీ ఫలితం మోడీ వ్యతిరేకులకు కొంత ఊరటనిచ్చింది. 

అయితే రాజకీయంగా బలపడేందుకు తరుణోపాయం ఆలోచించాల్సిన అవసరం మాత్రం అలానే ఉంది. వీటన్నింటికి తోడు కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలు ఇప్పటిలో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో ఆరు పార్టీలు పునరాలోచనలో పడి ఒకటైనాయి. జనతా పరివార్‌ పార్టీలన్నీ కలిసి సమాజ్‌వాదీ జనతా పార్టీగా ఆవిర్భవించాయి.  సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సారథ్యంలో ఆరు పార్టీలతో కూడిన జనతా పరివార్‌ త్వరలో జరగనున్న వివిధ రాషా్టల్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. 

బీహార్‌లో బలమైన నాయకుడైన నితిష్‌కుమార్‌, ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, హర్యానా, కర్నాటక రాషా్టల్ల్రో క్యాడర్‌ ఉన్న వివిధ జనతా పరివార్‌ పార్టీలు ఒక గుర్తుతో పోటీ చేస్తే మంచిఫలితం ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఏడాదే బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. 2017లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. అందువల్లే అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపి కూడా జనతా పరివార్‌ పార్టీలు కలుస్తాయా లేదా అనే అంశంపై వేచి చూశాయి. చివరకు జనతా పరివార్‌ ఒక్కటైంది. 

ములాయం సింగ్‌ యాదవ్‌ ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి బీహార్‌ ముఖ్య మంత్రి నితీష్‌కుమార్‌, జెడియు చీఫ్‌ శరద్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి, జెడిఎస్‌ చీఫ్‌, మాజీ ప్రధాని దేవేగౌడ, ఆర్‌జెడి చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌, సమాజ్‌వాదీ జనతా పార్టీ చీఫ్‌ కమల్‌ మొరార్‌‌క, ఐఎన్‌ఎల్‌డి నేత దుశ్యంత్‌ చౌతాలాలతోపాటు ములాయం సోదరుడు రామ్‌గోపాల్‌ యాదవ్‌ హాజరయ్యారు. జనతా పరివార్‌ మహా కూటమి ఏర్పాటులో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ కీలక పాత్ర పోషించారు. ఆయన చూపిన చొరవ వల్లే ఈ కూటమి సాకారమైంది. ములాయం, లాలూల మధ్య ఇటీవల కుదిరిన బంధుత్వం కూడా ఇందుకు బాటలు వేసింది. నితీష్‌కుమార్‌ ఈ పార్టీకి నేతృత్వం వహించేందుకు ఏనాడూ ఆసక్తి చూపలేదు. ఆది నుంచి ములాయం సింగ్‌ అయితేనే ఈ కూటమి నిలుస్తుందని నితీష్‌కుమార్‌ వాదిస్తూ వచ్చారు. ఇందుకు లలూ ప్రసాద్‌ యాదవ్‌ను ఒప్పంచారు. జనతా పరివార్‌ కూటమికి సంబంధించి ఆరు పార్టీల నాయకులు పలుదఫాలుగా విలీనంపై చర్చించుకున్నారు. ఓ అభిప్రాయానికి వచ్చారు. ఎన్నికల గుర్తుపై చర్చించిన తరవాత ఓ నిర్ణయానికి రావచ్చని, బహుశా సైకిల్‌ గుర్తు ఖరారు కావచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఈ నెల 5న ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఓ నినాదం ఇచ్చారు. ఏక్‌ జండా..ఏక్‌ నిషాన్‌ అని. జనతా పరివార్‌ ఏర్పాటయితే బీహార్‌లో బిజెపిని నామమాత్రం చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ సారథ్యంలో ఆరు పార్టీల పరివార్‌ పనిచేస్తుందని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇప్పటికే తెలిపారు. విలీనమంటే విలీనమే అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు అని ఆర్‌జెడి అధినేత స్పష్టం చేశారు. పార్టీ గుర్తుపైనే స్పష్టత లేదుతప్ప మిగతా అన్నింటిలోనూ ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన అన్నారు. లౌకికవాద పార్టీలతోనూ కలిసి పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని లాలూ పేర్కొన్నారు. 

సమాజ్‌వాది, ఆర్జేడీ, జేడీయూ, జేడీఎస్‌, ఐఎన్‌ఎల్డీ, ఎస్‌జేపీ పార్టీలన్నీ కూడా ఒక నాటి జనతా పార్టీలోని భాగాలే. భారతీయ జనతా పార్టీ కూడా ఆ తానులో ముక్కే కానీ సిద్ధాంత ప్రాతిపదికన పూర్తిగా వేరైపోయిన సందర్భం అది. ఒకప్పుడు ఈ అన్ని పార్టీల్లోకెల్లా చిన్న పార్టీ బిజెపి. అయితే కేంద్రంలో 24 సంవత్సరాల తర్వాత సాధారణ మెజారిటీ సాధించిన ఏకైక పార్టీ స్థాయికి బిజెపి చేరుకుంది. 

అప్రతిహతంగా సాగుతున్న బిజెపికి అడ్డుతగలాలంటే తమ స్వార్ధం కొంత వదులుకోవాలని పూర్వపు జనతా పార్టీ విభాగాలు అనుకున్నాయి. అనుకున్నదే తడవుగా పావులు కదిపి ఈ స్థాయికి చేరుకున్నాయి. మతతత్వ శక్తులను ఓడించడానికే ఆరు పార్టీలు విలీనం అయినట్లు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చెప్పారు. బీహార్‌ ఎన్నికల్లో జనతా పరివార్‌ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉండటమే తమ లక్ష్యమని లాలూ చెప్పడం రాజకీయ మార్పునకు నాందిపలుకుతున్నది. 

కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేని నేపధ్యంలో భవిష్యత్తులో వామపక్షాలు కూడా ఈ పరివార్‌తో చేరవచ్చు. ఈ కూటమిలో వామపక్షాలు కూడా కలిస్తే మిగిలిన రాషా్టల్రలోని జనతా పార్టీయేతర పార్టీలు మరి కొన్ని కూడా ఈ పార్టీతో కలవడానికి ఉత్సాహం చూపించవచ్చు. అదే జరిగితే బిజెపికి కొన్ని రాషా్టల్ల్రో మంచి ఫలితాలు సాధించడం కష్టసాధ్యమౌతుంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తే ఆ తర్వాత వచ్చే నాలుగు రాషా్టల్ర (తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి) అసెంబ్లీ ఎన్నికలు, ఆ మరుసటి ఏడాది వచ్చే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు ఉత్సాహంతో ముందుకు వెళ్తుంది. ఇవి ముగిసిన తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బిజెపిని సవాల్‌ చేసే స్థాయికి వస్తుంది. 

ఈ లోపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏవైనా తప్పులు చేస్తే ఎత్తి చూపేందుకు కూడా ఈ కొత్త పార్టీ ఉత్సాహం చూపిస్తుందనడంలో సందేహం లేదు. అందువల్ల సమస్యలు వచ్చేది బిజెపికే!

మార్పుకు నమ్మదగ్గ ప్రతినిధి కావాలి! జనతా పరివార్ అలాంటి ప్రాతినిధ్యం వహించగలదా???

సిగ్గూ ఇంగితం మరచిన ఓ కీర్తి కండూతి కాంగ్రెస్ పుర్రెల దండతో  కెనడాలో ఊరేగింది 


సిగ్గూ ఇంగితం మరచిన ఓ కీర్తి కండూతి కాంగ్రెస్ పుర్రెల దండతో  కెనడాలో ఊరేగింది

పర్యావసానమెరుగని జ్ఞానం వల్ల బుద్ధి కించపడింది 

చిరుమోతాదువిషంలాగ అహంకారం తలకెక్కిన కొద్దీ వ్యక్తిత్వం మృతకణమైపోతుంది.

వారు దేశాన్ని చెత్త చెత్త చేసి వెళ్ళిపోయారుఅని కెనడా-టోరంటో సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ ని యుపిఎ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏ విధంగానూ సమర్ధనీయమనిపించడంలేదు. పాలకులు మారినా నిరంతరాయంగా కోనసాగే ప్రభుత్వ వ్యవస్ధలో రాజకీయ ప్రత్యర్ధులను పరదేశంలో, ఆదేశాధినేతల సమక్షంలో చులకన చేయడం భారతదేశాన్ని అవమానించడమే.

మోదీ అంతటి మనిషికి ఇది తెలియదని అనుకోలేము. తనను తాను కొత్తగా ప్రతిష్టించడానికి ఉద్దేశ్యపూర్వకంగానే పరాయి నేలమీద సాంప్రదాయిక గౌరవ మర్యాదలను పెకలించి వేశారనుకోవాలి. కీర్తి కండూతి తలకెక్కి దిగిరావడంలేదనుకోవాలి. పరనిందకు ఆత్మస్తుతికి హద్దులు చెరిగిపోయాయనిపిస్తూంది. మోదీ కాంగ్రెస్ కంటే గొప్ప వారు కావచ్చు, బిజిపికంటే చాలా గొప్పవారు కావచ్చు. కానీ దేశం కంటే గొప్పవారు కానేకారు. 

(120 కోట్లమంది వున్న పాలనా వ్యవస్ధకు అధినేత అయిన భారత ప్రధాని శైలి మీద వ్యాఖ్యానించే అర్హతా యోగ్యతా నాకు నిస్సందేహంగా లేవు. చాలా ఆలోచించి ఉండబట్టలేక కొంత అయిష్టతతోనే నేను సైతం సహేతుకమైన ఈ నాలుగు రాళ్ళూ వేస్తున్నాను) 


గోదావరి డెల్డా అంటే చిలవలు పలవలుగా పాకిన ఈనెల్ని అల్లుకున్న  పచ్చని ఆకు 


తూర్పుగోదావరిలో, కోనసీమలో, పశ్చిమగోదావరిలో ఏ కాల్వకింద ఊరుకి వెళ్ళవలసిన అవసరమో ఆలోచనో తట్టగానే చల్లగా పడవ ప్రయాణం మొదలుపెట్టేసినట్టువుంటుంది. పారేనీరూ, కదలని చెట్టూ పలకరిస్తున్నాయనిపిస్తుంది. 

బ్యారేజి మీద బస్సు వెళుతున్నపుడు అఖండ గోదావరి జలరాశి మీదుగా వీచే నైరుతిగాలి మొహాన్నితాకినపుడు, లోనికి చేరినపుడు ఏదో పట్టరాని సంతోషంలో ఉక్కిరి బిక్కిరౌతున్నట్టు వుంటుంది. సహ ప్రయాణికుల మాటల్లో హావభావాల్లో కష్టసుఖాలు వినబడినపుడు, కనబడినపుడు మనం జీవితంలోనే వున్నామన్న స్పృహ వస్తుంది. బొబ్బర్లంక కూడలిలో సిపిఎం సభల ప్రచారం పాటలో దరువు మోత హుషారెక్కించింది. ఆపక్కనే చొక్కా బొత్తాలూడిపోయి, పుల్లయిస్ చీకుతున్న  పిల్లాడి మొహంలో ప్రపంచాన్నే జయించిన తృప్తికనబడింది.

విజ్జేశ్వరంలో బస్ ఫుల్లు. కాసేపటికి కోడిపెంట వాసనరాగానే సమిశ్రగూడెం దగ్గరున్నామని అర్ధమైపోయింది. ఖాళీ అయిన కిటికీ పక్క సీటులో కూర్చుంటే కనబడే దృశ్యాల అందాన్ని హైడెఫినెషన్ కెమెరాలు కూడా చూపించలేవు. పదకొండో తేదీ సోమవారం నాడు డి ముప్పవరం, కానూరు, తీపర్రు, కాకరపర్రు, అజ్జరం, పెరవలి.., సాయం సంధ్య వేళ అదేదారిలో రాజమండ్రికి తిరుగు ప్రయాణం చేసినప్పటి ముచ్చట ఇది. 

కొత్తగా తారుపరచుకున్నరోడ్డు మీద మెత్తగా బస్సు వేగంగా పాకుతున్నపుడు ఇది కాటన్ దొర బృదం తిరిగిన కాల్వగట్టేనన్న జ్ఞాపకం ఆ మహనీయుణ్ణి మరోసారి స్పురణకు తెచ్చింది. నీరుపల్లమెరుగుననే ప్రాధమిక సూత్రంలో గ్రావిటేషన్ ఫోర్సుని పురుకూస వుండలు విసిరి వాలు కనిపెట్టి ఆమార్గంలోనే కాలువలు తవ్వించిన ‘నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం’ టెక్నాలజీ మరోసారి అబ్బురమనిపించింది. 
పట్టని/నిండిన చోటునుంచి తొలగిపోడానికి నేలమీద నీరు ఏర్పరచుకున్న జాలు కాలక్రమంలో పశువులకు పుంతై, మనుషులకు దారై వర్షాకాలంలో పెద్ద అసౌకర్యమై, కాటన్ దొర చేతిలో గ్రావిటేషన్ కెనాలై, పర్యవేక్షణా నిర్వహణా యంత్రాంగాలకు రహదారులైన కాలక్రమంలో అందరికీ తార్రోడ్డయిన కాల్వగట్టు జీవిత చరిత్రగుర్తుకొచ్చింది. 


పొలాల పక్కనే టూవీలర్ మెకానిక్ షెడ్లు, మూడు చోట్ల సెకెండ్ హాండ్ కార్ల పార్కులు/సేల్సు పాయింట్లు చూస్తే జీవనశైలిలో యాంత్రిక సౌకర్యం కనిపిస్తూంది. ఆషెడ్ల చుట్టూ వున్న కొబ్బరాకు దడులు చూస్తే గోదావరి డెల్టా నేటివిటీ అర్ధమౌతుంది. 

ఒకో ఊరిలో  గుంపులు గుంపులుగా వీపున బరువైన బ్యాగులతో దిగే పలచటి కాలేజి అమ్మాయుల్ని చూస్తే  ఉచిత చదువు ఇచ్చిన ఎన్ టి ఆర్, వృత్తి విద్యాకోర్సులకు ఫీజు రీఎంబెర్స్ మెంటు ఇచ్చిన రాజశేఖరరెడ్డి గార్లమీద గౌరవమొచ్చింది. అబ్బాయిలు, అమ్మాయిల యూనీఫారాలు చూస్తే పూడ్చేసిన ప్రభుత్వ విద్యా సమాధుల మీద పూలకుండీల్లా అలంకరించిన ఆక్రమించుకున్న నారాయణ చైతన్య బ్రాండ్ల చదువులే తలపునకు వచ్చాయి. 

పంటకోసిన వరిచేలు పోలీసు అంటకత్తిరిలాగా, హైస్కూలు కుర్రాడికి తండ్రి చేయించిన సమ్మర్ క్రాఫులాగా వున్నాయి. 

పెళ్ళి ముచ్చట్లు, పలకరింపుల విషాదాలు, ఆస్పత్రి కష్టాలు, అప్పులతిప్పలు…ఇలాంటి ఈతి బాధలెన్నో అర్ధమైనట్టూ, అర్ధమవనట్టూ ప్రయాణికుల ముచ్చట్లలో వినబడుతూనే వున్నాయి.

కృష్ణా డెల్టా చూశాను, నాగార్జున సాగర్ కుడి ఎడమకాల్వల కింద ఊళ్ళు చూశాను. ప్రతీ ఇరిగేషన్ ప్రాజెక్టూ సిరిసంపదలను ఇచ్చేవే…అందుకు మూలాలైన పాడిపంటలు కృష్ణా, గోదావరి డెల్టాల్లో వున్నంత పదిలంగా దేశంలోనే ఎక్కడా లేవేమోనని నా అనుమానం. ఈ ప్రత్యేకత నైసర్గిక ఉనికి నుంచీ, నేల స్వభావం నుంచి వచ్చినవే. ఈ డెల్టాలు సముద్రతీరంనుంచి సగటున 70 కిలోమీటర్లలోపుదూరంలో, తీరానికి, నేషనల్ హైవేకీ మధ్యలో వున్నాయి. పంటకి అవసరంలేకపోయినా మాగాణుల్లో కాస్తయినా తీపినీరు లేకపోతే ఉప్పునీరు చేరి చేలు చౌడుబారిపోతాయి. నేల స్వభావం / సాయిల్ టెక్చర్ మారకుండా సహజ ప్రవాహాలే డెల్టాలను కాపాడుతున్నాయి. 

పట్టిసీమలో ఎత్తిపోతల పధకం వల్ల గోదావరి డెల్టాలో చివరి భూముల స్వభావం మారిపోతుంది. చౌడునేలలు మధ్యకంటా పాకిపోతాయి అని విజ్జేశ్వరంలో దిగిన రైతు పెరవలి సీతారామయ్యగారు వివరించారు. ఆయన తో సహా పశ్చిమగోదావరి జిల్లా వాళ్ళంతా ఏకపక్షంగా తెలుగుదేశాన్నే గెలిపించారు. అయితే ఈ సమస్యను ముఖ్య మంత్రికి చెప్పడానికి ఒక్కడంటే ఒక్కడు జిల్లా నాయకుడు కూడా లేడని ఆపెద్దాయన చాలా బాధపడ్డాడు. ఇది చెబుతున్నపుడు ఆయన కళ్ళలో దిగులుతడి మెరిసింది. 

పాలకులు గతులు తప్పుతున్నా, రుతువులన్నీ వేసవులౌతున్నా, పంట కేలెండర్లు మారిపొతున్నా మనుషులు,మనసుల ప్రకృతి తప్ప, ప్రకృతి ఆకృతి మారడం లేదు…మారదు.

నమ్రత తప్ప ఏమీతెలియని కాలువలు సాగిపోతూనే వున్నాయి. మనిషిలో మాలిన్యాన్ని గుండెలో దాచుకున్న తల్లిలా గోదావరి ప్రవహిస్తూనే వుంది. 
తాతలు గతించాకా వారి రూపులు వారసుల్లో వున్నట్టే, తరాలూ వేషభాషలు మారినా ఒక జాతి సంస్కృతీ సంప్రదాయాలు రూపాంతరమైనా  సజీవంగా కొనసాగుతూనే వుంటాయి. 

వీటన్నిటికీ మించి నీలిశూన్యంలో పరిమళాలు అల్లుతున్న గాలి నన్నుతాకడం గొప్ప అనుభవం…ఒక్కడినే అయిన నాలో వున్న నీటినీ,నేలనీ,గాలినీ,నిప్పునీ, ఆకాశాన్నీ…మూడుగదుల ఇల్లుదాటి స్వచ్ఛమైన ఒక ‘స్పేస్’లోకి రాగానే పంచభూతాలు పలకరించడమే నా ఆనందోద్వేగమనీ అనుభవయ్యింది.మతాతీత విశ్వాసం! 


మొక్క’బలి’ తీర్చుకోడానికి గుబ్బలమంగమ్మ గుడికి వెళ్తున్నాం మీరూ రండి అని ఒక పెద్దాయన పిలిచారు. షెడ్యూలైపోయిన పనుల వల్ల వెళ్ళలేకపోతున్నాను…

జంగారెడ్డిగూడెం గంగానమ్మ జాతర, తాడువాయి వీరభద్రుడి తిరనాళ్ళ, నిడదవోలులో కొటసత్తెమ్మ మొక్కు, ఎడమగట్టున గుబ్బలమంగమ్మ గుడి, రాజమండ్రిలో సోమాలమ్మ కాపలా, లోవలో తలుపులమ్మ తల్లిదయ…మతంతో నిమిత్తంలేని ఇన్ని జాతర్లు, మరెన్ని సంబరాలు నమ్మకానికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే / మొక్కుతీర్చుకునే మనిషి నిబద్ధతకీ ఆనవాళ్ళు…అన్నిమతాలవారూ తీర్చుకునే మొక్కబళ్ళు 

జీవితాన్ని కలుషితం చేసుకున్న మనం, నైతికతను కోల్పోయిన మనుషులం అసంతృప్తులను చల్లబరచుకోడానికో శూన్యాల్ని పూడ్చుకోడానికో మతాన్ని కౌగలించుకున్నాం…మనిషి ఉనికిని ఆధ్యాత్మికత ద్వారా సిద్ధాంతీకరించే ప్రయత్నం చేసే మతం మీద నాకు తృణీకారమైతే లేదుగాని, గ్రామదేవతలంటేనే ప్రేమ గౌరవాలు వున్నాయి.

జీవనవిధానంలో ఒకవిధమైన ప్రాకృతిక ధర్మాన్ని, నిరాడంబరతనీ, సొంత నైతికతనీ పాటించే మనిషి సాంఘిక స్వయంభువత్వమే మతాతీత విశ్వాసం. అక్కడ అన్నంలో బిరుసైన మొరటుతనం వున్నా, బలి ఇచ్చే కోడీ మేకా దున్నల చావు వాసన ఆవరించివున్నా ఏదో పవిత్రత అనుభూతిలోకి వస్తూనే వుంటుంది. 
రాజమండి ఇస్కాన్ టెంపుల్ లో పరిమళాలు బాగుంటాయి. పాతసోమాలమ్మ గుడిలో కూర్చుంటే ఇది నాది అనిపిస్తుంది. కంచి మఠం లో గంభీర ప్రశాంతత కంటే హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో అలికిడి అలజళ్ళే నచ్చుతాయి. 

మామూలు మనిషిని కాస్తదూరంగా వుంచే మతంకంటే, కష్టమొచ్చినపుడు పట్టుకున్నభరోసా ఇచ్చే మతాతీతమైన విశ్వాసమే నాకు ఇష్టంగా వుంటుంది.

Blog at WordPress.com.

Up ↑