సిగ్గూ ఇంగితం మరచిన ఓ కీర్తి కండూతి కాంగ్రెస్ పుర్రెల దండతో  కెనడాలో ఊరేగింది

పర్యావసానమెరుగని జ్ఞానం వల్ల బుద్ధి కించపడింది 

చిరుమోతాదువిషంలాగ అహంకారం తలకెక్కిన కొద్దీ వ్యక్తిత్వం మృతకణమైపోతుంది.

వారు దేశాన్ని చెత్త చెత్త చేసి వెళ్ళిపోయారుఅని కెనడా-టోరంటో సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ ని యుపిఎ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏ విధంగానూ సమర్ధనీయమనిపించడంలేదు. పాలకులు మారినా నిరంతరాయంగా కోనసాగే ప్రభుత్వ వ్యవస్ధలో రాజకీయ ప్రత్యర్ధులను పరదేశంలో, ఆదేశాధినేతల సమక్షంలో చులకన చేయడం భారతదేశాన్ని అవమానించడమే.

మోదీ అంతటి మనిషికి ఇది తెలియదని అనుకోలేము. తనను తాను కొత్తగా ప్రతిష్టించడానికి ఉద్దేశ్యపూర్వకంగానే పరాయి నేలమీద సాంప్రదాయిక గౌరవ మర్యాదలను పెకలించి వేశారనుకోవాలి. కీర్తి కండూతి తలకెక్కి దిగిరావడంలేదనుకోవాలి. పరనిందకు ఆత్మస్తుతికి హద్దులు చెరిగిపోయాయనిపిస్తూంది. మోదీ కాంగ్రెస్ కంటే గొప్ప వారు కావచ్చు, బిజిపికంటే చాలా గొప్పవారు కావచ్చు. కానీ దేశం కంటే గొప్పవారు కానేకారు. 

(120 కోట్లమంది వున్న పాలనా వ్యవస్ధకు అధినేత అయిన భారత ప్రధాని శైలి మీద వ్యాఖ్యానించే అర్హతా యోగ్యతా నాకు నిస్సందేహంగా లేవు. చాలా ఆలోచించి ఉండబట్టలేక కొంత అయిష్టతతోనే నేను సైతం సహేతుకమైన ఈ నాలుగు రాళ్ళూ వేస్తున్నాను)