ఇపుడున్న ప్రపంచం అన్యామైనదని, దాన్ని మరమ్మతు చేయాలని నమ్మి, ఎంతో కొంత ప్రయత్నం చేసే కమ్యూనిస్టు పార్టీ లంటే నాకు గౌరవం. సర్వభ్రష్టత్వాన్ని సాధించి గౌరవాభిమానాలకు కమ్యూనిస్టేతర పార్టీలు అర్హతలు కోల్పోయిన సమయంలో కమ్యూనిస్టు పార్టీలవైపు ఒక మినహాయింపుతో కొంత ఆశగా చూసే జనంలో నేనూ ఒకడిని. ఇన్ని ఎన్నికల్లో వామపక్షాలకు ఓటు వేసే అవకాశం నాకు రెండేసార్లు దొరికింది. 


రాజకీయప్రయోజనాలు, ఎన్నికల లెక్కలు చూసుకోకుండా ప్రజలకు అవసరమైన చోట, కావలసిన తీరులో నిలబడటం సిపిఎం, సిపిఐల వల్లే అవుతుంది. 
సిపిఎం 21 ఆల్ ఇండియా మహా సభలు విశాఖలో ఆరురోజులుగా జరుగుతున్నాప్రజాశక్తి పేపర్ లోనో మినహా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా యేచూరి సీతారామ్ ఎన్నికౌతున్నారన్న ”స్కూపు”లు తప్ప మరే మీడియాలో కూడా ఆ విశేషాలు పెద్దగా రాలేదు. 

ప్రపంచీకరణ నేపధ్యంలో అస్ధిత్వ ఉద్యమాలన్నిటికీ మార్కెట్ ప్రోత్సాహం దొరుకుతుందని స్ధూలంగా విశ్లేషించే సిపిఎం – కేంద్రీకృత ప్రజాస్వామ్యం, ఉక్కు క్రమశిక్షణల పేరుతో పార్టీలో మైనారిటీల అభిప్రాయాలకు పడుతున్న గతి, పార్టీలో అగ్రకులాధిపత్యం, పురుషాధిక్యం ఎందుకు సాగుతున్నాయో ”ఆత్మవిమర్శ” చేసుకోవాలి.

40 ఏళ్ళుగా ఢిల్లీలో వుండిపోవడం వల్ల తెలుగు అనర్గళంగా మాట్లాడలేని కాకినాడ బిడ్డ యేచూరి సీతారామ్ కొత్త ప్రధాన కార్యదర్శి అయ్యాక విశాఖ సాగరతీరంలో చేసిన ఉపన్యాసం ఉత్తేజభరితంగా లేదుకాని హుషారుగా వుంది.