మాటనిలబెట్టుకోలేదని బిజెపి మీద సగటు ఆంధ్రప్రదేశ్ మండిపడుతూండడం నిజమే! కష్టకాలంలో మాట ఇవ్వడం తప్ప బిజెపికి ఈ రాషా్ట్రనికి ఎలాంటి ఎమోషనల్ అటాచ్ మెంటూ లేని మాటా కూడా నిజమే!! మరి ఆక్రోశాన్ని వెలిబుచ్చడానికి ఎవరున్నారు? కాంగ్రెస్ ని అందామా అంటే ఆంధ్రప్రదేశ్ వరకూ అది కుళ్ళిపోతున్న శవం…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనబలమే తప్ప నీతిబలమే లేదు. పాలనలో విధానాల్లో లోపాలు, లొసుగులు, లుకలుకలు కూడా కలగలిపిన తెలుగుదేశమే ప్రజల మంచి చెడులకు జవాబుదారీగా వుండాలి. 

ఏమి చేసినా చెల్లిపోతూందనే వైఖరినే తెలుగుదేశం కొనసాగిస్తే ఆదేసూత్రం కేంద్రప్రభుత్వానికికూడా వర్తిస్తుంది. తెలుగుదేశం పదేళ్ళు అధికారానికి దూరంగా వున్న సమయంలో పార్టీని ఆదుకున్నది సుజనాచౌదరి, సిఎంరమేష్, నారాయణ వగైరా లాభసాటి వ్యాపారులే కావచ్చు. అలాంటివారి పట్ల చంద్రబాబుకి ఎనలేని కృతజ్ఞతల భారం వుండటం తప్పుకాదు. కానీ, అలాంటి వారికి ప్రభుత్వంలో నేరుగా కీలక బాధ్యతలు అప్పగించడం సమంజసంకాదు. ఇది ప్రజల కష్టనషా్టల్లో ప్రజలతో ప్రయాణించిన పార్టీ సీనియర్లను అవమానించడమే.ఇది ప్రజాస్వామ్య దృక్పధంలో కి ధనస్వామ్యాన్ని చొప్పించడమే. ఈ ధోరణి సామాన్య ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడమే కాక క్రమంగా వాటిని చంపేయడం కూడా. ఇందులో ముందుగా నిర్వీర్యమయ్యేది పార్టీయే…అది ఇప్పటికే మొదలైందని నా నమ్మకం.

అందరితో మంచి అనిపించుకోవాలన్న అతి తాపత్రయం వల్ల చంద్రబాబు పిల్లి మెడలో గంటకట్టీ, అదితానేనని నిలబడలేకపోతూంటారు. వ్యవసాయం దండగమారి దని ముందుగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆయనే. విమర్శలు వెల్లువెత్తేసరికి వెనక్కి వెళ్ళిపోయారు. ఇపుడు వ్యవసాయం ఏమీ ఉద్దరించబడలేదుకదా!
రాష్ట్రవిభజన అనివార్యమని సామాన్యులకు కూడా అర్ధమైపోయిన నేపధ్యంలో కొత్తరాజధానికి నాలుగైదు లక్షలకోట్ల రూపాయలు అవసరమని చెప్పిన బాబు విమర్శలు రాగానే వెనక్కి వెళ్ళిపోయారు. అపుడే ఆయన గట్టిగా నిలబడి వుంటే నిరర్ధకమైన సమైక్య ఉద్యమం స్ధానంలో సీమాంధ్ర హక్కుల పరిరక్షణ ఉద్యమానికి ఆయనే ఆద్యుడైవుండేవారు. 

ఎవర్ని ఎంత తిట్టుకున్నా పొగుడుకున్నా వచ్చేనాలుగేళ్ళూ ఆంధ్రప్రదేశ్ బాధ్యత తెలుగుదేశానిదే! రాషా్ట్రనికి ప్రత్యేకహోదా రాదని తేలిపోయినందువల్ల బిజెపితో సంబంధాలు సహా బహిర్గత, అంతర్గత వైఖరులను సమీక్షించుకుని కొత్త ప్రయాణం ప్రారంభించడానికి తెలుగుదేశం పార్టీకి ఇది కీలకమైన సందర్భం! 

దీనితో సంబంధం, నిమిత్తం లేని రెండు అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవాలి : ఒకటి-సీమాంధ్రలో బలంగా వున్నకాంగ్రెస్ తనను తాను పాతిపెట్టుకుంది…రెండు-ఆంధ్రప్రదేశ్ లో బాగా ఎదిగే అవకాశాలున్న బిజెపి పుట్టకముందే చచ్చిపోయింది 
వినియోగించుకోవడం చాతనైతే ఈ రెండూ తెలుగుదేశానికి మంచి అవకాశాలే!!