నియమాలు ఒప్పుకోనందున ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇక రాదని స్పష్టమైపోయింది. రాజ్యాంగాన్నే అనేకసార్లు మార్చుకున్నాం! ప్రత్యేకహోదాకు అడ్డుపడే నిబంధల్నీ, చట్టాల్నీ సవరించుకోలేమా? ఇది బిజెపి ఇంగిత జ్ఞానానికి, విజ్ఞతకి ఒక సవాలు! బిజెపితో సంబంధాలను సమీక్షించకోడానికి తెలుగుదేశానికి కీలక సందర్భం!! 

అన్యాయమైపోయిన ఆంధ్రప్రదేశ్ తనకాళ్ళమీద తాను నిలబడటానికి హక్కు తెస్తానన్న బిజెపి, మాటమార్చింది. ముష్టెత్తుకుని బతికెయ్యమని తలుపులు మూసేసింది. పెద్దకొడుకునై అండగావుంటానన్న మోదీ దగా చేశారు. ధర్మాగ్రహాన్ని ప్రదర్శించిన వెంకయ్యనాయుడు పిట్టలదొరై చెవిలో మెదులుతున్నారు. 

ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేసిన నరేంద్ర మోదీ అప్పుడు ప్రధానంగా ఇచ్చిన హామీ రాష్ట్రానికి ప్రత్యేక…ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ అన్యాయంగా విడదీసిందని, ఒక ప్రాంతాన్ని దిక్కులేకుండా చేసిందని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఆ లోపాన్ని సరిదిద్దుతామని మోదీ విస్పష్టంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తనను తమ పెద్ద కొడుకులా చూడాలని తాను ఇంటి కష్టాలు తీరుస్తానని ప్రజల్ని ఆయన నమ్మించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడమే కాకుండా అంతకు మించిన మరిన్ని రాయితీలు కల్పించి ఆదుకుంటామని, తనను నమ్మాలని మోదీ బహిరంగ సభల్లో చెప్పారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ అన్యాయంగా చీల్చిందనే కోపంతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మోదీని గాఢంగా నమ్మారు. ఆయన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఘన విజయం చేకూర్చారు. అన్యాయం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కని తీర్పునిచ్చారు. 

ఈ పది నెలలూ ఇదిగో అదిగో ప్రత్యేక హోదా అంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రులు చెబుతూ వచ్చారు. ప్రత్యేక హోదాపై తాము వెనక్కి వెళ్లేది లేదని కూడా ప్రతీసారీ అనేవారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని తేలిపోయింది.14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇక ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా వుండదని కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇంద్రజిత్‌సింగ్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోరుతూ ఆంధ్రప్రదేశ్‌, తెలం గాణ రాష్ట్రాల నుంచి అభ్యర్థనలు అందాయని, అయితే 14 ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఆయన తేల్చేశారు.

ఇప్పటికే 11 రాష్ట్రాలకు (అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌, మణిపూర్‌, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌)లకు అప్పటి ఎన్డీసీ (జాతీయ అభివృద్ధి మండలి) ప్రత్యేక హోదా ఇచ్చింది. ప్రత్యేక హోదాకు ఇచ్చేందుకు కావాలసిన అర్హతలు ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలోగానీ లేవు కాబట్టి అందువల్ల ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా దక్కే అవకాశం లేదన్నారుస

మరి ఈ విషయం దేశాన్ని పదేళ్లు పాలించిన యుపిఏ ప్రభుత్వానికి తెలియదా? అప్పటి హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే కి, రాజ్యసభలో పదేళ్ళ ప్రత్యేక హోదాపై పట్టుపట్టిన వెంకయ్యనాయుడికి ఈ విషయాలు తెలియవా. వెంకయ్యనాయుడు సూచనను కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించడం అన్నీ తెలియకుండానే జరిగాయా? ఎన్నికల ప్రచార సభల్లో నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా అర్హతకు సంబంధించిన నియమ నిబంధనలు తెలియకుండానే హామీలు గుప్పించారా? 

ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఏం సమాధానం చెబుతారు? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనీ అదీ కూడా పది సంవత్సరాలు ఉండాలని గతంలోని యుపిఏ ప్రభుత్వంపై రాజ్యసభలో ఒత్తిడి తీసుకువచ్చి అప్పటి కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే నుంచి హామీ పొందిన ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు తల ఎక్కడ పెట్టుకుంటారు

ఆంధ్రప్రదేశ్‌తో బాటు తమ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రం కోరింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్రానికి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ కూడా రాశారు. కర్నాటక, బీహార్‌ లాంటి రాష్ట్రాలు కూడా చాలా కాలంగా ప్రత్యేక హోదా కోరుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏ విషయం ఇప్పటి వరకూ తేల్చి చెప్పలేదు. ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం ఉండాలన్న నియమం వుండేది. అయితే జాతీయ అభివృద్ధి మండలిని ప్రధాని మోడీ రద్దు చేశారు. ఆ తర్వాత జాతీయ అభివృద్ధి మండలి స్థానే నీతీ ఆయోగ్‌ ఏర్పడింది. అయితే నీతీ ఆయోగ్‌కు ఈ రకమైన అధికారాలు దఖలు పరిచినట్లుగా లేదు.

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను విభజనకు అంగీకరింప చేయడానికి, రెండు ప్రాంతాలకు న్యాయం ఏ విధంగా చేయాలనే అంశాలపై చర్చించిన యుపిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై అప్పటిలో హామీ ఇచ్చింది. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఇన్ని నిబంధనలు ఉంటాయనే విషయాన్ని అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. 

అసలే లోటు బడ్జెట్‌తో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నెత్తిన మరో పిడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం. రెండుగా విడిపోయిన ఈ రాష్ట్రాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉండదా? నిబంధనల పేరు చెప్పి మళ్లీ ఒక ప్రాంతానికి తీరని అన్యాయం చేయడం ఎంత వరకూ సబబు? ప్రత్యేక హోదాపై తెలంగాణ ప్రభుత్వం పెద్దగా ఆశలు పెట్టుకోలేదు కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని అందరూ ఎదురుచూస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్‌ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం నిరాశనే మిగిల్చింది.

విభజన చట్టంలో ప్రత్యేక హోదాను చేర్చకపోవడం అప్పటి ప్రభుత్వం తపి్పదమని కొంతకాలంగా వెంకయ్య నాయుడు పాటఅందుకున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని చట్టంలో వుంది. బడ్జెట్టులో వందకోట్ల రూపాయలు చూపించి చట్టాన్ని తప్పక అమలు చేస్తాం కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఖర్చుపెట్టి బిల్లులిస్తే రీయంబెర్స్ చేస్తాం అని మెలిక పెట్టింది. లోటు బడ్జెట్టులో వున్న రాష్ట్రం వేలకోట్ల రూపాయలు ముందుగా ఖర్చుపెట్టగలిగే స్ధితిలో వుంటుందా అన్న ఇంగితాన్ని పక్కన పెట్టిన లౌక్యం ఇది. 

ఆ మధ్య ఢిల్లీలోని ఏపీ భవన్‌లో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు ఎంపిలు ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం కన్నా ఎక్కువ నిధులు ఇచ్చేందుకు కేంద్రం మొగ్గు చూపిస్తోందనే అనుమానం కూడా ఆయన ఆ సమావేశంలో వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గేది లేదని ఆ విషయాన్ని కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించాలని ఎంపీలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. 

అయితే ప్రత్యేక హోదా రాని నష్టాన్ని మాత్రం  ఆపలేకపోతున్నారు.