Search

Full Story

All that around you

Month

April 2015

సత్యమూర్తి


సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా 50 శాతం మనలోపలి ఆర్ధ్రతని ఉదాత్తని మనమే తాకుతున్నట్టు, జ్ఞాపకాలు చెమ్మగిల్లనట్టు అనుభవమౌతుంది…మిగిలిన 50 శాతం ఈ అనుభవాన్నే ఈ అనుభూతినే మనకి ఎవరో పులుముతున్నట్టు వుంది. 

ముగ్గురు అందగత్తెలు, ముగ్గురు కమేడియన్లు, ఐదారుగురు కేరెక్టర్ యాక్టర్లు, భారీ ఫ్రేయులు, సెంటిమెంట్ కథ అర్జున్ హీరోయిజమ్ ….అన్నీ కలిపి ఒక ఎత్తయితే త్రివిక్రం శ్రీనివాస్ సంభాషణలు ఒక ఎత్తు…

చూడ్డాకికే కాక వినడానికీ బాగుండే సినిమా ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ 

పుట్టుకతోనే/బాల్యం నుంచీ వచ్చే టైప్ వన్ డయాబెటిస్ ఇందులో హీరోయిన్ కి ఉన్నట్టు చూపించడం మధుమేహవ్యాధి విస్తృతికీ, ఇది పెద్ద స్టిగ్మా అనుకోనవసరంలేదనడానికి ఒక సంకేతంగా కూడా నాకు అనిపించింది 

నిస్సహాయులు ఏమిచేస్తారు 


వ్యాపారానికి ఆకలి బానిసైనపుడు ముడుపులు అందుకుని తటస్ధత నటించిన యంత్రాంగం ఆకస్మికంగా ఆయుధాన్ని అందుకుని ఆకలినే కాల్చేసిన బీభత్స నాటకంలో అచేతన మూలుగైపోయింది. ఆగనిరోదనైపోయింది..

ఆరుతడికి కూడా గతిలేని రెండో పంట కాలంలో నెత్తుటి ఊటమొదలైంది. చుట్టూ ఇరవై కళేబరాలను పరచుకుని రక్తసింహాసనం మీద కొత్త ఏలుబడి మొదలైంది
ఈతచాపలో చుట్టినా, భయపెట్టడానికి కోటగుమ్మానికి కట్టినా, వాడి శరీరం ప్రశ్నిస్తూనే వుంటుంది

ధర్మగంటలు మోగని పాలన, హృదయం లేని ప్రభువు, సానుభూతి నరంతెగిపోయిన సభ్యసమాజం ఎక్కడా వర్ధిల్లకూడదు. మూసినగుమ్మం ముందు పడిగాపులు పడవలసి రోజుల ఎవరికీ రాకూడదు పెద్దలే పిల్లలకు తలకొరివి పెట్టేరోజులు ఎప్పుడూ వుండకూడదు. 

స్మగ్లర్లని అదుపుచేయడం చేతకాక కూలీలలు కాల్చేసిన ఎన్ కౌంటర్ లో ఇరవై మంది చచ్చిపోవడంకంటే ఒక పూనకంగా దీన్ని సమర్ధిస్దున్న ప్రజల సంఖ్య పెరిగిపోతూండటమే దిగులుగా వుంది. మానవీయ విలువలకు చెదపట్టేస్తున్నంత భయంగా వుంది. ఇవాళ చట్టాన్ని వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తే అదే రేపు ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తుందన్న స్పృహలేకపోవడం బాధిస్తోంది.

నిస్సహాయులు ఏమిచేస్తారు నడిరోడ్డు మీద నిలబడి శాపనార్ధాలు పెడతారు…ఏడుదోసిళ్ళ దుమ్ము ఎత్తిపోస్తారు…(ఈపోస్టు అదే) 

పెళ్ళి సందడి 


పెళ్ళి సందడి 

సంసారాలతో తరలివచ్చిన టూవీలర్లని చిరునవ్వులతో ఆహ్వానిస్తున్నవియ్యంకుల కళ్ళలో స్వాగతం బోర్డులు మెరుస్తున్నాయి. అతిధుల మధ్యలో నిండు విస్తళ్ళలా పరచుకున్న వియ్యపురాళ్ళు పలకరింపుల్ని కొసరి కొసరి వడ్డిస్తూ మరి కాస్త తినండని మొహమాట పెడుతున్నారు. విసుగుని ఛేదించుకుని విరామంగా పెళ్ళికొచ్చినవారు నలుగురి మధ్య కొత్తతేజాన్ని పుంజుకుంటున్నారు. 

ఆ ఆవరణలో అమ్మాయిలు యాడ్ మోడల్స్ ని సినిమా స్టార్లని మించిపోయివున్నారు. కల్యాణమంటపం అప్సరసలు మెరిసిపోతున్న ఇంద్రసభలావుంది. ఆ ఏంబియన్సే నూతనోత్సాహాన్ని నరాల్లో పరుగులు తీయిస్తున్నట్టుంది. మళ్ళీ మళ్ళీ చిగురించే చెట్టులా జీవితం హుషారెక్కినట్టుంటుంది. 

మా కుటుంబ స్నేహితల పిల్లలైన బాలు, మంజు వివాహం రాజమండ్రి ఉమారామలింగ కల్యాణమంటపంలో జరుగుతోంది. ఇప్పటివరకూ  వుండివచ్చాము..ఇదంతా అక్కడి సీనే!!

ఏలినవారి హింస ! 


నిజమైన ఎన్ కౌంటర్ వల్ల వెల్లువెత్తిన ఉద్వేగాల్ని ఊతం 
చేసుకుని వరుస హత్యలనే పరిపాలనా చర్యలుగా చేపట్టిన 
కెసిఆర్, చంద్రబాబు ప్రభుత్వాల 
నెత్తుటి చేతుల్లో మృగదశ అవశేషాలు భయపెడుతున్నాయి! 

ప్రాణరక్షణ హక్కుని ప్రాణంతీసే పనికి వుపయోగించుకునే ధోరణిని ప్రజలు నిలదీయకపోతే నచ్చనివారిని తొలగించుకుంటూ పోయే గూండాయిజాన్ని ప్రభుత్వయంత్రాంగానికి ఆయుధంగా ఇవ్వడమే…డెడ్ ఎండ్ అంటూ గోడ ఎదురైనపుడు పాలక-యంతా్రంగాల్లో తలెత్తే నిస్పృహ, అనాగరిక, పాశవిక నీతినే పాటిస్తూండగా, అరాచకాన్ని నిర్మూలించడానికి అదే అరాచకాన్ని ఆశ్రయిస్తూండగా, ఏలినవారే హింసాపిపాసులైపోతూండగా అదే గొడుగుకిందవున్న మనది నాగరీక సభ్య సమాజమని సంతృప్తిగా భావించుకోగలమా? 

నెత్తుటికూడు వెగటైన సామా్రట్ అశోకుని వలే మన ఏలికలు ఎప్పటికైనా పశ్చాత్తాపపడతారా? 

(కంటికి కన్ను ప్రాణానికి ప్రాణం అని వాదించే వారికి ఒక నమస్కారం) 

బహుమతులు

నా మీద అసహనంతో వున్న మిత్రునికి….


ఆశనిరాశల మధ్య, ఉద్రేక ఉద్వేగాల మధ్య, నిరీక్షణలు నిస్పృహల మధ్య కొట్టు మిట్టాడే కోటాను కోట్ల ప్రజల్లో నేనూ ఒకడి కాబట్టి, నా ఆలోచనలు స్పందనలు గడ్డకట్టుకు పోలేదు కాబట్టి, బతికుండగానే శవపేటికలో కూర్చోలేను కాబట్టి…

నువ్వు నన్ను మెసేజీల కొద్దీ తిట్టిన అనేక బూతుల్లో “ఎందుకు ఓ చించేసుకుంటున్నావు” అన్న ప్రశ్న ఒక్కటే నాకు ఆసక్తి కలిగించింది. ఆలోచిస్తే దొరికిన సమాధానమే ఇది. 

నిజమే! నేను ఏమీ చేయలేని వయసు పైబడుతున్న రోగగ్రస్తుణ్ణే! నాది పడకకుర్చీ ఉద్యమమే !! నేను నీ పక్షం కాదు. ఏపక్షమూ కాదు. నేను నేను సంఘజీవిని. సంఘంలో జరుగుతున్న మంచి చెడులను ఆలోచించకుండా, స్పందించకుండా వుండటానికి నేను మాడిపోయిన బల్బుని కాదు… 

నిన్ను నువ్వు వెలిగించుకో బాగుంటుంది!  శుభోదయం

గ్యాస్ సబ్సిడి మన హక్కు! వదులుకోవద్దు!!


గ్యస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వొదులుకోవాలన్న భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపును నేను వ్యతిరేకిస్తున్నాను. ఖండిస్తున్నాను.

ప్రపంచ పోలీసులకు లోకమంటే సహజవనరులే!  ఇరాక్ అంటే అమెరికాకు పెటో్రలే! ఇండియా అంటే వాస్కోడిగామాకు మిరియాలు ఏలకులే! వెస్టిండీస్ అంటే కొలంబస్ కి బంగారపు ముద్దే! కృష్ణా గోదావరి బేసిన్ అంటే కార్పొరేట్లకు కోటానుకోట్ల నిక్షేపాలే!

ప్రకృతిలో కలసిపోయి అందులో వనరుల్ని వినియోగించుకుంటూ, పునర్జీవింపజేసుకుంటూ జీవించే మనిషికే ఆ వనరుల మీద అధికారం వుండాలన్నది సహజసూత్రం. ముందు బతుకుదారులకోసం, తరువాత కొత్తమార్కెట్లకోసం యూరోపియన్ల అన్వేషణతోనే ఈ సూత్రం చితికిపోవడం మొదలైంది. వనరులు తరలించుకుపోడానికి సాగిన వలసలే సామా్రజ్యీకరణై యుద్ధాలై, పతనాలై చరిత్రలో కలసిపోయాయి. 

ఇపుడు కనిపించేది వేరు, జరిగేది వేరు అంతర్జాతీయ సదస్సులు, నిర్ణయాలు, తీర్మానాలూ మహా ఉదాత్తంగా కనిపిస్తాయి. ఆవెంటనే బొగ్గుగనులు పరదేశీ కార్పొరేట్ల లీజుకి వెళ్ళిపోతాయి. గ్యాస్ నిక్షేపాలు విదేశీ ఒప్పందాలు కుదుర్చుకున్న అంబానీలకు దాదాదత్తమైపోతాయి. ఇది జులుమో దౌర్జన్యమో లేని హైటెక్  సామా్రజ్యీకరణ. ఇది మనిషి కళ్ళగప్పే ప్రపంచీకరణ. దీని వేగం ప్రపంచ ప్రభువులు తోడుకునే వేగాన్ని బట్టీ, స్ధానిక సామంతుల ఊడిగపు మోజూ, విధేయతలనుబట్టీ, దళారుల దురాశనుబట్టీ వుంటుంది. 

జలవనరులు, అటవీసంపదలు, భూగర్భనిక్షేపాల వినియోగంలో పాలకులు స్ధానిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చివుంటే దేశంలో ఇన్ని ప్రాతీయ అసమానతలు వుండేవికాదు. 

ఓబుళాపురం గనుల గొడవ మనకెందుకులే అన్న ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రిలయెన్సును దారికి తెచ్చుకోడానికైనాగాని ‘ఈ నేలనాదిరా, ఈ గ్యాస్ నాదిరా’ అనే పిలుపునకు దోహదపడ్డారు. వారం రోజులు కూడా సాగని ఈ ఉద్యమంలో నేనూ నినదించాను…ఊరేగాను.

ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీరాకే కృష్ణాగోదావరి బేసిన్ లో చమురు, సహజవాయువులను ఇతర చోట్లలో అమ్ముకునేలా రిలయెన్స్ ని శాసించడమే ఆ ఉద్యమ ప్రయోజనం. శాసించడం మాటెలా వున్నా కనీసం ప్రాధేయపడటానికైనా పాలకులకు అందనంత ఎత్తున అంబానీలు వున్నారు.

సహజవనరుల వంటి మౌలిక రంగాలను ప్రయివేటీకరించడమే తప్పు. ఆతప్పు ఇప్పటికే జరిగిపోయింది. కనీసం ప్రయివేటీకరణ ఫలాలను ప్రజలకు నేరుగా అందేలా చూడటమైనా ప్రభుత్వాల వల్ల కావటంలేదు. 

కూరగాయల బండివాడో కిరాణా కొట్టువాడో చిల్లర లేకపోయినా డబ్బుతక్కువైనా ఫర్లేదు రేపివ్వండి సార్ అంటారు. అలాంటి నావాళ్ళకోసం  స్పందిస్తాను. పైసా తక్కువైనా కర్సరే కదలకూడదని కంటికి కనబడకుండా శాసించే హైటెక్ వ్యాపారి తనలాభాల్లో ఎంత తగ్గించుకుంటాడో ప్రకటించగలిగితే నేను కూడా గ్యాస్ సబ్సిడీని రద్దు చేయించుకుంటాను.

ఇప్పటికే కాకుల్ని కొట్టి గ్రద్దలకు వేసేశారు. ఇపుడు కాకుల నోటికందిన కొద్దిపాటి ఇంధనాన్ని కూడా త్యాగం చేయమంటున్నారు. ఇదేమైనా ధర్మంగా వుందా? ఇదేమైనా న్యాయంగా వుందా??

నా పెద్దలు ఇచ్చిన వారసత్వంలాగే నానేల నిక్షేపమైన గేస్ లో కూడా నా వాటా వుంది. అదే సబ్సిడి రూపంలో నాకు అందుతోంది. ఈ హక్కునికూడా త్యాగం పేరుతో లాగేసుకునే వైఖరిని ఏవగించుకుంటున్నాను. 

నేలతల్లి ఇచ్చిన కానుక గ్యాస్ మన ఆంధ్రప్రదేశ్ హక్కు. దీన్ని వదులుకోకూడదని నేను కూడా పిలుపు ఇస్తున్నాను.

నాకూ, మీకూ, బిజెపి సానుభూతిపరులకూ తెలుసు. మోదీ గారి పిలుపునకే స్పందన హెచ్చుగా వుంటుందని….మనందరికీ తెలుసు ‘గ్యాస్ సబ్సిడీ ని స్వచ్ఛందంగా వదులుకోవాలన్న పిలుపు’ ఫస్ట్ బెల్లే…మనం కూర్చున్న కుర్చీ మనకి తెలియకుండానే మాయమైపోయేటంత చల్లగా…మూడోగంట మోగాక మనకి తెలియకుండానే మన సబ్సిడీ రద్దయిపోతుందని…

అయినా కూడా, అప్పటివరకైనా కూర్చునే వుంటాముకదా! ఆలోచించకుండా వుండలేము కదా!!

మరచిపోవద్దు : ఆర్ధిక ఆరోగ్యం పేరుతో ప్రజల హక్కులను త్యాగం చేయాలనడం నియతృత్వం వైపు ప్రయాణించడమే! 

Blog at WordPress.com.

Up ↑