తీపిగాలి, వేపగాలి, వగరుగాలి, కొమ్మనరికిన వేపచెట్టు వాసన…మహానగరంలో అనూహ్యమైన సంవేదన (ఒక సెన్స్)…నలభై ఏళ్ళ నాటి ఒక అనుభవాన్ని ఈ పరిమళం ఒక ఫీలింగ్ గా జ్ఞాపకానికి తీసుకు వచ్చింది.

అప్పట్లో జంగారెడ్డిగూడెంలో కట్టిస్తున్న ఇంటి తలుపులకోసం తాడువాయి పొలంలో పెద్దవేపచెట్టులో మూడు భారీకొమ్మల్ని నరికించారు. పొలంలో ఇంటిముందు రాత్రళ్ళు మడతమంచాలు వేసుకుని పడుకునే వాళ్ళం. దక్షిణవైపు నుంచి వేపచెట్టు విసిరే సువాసనా వీచేగాలికి వొళ్ళుతేలిపోతూండగా కళ్ళు మూతలు పడేవి. కొమ్మనరికిన చోట స్రవించే జిగురుని వేపరక్తం అనుకునే వాళ్ళం…

ఇపుడు నిజాంపేట ఇంట్లో మెయిన్ బెడ్ రూమ్ కి కబోర్డులు కట్టించే పనిపెట్టుకున్నాము. కార్పెంటర్లకు నిన్న ఉదయం ఆగది అప్పగించి వేరేగదిలో సర్దుకున్నాము. వేరేగదిలో ఎసి లేక రాత్రి చాలా అవస్ధపడ్డాము. రేపు ఆదివారం పనివారు రావడంలేదన్నారు. ఈ రాత్రి, రేపు రాత్రి సౌకర్యంగా నిద్రపోడానికి ఆగది వాడుకోవచ్చా అంటే వారే గదిని శుభ్రంచేసి ఇచ్చారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ ఫాన్ వేయవద్దన్నారు. పరుపులు పరచుకుని ఎసి వేసుకోగానే నాభార్యా పిల్లలైతే సామిల్లులోవున్నామా అనిపిస్తోందన్నారు. 

రకరకాల కలపను పల్చటి పలకలుగా చెక్కి యంత్రాలతో కంప్రెస్ చేసిన ప్లయ్ వుడ్ ను అల్మైరా అరల సైజుల ప్రకారం కార్పెంటర్లు నిన్నా ఇవాళా ఎలకి్ట్రక్ రంపాలతో ప్లయ్ వుడ్ ని కోస్తూ, గమ్ తో అతికిస్తూ, మేకులతో తాపడం చేస్తూ వున్నారు…ఈ ప్రక్రియలో ఉత్పన్నమైన రంపంపొట్టు,  కంప్రెస్ అయినా కూడా కోస్తూండగానే కలపనుంచి వ్యాపించి గదంతా అలుముకున్న చెట్టు పరిమళం నాకైతే మా పొలంలో వేపచెట్టు దగ్గర పడుకున్న రోజుల అనుభూతిని గుర్తుచేసింది. కలపగా మారిపోయాక కూడా అడవి మనిషిని చల్లగా వుండు అని దీవిస్తూందనిపించింది 

మహానగరంలో ఇలాంటి అనుభవం ఎదురౌతుందని ఊహించనేలేదు…

శనివారం శుభరాత్రి