ఇష్టారాజ్యాలకు అడ్డుకట్ట పడవలసిందే !
మంచో చెడో కాంగ్రెస్ కూడా వుండవలసిందే !!
(శనివారం నవీనమ్)

రైతులకు భూమిపై ఉన్న హక్కును తొలగించే నిబంధనను అంగీకరించే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలు కూడా స్పష్టం చేయటంతో భూ సేకరణ బిల్లు విషయంలో ఎన్‌డిఏ ప్రభుత్వం నిస్స హాయంగా ఉండిపోవలసి వచ్చింది.

ఎన్నికల్లో నెగ్గడానికి నోరు అదుపుతప్పి అబద్ధాలు చెప్పే రాజకీయపార్టీలు అధికారంలోకి రాగానే వాస్తవాలు తెలిసొచ్చి మాటలమాయ మొదలు పెడతాయి…అయినా అధికారంవల్ల తలకెక్కిన అహంకారం కిందికిదిగదు…ప్రజాభిప్రాయాన్ని ప్రతిపక్షాల విమర్శల్నీ పక్కన పడేసి సొంత ఇష్టాలకు చట్టాలు చేసేస్తాయి. కాంగ్రెసైనా, తెలుగుదేశమైనా ఏపార్టీ అయినా ఇంతే…ప్రతిపక్షాలు సమర్ధంగా ఎదుర్కొన్న ప్రతీసారీ ఇబ్బందిలో పడిపోతాయి. ఈ సారి ఈ అవస్ధ బిజెపికి వచ్చింది. పది నెలలకే ఇలా ఇరుక్కుపోవడం పెద్దమొట్టికాయే! అందరినీ కలుపుకునే ముందుకిపోవాలన్న పాఠమే!!

ఇలాంటి సందర్భాలు ప్రజాస్వామ్య స్పూర్తిని పటిష్టపరుస్తాయి. చట్టాల రూపకల్పనలో బిజెపి దూకుడుని ఏకపక్ష ధోరణిని నిలవరించడంలో కుంగిపోయివున్న కాంగ్రెస్ చొరవ, సకల ప్రతిపక్షాల ఐక్యతా మంచిఫలితాన్నే ఇచ్చాయి.

బడ్జెట్‌ సమావేశాల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తాను కోరుకున్న బిల్లులకు చట్టరూపం ఇవ్వటంలో దారుణంగా విఫలమైంది. ప్రభుత్వం చట్టరూపం ఇవ్వాలనుకున్న భూసేకరణ సవరణ బిల్లు, జిఎస్‌టి బిల్లు, రియల్‌ ఎస్టేట్‌ బిల్లులను రాజ్యసభలో నిలువరించి సంయుక్త సెలెక్ట్‌ కమిటీ, సెలెక్ట్‌ కమిటీలకు పంపించటంలో కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలు, ఇతర విపక్షాలు విజయం సాధించాయి.

లోక్‌సభ ఎన్నికల్లో కేవలం నలభై నాలుగు సీట్లు గెలిచి చావుదెబ్బ తిన్నదనుకున్న కాంగ్రెస్‌ పార్టీ బుధవారం ముగిసిన బడ్జెట్‌ సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయటంలో విజయం సాధించించింది. నాయకుడే కాదని, కాలేడని విమర్శలపాలౌతున్న  కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ 56 రోజుల రాజకీయ అజ్ఞాతవాసం తరువాత ఊహించని స్థాయిలో పార్లమెంటులో ప్రభుత్వంతో ఆటాడుకున్నారు. 

గత 24 సంవత్సరాలలో ఏ పార్టీకీ లోక్‌సభలో ఇన్ని స్థానాలు రాలేదని విజయగర్వంతో చెప్పిన బిజెపికి, ప్రత్యేకించి పార్లమెంటు సమావేశాల నిర్వహణ సమయంలో విపక్షాలు వారికి చుక్కలు చూపిస్తున్నాయి. లోక్‌సభలో మెజారిటీ ఉంటే చాలదు రాజ్యసభలో కూడా మెజారిటీ అవసరం కొంచెం ఆలస్యంగా బిజెపికి అర్ధమైంది.

ఈ సారి రెండు విడతలుగా జరిగిన పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలలో బిజెపి తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొన్నది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో జరిగిన సమావేశాలకు ఇప్పటికి బాగా తేడా కనిపించింది. కీలకమైన, ప్రతిష్ఠాత్మకమైన బిల్లులను పార్లమెంటు గట్టెక్కించలేక బిజెపి నానాతంటాలు పడాల్సివచ్చింది.

ఎన్డీఏ ప్రభుత్వం మూడు ప్రధాన బిల్లులకు పార్ల మెంటు ఆమోదముద్ర వేయించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా విజయం సాధించలేకపోయింది. ప్రధాని మోడీ అయితే భూసేకరణ బిల్లు, జిఎస్‌టి బిల్లు, రియల్‌ ఎస్టేట్‌ బిల్లులకు ఏదో విధంగా పార్లమెంటు ఆమోదం తీసుకోవాలనుకున్నారు.

అయితే రాజ్యసభలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉండట తో ఈ మూడు బిల్లులూ సెలెక్ట్‌ కమిటీకి వెళ్లకతప్పలేదు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు, మరీ ముఖ్యంగా రాహుల్‌ గాంధీ భూసేకరణ బిల్లును అడ్డుకోవటం ద్వారా మళ్లీ రాజకీయంగా పుంజుకోగలిగారు. జిఎస్‌టి బిల్లుకు పార్లమెంటు ఆమోదం తీసుకునేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఈ బిల్లుపై పన్నెండేళ్లుగా చర్చ జరుగుతున్నందున బడ్జెట్‌ సమావేశంలో ఆమోద ముద్ర పడుతుందని అధికార పక్షంలోని అందరూ భావించారు. ప్రతిపక్షం కూడా మొదట్లో కొంత మెతకవైఖరి అవలంబించినా ఆఖరున ఎందుకో మనసు మార్చుకుంది.

వచ్చే ఏప్రిల్‌ నుంచి ఏకీకృత పన్ను వసూలు చేసేందుకు వీలుగా బిల్లును ఆమోదించాలని, లేకుంటే మరో ఏడాది ఆగాల్సి వస్తుందని ఆర్ధిక మంత్రి ప్రాధేయపడ్డా కూడా విపక్షం కనికరించలేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణతో ప్రతిపక్షం ఈ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించ గలిగింది. రియల్‌ ఎస్టేట్‌ బిల్లు విషయంలో కూడా అదే జరిగింది. ఎన్డీఏకు మెజారిటీ ఉన్న లోక్‌సభలో బిల్లులను ఆమోదింపజేసుకున్నా రాజ్యసభలో ప్రతి పక్షానికి మెజారిటీ ఉండటంతో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షం అంగీకరించిన బిల్లులకు మాత్రమే సభ ఆమోదం లభించించి చట్ట రూపం దాల్చాయి.  బంగ్లాదేశ్‌తో సరిహద్దులను ఖరారు చేసుకునే రా జ్యాంగ సవరణ బిల్లుదానికి ఓ ఉదాహరణ. అదే విధంగా ప్రతిపక్షం సహకరిం చేందుకు అంగీకరించటం వల్లనే నల్లధనం బిల్లుకు ఆమోదం లభించింది.

బడ్జెట్‌ సమావేశాల మొదటి విడతలో లోక్‌సభకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బందుల్లో పడవేశారు. అయితే రెండో విడత సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి ప్రత్యక్షమైన రాహుల్‌ గాంధీ కొత్త సామర్థ్యాన్నిచూపించారు. భూసేకరణ బిల్లు, అంతర్జాలం (ఇంటర్నెట్‌)పై తటస్థ వైఖరి, అమేథీ ఫుడ్‌ పార్క్‌, రియల్‌ ఎస్టేట్‌ బిల్లు అంశాలపై ప్రభుత్వంపై ఎదురు దాడి చేసి ఇరకాటంలో పడవేయడంలో ఆయన కీలకపాత్రపోషించారు.

లోక్‌సభలో కూడా ప్రతిపక్షాలు కలిసికట్టుగా వ్యవహరించటంతో ప్రభుత్వం పలుమార్లు ఇరకాటంలో పడింది. కాంగ్రెస్‌ నాయకులు, ముఖ్యంగా సభలో ఆ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గే ఓ దశలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌పై సైతం పరోక్షంగా ఆరోపణలు చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు గట్టిగా ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. మొత్తం మీద ప్రతిపక్షం ఎదురు దాడిని తిప్పికొట్టటంలో అధికార పక్షం విజయం సాధించలేదు. నల్లధనం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని బిజెపి బహిష్కృత నేత రాంజెఠ్మలానీ ఆరోపించడం కూడా బిజెపికి మింగుడుపడే విషయం కాదు. నల్లధనంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ బిజెపి నాయకత్వంపై, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోడీ పేరు ప్రస్తావించకుండా ఆయన సర్కార్‌ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.

అంతర్గత అసమ్మతికి ఇదొక నాంది కూడానేమో!!