ఎన్ టి ఆర్ ఏ ప్రాంతంలో ఏమి మాట్లాడాలో నోట్సు రాసిన టీములో, ఆఅంశాన్ని ఏరోజుకి ఆరోజు తెల్లవారు ఝామున వారికి వివరించే టీములో వుండే అవకాశం నాకు దొరికింది.అపుడు ఈనాడు అగ్రికల్చరల్ బ్యూరో ఏకైక రిపోర్టర్నీ సబ్ ఎడిటర్ నీ నేనే…మాచీఫ్ & న్యూస్ ఎడిటర్ వాసిరెడ్డి సత్యనారాయణ గారు. తెలుగు టైపిస్టు ఉమాదేవి. 

ఎన్ టి ఆర్ పర్యటనకు నాలుగు నెలల ముందునుంచే ప్రాంతాలవారీగా సమస్యలు స్ధితిగతులు ఆర్ధికాంశాలగురించి, వాసిరెడ్డిగారూ, నేను – రిపోర్టర్లు ముఖ్యమైన పార్ట్ టైమర్ల తో(అప్పటికి సి్ట్రంగర్ వ్యవస్ధ పుట్టలేదు) ఫోన్లలో, సమావేశాల్లో వివరాలు సేకరించి నోట్సు తయారు చేశాము. ఒకో టాపిక్ A4 కాగితం లో సగానికి వచ్చేలా క్లుప్తంగా రాయడం నా పని…దాన్ని తప్పులు లేకుండా టైప్ చేయడం ఉమాదేవి పని.
ఇది అచ్చు వేసే ఫార్మేట్ కాదు. ఇదంతా ఎందుకు చేస్తున్నామో మాకు తెలియదు. వాసిరెడ్డిగారిని అడిగితే ముఖ్యమైన పనే అనేవారు.
ఎన్ టి ఆర్ పర్యటన మొదలైంది. కృష్టాజిల్లాలో ప్రవేశించడానికి రెండురోజులు ముందు మరోన్యూస్ ఎడిటర్ మోటూరి వెంకటేశ్వరరావుగారు తనతో పాటు నేనూ టూర్ లో వుండాలన్నారు. రిపోర్టింగ్ కి నాకంటే సీనియర్లు వున్నారు కదా అంటే న్యూస్ కవరేజి కి రెగ్యులర్ టీములు, హైదరాబాద్ నుంచి వచ్చే ఒక చీఫ్ రిపోర్టర్ వుంటారు.కవర్ చేయనవసరంలేదు అబ్జర్వేషన్ కి వెళ్ళాలి అని చెప్పారు. మొదటి రోజు చైతన్యరధాన్ని అనుసరించాము. ఆసాయంత్రమే పర్వతనేని ఉపేంద్రగారు మమ్మల్ని పిలిపించుకున్నారు. అప్పటినుంచి కాన్వాయ్ లో చైతన్యరధం తరువాత మాకారు వుండేలా చూడాలని నందమూరి హరికృష్ణ వాళ్ళ పర్సనల్ స్టాఫ్ ని ఆదేశించారు. ఆతరువాత మోటూరిగారు చెప్పారు”నువ్వు రాసిన నోట్సు ఆధారంగానే ఎన్ టి అర్ ఉపన్యాసాలు వుంటాయని” చాలా సేపు ఎగ్జయిట్ మెంటు తట్టుకోలేకపోయాను…కేవలం రెండు సంవత్సరాల వయసున్న జర్నలిస్టు ఉబ్బితబ్బిబయిపోవడం ఏమిటో గుర్తుచేసుకున్నపుడల్లా నాకు అనుభవమౌతూనే వుంది.
”కుక్కమూతి పిందెలు ఈ కాంగ్రెస్ వాళ్ళు” అన్న వాక్యంతో మొదలై జైతెలుగుదేశం అనేపదంతో అన్న ఉపన్యాసం ముగిసేవరకూ ఒళ్ళంతా చెవులు చేసుకుని వినే వాణ్ణి. మోటూరిగారు చెప్పినట్టు మొదటి రెండురోజుల ఉపన్యాసంలో నేను రాసిన సమస్యల ప్రస్తావనే లేదు. రెండో రోజు అర్ధరాత్రి ప్రాంతంలో ఉపేంద్రగారు మా కారెక్కి తెల్లవారుజామున అన్నగారిని కలిసి ఆరోజు ఏరియాలు సమస్యల్ని ఎక్స్ ప్లెయిన్ చెయ్యాలి అన్నారు. నన్ను చూపించి ఇతను ఇంప్రెస్ చేయలేడేమో సురేష్ ని తీసుకురాలేకపోయారా అన్నారు. కాన్సెప్టు వాసిరెడ్డిది…సి్క్రప్ట్ నవీన్ ది అని మోటూరిగారు వివరించారు. 
అలా రోజూ బ్రీఫింగ్ వుండేది వివరణ అంతా మోటరిగారిదే..నేను పక్కనే వుండటం ఎపుడైనా మోటూరిగారి వివరణకు తోడు పలకడం…ఇలా 8 జిల్లలాల్లో రెండునెలలకుపైగా బ్రీఫింగ్ లో నేను కూడా వున్నాను. 
ఒక్కసారి చెప్పగానే ఎన్ టి అర్ కళ్ళుమూసుకుని మననం చేసుకునేవారు. ఆవెంటనే హావభావాలతో ఉపన్యాసం ఇచ్చేవారు. మోటూరిగారు ఒకే అనగానే ఎన్ టి ఆర్ రైటో అని నవ్వేసేవారు. ఒకోరోజు నోట్సు ఒకటి ఆయన చెప్పేది మరొకటిగా వుండేది. రెండుసార్లు ప్రయత్నించి కుదరకపోతే ఇవాళ సాధారణ ప్రసంగమే (కుక్కమూతి పిందెలు..వగైరా విమర్శలు) అనేసే వారు ఎన్ టి ఆర్.
రోజూ మధ్యాహ్నం రెండుగంటలకు ఎక్కడినుంచైనా వాసిరెడ్డిగారికి ఫోన్ చేయడం నా బాధ్యత..ఎన్ టిఅర్ పర్యటనపై స్పందనలు విమర్శలకు ఆరోజు పత్రికల్లో వచ్చిన వార్తలమీద ఎన్ టి ఆర్ ఏమి మాట్లాడాలో వాసిరెడ్డిగారు రెడీ చేసివుంచేవారు. ఫోన్ లో దాన్ని రాసుకుని, ఫెయిర్ కాపీ రాసి మోటూరిగారికి ఇస్తే, ఆయన ఉపేంద్రగారూ చైతన్యరధం ఎక్కేవారు. అదంతా ఎన్ టి ఆర్ కి బీ్రఫ్ చేసేవారు. ఈ బ్రీఫింగ్ సెషన్ లో చివరి పదిహేనురోజులు మాత్రమే నన్ను అనుమతించారు.
ఎన్ టి ఆర్ తో జ్ఞాపకాలు ఒక పుస్తకానికి సరిపడావుంటాయి. అంతటి అనుభవాలు నాకు మిగలడానికి మూలం నా ప్రతిభో, జ్ఞానమో కాదు. బహుశ ఈ పనికేటాయించడానికి ఇతరులు ఎవ్వరూ ఖాళీగా లేకపోవడం…చెప్పిన పని చెప్పిన మేరకే చేయగల బుద్ధిమంతుడు వీడు అని వాసిరెడ్డిగారు, మోటూరిగారూ నమ్మడం…
నిజమే! నేను చేసిన ఈ పనికి పెద్దతెలివితేటలు అవసరంలేదు….అయినా చరిత్రను తిరగరాసిన నాయకుడికి 8 జిల్లాల్లో మంచి ఇన్ పుట్స్ ఇచ్చిన టీమ్ లో నేనూ వున్నానన్నది నాకు ఘనమైన అనుభవం…అపురూపమైన జ్ఞాపకం