తెలిసినదానినుంచి, తెలియనిదానినుంచి, ఊహలనుంచి, వాస్తవం నుంచి, ఎడబాటు అనుభవిస్తున్నపుడు సంబంధీకులకోసం వెతుక్కునే క్రమంలో నాకు ఇదొక జ్ఞాపకం. నా ఉనికికి పునాదైన ఆ స్మృతిని జీవితంలోకి అనువదించుకోవాలని తాపత్రయంగా వుంది. నిర్దాక్షిణ్యంగా ఒకవైపులాగేసే కాలానికి ఎదురీది తాపత్రయాల్ని నెరవేర్చుకోలేమని తెలిసి మనసు బెంగపడుతుంది. 

అయినా, కొత్త స్నేహాలు, సందర్భాలు, విషయాలూ జీవితాన్ని సుసంపన్నం చేయవలసిందే. బతుకు లోపలిపొరలనుంచి అనుభవాలు వెలికిరావలసిందే.తెలిసున్న సత్యాలను కొత్తనేస్తాలతో కలబోయవలసిందే. సంపాదించుకున్న గాయాలను సంక్రమించిన రత్నాలనూ ప్రదర్శించవలసిందే. 
పన్నెండేళ్ళకి ఒకసారి నదీపుత్రులంతా పుష్కర సమాగం జరుపుకున్నట్టు ఒక్క సారి జీవించిన జీవితాన్ని మళ్ళీ మళ్ళీ జీవించడం బాగుంటుంది. ఆలోచనల్ని జ్ఞాపకాల్లోకి పంపేలా మనసు రీవైండ్ అవ్వడం బాగుంటుంది. 
(ప్రతీ జ్ఞాపకమూ ఏ ఒకరికో ఉత్తేజభరితమే! స్ఫూర్తవంతమే! త్యాగి, యోధుడు, ఆచరణశీలి, గాంధేయవాది నాతండ్రిపెద్దాడ రామచంద్రరావుగారి స్మృతి మా కుటుంబానికే గాక మరికొందరికైనా ఆదర్శప్రాయమే అని నానమ్మకం…

ఈరోజు ఆయన 104 వ జయంతి)