పదేళ్ల యుపిఎ హయాంలో కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రులు అవినీతిలో మునిగిపోగా, కాంగ్రెస్ అవినీతిని దుమ్మెత్తిపోసి అధికారంలోకొచ్చిన బిజెపి, ఏడాదిలోనే అవినీతి మచ్చల్ని వొదిలించుకోలేనంత గాఢంగా అంటించుకుంది. ఒక్కొక్కటిగా బయట పడుతున్న బిజెపి నేతల అవినీతి, అక్రమాలు ఆ పార్టీకి తల బొప్పి కట్టిస్తున్నాయి. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే, స్మృతీ ఇరానీ, పంకజ్ ముండే – ఈ నలుగురూ పార్టీలోని శక్తివంతమైన మహిళలే!
సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే, పంకజా ముండే అక్రమాలతో బిజెపి నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీలకు మొహంచూపించలేని అవస్ధ. ఈ ఉదంతాలకు స్మృతి ఇరానీ విద్యార్హతల వివాదం తోడై ఊపిరాడని దుస్ధితి. ఆత్మరక్షణలో పడ్డ ప్రధాని, బిజెపి అగ్ర నేతలు ఆరోపణలెదుర్కొంటున్న వారందరినీ సమర్థించడమే పనిగా పెట్టుకున్నారు. నిందితులను వెనకేసు కొచ్చేందుకు ఏ మాత్రం జంకూ గొంకూ ప్రదర్శించట్లేదు. నీతులు ఎదుటి వారికి తప్ప తమకు కాదన్నట్లు ఆ పార్టీ వ్యవహరించడం దారుణం.
ఎవరిని ఏమంటే ఎవరి మెడకు ఏం చుట్టుకుంటుందోనన్న భయం బిజెపి నేతలను వెంటాడుతున్నట్లుంది. అందుకే ఆరోపణలెదుర్కొంటున్న వారిపై ఈగ వాలనీయడం లేదు. ఎన్నికల్లో బిజెపి నినాదం కుంభకోణాల కాంగ్రెస్‌ను గద్దె దించడం. అవినీతి రహిత పాలన అందించడం. మోడీ ప్రభుత్వం, సంవత్సరంలోనే ఆ హామీ నుంచి పూర్తిగా వైదొలిగింది. అవినీతి విషయంలో తమది యుపిఎ కాదని ప్రధాని చెప్పుకుంటున్నారు.
యుపిఎ ప్రభుత్వంలో భారీ బొగ్గు స్కాంను కోల్‌గేట్ అన్నారు. అనంతరం రైల్వే గేట్ ముందుకొచ్చింది. ఎన్‌డిఎ సర్కారులో లలిత్ గేట్ బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. లలిత్ గేట్‌లో తొలుత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పేరు వెల్లడైంది. ఐపిఎల్ మాజీ అధిపతి, ఆర్థిక నేరగాడు లలిత్ మోడీకి బ్రిటన్ నుంచి పోర్చుగల్ వెళ్లేందుకు సుష్మా మంత్రి హోదాలో వీసాకు సిఫారసు చేసిన ఉదంతంపై బ్రిటిష్ మీడియా భారత్ పరువు తీసింది. కేవలం మానవతా దృక్పథంతోనే వీసాకు సాయం చేశానని సుష్మా చెప్పిన అబద్ధం అతకలేదు. లలిత్ మోడీ విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) లలిత్ అక్రమాలపై దర్యాప్తు చేస్తోంది. ఐపిఎల్ బెట్టింగ్‌లు, ఆర్థిక లావాదేవీలు, కుంభకోణాలకు పాల్పడి దేశం విడిచి లండన్‌కు పారిపోయిన వైట్ కాలర్ క్రిమినల్ లలిత్ మోడీ. అతగాడిపై రెడ్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. అలాంటి నేరస్తుడికి కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మన దేశానికి రప్పించి, అక్రమాలపై విచారణకు ఆదేశించాల్సింది పోయి దేశాలు తిరగడానికి వీసా ఇప్పించడమేంటి? సుష్మా కుటుంబానికి, లలిత్ మోడీకి సంబంధాలున్నాయి. లలిత్ తరఫున కోర్టుల్లో సుష్మా భర్త, కూతురు వాదిస్తున్నారు. సుష్మా క్విడ్‌ప్రోకో నిరూపణకు ఈ ఆధారాలు సరిపోతాయి. అయినా నరేంద్ర మోడీ సర్కారు, బిజెపి సుష్మాను వెనకేసుకొచ్చాయి.
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సైతం లలిత్ మోడీ వీసాకు సహకరించి అడ్డంగా దొరికిపోయారు. ప్రతిపక్ష నాయకురాలిగా ఉండి బ్రిటన్ ఇమ్మిగ్రేషన్‌కు స్టేట్‌మెంట్ ఇచ్చారు. పైగా తాను సిఫారసు చేసినట్లు భారత అధికారులకు తెలపొద్దని షరతు పెట్టారు. ఆ పత్రం బయటపడ్డాక కూడా వసుంధరా రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని బిజెపి వత్తాసు పలకడం ఆమె అక్రమాలను సమర్థించడమే అవుతుంది. లలిత్ మోడీ అక్రమంగా ఎదిగిపోడానిక వసుంధరా రాజేనే కారణం. ఆమె ముఖ్యమంత్రిగా అందించిన సహకారంతోనే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి బిసిసిఐ, ఐపిఎల్ స్థాయికి అంచెలంచెలుగా ఎదిగాడు. అందుకు ‘ఉడతా భక్తి’తో వసుంధర తనయుడు, బిజెపి ఎంపి అయిన దుష్యంత్ కంపెనీలో పది రూపాయల ముఖ విలువ చేసే షేర్‌ను రూ.96 వేల చొప్పున 815 షేర్లు కొనుగోలు చేశారు. లలిత్ మోడీకి, వసుంధర కుటుంబాలకు మధ్య సంబంధాలకు ఇంతకంటే ఏ సాక్ష్యాలు కావాలి? వ్యాపార వృద్ధిని ఆశించి అత్యధిక ధరకు లలిత్ షేర్లు కొన్నారని బిజెపి వాదించడం ఘోరం.
మహారాష్ట్రలో బిజెపి మంత్రి పంకజా ముండే అవినీతి మరీ క్షమించరానిది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పేద పిల్లలకు అందించే వేరుశనగ పప్పుండలు, దుప్పట్లు, చాపల కొనుగోలులో రూ.200 కోట్లకు పైగా మెక్కారు. ఒకే రోజు టెండర్లు లేకుండా వందలాది ప్రభుత్వ తీర్మానాలతో వస్తువులు కొన్నారు. మంత్రి పంకజాపై ఎసిబి వద్ద కేసు నమోదు కాగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిదీ సమర్థన పల్లవే.
ఇక కేంద్ర మంత్రి స్మృతి ఇరానీది మరో వివాదం. ఎన్నికల కమిషన్‌కు అందజేసిన అఫిడవిట్‌లో విద్యార్హతలపై తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వ్యక్తి పదవిలో కొనసాగడానికి వీల్లేదు. లలిత్ గేట్‌లో కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, ఎంపి ఇరుక్కున్నా, మహారాష్ట్ర మంత్రి భారీ స్కాంకు పాల్పడ్డా, మరో కేంద్ర మంత్రి స్మృతిపై తప్పుడు అఫిడవిట్ కేసు కోర్టులో విచారిస్తున్నా ప్రధాని నరేంద్ర మోడీ మౌనం దాల్చడం గర్హనీయం.
కుంభకోణాలు, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డ వారిని పదవుల నుంచి తొలగించి సమగ్ర విచారణ జరిపించినప్పుడే అవినీతి రహిత పాలన హామీకి కొంతైనా విలువ ఉంటుంది. ఆరోపణలెదుర్కొంటున్నవారిని పదవుల్లో కొనసాగించడం అనైతికం అనిపించుకుంటుంది.
ఇలావుండగా నరేంద్ర మోడీ ప్రభుత్వ నిరంకుశ పోకడలపై ప్రతిపక్షాల నుంచే కాదు, సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రామ్ జెత్మలాని, అరుణ్‌శౌరీ నేడు కీర్తీ ఆజాద్, శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా, ఎంపి ఆర్‌కె సింగ్ ఇలా ఒక్కొక్కరు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. బిజెపిలో మోడీ-షాలు అన్నీ,అంతా తామే అన్నట్లుగా వ్యవహరించింది. వీరిధోరణి మీద ద్వితీయ శ్రేణి నాయకత్వం గుర్రుగా వుంది. రాంజెత్మలానీ, అరుణ్‌శౌరీ వీరికి మొదట దారి చూపారు. లలిత్‌గేట్ వ్యవహారం బయటపడ్డాక యశ్వంత్ సిన్హ, ఆర్‌కె సింగ్ లాంటివారు తిరుగుబాటు స్వరాలను వినిపించడం మొదలెట్టారు పార్టీలోని నలుగురు శక్తివంతమైన మహిళలు -సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే, స్మృతీ ఇరానీ, పంకజ్ ముండే- లు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడంతో వారిని దీనినుంచి ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం, బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేసిన తరుణంలో పార్టీలో కొందరు ఈ తిరుగుబాటు స్వరాలు వినిపించనారంభించారు.
2014 మే 26న ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి 75 ఏళ్లు దాటిన వారందరూ బ్రెయిన్ డెడ్ కింద మారిపోయారని యశ్మంత్ సిన్హా వ్యంగ్యంగా విమర్శించారు. ఇక కీర్తీ ఆజాద్ డిడిసిఏలో అక్రమాలు జరిగాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై ప్రత్యక్షంగానే దాడి చేశారు. డిడిసిఏకి జైట్లీనే అధిపతి. తమ పరిధులను దాటి ప్రవర్తిస్తే సహించేది లేదని పార్టీ సభ్యులకు మోడీ-షా నాయకత్వం హెచ్చరించినా, అసమ్మతి స్వరాలు ఊపందుకోవడం గమనార్హం. ప్రభుత్వం, పార్టీ బలహీనపడ్డాక ఈ అసమ్మతి సెగ మరింతగా విస్తరించే అవకాశముంది.