రెండు రాషా్ట్రల సగటు మనిషిదీ ఒకటే హృదయం
(శనివారం నవీనమ్)
తన జీవితంలో ఎన్నో అంశాలను పరిశీలించి, పరిష్కరించానని, అయితే మనం దేశ,విదేశాల్లో ఎవరితో మిత్రుత్వం, శత్రుత్వం చేయాలో నిర్ణయించుకోవచ్చుగానీ, మన పక్కన వుండే వారిని నిర్ణయించుకోలేమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా…కలిసి బ్రతకాల్సిందేనని, అందరూ కలిసి దేశాభివద్ధికి దోహదం చేయాల్సిందేనని అదే చరిత్ర చెప్పిన పాఠమని నిన్న హైదరాబాద్ లో ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన చేసిన వ్యాఖ్యానాలు చంద్రబాబునాయుడు, కెసిఆర్ ప్రభుత్వాలను ”చెంపలు వాయించుకుని గుంజీలు తీయాలని” పెద్దమనిషి ప్రేమతో మందలించినట్టుగా వున్నాయి.
కెసిఆర్ ఆంధ్రానాయకుల్ని లత్కోర్లు, లఫంగీలు అని హేళన చేసినా…నన్ను టచ్ చేస్తే తెలంగాణా ప్రభుత్వానిక అదే ఆఖరురోజని చంద్రబాబు ఊగిపోయినా ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణా ప్రజలుగాని ఆవేశాలతో రెచ్చిపోలేదు. టిఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలు వాటివాటి వైరాల్ని, గొడవల్ని ప్రజలకు పులిమే ప్రయత్నాలు చేస్తున్నా వాటిని అంటించుకోని రెండు రాషా్ట్రల ప్రజల సామరస్యం, వివేకం, ఇంగితం తెలుగురాషా్ట్రల్లో సగటు మనిషి కొండంత ఎత్తున నిలిపివుంచింది.ఇదే స్పూర్తిని రాష్ట్రపతి మాటల్లోకి మార్చారా అనిపిస్తోంది.
హైదరాబాదు తెలంగాణలో భాగంగా రాజధానిగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం జరిగే లోగా పదేళ్లకు మించకుండా హైదరాబాదు నుంచే పాలన సాగించాలి గనక ఉత్పన్నమైన ప్రత్యేక నిబంధనల అధ్యాయమే సెక్షన్ 8 . రాజ్యాంగం ప్రకారం గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ సలహాల ప్రకారమే నడుచుకోవాలి. తెలంగాణ ప్రభుత్వానికీ అదే సూత్రం వర్తిస్తుంది. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశా పరభుత్వం కూడా నివాసముంటోంది.దీనిపై మరో రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ చేసే అవకాశముండదు. కనుక మధ్యంతర దశలో గవర్నర్‌కు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించడమే ఆ సెక్షన్ ఉద్దేశం. ఆ ప్రకారం గవర్నర్ …భవనాల కేటాయింపు…పౌరుల, ప్రధాన సంస్థల భద్రతకు సంబంధించి పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది. ఇందుకోసం కేంద్రం ఆయనకు ఇద్దరు సలహాదార్లను నియమి స్తుంది. తెలంగాణ మంత్రివర్గంతో సంప్రదిస్తూ దాని సలహాల మేరకు గవర్నర్ పనిచేస్తారు. అయితే ఎప్పుడైనా ఆయన గనక ఆ ప్రభుత్వ నిర్ణయాలతో విభేదిస్తే అప్పుడు ఆయన విచక్షణాధికారమే అంతిమమవుతుంది.
ఈ సెక్షన్ ఇప్పటి వరకూ అమలు జరిగిందా, లేదా అంటే ఏదో మేరకు అమలు జరుగుతూనే ఉంది. భవనాల కేటాయింపు, వాహనాల కేటాయింపు వంటివి ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. ఐఎఎస్, ఐపిఎస్ అధికారులే గాక మంత్రులూ, ముఖ్యమంత్రులూ కూడా ఆయనతో తరచూ సమావేశమవుతున్నారు. నాగార్జున సాగర్ డ్యాంపై పోలీసుల ఘర్షణ, ఎన్జీవోల కార్యాలయంలో ఘర్షణ వంటివి జరిగినప్పుడు ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రులతో నూ సంప్రదించారు. విద్యా సంబంధ మైన విషయాల పైనా ఇరు రాష్ట్రాల మంత్రులూ ఆయనతో సమావేశమై అవగాహనకు వచ్చారు. ఇవన్నీ స్థూలం గా సెక్షన్ 8 పరిధిలోవే.
కాకపోతే అమలు కాని అంశం ఒకటుంది. ఈ సెక్షన్ అమలుకు నిబంధనల పేరిట కేంద్రం ఒక లేఖ రాసింది. అందులో పోలీసు కమిషనర్ల నియామకం వంటివి కూడా గవర్నర్ సలహాల మేరకు జరగాలన్నట్టు పేర్కొంది. దానిపై తెలంగాణ అభ్యంతరం తెల్పడంతో పక్కన పెట్టారు. దాన్ని ఉపసంహరించాలని ఆ ప్రభుత్వం గాని అమలు చేయాలని ఎపి ప్రభుత్వం గాని ఎప్పుడూ గట్టిగా అడిగింది లేదు. ఇప్పుడు రాజకీయ ఇరకాటంలో చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు దీన్ని పైకి తీశారు. తమ ప్రభుత్వాధినేతకే రక్షణ లేదు గనక స్వంత రాష్ట్ర పోలీసులను తెచ్చుకుంటామనీ, సరిగ్గా వారిపై ప్రతి వ్యూహ ప్రయోగం కోసం కెసిఆర్ ఆయన అనుయాయులు అసలా ఊసే ఒప్పుకోబోమని వాదించారు.
చెప్పాలంటే ఇదంతా కృత్రిమమైన వ్యవహారం. పైగా ఈ క్రమంలో హైదరాబాదు శాంతిభద్రతలు పదే పదే చర్చకు రావడం రెండు రాష్ట్రాలకూ మంచిది కాదు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సమర్పించిన ఒక పత్రంలో దాడులు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. కొన్ని రకాలైన ఒత్తిళ్లు, అపార్థాలు ఉన్నా ప్రభుత్వ స్థాయిలో ఫిర్యాదు చేయాల్సినంత తీవ్ర పరిస్థితి హైదరాబాదులో లేదనేది వాస్తవం.
ప్రధానంగా ఉద్యోగ కేంద్రాలలోనూ, అధికారుల బదలాయింపులోనూ, విద్యా సంస్థల పరీక్షలు, సీట్ల కేటాయింపులలోనూ, నీటి పంపిణీ లోనూ వివాదాలు వచ్చిన మాట, కొనసాగుతున్న మాట కాదనలేనిది. అయితే ఇందుకు బాధ్యత ప్రభుత్వాలది తప్ప ప్రజలది కాదు. వారి మధ్య ఘర్షణలు వచ్చిందీ లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సుకు ఆంధ్రప్రదేశ్ హేమా హేమీలంతా వచ్చారు. అమరావతి నిర్మాణంలో భాగం కోసం తెలంగాణకు చెందిన సంస్థలూ ఉవ్విళ్లూరుతున్నాయి. ఎటొచ్చి తెలుగుదేశం, టిఆర్‌ఎస్‌ల రాజకీయ వైరమే పరిస్థితిని ఉద్రిక్తం చేసింది.
గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల కోణంలో ఉన్న టిఆర్‌ఎస్ కూడా అందుకు తగినట్టే స్పందించింది. సెక్షన్ 8ని గుర్తిస్తాము గాని దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితులు లేవని తెలంగాణ సర్కారు అంటుంది. ఆ పరిస్థితులు ఉన్నాయా, లేదా అని నిర్ణయించు కోవలసింది గవర్నరే. ఇక ఎపి విషయానికి వస్తే ఈ సెక్షన్‌లో దాని ప్రస్తావనే లేదు.
గవర్నర్ సంప్రదించాల్సింది తెలంగాణ సర్కారును తప్ప ఎపిని కాదు. కాకపోతే ఏమైనా ఫిర్యాదులు, విజ్ఞప్తులు ఉంటే స్వీకరించి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.
అతి సామాన్య ప్రజలకు ఈ వివరాలన్నీ తెలిసి వుండకపోవచ్చు. అయితే ఏవివాదంలోనైనా, ఏ కీలకాంశంలోనైనా ప్రజల ప్రయోజనాలు ఎంత, పార్టీల లాభమెంత అని బేరీజువేసుకునే ఇంగితజ్ఞానం వున్న తెలుగు మనిషీ వర్ధిల్లు !