కథంటే కుతూహలాన్ని రేపాలి. ధైర్యాన్ని నింపాలి. ఊహను పెంచాలి. సాహసం మీద గౌరవమివ్వాలి. గౌరవం పొందే ఆదర్శాన్ని చూపాలి. కాశీమజిలీ కథల్లో పేదరాశి పెద్దమ్మకథల్లో చందమామ కథల్లో ఇవన్నీ వుండేవి. పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని ఈ కథలు చెప్పిన అమ్మ్మలూ నాయనమ్మలూ లేరు. ఉన్నా వాళ్ళు టివిలకు అతుక్కుపోయారు. వీడియో,ఎలక్టా్రనిక్ గేములే పిల్లలకు సాహసగాధలైపోయాయి.
దుర్గమమైన అరణ్యాలు, అగాధమైనలోయలు, అందుకోలేని శిఖరాలు, అనేక ఆశ్చర్యాలు, అనేకానేక అద్భుతాలు, అసమానులైన మనుషులు….వీటన్నిటిపై ముఖ్యంగా పిల్లలకు ఆలోచనలు ఊహలు ఇవ్వడానికే పుట్టిన కథలు అంతరించిపోయాయి.
అందుకే కొంచెంకూడా ఆశ్చర్యం మిగలని ప్రపంచం మీద విసుగొస్తుంది. ఊహకందని సంఘటనా, జోస్యం చెప్పలేని భవిష్యత్తు, తెలియని చోటు, వినని మాట, ఊహించని అందం ఎదురైతే బాగుండుననిపిస్తుంది.
కష్టం విన్న రాకుమారుడు దాన్ని తొలగించే అన్వేషణలో అడ్డదారిన అడవిన పడాలి. పేదరాశిపెద్దమ్మ ఇంట్లోనో, పూటకూళ్ళమ్మ పంచలోనో పరదేశుల నేస్తం చేసి ప్రపంచ వార్తలు వినాలి. కాలుజారి రాకాసిలోయలో పడిపోవాలి. గండభేరుండ పక్షి రెక్కల మాటున వొదిగి గగనవిహారం చేయాలి. వొద్దన్న ఉత్తరదిక్కుకే దారితప్పిపోవాలి. జంతువులను, మాయావులను ఒంటి చేత్తో మట్టికరిపించే వీరుని సాహసానికి మహోదృతమైన జలపాతమే ముడుచుకుపోవాలి. కొండల్ని మోక్కాలి. కోనల్ని వెతకాలి. ప్రమాదం తో చెలిమి చేసి రాకుమారి మనసు దోచుకోవాలి…బాల్యానికి సంబంధించి జ్ఞాపకాలో, అనుభూతులో వున్న వారికి ఇలాంటి ఫ్లోక్ లోర్ కథలు ఎప్పటికీ నచ్చుతూనే వుంటాయి.
అయితే…ప్రయత్నం లేకుండా విజయాల సాధన కుదరదనీ, అనుభవాల పంటకు ప్రయత్నమే మొదటి షరతనీ, విజయమో విజ్ఞనమో అప్రయత్నంగా ఎవరికీ అందకూడదనీ బాహుబలితో సహా ఉత్తేజపరచే జానపద కథలు మనకి చెబుతూనే వుంటాయి.రాజమౌళి మాంత్రికుడు కళ్ళముందు ఇంతకు మించిన మంత్రనగరినే పూయించాడు. బాహుబలి ఎందుకు నచ్చిందో, ఎందుకు నచ్చాలో చెప్పడానికే ఇదంతా.
అసలు విషయం :
బాహుబలి : చివరి దాకా వెల్లడికాని మూలమలుపులో వున్నట్టుండి తెరుచుకున్న అద్భుతం లాగా వుంది #nrjym