పిల్లలకు “పీడకలలు”లేని నిద్ర ఇవ్వడమే ఆయనకు నివాళి!!


ప్రముఖమైన లేదా విశిష్టమైన వ్యక్తికీ, గొప్ప వ్యక్తికీ తేడా వుంది. ఒక సామాజిక ప్రయోజనపు అంతస్సూత్రాలతోనే ప్రభావితమై కార్యాచరణకు దిగిన వారే గొప్ప వ్యక్తులు. సమాజంకోసం వారు అవసరాన్ని బట్టి కొరడా పట్టాలి, చీపురు పట్టాలి. వారే ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతారు. 

నాకుతెలిసినంతవరకూ ‘సత్యాగ్రహి’ గాంధీజీ, 

‘భారత సమాజాన్ని అర్ధం చేసుకోడానికి రిసోర్స్’ అంబేద్కర్ మహాశయుడు, 

‘మహా ఇన్ స్పైరర్’ కలామ్ సర్ లకు మించిన గొప్ప వారు లేరు. 
మనుషులు తమ జీవన సార్ధక్యం కోసం, సొంతబతుకుల నుంచి సమష్టి లోకి ఎదిగే విజయం సాధించడం కోసం అమాయకంగా, ప్రయత్నపూర్వకంగా కనే కలలగురించే, కనవలసిన కలల పరిచయం చేసింది ఆయనే!
కలలు…కలలు…కలలు కనండి…కలలు ఆలోచనలు అవుతాయి…ఆలోచనలు ఆచరణలు అవుతాయి అని పిల్లలకు నూరిపోసింది ఆయనే!
ఆరోహణ చివర ఒక శిఖరం వుంటుందనీ, చీకటి చివర వేకువలా కాచుకున్న జ్ఞానం వుంటుందనీ, కష్టపడి చేసే ప్రయాణం విజయగాధగా ముగుస్తుందనీ, విద్యార్ధుల్ని ప్రేరేపించింది ఆయనే!
స్వయం సిద్దుడైన ఆ విజయుడి కలల్ని నిజం చేయాలంటే, కఠిన వాస్తవాలనుంచి వెన్నల విజయాలు సాధించాలంటే పిల్లలకు పీడకలలు లేని నిద్రను ఇవ్వాలి అదే కలాం సర్ కి నివాళి! 
(ఉద్వేగం నుంచి మనసును ప్రశాంతతలోకి తెచ్చుకోడానికి గాంధీజీ మార్గంలో నేను ఈ పూట ఉపవాసం వుంటున్నాను) 

%d bloggers like this: