Search

Full Story

All that around you

Month

August 2015

ఇది గౌరవభంగం కూడా…


పార్లమెంటులో ప్రశ్నించడానికీ, ప్రభుత్వంలో ప్రస్తావించడానికీ వీలులేకుండా ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం దయాదాక్షిణ్యాల ఫైలు లో విభజన హక్కుల్ని కుడా కూరేసి చంద్రబాబు చూస్తూండగానే ప్రధాని చైర్మన్ గా వున్న నీతిఆయోగ్ కాళ్ళకిందికి తోసేశారు…..

http://www.telugu360.com/te/ap-right-is-now-at-neethi-ayoogs-mercy/ 

 

ఎపికి మెట్రో రైలు కుదరదు 


ప్రపంచమే మార్కెట్ అయిపోయాక లాభాలే తప్ప ప్రజాప్రయోజనాలు వుండవు. ప్రభుత్వాలే కాళ్ళావేళా పడినా ‘డబ్బు’ నష్టానికి ఒప్పుకోదు. విజయవాడ మెట్రోరైలు పట్టాలు ఎక్కదు. తలతాకట్టు పెట్టుకుంటేతప్ప రైతుపొలాన్ని సింగపూర్ వాడిక ఇచ్చేస్తేతప్ప నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కి హోదాగానో, పాకేజిగానో ఉదారంగా మోదీ ఇవ్వడానికి ‘డబ్బు’ ఒప్పుకోదు. 

http://www.telugu360.com/te/union-government-rejects-vijayawada-metro-proposal/ 

 

ఆంధ్రకేసరి జయంతి నేడే(మాగంటి మురళీమోహన్ గారికి ఈ పోస్టు అంకితం)


రాజమండ్రి విమానాశ్రయానికి ప్రకాశం పంతులుగారి పేరు పెట్టనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాలకుముందు ప్రకటించారు. ఆయన స్ధానికుడు కానందున విమానాశ్రయానికి మరో పేరు ఆలోచిస్తున్నామని పుష్కరాలతరువాత రాజమండ్రి ఎంపి మాగంటి మురళీమోహన్ చెప్పారు. చరిత్రజ్ఞానం లేకపోవడం నేరం కాదు. కానీ, చరిత్రను ధ్వంసం చేసే ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం మన దౌర్భాగ్యం. 

అయ్యా మురళీ మోహన్ గారూ! మీరూ ఎక్కడినుంచో దిగబడినవారే! దయచేసి రాజీనామా చేసి స్ధానికుల్నే ఎన్నుకునే అవకాశం మాకు ఇవ్వండి అని నిలదీస్తే ఆయన తల ఎక్కడ పెట్టుకుంటారు? 
ఒంగోలుదగ్గర వినోద రాయునిపాలెంలో పుట్టి, దరిద్రంలో పెరిగి, ప్లీడరుగా రాజమండ్రిలో జీవితం ప్రారంభించి, మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై ,బారిస్టరుగా ఎదిగి, మద్రాసుకి మకాం మార్చి, ఎడాపెడా సంసాదిస్తూ బ్రిటీష్ కమీషన్ అధ్యక్షుడుగా వచ్చిన సైమన్ వెనక్కి పొమ్మన్న స్వాతంత్రోద్యమంలో తుపాకీతో వస్తున్న పోలీసులకు దమ్ముంటే కాల్చు అని గుండె చూపి, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవిన్యూ మంత్రి అయ్యి, ప్రజల కు చేరువగా పాలనను చేర్చడానికి తాలూకాల నుంచి ఫిర్కాలను విభజించి, విజయవాడవద్ద కృష్ణా నదిపై బేరేజీని పునర్నిర్మించి, రాష్ట్రం విడిపోయాక కర్నూలునుంచే పదమూడునెలలు టెంటుల్లో పాలన సాగించి, వాల్తేరులో అసెంబ్లీని నిర్వహించి, ఆంధ్రరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా పునర్నిర్మిత మయ్యేవరకూ 85 ఏళ్ళు (23 -8-1872 – 20 -5-1957)జీవించి సొంతఇల్లుకూడా లేని ముఖ్యమంత్రిగా పేదరికంలో హైదరాబాద్ లో పేదరికంతో మరణించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 143 వజయంతి ఈరోజే. 
పాలనలో తెలివినికాక హృదయాన్ని చూపిన తెలుగు నాయకులు టంగుటూరి ప్రకాశం పంతులుగారు, నందమూరి తారక రామారావుగారు తప్ప మరెవరూలేరు. సమస్యలపై ఆ ఇద్దరూ ఓట్ల లెక్కల్ని కాక సమస్యల పరిష్కారానికి తోచిన పరిష్కారాలను, హృదయపూర్వకమైన ఉద్వేగాలతోనే నిర్ణయాలు తీసుకున్నారు.

ఇద్దరూ ఎవరు ఏమనుకున్నా తాము నమ్మినదే త్రికరణశుద్దిగా ఆచరించిన ధీరులు.

ఇద్దరూ ఎత్తుపల్లాలు చూసినవారే…అవసానకాలంలో ఒకరిని పేదరికం, మరోకరిని పట్టించుకునే వారు లేని ఒంటరితనం వేటాడింది. మరుగుజ్జు నాయకులకు తెలియకపోయినా ఉత్తేజభరితాలైన వారి జ్ఞాపకాలు ప్రజల హృదయాల్లో పరంపరగా విస్తరిస్తూనే వుంటాయి. 

 

విలాసవంతమైన భోజనం 😀😀


అన్నంలో కలుపుకుని తినడానికి రకరకాల కూరలు పులుసులు సాంబారుల శాఖాహార విందుభోజనంలో ముందుగా మొఘలాయీ వంటకమైన మసాలా దినుసుల పులావ్, బిర్యానీలను వడ్డిస్తున్నారు. వాటిని తిన్నాక ఆతర్వాత అన్నంలో కలుపుకు తినే అనుపాకాల రుచి తెలియదు. ముందుగా పులిహోర తింటే ఆ రుచితో పాటు ఇతర అన్ని వంటకాల రుచులూ ఎంజాయ్ చేయవచ్చని నా అనుభవం ద్వారా గట్టిగా చెబుతున్నాను.
ఇవాళ మధ్యాహ్నం ఒక కాన్ఫరెన్సులో శాఖాహార విభాగంలో ప్లేటు ప్లేటు పట్టుకుని మెనూ వెతుకుతూ వెతుకుతూ వెళ్ళగా ఈ మధ్య రుచి చూడని మునగకాడల ఉలవచారు కనబడింది. మిగిలినవాటిలో కొత్తదనమేమీలేదు. పాలగోవిందు కమ్మటి గడ్డపెరుగు. చెయ్యకడిగిన కాసేపటి తరువాత కూడా రుచుల ఫీలింగ్ నిలుపుకోడానికి విందుభోజనం తరువాత ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్, కిళ్ళీ మొదలైనవి వేటినీ తినను. 
ఇంతకీ ఇవాళ నా మధ్యాహ్నం మెనూ ఏమిటంటే ఉలవచారు, పెరుగు, ముందుగా పెద్ద ఉల్లిపాయల ఆవకాయ…అలా ఇవాళ పెద్దపెద్ద ఉల్లిపాయలు కలిసిన విలాసవంతమైన భోజనం చేయగలిగాను 

కుదురులేని మనసు 


ప్రధానమంత్రి వ్యవస్ధమీద నాకు ఇప్పటికీ గౌరవం వుంది. నరేంద్రమోదీ గారి మీద ఎన్నో ఆశలు వుండేవి. రంగులతలపాగాలో ఆయన భారతీయత, ఆయన చేతులూపుతూ చేసే ప్రసంగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు పట్ల కమిట్ మెంటు కనబడేది. 

ఆయనలోని వ్యాపార వర్గాల అనుకూలత ప్రజలకు ఉపయోగపడేదికాక, ఇబ్బంది పెట్టేది మాత్రమేనని ఏడాది అనుభవంతో అర్ధం చేసుకున్నాను. ఇది అర్ధమయ్యాక, (ప్రత్యేక హోదా పై ఆయన మోసం చేయడం వల్లకూడానేమో)…
ఇవాళ ఎర్రకోటలో అదే మోదీ, అదే తలపాగా, అవే చేతులు ఊపడం చూస్తూంటే 

ఎవరో సుప్రసిద్ధ ఇంద్రజాలకుడి మేజిక్ షో చూస్తున్నట్టు అనిపించింది. ఆయన కొత్తగా నినదించిన ‘టీమ్ ఇండియా’ ఏమాత్రం ఉత్తేజపరచలేకపోయింది. 

వెరీ వెరీ సారీ! 
శక్తి హీనుడైపోయిన చివరి మొఘలాయీ చక్రవర్తి కూడా అనేకసార్లు అడిగించుకుని కాని ఈస్టిండియా కంపెనీవాళ్ళ వ్యాపారానికి ఈ నేలమేద అధికారాన్ని ఇవ్వలేదు. అలా వేళ్ళూనుకున్న ఆంగ్లేయులను సాగనంపడానికి మన పూర్వీకులు మూడువందల ఏళ్ళు పాటు పడ్డాక హమ్మయ్య అనుకున్న 69 ఏళ్ళకే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులూ పోటీలుపడి విదేశీకంపెనీలను ఆహ్వానించేస్తున్నారు. 
వ్యాపారఒప్పందాల్లో ప్రజలప్రయోజనమెంత?కార్పొరేట్ల లాభమెంత? ఈరెండింటికీ మధ్య హద్దుల్ని కట్టడి చేసేదెవరు? మొదలైన అంశాల్ని నరేంద్రమోదీ, చంద్రబాబు సహా ఏ ప్రభుత్వాలూ పారదర్శకంగా వుంచకపోవడం వల్ల మనపేదరికాన్ని దేశ,విదేశీ పెట్టుబడులకోసం అడ్డంగా తాకట్టుపెట్టేస్తున్నారనిపిస్తోంది. 
స్వేచ్ఛా స్వాతంత్రాలను ఐచ్ఛికంగా తాకట్టుపెట్టేస్తున్న నాయకులధోరణి కష్టంగా వుంది. అందుకని జెండాపండుగకు వెళ్ళకుండా ఇంట్లోనే వుండిపోయాను. ఒళ్ళుబాగోలేక ఒకసారి, మనసుబాగోలేక ఈవేళ మినహాయించి నేను జెండాపండగ చేసుకోని సంవత్సరమేలేదు. – జైహింద్ 

వృద్ధికి కేంద్రం – జీవితమా ? డబ్బా?


”గడవడమే కష్టంగా వుంది” అంది ఒక యువతి 

”డబ్బుసమస్య ఎవరికి లేదని, ఏదైనా ఆర్డర్ వస్తే పూర్తిచేసి ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి ఇదంతా ఎప్పటికి అవుతుందో తెలీదు. అందాకా ఈడబ్బుతోనే సర్దికోవాలి”అని ఓ నలభైఏళ్ళ సీ్త్ర తన పర్సుని ఆయువతికి ఇచ్చింది. 
అందులో ఒక ఇరవై నోటు ఒక పదినోటు కాస్త చిల్లర చూసి ”నువ్వేనయం 

దేవుడి దగ్గర వెలిగించచానికి అగరుబత్తీ లేదు. రేపు తలస్నానానికి షాంపూ పేకెట్ లేదు. కొనడానికి డబ్బులు లేవు” అంది ఆ యువతి.
”ఉన్నదే సర్దుకుని తింటున్నాం. ఎప్పుడు ఏ అవసరం విరుచుకుపోతుందనే భయమే తప్ప బాగానే వున్నాము. అదేజీతం ఇదివరకు చివరి వారమే డబ్బులుండేవికాదు. ఇపుడు వారం పదిరోజుల తరువాత డబ్బు వుండటం లేదు” అని యువతి చెప్పుకొస్తోంది. డబ్బు ఇబ్బందే తప్ప ఎంతబాగా చూసుకుంటాడో అని మురిపెంగా చెబుతోంది. 
ఏదైనా జాబ్ చూడకపోయావా అంది ఆస్త్రీ 

నీలాంటి ముసలోళ్ళకే బయటికి వెళ్ళి పనిచేయడం సమస్య నేను వెళ్ళనే వెళ్ళను అనేసింది యువతి. 
ఇద్దరూ గట్టిగా నవ్వేసుకుని చేతులు పట్టుకుని కబుర్లాడుకుంటూ సంతోషాల్ని కలబోసుకున్నారు. ఒక అగరుబత్తీని ఎన్ని ముక్కలు చేస్తే అన్నిరోజులు దేవుడిముందు వెలిగించవచ్చిని ఆమె చిట్కా చెప్పగానే 

కదా అంటూ భలే డిస్కవరీ అన్నట్టు సంబరపడిపోయింది ఆయువతి. 
ఈసాయంత్రం ఇద్దరి మధ్య (ఖచ్చితంగా ఈ మాటలే కాదుకాని ఇంచమించు)ఈ సంభాషణల్నే విన్నాను. 
డబ్బులేదన్న ఆందోళన తప్ప జీవితం ప్రేమాస్పదం అనే ఎమోషన్ యువతిలో, సమస్యల్ని హాండిల్ చేసే నిబ్బరాన్ని సాధించిన సీ్త్రలో …పాజిటివ్ యాటిట్యూడ్ అద్భుతంగా కనిపించింది. వారు జీవితమే కేంద్రంగా బతుకుని వారు స్వీకరించి ఆస్వాదిస్తున్నారు. నాలాంటి లక్షలు కోట్లమంది డబ్బే కేంద్రంగా తృప్తి లేని బతుకును ఈడ్చేస్తున్నాము.
ఆ ఇద్దరూ ఆకస్మికంగా రెండు చీపురుకట్టలై పోయినట్టు భ్రమ కలిగింది. ధరలు అదుపుచేయలేక, సాంఘిక భద్రత ఇవ్వలేక, కష్టపడి జీవించే అడుగు మనిషికి ప్రశాంతతనూ, గౌరవాన్నీ హరించేసి కార్పొరేట్ ఊడిగపు వెర్రిలో మైమరచిపోతున్న పాలకులను చీపురుకట్టలు కోపంగా చూస్తున్నట్టు భ్రాంతి కలిగింది. డిల్లీనుంచీ అమరావతినుంచి దిగబడే స్మార్ట్ సిటిల్లో తమకు చోటెక్కడో తేల్చమని చీపురుకట్టలు నిలదీస్తున్నట్టు ఒక భావన ఆవరించింది. 
జీవన ప్రాధాన్యతలను తొక్కేసి మనుషుల్ని సింగపూరు డాలర్లకీ అమెరికా డాలర్లకీ ఎడాపెడా తాకట్టు పెట్టేస్తున్న విధానాల్ని తరిమెయ్యడానికి చీపురు కట్టల్ని తిరగెయ్యాలన్నంత కోపం కలిగింది.  
 

త్రీడి సౌండ్ + హెచ్ డి పిక్చర్ = థ్రిల్లర్ ఎఫెక్ట్ 


ఈ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు వినిపించిన శబ్దం 
సకిలిస్తున్న ఒక డైనోసార్ నేను వున్నవైపు చిన్నగా నడిచి వస్తున్నట్టు అనిపించింది. 

అదిపాతిక అడుగుల ఎత్తున వున్న రెండంతస్ధుల భవనం స్లాబుమీదినుంచి తీసినఫొటో ఇది. రిన్నోవేషన్ కోసం బిల్డింగ్ లో ఫ్లోర్ ను పగలగొడుతున్నారు. పెద్దపెద్ద గదులనుంచి వస్తున్న రీసౌండు ఈదురుగాలులతో కలిసిపోయి ఎప్పుడూ వినని ధ్వనులు వినిపించాయి. 
ఎటుచూసినా దట్టంగా ఎదిగిన ముదురు ఆయిల్ పామ్ తోటలు.త్రీడి డిజిటల్ డాల్ఫీ సౌండ్ ఎఫెక్టుతో హైడెఫినిషన్ మూవీ చూస్తున్న యాంబియెన్స్ మల్లవోలులో ఈ బిల్డింగ్ దగ్గర వుంది. 
సాంప్రదాయికంగా మెట్టవరి, కందులు, పెసలు, మినుములు, నువ్వులు, వేరుశెనగ లాంటి వర్షాధార పైర్లు మెట్టనేలల్లో పండించేవారు. వాటికవే విస్తరించిన తాడిచెట్లు దట్టంగా వుండేవి. దీన్ని బట్టి కాస్త పోషిస్తే పామ్ జాతికి చెందిన కొబ్బరి, కోక్, ఆయిల్ పామ్ లాంటి తోటలకు అనువైన నేలలుగా గుర్తించారు. హెచ్చు ఎకరాలున్న పెద్దరైతులు తప్ప సగటు రైతులు కొత్త తోటల ప్రయోగాలు చేయలేకపోయారు. 
1997 పెనుతుఫానుకి కోససీమ కొబ్బరితోటలు ధ్వంసమయ్యాక పామ్ జాతి తోటల సాగు తూర్పుగోదావరి జిల్లాలో ఎర్రగరప నేలలకు ఒక ఉద్యమంలా విస్తరించింది. అడవిలా పెరిగిన ఈ ఆయిల్ పాయ్ తోటల వయసు పదహారు పదిహేడేళ్ళే…
ఇది రాజానగరానికీ, అనపర్తికీ మధ్య మల్లవోలులో ఈరోజు ఉదయం నేను తీసిన ఫొటో 

  

ఎగిరిపోతే ఇంత బాగుంటుంది!


ఎత్తుతక్కువ అంచులు, తక్కువ కోత శక్తి, విస్తారమైన వరదమైదానాలు, వున్న నదులను వృద్ధనదులు అంటారు. ఆఫ్రికాలో నైలునది, పాకిస్ధాన్ లో సింధునది, ఇండియాలో గంగ,గోదావరులకు ఈ లక్షణాలు వున్నాయి. గోదావరి ఏడాదిలో ఆరు నెలలు ముదురు గోధుమరంగులో మూడు నెలలు లేత గోధుమరంగులో మూడునెలలు లేత నీలం, లేత ఆకుపచ్చ రంగులు కలిసిన రంగులో వుంటుంది.

ఇవాళ ఈవినెంగ్ వాక్ సమయానికి వానతుంపరలు మొదలయ్యాయి. కారులో వాకింగ్ చేస్తూ చేస్తూ పుష్కరఘాట్ కి చేరుకునేసరికి నదిమీదుగా వీస్తున్న గాలి-నేలమీద కాళ్ళు వుంచే ఎక్కడికికో తెలిపోతున్న అనుభూతిని ఇచ్చింది అక్కడనిలబడితే చాలు ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అనుభవమౌతుంది. అప్పుడే ఫోన్ చేసిన ఒకఫ్రెండ్ మైల్డ్ గా గాలివీస్తున్న శబ్దం వినబడుతోంది ఎక్కడ అని అడిగారు. గోదావరి ఒడ్డున అని చెప్పగానే ఔనా అదేనా నన్ను తాకుతున్న హాయి అన్నారు. 

గోదావరి పక్కన వుండటమంటే అంత రొమాంటిక్ గా వుండటం! గోదావరి అంటే అంతటి భావుకత!!
ఫ్లడ్ లైట్ల వెలుగులో మెరుస్తున్న గోదావరి, నదికే నీరిచ్చే అడవులనుంచి కొట్జుకు వచ్చే ఖనిజలవణాలన్నీ నిరంతరం మేటలు పడుతూ పొరలుపొరలుగా సాగరంలోకి తరలిపోతూన్న వేళ పారదర్శకమైన నీటినుంచి నదీగర్భం గోధుమ రంగులో కనిపిస్తున్నట్టు అనిపించింది. 

 

కారొ్పరేట్లకే ఆర్జితాలు (శనివారం నవీనమ్) 


విస్తరిస్తున్నకార్పొరేటీకరణ, కుంచించుకుపోతున్న పబ్లిక్ సర్వీసులనుంచి మధ్యతరగతి ప్రజలను దూరం చేసి ఆర్ధిక భారాలను ఎలా మోపుతుందో పబ్లిక్ సర్వీసులను ఎలా నష్టపెడుతుందో అర్ధం చేసుకోడానికి గోదావరి పుష్కరాలు ఒక ఉదాహరణ.

భక్తివిశ్వాసాలతో ప్రజలు గోదావరి స్నానాలకు వెళ్ళినపుడు వారికి సదుపాయాలు కల్పించడం మాత్రమే ఇంతవరకూ ప్రభుత్వాలు చేసిన పని. ఈ సారి 24 గంటల న్యూస్ టివిల వల్ల వచ్చిన ప్రచారం,ప్రభుత్వం ప్రకటించిన సదుపాయాలు, ‘ఉచిత’ ఏర్పాట్లు, పుష్కరాలమీద విశేషమైన ఆసక్తి కుతూహలాలను పెంచేశాయి. వెళ్ళకపోతే ఏదో మిస్సవుతామన్న భావనను వ్యాపింపజేశాయి. ఇలా పెరిగిపోయిన రద్దీ కార్పొరేట్ కంపెనీలకు బ్రహాండంగా సొమ్ము చేసిపెట్టాయి. ముఖ్యమంత్రి పిలుపునకు స్పందించి ప్రజలు యధాశక్తి తాగునీళ్ళు ఆహార వితరణ చేయగా, నెస్లే, పెప్సీ, కోకాకోలా వగైరా సంస్ధలు టన్నుల కొద్దీ వాటర్ బాటిళ్ళను ఇన్ స్టాంట్ కాఫీ,టీ, సాఫ్ట్ డ్రింకులను బ్రహాండంగా అమ్ముకున్నాయి. తమతమ బా్రండులను ఖర్చులేకుండా ప్రచారం చేసుకున్నాయి. 
నిరుపేదల యధాశక్తి వితరణ చూసి సిగ్గుపడో ప్రేరణపొందో ఉచిత లేదా లాభాపేక్షలేని ధరకే సేవలు అందించడానికి కార్పొరేట్ లంటే మనుషులు కావు. అమ్మడానకి, కొనడానికి మనుషుల్ని బానిసలుగా చేసుకున్న పెట్టుబడిదారుల యంత్రబూతాలు. 
రాష్ట్రప్రభుత్వరంగ సంస్ధ అయిన ఆర్టీసీ రాజమండ్రిలో 300 బస్సుల్ని పన్నెండురోజులూ ఉచితంగా నడిపింది.తిరిగు ప్రయాణంలో సీట్లులేక నిలబడి వున్న వారినుంచి చార్జీలు తీసుకోకుండా తీసుకు వెళ్ళింది. పబ్లిక్ సంస్ధ అయిన రైల్వేలు చార్జీలు పెంచకుండా అదనపురైళ్ళునడిపి, సిబ్బందితో ఓవర్ టైమ్ చేయించి యాత్రీకులకు సేవచేసింది. ప్రయివేటు రంగంలో వున్న కంపెనీలు అదనపు విమానాలను హెచ్చుచార్జీలతో నడిపి సొమ్ము చేసుకున్నాయి. 

యాత్రికులనే మార్కెట్ గా చేసుకుని ఔత్సాహికులను ఎక్కించుకుని రాజమండ్రి నెత్తిమీద రౌండ్లు వేసి హెలికాప్టర్ సర్వీసులు సొమ్ము చేసుకున్నాయి. 
సో్తమత వున్నవారు చెల్లింపుల మీద సేవలను కొనుక్కుంటే అభ్యంతరమెందుకు అన్న ప్రశ్న సమజసమే అనిపిస్తుంది. ప్రభుత్వం తటస్ధంగా వుండి, 

సమాన అవకాశం వుండివుంటే ప్రభుత్వ ప్రయివేటు రంగం సంస్ధల మధ్య పోటీ నాణ్యమైన సేవలకు ధరల నియంత్రడకు దారితీసేవి. ప్రయివేటు రంగం మీద నియంత్రణ లేని ప్రభుత్వం , ప్రభుత్వంరంగం సర్వీసులను ఉచితం చేయడం వల్ల ఈ సర్వీసులు అందరికీ సరిపోకపోవడం వల్ల ప్రయివేటు రంగం దోపిడీకి ప్రభుత్వమే తలుపు తీసినట్టయింది. పుష్కరకాలంలో హైదరాబాద్, రాజమండ్రి మధ్య ప్రయివేట్ బస్సులు ఒక పాసింజర్ కు మూడువేల రూపాయల వరకూ కూడా వసూలు చేయడమే ఇందుకు ఉదాహరణ. 
పుష్కరకాలంలో నేషనల్ హైవేలమీద టా్రఫిక్ జామ్ లను నిలువరించడానికి టోల్ ఫీజు వసూలు చేయవద్దని ముఖ్యమంత్రి అడిగారు. ఓగంట పాటు వొదిలారేమో కాని ఆతరువాత ఏటోల్ గేటూ ఫీజు వసూలు ఆపలేదు. ఎందుకంటే ఫీజు వసూలు ఆయా కంపెనీల హక్కు. ఆర్టీసితో ఉచిత సర్వీసులు చేయించడం ప్రభుత్వ అధికారం. ముఖ్యమంత్రి ఆ అధికారాన్ని ఉపయోగించుకున్నారు. ఫలితంగా ఆర్టీసి నష్టపోయింది
ఆమొత్తమెంతో ఆనషా్టన్ని ప్రభుత్వం ఎప్పటికి బర్తీ చేస్తుందో ముఖ్యమంత్రికే తెలియదు.  

Blog at WordPress.com.

Up ↑