రాజమండ్రి విమానాశ్రయానికి ప్రకాశం పంతులుగారి పేరు పెట్టనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాలకుముందు ప్రకటించారు. ఆయన స్ధానికుడు కానందున విమానాశ్రయానికి మరో పేరు ఆలోచిస్తున్నామని పుష్కరాలతరువాత రాజమండ్రి ఎంపి మాగంటి మురళీమోహన్ చెప్పారు. చరిత్రజ్ఞానం లేకపోవడం నేరం కాదు. కానీ, చరిత్రను ధ్వంసం చేసే ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం మన దౌర్భాగ్యం. 

అయ్యా మురళీ మోహన్ గారూ! మీరూ ఎక్కడినుంచో దిగబడినవారే! దయచేసి రాజీనామా చేసి స్ధానికుల్నే ఎన్నుకునే అవకాశం మాకు ఇవ్వండి అని నిలదీస్తే ఆయన తల ఎక్కడ పెట్టుకుంటారు? 
ఒంగోలుదగ్గర వినోద రాయునిపాలెంలో పుట్టి, దరిద్రంలో పెరిగి, ప్లీడరుగా రాజమండ్రిలో జీవితం ప్రారంభించి, మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై ,బారిస్టరుగా ఎదిగి, మద్రాసుకి మకాం మార్చి, ఎడాపెడా సంసాదిస్తూ బ్రిటీష్ కమీషన్ అధ్యక్షుడుగా వచ్చిన సైమన్ వెనక్కి పొమ్మన్న స్వాతంత్రోద్యమంలో తుపాకీతో వస్తున్న పోలీసులకు దమ్ముంటే కాల్చు అని గుండె చూపి, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవిన్యూ మంత్రి అయ్యి, ప్రజల కు చేరువగా పాలనను చేర్చడానికి తాలూకాల నుంచి ఫిర్కాలను విభజించి, విజయవాడవద్ద కృష్ణా నదిపై బేరేజీని పునర్నిర్మించి, రాష్ట్రం విడిపోయాక కర్నూలునుంచే పదమూడునెలలు టెంటుల్లో పాలన సాగించి, వాల్తేరులో అసెంబ్లీని నిర్వహించి, ఆంధ్రరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా పునర్నిర్మిత మయ్యేవరకూ 85 ఏళ్ళు (23 -8-1872 – 20 -5-1957)జీవించి సొంతఇల్లుకూడా లేని ముఖ్యమంత్రిగా పేదరికంలో హైదరాబాద్ లో పేదరికంతో మరణించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 143 వజయంతి ఈరోజే. 
పాలనలో తెలివినికాక హృదయాన్ని చూపిన తెలుగు నాయకులు టంగుటూరి ప్రకాశం పంతులుగారు, నందమూరి తారక రామారావుగారు తప్ప మరెవరూలేరు. సమస్యలపై ఆ ఇద్దరూ ఓట్ల లెక్కల్ని కాక సమస్యల పరిష్కారానికి తోచిన పరిష్కారాలను, హృదయపూర్వకమైన ఉద్వేగాలతోనే నిర్ణయాలు తీసుకున్నారు.

ఇద్దరూ ఎవరు ఏమనుకున్నా తాము నమ్మినదే త్రికరణశుద్దిగా ఆచరించిన ధీరులు.

ఇద్దరూ ఎత్తుపల్లాలు చూసినవారే…అవసానకాలంలో ఒకరిని పేదరికం, మరోకరిని పట్టించుకునే వారు లేని ఒంటరితనం వేటాడింది. మరుగుజ్జు నాయకులకు తెలియకపోయినా ఉత్తేజభరితాలైన వారి జ్ఞాపకాలు ప్రజల హృదయాల్లో పరంపరగా విస్తరిస్తూనే వుంటాయి.