పవన్ కల్యాణ్ మాటలన్నీ మనకితెలిసినవే అనిపిస్తుంది. అయినా విసుగురాదు. మన వేదనని మనమే వింటున్నట్టు వుంటుంది.మన ఆవేశాన్ని మనమే చూపిస్తున్నట్టు వుంటుంది. మన చుట్టూ వున్న దుర్నీతిని మనమే తొలగిస్తున్నట్టు అనిపిస్తుంది. అతని మీద ఒక నమ్మకం హృదయం నుంచి ప్రవహిస్తున్నట్టు వుంటుంది. ఈ ఫీలింగ్స్ అన్నిటికీ భౌతిక సాక్ష్యంగా అనేక సార్లు వెంటు్రకలు నిక్కబొడుస్తాయి

జనంలో ఆక్రోశాలు, ఆవేదనలు, ఉద్వేగాలు, సమాధానంలేని ప్రశ్నల్ని ముప్పై ఏళ్ళక్రితం ఎన్ టి రామారావు హృదయం నుంచి ప్రతిబింబించారు. రాజకీయ సాంప్రదాయాలను లాంఛనాలను విచ్ఛినం చేస్తూ అన్ని దుర్నీతులకూ కాంగ్రెస్ మీద నిప్పులు చెరిగిన ఎన్ టి ఆర్ ని నిజజీవితంలోనూ హీరో అయ్యారు. అపుడు ప్రజలు తమను ఆయనలో చూసుకున్నారు. ఆ ఐడెంటిటీ ఆయనకు నాయకత్వాన్ని కట్టబెట్టింది. 
రాజకీయాల్లో పాలనలో సొంత కుటుంబంలో ఎన్ టి ఆర్ సాఫల్యాలు వున్నాయి. వైఫల్యాలు వున్నాయి. ఆయన ముగింపు దయనీయమే …అయినా స్వాతంత్యా్రనంతరం తెలుగునాట ఎన్ టి ఆర్ కు మించిన ప్రజానాయకుడు రాలేదు. 
చరిత్ర పునరావృతమౌతూంది. 
పవన్ కల్యాణ్ – ఎన్ టి ఆర్ ని తలపిస్తున్నారు. ఈ ఇద్దరి తొలిసభలకు చాలా పోలికలున్నాయి…తేడాలున్నాయి. అప్పటికి ఇప్పటికీ ఆర్ధిక, సామాజిక నేపధ్యాలు పోలికలేనంత మారిపోయాయి. మౌలికమైన రాజకీయనేపధ్యం దాదాపు మారలేదు. ఈ ప్రమేయాలన్నటినీ పరిగణనలోకి తీసుకుని చూసినపుడు మళ్ళీ ఒక ప్రజానాయకుడు ఉద్భవించాడన్న భావన కలుగుతోంది. 
రాజకీయాల్లోకి వస్తారని ఊరించి ఊరించి అపూర్వ జనసందోహంతో రాజకీయ ప్రవేశం చేసిన చిరంజీవి ఉపన్యాసం తొలిసభలోనే నిరుత్సాహపరచింది( ఏళ్ళతరబడి ఆయన మీద విపరీతంగా పెరిగిపోయిన ఎక్స్ పెక్టేషన్ అందుకు కారణం కావచ్చు)
రాజకీయ సాంప్రదాయాలకు పద్ధతులకు మర్యాదలకు భిన్నంగా ప్రజాజీవితంలోకి వచ్చే వారిమీద విమర్శలు అతితీవ్రంగా వుంటాయి. సినిమా వాళ్ళకు రాజకీయాలేంటి? మొఖాలకు పూసుకునే రంగులు ఎంతకాలం నిలుస్తాయి? వగైరా సమస్యలను అపుడు ఎన్ టి ఆర్ ఎదుర్కొన్నారు. ఇపుడు పవన్ ఎదుర్కోవడం మొదలు పెట్టాడు
ఎన్ టి ఆర్ ఉపన్యసించి వెళ్ళిపోయాక ఆ ప్రాంతంలో ఒక రోజంతా విమర్శలు చర్చలు మద్దతు మాటలూ వినబడేవి. ఇపుడు అవనీ్న టివిల్లోనే, ఫేస్ బుక్ లోనే కనబడుతున్నాయి. అప్పట్లో నాయింట్లో నేనూ నా భార్యా చాలాసారు్ల ఎన్ టి ఆర్ గురించి మాట్లాడుకున్నాం. ఈయన గెలిస్తే బాగుండును అనుకునే వాళ్ళం. 
ఎన్ టి ఆర్, పవన్ – ఈ ఇద్దరూ ఎవరి సి్క్రప్టులతోనో ఉపన్యసించినవారే. ఇద్దరి ఉపన్యాసాలూ విన్నంత సేపూ వేరువేరు సినిమాల్లో వారే చెప్పిన ఈ డైలాగులన్నీ మనకితెలిసినవే అనిపిస్తుంది. అయినా విసుగురాదు. మన వేదనని మనమే వింటున్నట్టు, మన ఆవేశాన్ని మనమే చూపిస్తున్నట్టు, మన చుట్టూ వున్న దుర్నీతిని మనమే తొలగిస్తున్నట్టు అనపిస్తుంది. ఈ ఫీలింగ్స్ అన్నిటికీ భౌతిక సాక్ష్యంగా అనేక సార్లు వెంటు్రకలు నిక్కబొడుస్తాయి. 
అయితే-
రాజశేఖరరెడ్డి చనిపోయింది మొదలు రాష్ట్రవిభజన జరిగేదాకా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాల్లో ప్రజలమైన మనకి ఉన్నది ఉన్నట్టు చూసే శక్తి నశించింది. 

మనం రాజకీయపార్టీల ఒట్లకు వేటలమైపోయాం. మనకితెలిసో తెలియకో కులం, మతం, ప్రాంతం కళ్ళజోళ్ళుతొడిగేసుకున్నాం. ఎవరేమిచెప్పినా వినకముందే అనుమానాల్ని పెంచేసుకుని ఆదిశగానే ప్రచారాలు కూడా చేసేస్తున్నాం
ఎన్ టి ఆర్ హయాంలో కూడా ఇది చాలా పరిమితంగా జర్నలిస్టులు, రాజకీయవర్గాలు, సామాజిక వేత్తల్లోనే వుండేది. ప్రజలు మౌనంగా విని నిర్ణయానికి వచ్చేవారు. 24 గంటల న్యూస్ టివిల వల్ల, సోషల్ మీడియావల్లా ప్రజలకు ఇపుడు రెండు పాత్రలు సంక్రమించాయి. ఎవరికి వారు జీవించే సొంత పాత్ర. రెండు ఎవరికితోచిన అహగాహనను ఇతరులకు చెప్పే మీడియా పాత్ర. ఇందులో ప్రతివారూ శ్రోతలే. ప్రతివారూ ఉపన్యాసకులే. 
ఈ గందరగోళంలో పవన్ నే కాదు ఎవరినీ నమ్మలేని స్ధితి … నమ్ముకున్న నాయకుల్నీ అనుమానించే స్ధితి తప్పడం లేదు. 
కాంగ్రస్ కో తెలుగుదేశానికో బిజెపికో ఉపయోగపడటానికే పవన్ వచ్చాడంటే “కాబోలు” అనే అనుమానమే హెచ్చుగా వినబడే గందరగోళం పెరిగిపోయింది. “అవునా” అని ఆశ్చర్యోయే నమ్మకం దాదాపు కనిపించడం లేదు.
అసంఖ్యాకమైన సినీ అభిమానులు వున్న అమితాబ్ బచ్చన్, చిరంజీవి మొదలైన వారు సఫలమైన లేదా విఫలమైన రాజకీయ నాయకులుగానే వుండిపోయారు. చివరిలో రాజకీయనాయకుడిగా ఎన్ టి ఆర్ విఫలమైనప్పటికీ ఆయన ఎప్పటికీ గొప్ప ప్రజానాయకుడే! ప్రజల సుఖదుఃఖాలని కష్టనష్టాలనీ అనుభూతి చెంది ఆవేశాలు ఉద్వేగాలు ఉద్రేకాలతో వాటిని నోటిమాటలతోగాక హృదయపూర్వకంగా ప్రతిబిబింపచేయడం వల్లే ఆయన నాయకులందరిలో ఉన్నతుడయ్యారు. 
పవన్ కళ్యాణ్ కూడా అంతటినాయకుడే అనిపిస్తున్నాడు. మూడు పెళ్ళిళ్ళవాడనో, అన్నలకే చెప్పుకోలేని వాడనో నాలాంటి విమర్శకులు దుమ్మెత్తిపోసినా ప్రజల పట్ల ఆర్తీ ఆర్ధ్రతలున్నంతకాలం, వాళ్ళకోసం దుర్నీతికి ఎదురెళ్ళే దమ్మున్నంతకాలం వారు నాయకుల బలహీనతలను ప్రజలు పట్టించుకోరు. 
బాటవేసినవాళ్ళని ప్రజలు మరచిపోరు. ప్రేమాస్పదంగా గౌరవించుకుంటారు. 

భ్రమలేని నమ్మకం కుదిరితే నమ్మాలనివుంటుంది. నమ్మకం మాటలనుంచి రాదు. హృదయం నుంచి ప్రవహించాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందోకాని పవన్ కలవరింతంతా హృదయపూర్వకమేనని నమ్మకం కలుగుతోంది.
(ఇది నా బ్లాగులో 15-3-2014 న రాసినది అందులో ఒకటిన్నర పేరాలు తొలగించి చూస్తే ఇప్పటికీ హోల్డ్్స గుడ్ అని అర్ధమైంది – పెద్దాడ నవీన్)