శీతోష్ణాల సమస్ధితి వల్ల శరీరానికి అలసటలేదు. పెద్దగా మెడికేషన్ లేకపోయినా వారంలోనే వైరల్ ఫీవర్ తగ్గడానికి క్లయిమేటే కారణం అనిపిస్తోంది. ఏమైతేనేమి హైదరాబాద్ లో వారంరోజులు వృధాపోయాయి. అసలే చెమట పట్టని హైదరాబాద్…ఆపై వేడితక్కువ వెన్నెల ఎక్కువ అయిన శరదృతువు. ఆకులు రాలేదీ, రంగురంగుల డిజైన్ల శీతాకోక చిలుకలు గుంపులు గుంపులు గా సంచరించే కాలం వచ్చేసింది.
రాజమండ్రిలో మాదిరిగానే నిజాంపేటలో కూడా నా ఇంటికి 350 మీటర్ల దూరంలోనే పార్కు వుంది. అది పచ్చటి రౌండ్ పార్క్. ఇది రాతిమీదఎర్రమట్టి, ఇసుక పరచిన స్వేర్ పార్కు. ఇక్కడ వడలిపోయినట్టు వున్న పెద్దమొక్కల ఆకుల తొడిమలు నిస్సత్తువకు వచ్చేశాయి. రేపో మాపో ఆకులు రాలడం మొదలయ్యేలా వుంది.
పచ్చదనపు మృధుత్వాన్ని చూస్తూ తాకలేకపోతున్నా వెన్నెల కాలంలో నిలబడటమో నడూస్తూ వుండిపోవడమో అద్భుతమైన అనుభవం. ఈసారి ఆ అనుభవాలు హైదరాబాద్ లో దొరుకుతాయోలేదో చూడాలి మరి. కూడాపడే ఆకతాయి కుక్కలను అదలించడానికి చిన్న కర్ర, చలిగా మారుతున్న చల్లదనం నుంచి ఊపిరితిత్తులను వెచ్చగా వుంచడానికి ఒక ఫెల్టు క్యాప్, వాకింగ్ షూలను సిద్ధం చేసుకోవాలి. ఇదేమీ సమస్య కాదుకాని జ్వరపడ్డాక కూడా బుద్దిరాదా? పైగా ఈ పిచ్చి వేషం పేరు ”వెన్నెల వాకింగా” అని నిలదీసే గృహిణికి చెప్పవలసిన సమాధానం వెతకడమే కష్టం అనిపిస్తోంది.