ఈ సామెత గుర్తురాక కోసం ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేశాను. ఈ ఉదయం లేచి పేపర్ చదువుతూండగా పెద్దశబ్దంతో వాన. ఇక ఇవాళ పనులన్ని ఆగిపోయినట్టే అని డిసైడైపోయి, వానచూస్తూ కుర్చోవచ్చని సెటిలైపోయాను. ఈ కాసిని అక్షరాలు టైప్ చేసినంత సేపుకూడా వానలేదు. ఆకస్మికంగా ఆగిపోవడం, చిటపడలాడించే ఎండరావడం ఒకేసారి జరిగాయి.

కేలెండర్ చూద్దునా! పుష్యమి కార్తెకు రెండురోజులు ముందు పునర్వసు కార్తె చివరన ఉన్నామని అర్ధమైంది. ఈ కార్తలో వర్షాలు ఇంతే! ఇప్పటికే పడిన వర్షాలకు ఇంకిపోయిన నేల మీద (పేరుగుమీద మీగడ లాంటి) మెత్తటి పొరను కన్సాలిడేట్ చేయడమే – దీన్నే ‘ఇవక’ వేయడం అంటారు. ఇదే ఈ కార్తెలో ఎపుడైనా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చే వానల ప్రయోజనం!

అర్ధం కాలేదా? నా క్లాస్ చదవడానికి రెడీ అయిపోండి 😀😀…ఈ కార్తెలు వ్యవసాయ పంచాంగానికి మూలాధారాలు…గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధకు కేలెండర్లు.

మనకి 27 నక్షత్రాలు వున్నాయి కదా! ఒకో నక్షత్రమూ ఒకో కార్తె! ఒకో కార్తె కు 13/14 రోజులు వుంటాయి. తెలుగు సంవత్సరాదినుంచి అప్పటి వరకూ ఎన్నిరోజులో ఆసంఖ్యను 14 తో భాగిస్తే వచ్చే నంబరు ఏనక్షత్రానిదో చూస్తే అపుడు ఆకార్తెలో వున్నట్టు అన్నమాట! అర్ధం కాలేదా? వొదిలెయ్యండి పెద్ద ప్రమాదమేదీ లేదు.

పర్యావరణం దెబ్బతిని రుతువులు గతులు తప్పడం వల్ల ఏ కార్తెలో జరగవలసినవి ఆకార్తెలో జరగడం లేదు. వ్యవసాయమే మారిపోయింది. రైతులే కార్తెల్ని మరచిపోయారు.

అయితే, ఆయా కార్తెల్లో వాతావరణం ప్రజల మీద ఎలాంటి ప్రభావం కలుగజేస్తూందో సామెతలుగా మిగిలిపోయాయి…అవికూడా వెతికితే తప్ప కనబడని జ్ఞాపకాల మూటలైపోయాయి.

సాయంత్రం పుణ్యక్షేత్రం అనే ఊరివద్ద ఒక స్నేహితుని పొలం లోకి వెళ్ళాను . షూ కారులోనే వదిలేసి కాసేపు నడిచేసరికి అంగుళం మందాన డార్క్ గ్రే కలర్ షూ వేసుకున్నట్టు కాళ్ళు మట్టిని తొడుక్కున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన వానలకు నేల కడుపు నిండింది. తరువాత పడే వానలు లోనికి దిగకుండా, ఎండలకు లోపలి నీరు ఆవిరైపోకుండా పుష్యమి వానలకు నేలమీద పేరుకునే ఇవక పొర ఫిల్టర్ గా అడ్డుపడుతుందన్నమాట! –అయిపోయింది😀

#GodavariPost