చందమామ చెక్కిలి మీటితే తడితగిలిన మాట గుర్తుకొస్తే, ఆనిర్ధారణ చేసిన యూరీ గెగారిన్ – మనసులో ఒక ఉద్వేగమైపోతాడు. భూమాత చుట్టూ తిరుగుతున్న చందమామ ఏకాంతం నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ పాదముద్రతో ముగిసిపోయిందన్న జ్ఞాపకం 50 ఏళ్ళతరువాత కూడా ఉత్తేజభరితమే!

ఒకదానిని మించిన మరొక స్వదేశీ రాకెట్‌ తయారుచేస్తూ, చంద్రయానాలను, మంగళయానాలను ఘనంగా నిర్వహించిన ఇస్రో చరిత్ర జనం ఎమోషన్లలో కదలాడుతూ వుంటుంది.

రాకేష్‌ శర్మ సోవియట్‌ నౌకలో విహారం చేస్తూ ‘సారే జహాసె అచ్ఛా’ అన్నందుకే మురిసిపోయిన భారతదేశం, 39 ఏళ్ళ తరువాత కూడా ఇపుడు పులకరించి పోతున్నట్టు వుంది.

మరో 3 ఏళ్లకు మన స్వదేశీ నౌక ముగ్గురు భారతీయులతో అంతరిక్ష యానం జరిపబోతున్నందుకు ఇపుడే గర్వంతో ఒళ్ళు జలదరిస్తున్నట్టుంది.

భారత్ మొదటి చంద్రయానానికీ, (ఆరాత్ర) 15-7-2019 తొలిఘడియల్లో ప్రయాణమయ్యే చంద్రయాన్ 2 కీ ప్రయోగం స్థాయిలోనూ, పరిశోధన రీతిలోనూ చాలా పెద్దతేడా ఉన్నది.

ఈ సారి భారత్‌ అక్కడ ల్యాండర్‌, రోవర్లను దింపబోతున్నది. సాంకేతికంగా మనకంటే ఎంతో ముందున్న ఇజ్రాయెల్‌ విఫలమైన చోట, గెలవాలని భారత్‌ సంకల్పించింది. ఈ ప్రయోగం సంక్లిష్టతను బట్టి , ‘ఇస్రో’ శివన్‌ దీనిని ఓ భయానక ప్రక్రియగా అన్నారు.

జులై 15న జీఎస్‌ఎల్‌వి–మార్క్‌ 3 రాకెట్‌ శ్రీహరి కోటనుంచి బయలుదేరి చంద్రునివద్దకు ప్రయాణం మొదలెడితే, సెప్టెంబరు ఆరు లేదా ఏడోతేదీన ల్యాండర్‌ అక్కడ వాలబోతున్నది.

ఇప్పటివరకూ ఎవరూ కన్నెత్తిచూడని, ఏ ప్రయోగమూ స్పృశించని చంద్రుని దక్షిణ ధృవం సమీపాన దిగబోతున్నాం. కాస్త ఎక్కువ మంచుతో ఖనిజాలతో నిండిన ఈ ప్రాంతం కొత్త అన్వేషణలకు వీలుకల్పిస్తుంది. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించగానే ఆర్బిటార్‌నుంచి వేరుపడిన ల్యాండర్‌ నెమ్మదిగా అక్కడి నేలను తాకి, అందులోనుంచి ఐదువందల మీటర్ల వరకూ కదలగలిగే రోవర్‌ బయటకు వస్తుంది.

ఆర్బిటార్‌ సంవత్సర కాలం పనిచేస్తుంది కానీ, సూర్యుని అత్యధిక రేడియేషన్‌ కారణంగా ల్యాండర్‌, రోవర్ల జీవితకాలం మాత్రం పద్నాలుగు రోజులే. ఈ మూడూ స్వతంత్రంగానూ, సమన్వయంతోనూ పనిచేస్తూ, చంద్రుని ఉపరితలంలోని నీటినీ, ప్రకంపనలను పసిగడతాయి. తవ్వకాలు జరిపి ఖనిజాలు, హీలియం జాడల వివరాలు అనేకం శోధిస్తాయి.

3.85 లక్షల కిలోమీటర్ల ప్రయాణంలో జీఎస్‌ఎల్‌వి పలుమార్లు తన దిశను మార్చుకోవడానికి విభిన్న కోణాల్లో పేలుతూ కాలుతూ సాగే విన్యాసాన్ని అటుంచితే, ఆర్బిటార్‌ నుంచి వేరుపడిన ల్యాండర్‌ చంద్రుని నేలమీదకు అతినెమ్మదిగా జారిపడే ఆ 17 నిముషాల కాలం ఈ మొత్తం ప్రయోగంలో అతి కీలకమైన, ప్రమాదకరమైన దశ.

2008లో యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, నాసా సహకారంతో జరిగిన తొలి చంద్రయానంలో నీటి జాడలు కనిపెట్టిన మనం, ఇప్పుడు ఓ కొత్త ప్రాంతంలో కాలూని ఎన్ని రహస్యాలు ఛేదిస్తామో చూడాలి.

పదివేలకోట్ల విలువైన ఈ ప్రాజెక్టు అవసరాల్లో 60శాతం ప్రైవేటు రంగం నుంచే తీరబోతున్నందున కొత్త ఉపాధులకు ఊతం వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రాజెక్టులో భాగస్వామి కాకుండా, రోదసిలో మనకంటూ ఓ అంతరిక్ష కేంద్రాన్ని కట్టుకోబోతున్నట్టు ఇస్రో ఇప్పుడు బహిరంగంగా చెప్పి ఉండవచ్చును కానీ, ఇందుకు సంబంధించిన కృషి మూడేళ్ళుగా సాగుతున్నది.

చిన్నదో, పెద్దదో మనకంటూ ఓ కేంద్రాన్ని నిర్మించుకోవడం మానవయానానికీ, విహారాలకు సిద్ధపడుతున్న భారతదేశానికి అవసరం. వ్యోమగాముల తరలింపు, మార్పిడి వంటి ప్రక్రియలు దీనివల్ల సులభమవుతాయి.

మనకు నచ్చిన, అవసరాలకు తగిన మరిన్ని ప్రయోగాలు యథేచ్ఛగా చేసుకోవచ్చు. రోదసి కార్యక్రమానికి సంబంధించి ఒక విస్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగిపోతున్న ఇస్రో శాస్తవేత్తలూ, అధికారులూ, సమస్త సిబ్బందీ జిందాబాద్! జిందాబాద్! జిందాబాద్!