రాష్ట్ర ప్రభుత్వం “ప్రజావేదిక”ను కూల్చివేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వుంటున్న అక్రమ నిర్మాణ నివాసాన్ని కూల్చివేయడాన్ని కూడా తప్పుపట్టవలసిన పని లేదు…
అయితే, రాష్ట్రవ్యాప్తంగా కరకట్టలను ఆక్రమించుకుని నివశిస్తున్న లక్షకు పైగా ఇళ్ళ మాటేమిటి? పోనీ విజయవాడలోనే కరకట్ట మీద వుంటున్న పదిహేను వేల నివాసాల మాటేమిటి? వాటిలో నివశిస్తున్న పేద కుటుంబాలకు పునరావాసం ఎలా అన్న ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం లేదు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబుకు పర్యావరణ విషయాలమీద ఆసక్తి లేకపోవడం, నిర్లక్ష్యంగా చట్టాన్ని ధిక్కరించడం నైతికంగా కూడా శిక్షార్హ మైన నేరమే! ఆయన ఈ వైఖరితో చేపట్టిన నిర్వాకాల వల్లే గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్రప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది.
మళ్ళీ చెబుతున్నాను అక్రమాల కూల్చివేతలను ఎవరూ తప్పుపట్టరు. తప్పుపట్టకూడదు. అయితే నిర్ణయాల ద్వారా ప్రజల జీవితాలకు కూడా బాధ్యత వహించవలసిన ప్రభుత్వం – ఇందుకు పర్యవసానాలను కూడా ఆలోచించాలి. లోతుపాతులను అధ్యయనం చెయ్యాలి. ప్రజావేదిక నిర్మాణం కూల్చివేతకు ముందు ముఖ్యమంత్రి జగన్ కలెక్టర్ల సమావేశంలో “ఇదోక అక్రమ కట్టడం, ఈ సమావేశం ముగియగానే దీనిని కూల్చివేత చేయాలి. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కట్టిన అక్రమ కట్టడాలు కూల్చివేత, ప్రభుత్వ భవనంతో మొదలు పెట్టి, తరువాత మిగిలిన కట్టడాలు జోలికి వెళ్ళతాము” అన్నారు.
అంటే గుంటూరు జిల్లా రాజథాని ప్రాంతాల పరిథిలో ఉన్న పలు ప్రైవేటు వ్యక్తులు మరియు సంస్థలు ఏర్పాటు చేసిన కట్టడాలు కూడా ఇదే రీతిన జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పకనే చెబుతున్నారు. పనిలో పనిగా అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా కూల్చివేయాలి అన్నారు. నిజంగా ఇది చాలా మంచి నిర్ణయం.
కృష్ణా జిల్లా వైపున ఉన్న కృష్ణలంక ఏరియాలో ఇక్కడ అర్టీసీ బస్టాండ్ దగ్గర మొదలు పెడితే, బెంజ్ సర్కిల్ కి దగ్గరగా ఉన్న రామలింగేశ్వర నగర్ ప్రాంతం వరకు పలు ప్రైవేటు కట్టడాలు చిన్న చిన్న వ్యక్తులు, పేదవారు, సామాన్యులు ఇళ్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అవి అన్నీ కరకట్ట లోపలి వైపున ఉన్నాయి.
విజయవాడ నుంచి వస్తూంటే ఉయ్యూరు వరకు, కాలువ గట్ల మీద పలు అక్రమణ చేసుకున్న కట్టడాలు, గృహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలు మరియు ఆక్రమించి కట్టిన కట్టడాలు.
మరి వీటన్నిట్నీ కూడా కూల్చేస్తారా? గురవుతాయా? చంద్రబాబు గారు తుండుదులుపుకుని వెళ్ళిపోతారు…ఆయనకు అద్దెకిచ్చిన లింగమనేని వాళ్ళు రోడ్డున పడే పరిస్ధితిలేదు. మిగిలిన వేల కుటుంబాల పరిస్ధితి ఏమిటి? వారికి ని అలాగే వుంచేలా చట్టాన్ని సవరించడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల అవుతుందా? ఆఘమేగాలమీద అన్నీ కూల్చేయడం సాధ్యమేనా? కరకట్టల ఆక్రమణ పునరావాసం కల్పించి దశలవారీగా కూల్చివేతలే ఈ సమస్యకు పరిష్కారం!
కనీస స్థాయిలో రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, త్రాగు, సాగు నీటి ప్రాజెక్టులు నిర్మాణం, సమతుల్యతతో కూడిన ప్రాంతాల అభివృద్ధికి ఉతం ఇవ్వటం, రైతులకు సరైన సమయంలో విత్తనం, ఎరువులు మరియు గిడ్డంగి, మార్కెటింగ్ సౌకర్యాలుమొదలైనవి మొదలైన ప్రాధాన్యతల కంటే కరకట్టల్లో ఆక్రమణల కూల్చివేత ఏ విధంగా రాష్ట్రానికి ప్రాధాన్యత అవుతుందో జగన్ గారికే తెలియాలి.
ప్రాధాన్యతలను మీరూ నేనూ కాక ప్రభుత్వమే నిర్ణయించాలి. ఆ అధికారాలను ఎవరూ తోసిపుచ్చలేరు. అయితే, ప్రభుత్వం నుంచి జవాబుదారీ తనాన్ని ఆశించే హక్కు మనందరికీ వుంది.
ఇదంతా జగన్ ప్రభుత్వానికి తెలియదు అనుకోలేము..తెలిసి కూడా చేస్తున్నారంటే ఇది – ప్రజలదృష్టిని మళ్ళించే కాలక్షేపం చర్యలు అనుకోవాలి లేదా చంద్రబాబుపై కక్ష సాధింపు అనుకోవాలి.
పరిహారం, పునరావాస కార్యక్రమాల పై ఏ అధ్యయనాలూ లేకుండా “కూల్చివేత” సాగించడం లో చట్టం వుంది…సంచలనం వుంది..కరకట్టలమీదున్న వారిని అనిశ్చితి లోకి నెట్టి భయపెట్టడం విందు…ప్రతీకారం కూడా వుంది. విస్తృత ప్రజాప్రయోజనాలు మాత్రం లేవు.
ఇలాంటి టైమ్ పాస్ చేష్టలు వలన రాష్ట్ర ఖ్యాతి కూడా దెబ్బతిని, పెట్టుబడి అవకాశాలు దెబ్బతింటాయి. ఇప్పటికే విలువైన 5 సంవత్సరాల కాలం నష్టపోయాము. ఇలాగే ఉంటే, మరోక 5 సంవత్సరాల విలువైన కాలం వృథా చేయడం అవుతుంది.
జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాధాన్యతలు ఏమిటో ఖరారు చేసుకోవడం ఆప్రకారం కార్యక్రమాలను రూపొందించుకోవడం అవసరం