రాజహంసలు, గూడబాతులు, మంచు కొంగలు…పేరు ఏదైనా కాని సైబీరియా నుంచి వచ్చే పక్షులకు పుట్టింటి వారి వలె పురుడుపోసి తల్లీబడ్డల్ని అల్లుడినీ భద్రంగా సాగనంపే “పుణ్యక్షేత్రం” 5-8-2018 ఆదివారం నాడు మరోసారి దర్శనమైంది.
ఆహారమైన క్రిమి కీటకాలవేటలో రాత్రంతా షికార్లు చేసి పగటిపూట తల్లకిందులుగా వేలాడుతూ నిద్రపోయే గబ్బిలాలకు గూడై నిల్చిన “రాధేయపాలెం” చెట్టుని ఆవెంటనే దర్శించుకున్నాము. 
ఇదంతా రాజమండ్రికి 20 కిలోమీటర్లలోపు దూరంలోనే! గ్రేకలర్ ముక్కు, మచ్చలు వున్న తెల్లకొంగలు జంటలు జంటలుగా జూన్ జులై ఆగస్టునెలల్లో సైబీరియా నుంచివస్తాయి. పుల్లా, పుడకా ముక్కున కరచి, పదిలపరచుకుని, సురక్షితమైన స్ధావరాల్లో గూడుకట్టుకుంటాయి. గుడ్డుపెట్టిన కొంగ దాన్ని పొదిగి పిల్లను చేసే వరకూ మగకొంగ మేతను ఏరుకు వస్తుంది. పిల్లకు రెక్కలు బలపడి ఎగరడం నేర్చుకునే వరకూ తండ్రి కొంగ గూడులోనే వుండి పిల్లను కాపాడుకుంటుంది. తల్లికొంగ మేతను ఏరుకొచ్చి తండ్రీబిడ్డల కడుపునింపుతుంది. రెక్కలొచ్చిన బిడ్డలు, తల్లిదండ్రులూ డిసెంబర్ జనవరి నెలలలో వెళ్ళిపోతాయి.
కుటుంబ బాధ్యతల్లో పనివిభజనకు ఇంతకంటే మరొక రోల్ మోడల్ వుండదు.
చిన్నపాటి అలికిడికే బెదరిపోయే మూగజీవులు పుణ్యక్షేత్రం గ్రామం చెరువు చుట్టూ గట్టంతావున్న చెట్లనిండా సైబీరియానుంచి వచ్చే పక్షుల గూళ్ళు కట్టుకుంటున్నాయంటే ఈ ఊరి జనం మీద ఆ పక్షుల నమ్మకానికి భరోసాకి ఆశ్చర్యమనిపిస్తుంది. పక్షులను వేటాడే వారిని ఊరినుంచి పంపివేయడం పుణ్యక్షేత్రంలో తరతరాల సాంప్రదాయం. గుడ్లు పొదగడానికి సరైన శీతోష్ణాలు, పౌష్టికాహారాలు లభించడంతో పాటు వాటిని కాపాడుకునే ఊరి కట్టుబాటూ, పుణ్యక్షేత్రాన్ని సైబీరియా కొంగలకు పుట్టిల్లుగా మార్చేసింది.
ఇదంతా పత్రికలలో, టివిలలో చాలాసార్లు వచ్చింది. నేనుకూడా స్యూస్ ఫీచర్ గా ఈనాడులో, ఈటివిలో, జెమినిటివిలో ప్రెజెంట్ చేశాను. మోతుబరి బొప్పన బ్రహ్మాజీరావుగారు, డాక్టర్ గన్నిభాస్కరరావుగారితో కలిసి లోకసంచారం చేస్తున్నపుడు, ఆ గ్రామంలో డాక్టర్ గారికి ఇదంతా వివరించాను. ఆయన స్వయంగా ఫొటోలు తీశారు.
బ్రహ్మాజీ గారు గబ్బిలాల చెట్టుగురించి గురించి చెప్పగా చక్రద్వారబంధం రోడ్డులో వున్న రాధేయపాలెం దారిపట్టాము. ఊరికి ముందుగానే వున్న చెట్టుకి నల్లతోరణాలు వెలాడుతున్నట్టు నిద్రపోతున్న గబ్బిలాలు కనిపించాయి.
ఈ రెండు సన్నివేశాలలో పుణ్యక్షేత్రం, రాధేయపాలెం గ్రామాల వారి భూతదయ, జీవకారుణ్యం కనిపిస్తున్నాయి.
ఈ సంచారంలో – లోకమే శబ్ధసంగీతాల మయం అని నాకు అర్ధమైంది. దోమలు, తేనెటీగలు, వడ్రంగిపిట్టలు, చిలుకలు, పావురాలు, కాకులు, పక్షులు…నడిచే – పాకే – ఎగిరే క్రిమికీటకాలు, జీవుల పాటల్ని వినగలిగితే మన చెవులు, శరీరం, మనసూ ఆలకించగలదని అనుభవమైనట్టు కొన్ని క్షణాలు అనిపించింది.
కీటకాల, పక్షుల, పిట్టల ప్రతీ కదలిక, ఆట, వేట, ఒరిపిడి, రోదన, సంతోషం, ఆనందాల్లో ఒక లయవుంటుందని, ఆ లయ నుంచే సంగీతం పుట్టుకొచ్చిందని అర్ధమైంది.
జనంరొదలేని ప్రశాంతతలోనే లయ వినపడుతుంది. అది అబలలైన మూగజీవాలక ఆ లయే భరోసా ఇస్తుంది. ప్రకృతి తన సృష్టి ని తాను కాపాడుకోవడం ఇదే! రాధేయపాలెం, పుణ్యక్షేత్రాల మహిమ ఇదే!!
– పెద్దాడ నవీన్