కేన్సర్ అంటే ఏంటి?
అపారమూ, అసంఖ్యాకమైన కణాల సముదాయమే మానవ దేహం.
శరీరం లోపలి భాగాల పెరుగుదల, వాటి పని సామర్ధ్యం కణాల చైతన్యం మీదే ఆధారపడి వుంటుంది.
నిరంతర చైతన్య ప్రక్రియలో వున్న కణాలు నశిస్తాయి. కొత్త కణాలు పుడుతూ వుంటాయి
కొన్ని ప్రత్యేక పరిస్ధితుల వల్ల, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల, అవసరానికి మించిన కణాలు పుట్టవచ్చు. అవి పూర్తిగా ఎదగకుండా మిగిలిపోయినపుడు “కంతి” గా స్థిరపడతాయి. వీటిని ట్యూమర్లు అంటాము.
స్వభావాన్ని బట్టి వీటిని బినైన్ ట్యూమర్ అనీ, మెలిగ్నంట్ ట్యూమర్ అనీ పిలుస్తారు.
మెలిగ్నంట్ ట్యూమరే కేన్సర్!
ఈ కేన్సర్ కణం ఏ శరీరభాగం నుంచైనా, ఏ కణం నుంచైనా మొదలవ్వవచ్చు! ఇది రక్తనాళాల ద్వారా ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. చుట్టుపక్కల వున్న ఇతర కణాలను నాశనం చేస్తుంది.
సాధారణ జీవకణాలు కేన్సర్ కణాలుగా ఎందుకు మారిపోతాయో ఖచ్చితంగా తెలియదు. జీన్స్ లో జరిగే కొన్ని మార్పులు ఇందుకు మూలం కావచ్చు.
రోజురోజుకీ మారుతున్న లైఫ్ స్టయిల్, ఆహారపు అలవాట్లు, ఇతర అలవాట్లు ఇందుకు కారణం కావచ్చు!
వయసు పెరిగే కొద్దీ కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువౌతున్నాయి.
కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కేన్సర్ కారకమైన “ కార్సినో జీన్స్ “ నుంచి రక్షణ పొందవచ్చు.
కేన్సర్ అంటే…
అంటు వ్యాధికాదు
ఏ విధంగానైనా కూడా ఒకరి నుంచి మరొకరికి వచ్చేది కాదు.
మొదటి దశల్లోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు
పొగ తాగవద్దు
ఊపిరి తిత్తుల కేన్సర్ వచ్చిన వారిలో 90 శాతం మందికి,
ఇతర కేన్సర్లు వచ్చిన వారిలో 30 శాతం మందికి పొగతాగడమే కేన్సర్ కారణమని, అధ్యయనాలు చెబుతున్నాయి.
కేన్సర్ వచ్చిన వారిలో 3 శాతం మందికి ఆల్కహాల్ అందుకు కారణం.
ఇందువల్ల చుట్ట బీడి సిగరెట్, లిక్కర్, సారా, స్పిరిట్ తాగడం ఆపెయ్యాలి.
పొగతాగే వారి పక్కన వుండే వారికి కూడా హాని జరుగుతుందని మరచిపోకూడదు.
పండ్లు కూరల నుంచి రక్షణ
కేబేజి, కాలిఫ్లవర్ లాంటి కూరగాయల్లో కేన్సర్ నుంచి రక్షించే గుణాలు వున్నాయి. పీచు పదార్థాలు ఎక్కువగా వున్న ఆహారం పెద్దపేగుల్లో కేన్సర్ ను కొంతవరకూ నివారిస్తుంది. “ఎ”, “సి” విటమిన్లు అధికంగా వున్న ఆహారపదార్ధాలు కేన్సర్ ను నివారించడానికి ఉపయోగపడతాయి. తాజాపళ్ళు, తాజా కూరగాయలు ఉన్న ఆహారం అన్ని విధాలా మంచిది.
బరువు తగ్గాలి
శరీర అవసరానికి మించిన బరువు కొన్ని రకాల కేన్సర్ కి దారితీస్తుంది. మితిమీరి తినడం మానుకోవాలి. వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు బరువుని తగ్గిస్తాయి. డాక్టర్ సలహాతో వీటిని అమలు చేయడం మంచిది.
కొవ్వు, మసాలాలు వద్దు!
వేపుళ్ళు, కారం, మసాలాలు ఎక్కువగావున్న ఆహారం వల్ల జీర్ణాశయం, ఆహారనాళాలకు కేన్సర్ సోకే అవకాశం వుంది.
చేప, చర్మం తీసిన చికెన్, మీగడలేని పాలు తీసుకోవడం మంచిది. కొవ్వుపదార్థాలు తక్కువగావుండే ఆహారం మంచిది.
వెస్ట్రన్ దేశాల్లో పెద్దపేగుల కేన్సర్ ఎక్కువ. వారు ప్రొటీన్లు ఎక్కువ, ఫైబర్లు తక్కువ వున్న ఆహారం తినడమే అందుకు కారణం.
మహిళలు – కేన్సర్
మనదేశంలో మహిళల కేన్సర్ అంటే అది గర్భాశయ కేన్సర్ లేదా రొమ్ము కేన్సర్ అయివుంటుంది.
లక్షణాలు
తెల్లబట్ట కావడం దీన్నే వైట్ డిశ్చార్జ్ అంటున్నాము.
బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం
బహిష్టు కాని సమయంలో రక్తస్రావం
లైంగికచర్య తరువాత రక్త స్రావం
ఎలాంటి స్త్రీలలో గర్భాశయ కేన్సర్ లేదా సెర్వికల్ కేన్సర్ కు అవకాశాలు ఎక్కువ?
చిన్నవయసులో పెళ్ళిజరిగినవారికి,
చిన్నవయసులో పిల్లలుపుట్టినవారికి,
హెచ్చుమంది పిల్లల్ని కన్నవారికి,
అల్పాదాయ వర్గాలవారికి,
గర్భాశయ కేన్సర్ లేదా సెర్వికల్ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఈ కేన్సర్ ను ప్రారంభదశకుముందు లేదా తొలిదశలో నిర్ధారించే అవకాశాలు వున్నాయి.
గర్భాశయం లోపలిగోడలను సూక్ష్మంగా పరిశీలించే సెర్వికల్ పాప్స్మియర్ టెస్టు ద్వారా కేన్సర్ రాగల అవకాశాలను కొన్నేళ్ళు ముందుగానే గుర్తించవచ్చు. అసాధారణమైన కణాలు ఈ పరీక్షలో కనబడినట్టయితే భవిష్యత్తులో కేన్సర్ రాగల అవకాశం తెలుస్తుంది. నివారణచర్యల ద్వారా వ్యాధిని నిరోధించవచ్చు.
రొమ్ముకేన్సర్
50 ఏళ్ళుపైబడిన స్త్రీలలో, పిల్లలు పుట్టనిస్త్రీలలో, 12 ఏళ్ళ వయసుకిముందే మెనుస్ట్రేషన్ ప్రారంభమైనవారిలో, 35ఏళ్ళ వయసుదాటాక మొదటిబిడ్డ పుట్టిన స్త్రీలలో, అధికబరువు వున్నస్త్రీలలో, రక్తసంబంధీకులలో ఎవరికైనా రొమ్ముకేన్సర్ వున్న స్త్రీలలో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశంవుంది.
తొలిదశలోనే నిర్ధారించే పద్ధతులు
తమనుతామే పరిశీలించుకోవడం, డాక్టర్ వద్దకువెళ్ళి పరీక్ష చేయించకోవడం, మమ్మోగ్రఫీ ద్వారా పరీక్ష చేయించుకోవడం ద్వారా రొమ్ము కేన్సర్ ను మొదటిదశలోనే గుర్తించవచ్చు.
రొమ్ముకేన్సర్ ను మొదటేలోనే గుర్తిస్తే పూర్తిగా నయంచేసుకునే అవకాశం వుంది. రొమ్మును తొలగించే అవసరంరాదు.
స్వియ పరీక్ష
స్నానంచేసేటప్పుడు, శరీరం తడిగావున్మప్పుడు కుడి రొమ్మును ఎడమచేత్తో, ఎడమరొమ్మును కుడిచేత్తో క్రమపద్ధతిలో తడిమిచూసుకోవాలి.
మెన్సెస్ అయిన తరువాత వారంలోపులో ఈపరిశీలన చేసుకోవాలి. మెనుస్ట్రేషన్ ఆగిపోయినవారు నెలలో ఏదో ఒకతేదీ నిర్ణయించుకుని క్రమంతప్పకుండా ఇలా పరీక్షించుకోవాలి.
వక్షంలో కంతులు, వుండలు చేతికితగులుతాయి. ఇవన్నీ కేన్సర్ కారకాలు కావు. అయితే, క్రమంతప్పని పరిశీలనల్లో కంతులు వుండల లో పెద్దపెద్ద మార్పులు గమనిస్తే అపుడు డాక్టర్ వద్దకు వెళ్ళాలి
అద్దంముందు నిలబడికూడా పరిశీలించుకోవచ్చు!
అద్దంఎదురుగా నిటారుగా, రిలాక్స్ డ్ గా నిలబడి భుజాలు దించి, చేతులు పైకెత్తివుంచి వక్షోజాల అరారంలో సైజులో మార్పులు వున్నాయో లేదో గమనించాలి. రొమ్ముల మీద ముడుతలు, సొట్టలవంటి మార్పులు వచ్చాయేమో చూసుకోవాలి.
వేళ్ళతో పరీక్ష
బొటనవేలు, చూపుడువేళ్ళతో చనుమొనలను నొక్కి ఏదైనాద్రవం వస్తూందా అని గమనించాలి! బిడ్డకు పాలు ఇస్తున్న తల్లికి ఈలక్షణం వుంటే ఫరవాలేదు. చనుపాలు ఇవ్వని స్త్రీలలో ఈలక్షణం వుంటే డాక్టర్ ను సంప్రదించాలి.
జీర్ణాశయ కేన్సర్ కారకాలు
పొగతాగే అలవాటు, వేపుడుఆహారం, ఊరగాయపచ్చళ్ళు, కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు
జీర్ణాశయ కేన్సర్ లక్షణాలు
ఆకలితగ్గడం, బరువుతగ్గడం, పొట్టలోనొప్పి, పొట్టనిండినట్టు, పొట్టబరువుగావున్నట్టు అనిపించడం, తేనుపులు, అజీర్ణం, వాంతులు…ఇవన్నీ జీర్ణాశయ కేన్సర్ లక్షణాలు.
పరీక్షా పద్ధతులు
ఎండోస్కోపీ ద్వారా జీర్ణాశయంలో కంతులు, పుండ్లను గుర్తించవచ్చు. బయాప్సీ అంటే చిన్నభాగాన్ని కోతపెట్టి పరీక్షకు పంపి నిర్ధారణ చేసుకోవచ్చు. రేడియేషన్ ద్వారా, మందులద్వారా, సర్జరీద్వారా జీర్ణాశయ కేన్సర్ ని నయంచేయవచ్చు.
నోరు మరియు గొంతు కేన్సర్
పొగాకు వాడకం, సిగరెట్, చుట్ట, బీడి, గుట్కా, ఖైని, పాన్, ముక్కపొడుం, లిక్కర్, ఆల్కహాల్, చుట్టను కాలుతున్న వైపు నోట్లో పెట్టికుని పొగపీల్టే అడ్డచుట్ట మొదలైనవాటివల్ల నోటికేన్సర్, గొంతుకేన్సర్ రావచ్చు.
లక్షణాలు
నోట్లో తగ్గనివాపు మాననిపుండు కంతి, ఎర్రని లేదా తెల్లనిమచ్చలు, మెడవద్ద బిళ్లలు, కంతులు, తగ్గనిగొంతుమంట, నోటిదుర్వాసన, గొంతుబొంగురుపోవడం, తరచుముక్కుదిబ్బడ, ముక్కునుంచి రక్తంకారడం, తినేటప్పుడు గొంతునొప్పి మొదలైన లక్షణాలు వుంటే అది గొంతుకేన్సర్ లేదా నోటికేన్సర్ అని అనుమానించవచ్చు.
(సంకలనం : పెద్దాడ నవీన్)