(పెద్దాడ నవీన్ 27-7-2019)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత ఆర్ధిక వాతావరణంపై అంతర్జాతీయ ద్రవ్యసంస్ధలకు కేంద్రప్రభుత్వం వివరణ ఇచ్చుకోవలసిన పరిస్ధితిని ముందుకి నెడుతున్నారు.
తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించాక కూడా చంద్రబాబు మీద పగా ద్వేషాలతో రగిలిపోతున్నట్టున్న జగన్ మాటలు – చేతలు పాత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడటానికి మాత్రమే పరిమితం కాలేదు.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ మెట్రోరైలు నిర్మాణాలకు అప్పు ఇవ్వడానికి ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు రుణం ఇవ్వలేమని చెప్పేశాయి.
ఆర్ధిక సంస్కరణలు, ఉదార విధానాలు భారత్ లో 29 ఏళ్ళక్రితం మొదలయ్యాయి. పెట్టుబడులను ప్రోత్సహించే ఈ పద్ధతిలో ప్రయివేటు రంగానికి అనేక రాయితీలు ఇవ్వవలసి వుంటుంది…ఇంకా చెప్పాలంటే గొంతెమ్మ కోర్కెలు అనిపించే ప్రయివేటు షరతులను ప్రభుత్వాలు ఆమోదించక తప్పదు. ఈ విధంగా విస్తరించే పరిశ్రమలు సర్వీసురంగం ప్రయోజనాలను రెండోదశలో వినియోగదారులకు అందేలా చూడవలసి వుంటుంది.
భిన్న సంస్కృతులు, ఆర్ధిక స్ధితిగతులు, రాజకీయ వాతావరణాలు వున్న భారత దేశంలో సంస్కరణలు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే తీరుగా, ఒకే వేగంతో అమలు కావడం లేదు. అయితే సంస్కరణల తత్వాన్ని ముందుగా గ్రహించి వేగంగా అమలు పరచిన ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లోనే ఆర్ధిక, వాణిజ్య రంగాలలో అంతర్జాతీయ, జాతీయ వేదికల మీద (అవిభక్త) ఆంధ్రప్రదేశ్ ను ప్రముఖంగా నిలబెట్టారు. ఆ తొలిదశల్లో ఆయన సంక్షేమాన్ని పక్కన పెట్టి సంస్కరణల కు పెద్దపీటవేసి పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారని పేరుపడ్డారు.
ఆతరువాత వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంస్కరణలకు సంక్షేమానికి మధ్య సమతూకం తెచ్చారు. “ఆరోగ్యశ్రీ” పధకం ఆయనకునప్రజానాయకుడిగా దేశంలోనే ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది.
రెడ్ టేపిజాన్ని, పర్మిట్ల రాజ్యాన్ని తొలగించే సంస్కరణలతో పాటు లంచగొండితనం, బ్రోకర్ల సేవలు, “మీకు అది నాకు ఇది”, అనే ఒప్పందాలు, అవినీతి పెరిగిపోతాయి. ప్రపంచమంతటా ఇదే ధోరణి వుంది… ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు నాయుడు, ఓడరేవులు, సెజ్ ల నోటిఫికేషన్ల వంటి భూముల కేటాయింపులపై వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. అక్రమ ఆదాయాల కేసుల్లో అప్పటి ముఖ్యమంత్రి కొడుకుగా జగన్, అప్పటి మంత్రి, కొందరు అధికారులు జైలుకి వెళ్ళడం సంస్కరణల్లో అవినీతి పార్శ్వానికి పరాకాష్ట. జగన్ మీద కేసుల విచారణ సాగుతూనే వుంది.
ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ విభజన, 13 జిల్లాల రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం, రాజధాని, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం వంటి నిర్మాణ, పునర్మిర్మాణ బాధ్యతల అమలు మొదలయ్యింది. ఈ దశలో జరిగిన ఎన్నకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
ముఖ్యమంత్రిగా జగన్ తన ఎజెండాను అమలు చేయడం కంటే చంద్రబాబు మీద పెంచుకున్న ద్వేషాన్ని ప్రతీకారంగా మార్చుకోడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు అర్ధమౌతోంది. రాజరికంలో తప్ప ప్రజాస్వామ్యంలో ఇది నడవదు.
విద్యుత్తు ఒప్పందాలను తిరగదోడటం , రివర్స్ టెండరింగ్ మొదలైన నిర్ణయాలు ప్రత్యక్షంగా రాష్ట్రాభివృద్ధిని కుంటుపరచేవిగా పరోక్షంగా జగన్ కాళ్ళ కిందికి నీళ్ళు తెచ్చేవిగా వున్నాయి.
రాష్ట్రాల ప్రతిపాదనలు, కేంద్ర సంస్ధల, శాఖల ఆమోదాల తరువాతే ఆంతర్జాతీయ, జాతీయ ద్రవ్య సంస్ధల ఒప్పందాలు జరుగుతాయి… ప్రతీదశలోనూ పైనుంచి కిందికి ప్రశ్నలు అడగటం, కింద నుంచి వివరణలు ఇవ్వడం జరుగతుంది. ఒకసారి ఆమోదం కుదిరాక దానిని తిరగదోడటం అంటే ప్రాజెక్టు రద్దైపోవడమే!
ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది ఇదే!
ముందు చూపూ, పర్యావసానాలపై అంచనాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ఒక ముఖ్యమంత్రి చేయకూడని పని. ఆయనకు తెలియదు సరే ఆజేయ్ కల్లాం వంటి అనుభవజ్ఞులైన సలహాదారులు , ప్రభుత్వ యంత్రాంగం సలహా ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం… సలహా ఇచ్చినా జగన్ పట్టించుకోలేదంటే ఈ రాష్ట్రం దౌర్భాగ్యం!
ఈ పరిస్ధితిని రాజకీయకోణం నుంచి చూసినా జగన్ కే నష్టం. మోదీ ప్రభుత్వం తాను నిర్దేశించుకున్న ఆర్ధిక విధానాలతోనే పాలన సాగిస్తుంది… అమిత్ షా సారధ్యంలోని బిజెపి తాను నిర్దేశించుకున్న మార్గంలోనే ప్రత్యర్ధులను తొక్తేస్తూ పార్టీని విస్తరించుకుంటూ పోతుంది…ఇందులో వ్యక్తిగత ప్రాబల్యాలకూ, ఎమోషన్లకూ, ఇగోలకూ చోటు వుండదు.
నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ వంటి సామాజిక న్యాయం విధానాలపట్ల ద్రవ్య సంస్ధలకు అభ్యంతరం వుండదు. పరిశ్రమల్లో 75 శాతం స్ధానికులకు రిజర్వేషన్ విధానాలను ద్రవ్యసంస్ధలు అనుమతించవు. కాదూ కూడదని చట్టం చేస్తే రాష్ట్రంలో పరిశ్రమలకు అప్పు దొరకదు.
సంస్కరణలకు వ్యతిరేక దశలో వున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఖరి అంతర్జాతీయ ద్రవ్యసంస్ధలకూ, కేంద్ర ప్రభుత్వానికీ నచ్చదు..
సంస్కరణలకు అనుకూలంగా చట్టాలను మార్చుకుంటూ వస్తున్న మోదీ ప్రభుత్వం జగన్ దుందుడుకు తనానికి గట్టిగానే చెవిమెలిపెట్టే వాతావరణం కనబడుతోంది.
సామాజిక న్యాయం, సంకషేమాలతోపాటు సంస్కరణలను కూడా జగన్ భుజాన మోయకపోతే మోదీ ప్రభుత్వానికి ఎపి ప్రభుత్వానికి మధ్య ఆర్ధిక సూత్రబద్ధమైన వైరుధ్యంవారిని ప్రత్యర్ధులగా మార్చే అవకాశం వుంది.