17-8-2022
నెహ్రూ ఆలోచనా విధానానికి రిఫరెన్స్ బుక్ లాంటి MC – మానికొండ చలపతిరావు గారు నెలకొల్పిన వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ 65 వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నాకు సత్కారం జరిగింది. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో MC గారి ఫొటో సమక్షంలో జర్నలిస్టులు పౌరప్రముఖులు
సత్కరించిన సీనియర్ జర్నలిస్టులలో నేను మొదటివాడిని.
సన్మానాలు సత్కారాలకు నేను చాలా…అంటే చాలా దూరంగా వుంటాను. 40 ఏళ్ళ జర్నలిస్ట్ కెరీర్ లో నాకు బలవంతంగా / ఆకస్మికంగా చేసిన సన్మానాలు 6 మాత్రమే!
మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధే విధానంగా పంచవర్షప్రణాళికలతో దేశాన్ని ప్రగతి పథం వైపు నెహ్రూ మళ్ళించారు. నేహ్రూ మోడల్ డెవలప్ మెంటు గా నెహ్రూ ఆలోచనా విధానంగా అది అది అభివృద్ధి సిద్ధాంతమైంది.
అలాంటి వాతావరణంలో జర్నలిస్టుగా ఎదిగిన తరం మొదట్లో MC వున్నారు. చివరిలో నాలాంటి వాళ్ళం వున్నాము. ఆయన తెలుగువారు, అయినా ఇంగ్లీషులో నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ గా నెహ్రూ ఆలోచనా సరళిని దేశవ్యాప్తంగా స్ర్పెడ్ చేయడంలో విశేష ప్రభావం చూపించారు.
నెహ్రూ గారి మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధను అర్ధం చేసుకున్న అవగాహనతో “మేము సమాజానికి కాపలాకుక్క” బాధ్యతను చేతనైనంత వరకూ నిర్వహించాము. మా తరానికి నెహ్రూ ఆదర్శవంతమైన సిద్ధాంత కర్త. ఆయన్ని ప్రజలముందుంచిన MC ఒక రోల్ మోడల్ జర్నలిస్ట్.
హైదరాబాద్ వెళ్ళి ఆయన్ని కలుద్దాము అనుకున్నాను. కుదరలేదు. 1983 లోనో 84 లోనో ఆయన చనిపోయారు.
MC జర్నలిస్టుల సంక్షేమం హక్కుల గురించి ఉద్యమించి వుండకపోతే ఆయన చరిత్ర “ప్రధానికి సన్నిహితంగా మెసిలిన పాత్రికేయుడు” అన్న వాక్యంతో ముగిసిపోయి
వుండేది.
వ్యక్తిగతంగా MC నాకు రోల్ మోడల్… ఆయన నెహ్రూ విధానాలను బాగా అర్ధం చేసుకుని ప్రజల్లోకి శక్తివంతంగా తీసుకువెళ్ళారు. నేను సరళీకృత ఆర్ధిక విధానాలను బాగా అర్ధం చేసుకుని వాటివల్ల భవిష్యత్తులో రాబోయే మంచి చెడులను 30 ఏళ్ళ క్రితమే రాయగలిగాను. ఈ టాపిక్స్ మీద రామోజీరావు గారు రెండు సార్లు నాతో చాలాసేపు చర్చించారు. జర్నలిస్టు సహచరుడు, సోషలిస్టు కీర్తిశేషులు బిసి నారాయణ గారు
నేను లిబరలైజేషన్ పర్యవసానాలపై కథనాలు రాసిన కాలంలో ఒక సారి “ మిక్స్ డ్ ఎకానమీ మీద MC కూడా ఇంతే అధారిటేటివ్ గా రాసేవారు” అని చెప్పారు.
ఇవాళ సమావేశం ముగిశాక “యూట్యూబ్ న్యూస్ వ్లోగర్” రామ్ నారాయణ్ “ గురూగారూ మీరు ముప్పైఏళ్ళ క్రితం రాసినవన్నీ ఇపుడు చూస్తున్నాము” అని ప్రస్తావించినపుడు నన్ను నేనే కౌగలించుకున్నట్టు అనిపించింది.
ఒక్కసారి కూడని MC తో నేను బాగా కనెక్టయిన విషయం బిసి నారాయణ గారి వల్ల అపుడు తెలిసింది. రామ్ నారాయణ్ వల్ల ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది.
ఈ కార్యక్రమకర్త యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, సహచర జర్నలిస్టు శ్రీరామమూర్తి సందర్భం చెప్పి మీరు కొందరికి సన్మానంచేయాలి తప్పక రండి అని పొద్దున్న కూడా గుర్తు చేశారు. మెయిన్ స్ట్రీమ్ లో వున్న జర్నలిస్టులకు నా చేతులమీదుగా సన్మానం అనుకుని వెళ్ళాను. శ్రీరామమూర్తి కొంచెం ట్రిక్కిష్ గా పిలిచారు.
సహచర జర్నలిస్టులు కృష్ణకుమార్, భూషన్ బాబు, గన్నికృష్ణ , పంతం కొండలరావు, కందుల దుర్గేష్, ఆదిరెడ్డి వాసు గార్లు పత్రికా రంగం పెడధోరణులు, పాత్రికేయుల ఆర్ధిక భారాల గురించి ఆవేదన వెలిబుచ్చారు.
మిశ్రమ ఆర్ధిక వ్యవస్థలో జర్నలిస్టుగా పుట్టి, పెరిగిన నేను లిబరలైజేషన్ ని కూడా అర్ధం చేసుకుని నా బ్లాగులో రాయగలుగుతున్నాను. ఫేస్ బుక్ మొదలైన సోషల్ మీడియాలో దాన్ని కొద్దిమందిలో కైనా తీసుకువెళ్ళగలుగుతున్నాను. ఆర్ధిక విధానాల్లో మౌలిక మౌన మార్పువచ్చినా ఆ మూలాలను నేపధ్యంలోకి తీసుకోకుండా పనిచేయడమే జర్నలిస్టులు ప్రజలకు కనెక్ట్ కాలేకపోతున్నారేమో నని, అంటే ఆట స్థలం మారిపోయాక కూడా పాత ప్లేగ్రౌండ్ లోనే మేము ఆడేస్తున్నామేమో నని నా అనుమానం.
సన్మాన సమావేశంలో నేను ఇదే చెప్పాను.
⁃ పెద్దాడ నవీన్