29-8-2021

పండితుల పరిధిలో వున్న తెలుగు సాహిత్య / గ్రాంధికాన్ని పామరులు మాట్లాడుకునే వ్యవహారిక భాషగా సంస్కరించిన ఉద్యమ సారధి కీర్తిశేషులు గిడుగు వెంకట రామమూర్తి గారికి నమస్కరించుకుంటున్నాను.

వ్యవహారిక భాష వినియోగం విస్తృతమయ్యేకొద్దీ సామాన్యుల నుంచి రచయితలు, కవులు పెరిగారు. సాహిత్యం మరింతగా జనాలకు చేరువ అయ్యింది.

80 వ దశకం నాటికే 4 లక్షల శీర్షికల ( టైటిల్స్) తెలుగు పుస్తకాల వుండటం భాషాసాహిత్య వికాసానికి ఒక ఆనవాలు అనవచ్చు. తెలుగు రాష్ట్రల్లోనే, తెలుగువారిమధ్యనే వుండిపోయి, కృశించిపోతున్న తెలుగు పరిధి అవధి విస్తరించాలంటే రచన అంశం శాస్త్రీయవిజ్ఞానం, పరిజ్ఞానాల వైపు మళ్ళాలి!

తెలుగు భాషను ప్రమాణీకరించుకోవాలి. జర్మన్ పండితులు సంస్కృతాన్ని నేర్చుకున్నట్టు, ఉత్తరాది పండితులు కోనసీమ వచ్చి వేదాన్ని నేర్చుకున్నట్టు ,

ఏ భాష అయినా శాస్త్రీయ అంశాలను సుబోధకంగా వ్యక్తీకరించ గలిగేలా ఎదగాలి.

తెలుగువారు చేస్తున్న మౌలికమైన పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న పురోగతీ తెలుగుభాషలో కూడా చెప్పగలగితే, రాయగలిగితే శాస్త్రీయ విషయాలు చెప్పగల భాషగా తెలుగు పటిష్టమౌతుంది. అంటే కథలు, కవిత్వాలు, వ్యాసాల సాహిత్యం నుంచి మేధస్సు, ఆలోచనల మౌలిక అంశాలు కూడా చెప్పగల స్ధాయికి తెలుగు విస్తరించాలి.

శాస్త్ర సాంకేతిక రంగాల్లోని మౌలిక అంశాలపై విద్యార్థులకు పట్టు పెరగాలంటే మాతృభాషా మాధ్యమాలతోనే సాధ్యమని చైనా, జపాన్‌, ఐరోపా దేశాల అనుభవాలు నిరూపిస్తున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు అమ్మభాషల్లో బోధిస్తూ జ్ఞానాధారిత ఆర్థికరంగ వృద్ధితో ఆయా దేశాలు దూసుకుపోతున్నాయి.

నవీన పరిశోధనల్లో, అత్యాధునిక ఆవిష్కరణల్లో కొత్త పుంతలు తొక్కుతున్న వాటికి భిన్నంగా ఆంగ్లాన్ని నెత్తికెత్తుకున్న ఇండియాలోని ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో అత్యధిక శాతానికి విషయ పరిజ్ఞానం అరకొరేనని అధ్యయనాలెన్నో నిగ్గుతేల్చాయి. పిల్లలకు చిరపరిచితమైన భాషలను తరగతి గదిలోకి అనుమతించని దురవస్థ తొలగిపోతేనే విద్యార్థిలోకంలో సృజన నైపుణ్యాలు వికసిస్తాయి.

స్థానిక భాషల్లో వృత్తివిద్యా పదకోశాల నిర్మాణం, సంప్రదింపు గ్రంథాలతో సహా పాఠ్యపుస్తకాల సరళానువాదం, బోధన సిబ్బందికి తగిన శిక్షణలపై ప్రభుత్వాలు సత్వరం దృష్టి సారించాలి. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక పట్టాలు పొందినవారికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం కల్పించడం మరింత ముఖ్యం. ఆంగ్లం, హిందీలకే పరిమితమైన జాతీయ స్థాయి పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తేనే భిన్నత్వంలో ఏకత్వ భావన బలపడుతుంది.

‘విద్యావ్యాప్తి విస్తృతం కావాలంటే స్థానిక భాషల్లో బోధించాల్సిందే’నన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ మేలిమి సూచనకు ప్రభుత్వాలు గొడుగుపట్టాలి!

యూనీకోడ్ ఫాంట్లు కంప్యూటర్ లో ప్రవేశించడం వల్లే ఇక్కడ ఇది నేను రాయగలిగాను. మీరు చదవగలుగుతున్నారు. తెలుగు స్పెల్,గ్రామర్ చెకర్ లు రూపొందించడానికి కేంద్రీయ విశ్వ విద్యాలయం గతంలో మొదలు పెట్టిన ప్రయత్నాలను పున:ప్రారంభించాలి. డిగ్రీదాకా తెలుగును నిర్బంధం చెయ్యాలి.

భాషావికాసం, ఔన్నత్యాలకు తెలుగురాష్ట్రాల్లో కనుచూపుదూరంలో అవకాశమే లేదు. ముస్లిం పాలకుల ప్రభావం వల్ల తెలంగాణాలో ఉర్దూ, హిందీ యాసలు కలసిన తెలుగు, ఆంగ్లేయుల ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీషు పదాలు కలసిన తెలుగు వర్ధిల్లుతున్నాయి.

తెలంగాణా నుడికారాన్ని కెసిఆర్ గారు అందిపుచ్చుకున్నారు. ఇతరులకంటే కాస్త లోతుగా జన హృదయాలలో చొరబడిపోడానికి అది వారికి దోహదమైంది. అయితే అది తెలంగాణా ప్రభుత్వ భాషా విధానంకాదు.

ఉన్నత రాజకీయాధికారంలో వున్నవారిలోఎవరికీ తెలుగు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు లేవు…ఇందువల్ల తెలుగుని ఉద్ధరించేస్తామనే నాయకుల మాటలు మనకి వినబడవు…ఒక వేళ ఎవరైనా అలా చెబితే అవి దొంగమాటలే అని మరో ఆలోచనలేకుండా అనేసుకోవచ్చు

* ప్రపంచంలో ఏమతమైనా తనను తాను ప్రచారం చేసుకోడానికి ప్రజల భాషను ఆశ్రయించింది. మన వైదీకం జనం భాషకు దూరమై రహస్యంగా వుండిపోయింది

* సంస్కృతాన్ని పక్కన పెట్టి గౌతమబుద్ధుడు, మహావీరుడు ప్రజలభాష “పాళీ”లో చేసిన బోధనలు శరవేగంతో దేశాన్ని చుట్టుముట్టాయి

* పండితుల సంస్కృత భారతాన్ని వందల ఏళ్ళతరువాతే నన్నయ తెలుగునేల మీదకు తీసుకురాగలిగారు

* తెలుగుదేశాన్ని ఎవరుపాలించినా సంస్కృతమో, పారశీకమో, ఊర్దోనో, ఇంగ్లీషో పాలకుల భాషగావుండిపోయాయి

* ఉద్యోగాలకోసం నైజాములో ఉర్దూ, ఆంధ్రాలో ఇంగ్లీషూ తెలుగుని టెలుగూ గా మార్చేశాయి

* తెలుగుకోసం ఉద్యమాలు చేసి రాష్ట్రాలు సాధించిన తెలుగువాడు కూర్చున్న కొమ్మను తానే నరికేసుకుంటున్నాడు

* ఇంగ్లీషువాళ్ళు , నిజాం స్కూళ్ళవరకూ తెలుగుని అనుమతించారు తెలుగువాడు తల్లఒడిలోనే మాతృభాషను తన్నేస్తున్నాడు

* మెకాలే ఊహలోనే లేని ఉగ్గుపాల నుంచే ఎబిసిడిలను అడుగులు పడనపుడే ఐఐటి కోచింగ్ లను తెలుగువాడు మోహిస్తున్నాడు

* ఉద్యోగాలు ఇస్తున్నపుడు, తల్లిదండ్రులే చదివించుకుంటున్నపుకు ఇంగ్లీషంటే నొప్పి ఎందుకని సుప్రీం కోర్టే ప్రశ్నిస్తోంది

* భాషఅంటే అది మాట్లాడే ప్రజలూ, చరిత్రా, సంక్కృతీ – ఇవన్నీ ధ్వంసమయ్యాక భాష ఒక్కటే బతికి వుండటం సాధ్యం కాదు.

* పక్కదారులనుంచి దేశంలో దూరిన బ్రిటీష్ వాడిని తరిమేసిన ఉద్యమ విలువలు అమెరికావాడికి ఎస్ బాస్ అనేలా తిరగబడ్డాక మాతృభాషకు చోటెక్కడ?

* ఆత్మనే అమ్మకుకున్నాక అమ్మ భాష మీద మమకారముంటుందా?

* మాతృభూమిని ప్రేమించకుండా మాతృభాషను కాపాడుకోవడం కుదురుతుందా?

• కవిత్వానికీ, కాల్పనిక సాహిత్యానికీ పనికొచ్చే తెలుగు భాషను శాస్త్రవిజ్ఞానాలను వివరించే భాషగా వికసింపజేసే ప్రయత్నాలు జరగనంతవరకూ తెలుగుభాషా ఉత్సవాలంటే ఖాళీ వేళల్లో సాంస్కృతిక ఉద్వేగంతో ఊగిపోవడమే! గిడుగు జయంతినాడు భాషావేత్తలను సత్కరించి చేతులు దులిపేసుకోవడమే!!

• తెలుగు మాయమైపోతూండటం విచారకరమే అయినా ఇదొక పరిణామక్రమంగా స్వీకరిస్తున్నాను

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారికైతే తెలుగు భాషమీద ఎలాంటి ప్రేమా ఆసక్తీ లేవు! పైగా బతుకుదారి చూపించగలదన్న నమ్మకంతో ఇంగ్లీషును చిన్న బడి నుంచే నిర్భందం చేశారు. #nrjy #GodavariPost

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s