వైద్య ఆరోగ్య విశ్వాలయానికి ఎన్ టి ఆర్ పేరు తొలగించినందుకు మనస్తాపంతో రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్ష స్ధానం నుంచి వైఎల్ పి (డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్) వైదొలగడం ఒక సందేశంలా వుంది.
ప్రభుత్వాన్ని నడుపుతున్న వారి అడ్డగోలుతనాన్ని వ్యతిరేకించే వారు రణమో శరణమో తేల్చుకోవాలని వైఎల్ పి పిలుపు ఇచ్చినట్టు అనిపిస్తోంది.
ఆరోగ్యమంటే ప్రజారోగ్యమని, వైద్య సేవలను కిందికి తీసుకువచ్చినపుడే ఇది సాధ్యమౌతుందని ఇందుకు వైద్యవిద్యలను విజ్ఞానాలను సమన్వయంగా క్రోడీకరించాలని ఎన్ టి ఆర్ తలపెట్టారు.
రాష్ట్రంలో మెడికల్ కాలేజిలు, నర్సింగ్ కాలేజిలు, ఇతర పారా మెడికల్ కాలేజీల అవి వున్న ప్రాంతపు యూనివర్సిటీల పరిధిలో వుండేవి. ఒకే రాష్ట్రంలో వున్న వైద్య విద్యా సంస్ధల కాలెండర్లలో తేడాలు పైచదువులకు వెళ్ళే సందర్భాల్లో విద్యార్థుల్ని అడ్డుపెట్టేవి. ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో వుండేవారు. ఈ రంగంలో వున్న పెద్దలు అకడమీషియన్లు సమస్యను వివరించినపుడు
ఎన్ టి ఆర్ – రాష్ట్ర వ్యాప్తవ్యాప్తంగా అన్ని వైద్య, పారా వైద్య విద్యా సంస్ధల్నీ ఒకే పాలనా పర్యవేక్షణలో వుండేలా
వైద్య విశ్వవిద్యాలయాన్ని స్ధాపించారు. యూనివర్సిటీకి అవసరమైన మెడికల్ కాలేజిని, టీచింగ్ హాస్పిటల్ నీ విజయవాడలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రభుత్వానికి స్వాధీనం చేసింది.
తరువాత ఇదే నమూనాతో మరికొన్ని రాష్ట్రాలు కూడా రాష్ట్రమంతటికీ ఒకే హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పుకున్నాయి. ఇది వైద్యవిద్యల్లో దేశానికే ఒక దిక్సూచిగా నిలచిన డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ చరిత్ర. వై ఎస్ ఆర్ పేరు పెడుతున్న జగన్ తో సహా ఎవరైనా ఈ చరిత్రను మార్చగలరా?
మూడు దశాబ్దాల్లో వేల వేల మంది డాక్టర్లుగా, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లుగా, డెంటల్ సర్జన్లుగా, ఫిజియో ధెరపిస్టులుగా నర్సులుగా, పారామెడికల్ టెక్నీషియన్లుగా ఈ యూనివర్సిటీ నుంచి డిగ్రీలు తీసుకున్నారు. యూనివర్సిటీ పేరు మారిపోవడంతో వారి పరిస్ధితి ఏమిటి? మాతృసంస్ధతో లింకు తెగిపోయిన ఇలాంటి మెడికల్ అనాథలు బహుశ మరేరాష్ట్రంలో మరే దేశంలో కూడా వుండరుగాక వుండరు.
జగన్ లాంటి పాలకుల చేతిలో పడితే 1000 ఏళ్ళుగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విలసిల్లుతూ వుండేదా? తక్షశిల, నలందా విశ్వవిద్యాలయాల పేర్లు మనకు తెలిసేవా?
బెనరస్ హిందూ విశ్వవిద్యాలయం, ఆలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ, రవీంద్రుడి విశ్వభారతి యూనివర్సిటీలు ఏమైపోయేవి?
ఎవరైనా మంచి పనులు చేస్తే చరిత్రలో మిగిలిపోతారు. చరిత్ర పుస్తకానికి పేరు మార్చేద్దామనుకునే వారు, చిల్లర మనుషులుగా, వివేక వికాసాలు లేని తుంటరులుగా చరిత్రహీనులైపోతారు.
ప్రభుత్వ దుందుడుకు, తుంటరి పనులకు ఎవరైనా స్పందించవలసిందే. వైఎల్ పి రియాక్షన్ ఒక సందేశంగా వుంది. ఎన్ టి ఆర్ కుటుంబీకులతో సహా ఆయన అభిమానులు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా రియాక్ట్ కావలసిందే!
మరో విషయం కూడా గుర్తుకొస్తున్నది. ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రంలో వున్న బిజెపి ప్రభుత్వం బాహాటంగా ఉల్లంఘిస్తున్న సందర్భంలో కామినేని శ్రీనివాస్, ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇలా రియాక్ట్ అయివుంటే కథ మరోలా వుండేది.
ఆ ఇద్దరూ, మరెందరో కూడా సందర్భానికి వచ్చినపుడు ప్రతిస్పందించలేదు. వైఎల్ పి రియాక్ట్ అయ్యారు. అదే ఆయనకు వాళ్ళకు తేడా!
ఇంతకీ! డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని జగన్ ప్రభుత్వం వుంచుతుందా? కూల్చేస్తుందా?? #nrjy