రణమా! శరణమా!!


వైద్య ఆరోగ్య విశ్వాలయానికి ఎన్ టి ఆర్ పేరు తొలగించినందుకు మనస్తాపంతో రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్ష స్ధానం నుంచి వైఎల్ పి (డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్) వైదొలగడం ఒక సందేశంలా వుంది.

ప్రభుత్వాన్ని నడుపుతున్న వారి అడ్డగోలుతనాన్ని వ్యతిరేకించే వారు రణమో శరణమో తేల్చుకోవాలని వైఎల్ పి పిలుపు ఇచ్చినట్టు అనిపిస్తోంది.

ఆరోగ్యమంటే ప్రజారోగ్యమని, వైద్య సేవలను కిందికి తీసుకువచ్చినపుడే ఇది సాధ్యమౌతుందని ఇందుకు వైద్యవిద్యలను విజ్ఞానాలను సమన్వయంగా క్రోడీకరించాలని ఎన్ టి ఆర్ తలపెట్టారు.

రాష్ట్రంలో మెడికల్ కాలేజిలు, నర్సింగ్ కాలేజిలు, ఇతర పారా మెడికల్ కాలేజీల అవి వున్న ప్రాంతపు యూనివర్సిటీల పరిధిలో వుండేవి. ఒకే రాష్ట్రంలో వున్న వైద్య విద్యా సంస్ధల కాలెండర్లలో తేడాలు పైచదువులకు వెళ్ళే సందర్భాల్లో విద్యార్థుల్ని అడ్డుపెట్టేవి. ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో వుండేవారు. ఈ రంగంలో వున్న పెద్దలు అకడమీషియన్లు సమస్యను వివరించినపుడు
ఎన్ టి ఆర్ – రాష్ట్ర వ్యాప్తవ్యాప్తంగా అన్ని వైద్య, పారా వైద్య విద్యా సంస్ధల్నీ ఒకే పాలనా పర్యవేక్షణలో వుండేలా
వైద్య విశ్వవిద్యాలయాన్ని స్ధాపించారు. యూనివర్సిటీకి అవసరమైన మెడికల్ కాలేజిని, టీచింగ్ హాస్పిటల్ నీ విజయవాడలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రభుత్వానికి స్వాధీనం చేసింది.

తరువాత ఇదే నమూనాతో మరికొన్ని రాష్ట్రాలు కూడా రాష్ట్రమంతటికీ ఒకే హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పుకున్నాయి. ఇది వైద్యవిద్యల్లో దేశానికే ఒక దిక్సూచిగా నిలచిన డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ చరిత్ర. వై ఎస్ ఆర్ పేరు పెడుతున్న జగన్ తో సహా ఎవరైనా ఈ చరిత్రను మార్చగలరా?

మూడు దశాబ్దాల్లో వేల వేల మంది డాక్టర్లుగా, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లుగా, డెంటల్ సర్జన్లుగా, ఫిజియో ధెరపిస్టులుగా నర్సులుగా, పారామెడికల్ టెక్నీషియన్లుగా ఈ యూనివర్సిటీ నుంచి డిగ్రీలు తీసుకున్నారు. యూనివర్సిటీ పేరు మారిపోవడంతో వారి పరిస్ధితి ఏమిటి? మాతృసంస్ధతో లింకు తెగిపోయిన ఇలాంటి మెడికల్ అనాథలు బహుశ మరేరాష్ట్రంలో మరే దేశంలో కూడా వుండరుగాక వుండరు.

జగన్ లాంటి పాలకుల చేతిలో పడితే 1000 ఏళ్ళుగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విలసిల్లుతూ వుండేదా? తక్షశిల, నలందా విశ్వవిద్యాలయాల పేర్లు మనకు తెలిసేవా?
బెనరస్ హిందూ విశ్వవిద్యాలయం, ఆలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ, రవీంద్రుడి విశ్వభారతి యూనివర్సిటీలు ఏమైపోయేవి?

ఎవరైనా మంచి పనులు చేస్తే చరిత్రలో మిగిలిపోతారు. చరిత్ర పుస్తకానికి పేరు మార్చేద్దామనుకునే వారు, చిల్లర మనుషులుగా, వివేక వికాసాలు లేని తుంటరులుగా చరిత్రహీనులైపోతారు.

ప్రభుత్వ దుందుడుకు, తుంటరి పనులకు ఎవరైనా స్పందించవలసిందే. వైఎల్ పి రియాక్షన్ ఒక సందేశంగా వుంది. ఎన్ టి ఆర్ కుటుంబీకులతో సహా ఆయన అభిమానులు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా రియాక్ట్ కావలసిందే!

మరో విషయం కూడా గుర్తుకొస్తున్నది. ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రంలో వున్న బిజెపి ప్రభుత్వం బాహాటంగా ఉల్లంఘిస్తున్న సందర్భంలో కామినేని శ్రీనివాస్, ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇలా రియాక్ట్ అయివుంటే కథ మరోలా వుండేది.

ఆ ఇద్దరూ, మరెందరో కూడా సందర్భానికి వచ్చినపుడు ప్రతిస్పందించలేదు. వైఎల్ పి రియాక్ట్ అయ్యారు. అదే ఆయనకు వాళ్ళకు తేడా!

ఇంతకీ! డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని జగన్ ప్రభుత్వం వుంచుతుందా? కూల్చేస్తుందా?? #nrjy

శాస్త్రాలు తెలుగులో రాస్తేనే అది విశ్వభాష అవుతుంది!!


29-8-2021

పండితుల పరిధిలో వున్న తెలుగు సాహిత్య / గ్రాంధికాన్ని పామరులు మాట్లాడుకునే వ్యవహారిక భాషగా సంస్కరించిన ఉద్యమ సారధి కీర్తిశేషులు గిడుగు వెంకట రామమూర్తి గారికి నమస్కరించుకుంటున్నాను.

వ్యవహారిక భాష వినియోగం విస్తృతమయ్యేకొద్దీ సామాన్యుల నుంచి రచయితలు, కవులు పెరిగారు. సాహిత్యం మరింతగా జనాలకు చేరువ అయ్యింది.

80 వ దశకం నాటికే 4 లక్షల శీర్షికల ( టైటిల్స్) తెలుగు పుస్తకాల వుండటం భాషాసాహిత్య వికాసానికి ఒక ఆనవాలు అనవచ్చు. తెలుగు రాష్ట్రల్లోనే, తెలుగువారిమధ్యనే వుండిపోయి, కృశించిపోతున్న తెలుగు పరిధి అవధి విస్తరించాలంటే రచన అంశం శాస్త్రీయవిజ్ఞానం, పరిజ్ఞానాల వైపు మళ్ళాలి!

తెలుగు భాషను ప్రమాణీకరించుకోవాలి. జర్మన్ పండితులు సంస్కృతాన్ని నేర్చుకున్నట్టు, ఉత్తరాది పండితులు కోనసీమ వచ్చి వేదాన్ని నేర్చుకున్నట్టు ,

ఏ భాష అయినా శాస్త్రీయ అంశాలను సుబోధకంగా వ్యక్తీకరించ గలిగేలా ఎదగాలి.

తెలుగువారు చేస్తున్న మౌలికమైన పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న పురోగతీ తెలుగుభాషలో కూడా చెప్పగలగితే, రాయగలిగితే శాస్త్రీయ విషయాలు చెప్పగల భాషగా తెలుగు పటిష్టమౌతుంది. అంటే కథలు, కవిత్వాలు, వ్యాసాల సాహిత్యం నుంచి మేధస్సు, ఆలోచనల మౌలిక అంశాలు కూడా చెప్పగల స్ధాయికి తెలుగు విస్తరించాలి.

శాస్త్ర సాంకేతిక రంగాల్లోని మౌలిక అంశాలపై విద్యార్థులకు పట్టు పెరగాలంటే మాతృభాషా మాధ్యమాలతోనే సాధ్యమని చైనా, జపాన్‌, ఐరోపా దేశాల అనుభవాలు నిరూపిస్తున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు అమ్మభాషల్లో బోధిస్తూ జ్ఞానాధారిత ఆర్థికరంగ వృద్ధితో ఆయా దేశాలు దూసుకుపోతున్నాయి.

నవీన పరిశోధనల్లో, అత్యాధునిక ఆవిష్కరణల్లో కొత్త పుంతలు తొక్కుతున్న వాటికి భిన్నంగా ఆంగ్లాన్ని నెత్తికెత్తుకున్న ఇండియాలోని ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో అత్యధిక శాతానికి విషయ పరిజ్ఞానం అరకొరేనని అధ్యయనాలెన్నో నిగ్గుతేల్చాయి. పిల్లలకు చిరపరిచితమైన భాషలను తరగతి గదిలోకి అనుమతించని దురవస్థ తొలగిపోతేనే విద్యార్థిలోకంలో సృజన నైపుణ్యాలు వికసిస్తాయి.

స్థానిక భాషల్లో వృత్తివిద్యా పదకోశాల నిర్మాణం, సంప్రదింపు గ్రంథాలతో సహా పాఠ్యపుస్తకాల సరళానువాదం, బోధన సిబ్బందికి తగిన శిక్షణలపై ప్రభుత్వాలు సత్వరం దృష్టి సారించాలి. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక పట్టాలు పొందినవారికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం కల్పించడం మరింత ముఖ్యం. ఆంగ్లం, హిందీలకే పరిమితమైన జాతీయ స్థాయి పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తేనే భిన్నత్వంలో ఏకత్వ భావన బలపడుతుంది.

‘విద్యావ్యాప్తి విస్తృతం కావాలంటే స్థానిక భాషల్లో బోధించాల్సిందే’నన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ మేలిమి సూచనకు ప్రభుత్వాలు గొడుగుపట్టాలి!

యూనీకోడ్ ఫాంట్లు కంప్యూటర్ లో ప్రవేశించడం వల్లే ఇక్కడ ఇది నేను రాయగలిగాను. మీరు చదవగలుగుతున్నారు. తెలుగు స్పెల్,గ్రామర్ చెకర్ లు రూపొందించడానికి కేంద్రీయ విశ్వ విద్యాలయం గతంలో మొదలు పెట్టిన ప్రయత్నాలను పున:ప్రారంభించాలి. డిగ్రీదాకా తెలుగును నిర్బంధం చెయ్యాలి.

భాషావికాసం, ఔన్నత్యాలకు తెలుగురాష్ట్రాల్లో కనుచూపుదూరంలో అవకాశమే లేదు. ముస్లిం పాలకుల ప్రభావం వల్ల తెలంగాణాలో ఉర్దూ, హిందీ యాసలు కలసిన తెలుగు, ఆంగ్లేయుల ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీషు పదాలు కలసిన తెలుగు వర్ధిల్లుతున్నాయి.

తెలంగాణా నుడికారాన్ని కెసిఆర్ గారు అందిపుచ్చుకున్నారు. ఇతరులకంటే కాస్త లోతుగా జన హృదయాలలో చొరబడిపోడానికి అది వారికి దోహదమైంది. అయితే అది తెలంగాణా ప్రభుత్వ భాషా విధానంకాదు.

ఉన్నత రాజకీయాధికారంలో వున్నవారిలోఎవరికీ తెలుగు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు లేవు…ఇందువల్ల తెలుగుని ఉద్ధరించేస్తామనే నాయకుల మాటలు మనకి వినబడవు…ఒక వేళ ఎవరైనా అలా చెబితే అవి దొంగమాటలే అని మరో ఆలోచనలేకుండా అనేసుకోవచ్చు

* ప్రపంచంలో ఏమతమైనా తనను తాను ప్రచారం చేసుకోడానికి ప్రజల భాషను ఆశ్రయించింది. మన వైదీకం జనం భాషకు దూరమై రహస్యంగా వుండిపోయింది

* సంస్కృతాన్ని పక్కన పెట్టి గౌతమబుద్ధుడు, మహావీరుడు ప్రజలభాష “పాళీ”లో చేసిన బోధనలు శరవేగంతో దేశాన్ని చుట్టుముట్టాయి

* పండితుల సంస్కృత భారతాన్ని వందల ఏళ్ళతరువాతే నన్నయ తెలుగునేల మీదకు తీసుకురాగలిగారు

* తెలుగుదేశాన్ని ఎవరుపాలించినా సంస్కృతమో, పారశీకమో, ఊర్దోనో, ఇంగ్లీషో పాలకుల భాషగావుండిపోయాయి

* ఉద్యోగాలకోసం నైజాములో ఉర్దూ, ఆంధ్రాలో ఇంగ్లీషూ తెలుగుని టెలుగూ గా మార్చేశాయి

* తెలుగుకోసం ఉద్యమాలు చేసి రాష్ట్రాలు సాధించిన తెలుగువాడు కూర్చున్న కొమ్మను తానే నరికేసుకుంటున్నాడు

* ఇంగ్లీషువాళ్ళు , నిజాం స్కూళ్ళవరకూ తెలుగుని అనుమతించారు తెలుగువాడు తల్లఒడిలోనే మాతృభాషను తన్నేస్తున్నాడు

* మెకాలే ఊహలోనే లేని ఉగ్గుపాల నుంచే ఎబిసిడిలను అడుగులు పడనపుడే ఐఐటి కోచింగ్ లను తెలుగువాడు మోహిస్తున్నాడు

* ఉద్యోగాలు ఇస్తున్నపుడు, తల్లిదండ్రులే చదివించుకుంటున్నపుకు ఇంగ్లీషంటే నొప్పి ఎందుకని సుప్రీం కోర్టే ప్రశ్నిస్తోంది

* భాషఅంటే అది మాట్లాడే ప్రజలూ, చరిత్రా, సంక్కృతీ – ఇవన్నీ ధ్వంసమయ్యాక భాష ఒక్కటే బతికి వుండటం సాధ్యం కాదు.

* పక్కదారులనుంచి దేశంలో దూరిన బ్రిటీష్ వాడిని తరిమేసిన ఉద్యమ విలువలు అమెరికావాడికి ఎస్ బాస్ అనేలా తిరగబడ్డాక మాతృభాషకు చోటెక్కడ?

* ఆత్మనే అమ్మకుకున్నాక అమ్మ భాష మీద మమకారముంటుందా?

* మాతృభూమిని ప్రేమించకుండా మాతృభాషను కాపాడుకోవడం కుదురుతుందా?

• కవిత్వానికీ, కాల్పనిక సాహిత్యానికీ పనికొచ్చే తెలుగు భాషను శాస్త్రవిజ్ఞానాలను వివరించే భాషగా వికసింపజేసే ప్రయత్నాలు జరగనంతవరకూ తెలుగుభాషా ఉత్సవాలంటే ఖాళీ వేళల్లో సాంస్కృతిక ఉద్వేగంతో ఊగిపోవడమే! గిడుగు జయంతినాడు భాషావేత్తలను సత్కరించి చేతులు దులిపేసుకోవడమే!!

• తెలుగు మాయమైపోతూండటం విచారకరమే అయినా ఇదొక పరిణామక్రమంగా స్వీకరిస్తున్నాను

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారికైతే తెలుగు భాషమీద ఎలాంటి ప్రేమా ఆసక్తీ లేవు! పైగా బతుకుదారి చూపించగలదన్న నమ్మకంతో ఇంగ్లీషును చిన్న బడి నుంచే నిర్భందం చేశారు. #nrjy #GodavariPost

నాకు MC ఒక రోల్ మోడల్


17-8-2022

నెహ్రూ ఆలోచనా విధానానికి రిఫరెన్స్ బుక్ లాంటి MC – మానికొండ చలపతిరావు గారు నెలకొల్పిన వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ 65 వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నాకు సత్కారం జరిగింది. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో MC గారి ఫొటో సమక్షంలో జర్నలిస్టులు పౌరప్రముఖులు

సత్కరించిన సీనియర్ జర్నలిస్టులలో నేను మొదటివాడిని.

సన్మానాలు సత్కారాలకు నేను చాలా…అంటే చాలా దూరంగా వుంటాను. 40 ఏళ్ళ జర్నలిస్ట్ కెరీర్ లో నాకు బలవంతంగా / ఆకస్మికంగా చేసిన సన్మానాలు 6 మాత్రమే!

మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధే విధానంగా పంచవర్షప్రణాళికలతో దేశాన్ని ప్రగతి పథం వైపు నెహ్రూ మళ్ళించారు. నేహ్రూ మోడల్ డెవలప్ మెంటు గా నెహ్రూ ఆలోచనా విధానంగా అది అది అభివృద్ధి సిద్ధాంతమైంది.

అలాంటి వాతావరణంలో జర్నలిస్టుగా ఎదిగిన తరం మొదట్లో MC వున్నారు. చివరిలో నాలాంటి వాళ్ళం వున్నాము. ఆయన తెలుగువారు, అయినా ఇంగ్లీషులో నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ గా నెహ్రూ ఆలోచనా సరళిని దేశవ్యాప్తంగా స్ర్పెడ్ చేయడంలో విశేష ప్రభావం చూపించారు.

నెహ్రూ గారి మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధను అర్ధం చేసుకున్న అవగాహనతో “మేము సమాజానికి కాపలాకుక్క” బాధ్యతను చేతనైనంత వరకూ నిర్వహించాము. మా తరానికి నెహ్రూ ఆదర్శవంతమైన సిద్ధాంత కర్త. ఆయన్ని ప్రజలముందుంచిన MC ఒక రోల్ మోడల్ జర్నలిస్ట్.

హైదరాబాద్ వెళ్ళి ఆయన్ని కలుద్దాము అనుకున్నాను. కుదరలేదు. 1983 లోనో 84 లోనో ఆయన చనిపోయారు.

MC జర్నలిస్టుల సంక్షేమం హక్కుల గురించి ఉద్యమించి వుండకపోతే ఆయన చరిత్ర “ప్రధానికి సన్నిహితంగా మెసిలిన పాత్రికేయుడు” అన్న వాక్యంతో ముగిసిపోయి

వుండేది.

వ్యక్తిగతంగా MC నాకు రోల్ మోడల్… ఆయన నెహ్రూ విధానాలను బాగా అర్ధం చేసుకుని ప్రజల్లోకి శక్తివంతంగా తీసుకువెళ్ళారు. నేను సరళీకృత ఆర్ధిక విధానాలను బాగా అర్ధం చేసుకుని వాటివల్ల భవిష్యత్తులో రాబోయే మంచి చెడులను 30 ఏళ్ళ క్రితమే రాయగలిగాను. ఈ టాపిక్స్ మీద రామోజీరావు గారు రెండు సార్లు నాతో చాలాసేపు చర్చించారు. జర్నలిస్టు సహచరుడు, సోషలిస్టు కీర్తిశేషులు బిసి నారాయణ గారు

నేను లిబరలైజేషన్ పర్యవసానాలపై కథనాలు రాసిన కాలంలో ఒక సారి “ మిక్స్ డ్ ఎకానమీ మీద MC కూడా ఇంతే అధారిటేటివ్ గా రాసేవారు” అని చెప్పారు.

ఇవాళ సమావేశం ముగిశాక “యూట్యూబ్ న్యూస్ వ్లోగర్” రామ్ నారాయణ్ “ గురూగారూ మీరు ముప్పైఏళ్ళ క్రితం రాసినవన్నీ ఇపుడు చూస్తున్నాము” అని ప్రస్తావించినపుడు నన్ను నేనే కౌగలించుకున్నట్టు అనిపించింది.

ఒక్కసారి కూడని MC తో నేను బాగా కనెక్టయిన విషయం బిసి నారాయణ గారి వల్ల అపుడు తెలిసింది. రామ్ నారాయణ్ వల్ల ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది.

ఈ కార్యక్రమకర్త యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, సహచర జర్నలిస్టు శ్రీరామమూర్తి సందర్భం చెప్పి మీరు కొందరికి సన్మానంచేయాలి తప్పక రండి అని పొద్దున్న కూడా గుర్తు చేశారు. మెయిన్ స్ట్రీమ్ లో వున్న జర్నలిస్టులకు నా చేతులమీదుగా సన్మానం అనుకుని వెళ్ళాను. శ్రీరామమూర్తి కొంచెం ట్రిక్కిష్ గా పిలిచారు.

సహచర జర్నలిస్టులు కృష్ణకుమార్, భూషన్ బాబు, గన్నికృష్ణ , పంతం కొండలరావు, కందుల దుర్గేష్, ఆదిరెడ్డి వాసు గార్లు పత్రికా రంగం పెడధోరణులు, పాత్రికేయుల ఆర్ధిక భారాల గురించి ఆవేదన వెలిబుచ్చారు.

మిశ్రమ ఆర్ధిక వ్యవస్థలో జర్నలిస్టుగా పుట్టి, పెరిగిన నేను లిబరలైజేషన్ ని కూడా అర్ధం చేసుకుని నా బ్లాగులో రాయగలుగుతున్నాను. ఫేస్ బుక్ మొదలైన సోషల్ మీడియాలో దాన్ని కొద్దిమందిలో కైనా తీసుకువెళ్ళగలుగుతున్నాను. ఆర్ధిక విధానాల్లో మౌలిక మౌన మార్పువచ్చినా ఆ మూలాలను నేపధ్యంలోకి తీసుకోకుండా పనిచేయడమే జర్నలిస్టులు ప్రజలకు కనెక్ట్ కాలేకపోతున్నారేమో నని, అంటే ఆట స్థలం మారిపోయాక కూడా పాత ప్లేగ్రౌండ్ లోనే మేము ఆడేస్తున్నామేమో నని నా అనుమానం.

సన్మాన సమావేశంలో నేను ఇదే చెప్పాను.

⁃ పెద్దాడ నవీన్

ఇవి అమృత ఘడియలు…


డబ్బు ఇబ్బందులు వుంటాయి. ఆశలు సంతోషాలు వుంటాయి. కష్టాలు కన్నీళ్లు వుంటాయి. నిరాశలు నిస్పృహలు వుంటాయి.

మనిషికైనా ఇంటికైనా వీధికైనా రాష్ట్రానికైనా దేశానికైనా ఇదే జీవితం..ఇందులో పండగలు ఒక హుషారు ఊపు తెస్తాయి.

ఇంటికైతే జెండా కట్టుకోలేదు కాని నేను 75 ఏళ్ళ జెండా పండగలో వున్నాను. అంటే సంఘంలో ధోరణుల గురించి విలువల గురించి ధర్మాల గురించి ఆలోచనల్లో వున్నాను.
ఆశనిరాశలు మధ్య ఊగుతున్నాను.

అయినా నాకు ఆశ వైపే మొగ్గు వుందని నమ్ముతున్నాను.

పాలకులు (కాంగ్రెస్ / బిజెపి / తెలుగుదేశం / వైఎస్ఆర్ కాంగ్రెస్ – ఎవరైనా సరే) నిజాన్ని పూర్తిగా చూడనివ్వరు కళ్ళకు గంతలు కట్టేస్తారు. తమకు నచ్చినదానినే బూతద్దాలతో చూపిస్తారు. ఇందులో మోదీ / జగన్ తక్కువా కాదు. ఎక్కువా కాదు.

కొందరి ఓట్లకోసం అందరి డబ్బనీ పప్పూబెల్లాల్లా జగన్ పంచేస్తూండటం నచ్చడం లేదు. – ఇది అధర్మం

నచ్చకపోతే పాకిస్థాన్ పో అనే దుర్మార్గుల్ని మోదీ ఖండించకపోవడం అసలే నచ్చడం లేదు – ఇది అమానుషం, అనాగరీకం

మిగిలిందంతా ఒకే

మీకు స్వతంత్ర భారత అమృతోత్సవ శుభాకాంక్షలు!

——

ఎర్రకోటనుంచి ప్రధాని ప్రసంగాన్ని టివిలు వచ్చాక నేను ఎప్పుడూ మిస్ అవలేదు. రాత్రి హైఓల్టేజి వల్ల అడాప్టర్లు కాలిపోయాయి. రెండు టీవీలూ పనిచేయడంలేదు. (వేరేవాళ్ళ అడాప్టర్ తో చూస్తే రెండు టివీలూ పనిచేస్తున్నాయి) క్వాలిటీ కరెంటును సాధించుకోలేకపోయాము.

ఇందువల్ల ప్రధాని ఎర్రకోట అమృతోత్సవ ఉపన్యాసాన్ని మిస్ అయిపోయాను – తరువాత చూడవచ్చు ఏదైనా రియల్ టైమ్ లో చూసిన హుషారే వేరు.

వీరవాసరం… వాయిదా!


స్వాతంత్ర్య సమరయోధుడు నా తండ్రి కీర్తిశేషులు పెద్దాడ రామచంద్రరావు గారు పుట్టి పెరిగిన వీరవాసరంలో ఆయన ఒకప్పటి ఇల్లు, వీధులు, పొలాలు చూసి రావాలన్న కోరిక చాలా కాలంగా వుంది.

వీరవాసరంలో మా ఇలవేలుపు వున్నట్టు ఒక పురోహితుని భాష్యంద్వారా నా భార్య కనిపెట్టింది. ఆమెకు నమస్కారం పెట్టి రావాలన్నది తన కోరిక. ఇందుకు పసుపు కుంకుమ గాజులు చీరె రెడీ చేసింది.

వీరవాసరంంలో ఒక మిత్తుడిని ఫోన్ ద్వారా పట్టుకుని మా కార్యక్రమం చెప్పాను. ఆయన తప్ప నాతాతతండ్రుల ఊరిలో నేను తెలిసిన వారు ఎవరూ లేరు

సరే రండి. ఆ యోధుడి వారసుడిగా మీకు మా మిత్రబృందం చిరుసత్కారం చేసుకుంటాము అన్నారు.

జెండా పండుగ అయ్యాకే వీరవాసరం వెళ్ళాలని నిర్ణయించుకున్నాము.

మాకు సత్కారాలు వొద్దు. కాయలు అమ్ముకోడానికి

“ఆ చెట్టు” మా ఇంటికే పరిమితం అనుకోవడం లేదు. నా తండ్రిగారికి ఆయన వ్యక్తిత్వం వల్ల రాజకీయాల్లో సమాజంలో గౌరవ మర్యాదలు వచ్చాయి. ప్రభుత్వ యంత్రాంగం నుంచి కొన్ని సార్లు అవమానాలూ జరిగాయి.

మాతండ్రిగారి విషయంలో వారసుసమైన నేను, తమ్ముడు సుధీర్ తృప్తిగా వున్నాము. మమ్మల్ని సత్కరించాలని మిత్రుడు అనుకోవడమే మా నాన్నగారికి మరోసారి సన్మానం జరుగుతున్నట్టు గా భావిస్తున్నాను.

వీరవాసరం తరువాత వెళ్తాము #nrjy

రాంగ్ బటన్లు నొక్కుతున్న జగన్!


(పెద్దాడ నవీన్ 27-7-2019)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత ఆర్ధిక వాతావరణంపై అంతర్జాతీయ ద్రవ్యసంస్ధలకు కేంద్రప్రభుత్వం వివరణ ఇచ్చుకోవలసిన పరిస్ధితిని ముందుకి నెడుతున్నారు

తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించాక కూడా చంద్రబాబు మీద పగా ద్వేషాలతో రగిలిపోతున్నట్టున్న జగన్ మాటలుచేతలు పాత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడటానికి మాత్రమే పరిమితం కాలేదు

రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ మెట్రోరైలు నిర్మాణాలకు అప్పు ఇవ్వడానికి ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు రుణం ఇవ్వలేమని చెప్పేశాయి.

ఆర్ధిక సంస్కరణలు, ఉదార విధానాలు భారత్ లో 29 ఏళ్ళక్రితం మొదలయ్యాయి. పెట్టుబడులను ప్రోత్సహించే పద్ధతిలో ప్రయివేటు రంగానికి అనేక రాయితీలు ఇవ్వవలసి వుంటుందిఇంకా చెప్పాలంటే గొంతెమ్మ కోర్కెలు అనిపించే ప్రయివేటు షరతులను ప్రభుత్వాలు ఆమోదించక తప్పదు. విధంగా విస్తరించే పరిశ్రమలు సర్వీసురంగం ప్రయోజనాలను రెండోదశలో వినియోగదారులకు అందేలా చూడవలసి వుంటుంది.

భిన్న సంస్కృతులు, ఆర్ధిక స్ధితిగతులు, రాజకీయ వాతావరణాలు వున్న భారత దేశంలో సంస్కరణలు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే తీరుగా, ఒకే వేగంతో అమలు కావడం లేదు. అయితే సంస్కరణల తత్వాన్ని ముందుగా గ్రహించి వేగంగా అమలు పరచిన ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లోనే ఆర్ధిక, వాణిజ్య రంగాలలో అంతర్జాతీయ, జాతీయ వేదికల మీద (అవిభక్త) ఆంధ్రప్రదేశ్ ను ప్రముఖంగా నిలబెట్టారు. తొలిదశల్లో ఆయన సంక్షేమాన్ని పక్కన పెట్టి సంస్కరణల కు పెద్దపీటవేసి పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారని పేరుపడ్డారు

ఆతరువాత వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంస్కరణలకు సంక్షేమానికి మధ్య సమతూకం తెచ్చారు. “ఆరోగ్యశ్రీపధకం ఆయనకునప్రజానాయకుడిగా దేశంలోనే ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది

రెడ్ టేపిజాన్ని, పర్మిట్ల రాజ్యాన్ని తొలగించే సంస్కరణలతో పాటు లంచగొండితనం, బ్రోకర్ల సేవలు, “మీకు అది నాకు ఇది”, అనే ఒప్పందాలు, అవినీతి పెరిగిపోతాయి. ప్రపంచమంతటా ఇదే ధోరణి వుందిఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఒప్పందాలపై చంద్రబాబు నాయుడు, ఓడరేవులు, సెజ్ నోటిఫికేషన్ల వంటి భూముల కేటాయింపులపై వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. అక్రమ ఆదాయాల కేసుల్లో అప్పటి ముఖ్యమంత్రి కొడుకుగా జగన్, అప్పటి మంత్రి, కొందరు అధికారులు జైలుకి వెళ్ళడం సంస్కరణల్లో అవినీతి పార్శ్వానికి పరాకాష్ట. జగన్ మీద కేసుల విచారణ సాగుతూనే వుంది

నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ విభజన, 13 జిల్లాల రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం, రాజధాని, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం వంటి నిర్మాణ, పునర్మిర్మాణ బాధ్యతల అమలు మొదలయ్యింది. దశలో జరిగిన ఎన్నకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది

ముఖ్యమంత్రిగా జగన్ తన ఎజెండాను అమలు చేయడం కంటే చంద్రబాబు మీద పెంచుకున్న ద్వేషాన్ని ప్రతీకారంగా మార్చుకోడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు అర్ధమౌతోంది. రాజరికంలో తప్ప ప్రజాస్వామ్యంలో ఇది నడవదు

విద్యుత్తు ఒప్పందాలను తిరగదోడటం , రివర్స్ టెండరింగ్ మొదలైన నిర్ణయాలు  ప్రత్యక్షంగా రాష్ట్రాభివృద్ధిని కుంటుపరచేవిగా పరోక్షంగా జగన్ కాళ్ళ కిందికి నీళ్ళు తెచ్చేవిగా వున్నాయి

రాష్ట్రాల ప్రతిపాదనలు, కేంద్ర సంస్ధల, శాఖల ఆమోదాల తరువాతే ఆంతర్జాతీయ, జాతీయ ద్రవ్య సంస్ధల ఒప్పందాలు జరుగుతాయిప్రతీదశలోనూ పైనుంచి కిందికి ప్రశ్నలు అడగటం, కింద నుంచి వివరణలు ఇవ్వడం జరుగతుంది. ఒకసారి ఆమోదం కుదిరాక దానిని తిరగదోడటం అంటే ప్రాజెక్టు రద్దైపోవడమే

ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది ఇదే

ముందు చూపూ, పర్యావసానాలపై అంచనాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ఒక ముఖ్యమంత్రి చేయకూడని పని. ఆయనకు తెలియదు సరే ఆజేయ్ కల్లాం వంటి అనుభవజ్ఞులైన సలహాదారులు , ప్రభుత్వ యంత్రాంగం సలహా ఇవ్వకపోవడం ఆశ్చర్యకరంసలహా ఇచ్చినా జగన్ పట్టించుకోలేదంటే రాష్ట్రం దౌర్భాగ్యం

పరిస్ధితిని రాజకీయకోణం నుంచి చూసినా జగన్ కే నష్టం. మోదీ ప్రభుత్వం తాను నిర్దేశించుకున్న ఆర్ధిక విధానాలతోనే పాలన సాగిస్తుందిఅమిత్ షా సారధ్యంలోని బిజెపి తాను నిర్దేశించుకున్న మార్గంలోనే ప్రత్యర్ధులను తొక్తేస్తూ పార్టీని విస్తరించుకుంటూ పోతుందిఇందులో వ్యక్తిగత ప్రాబల్యాలకూ, ఎమోషన్లకూ, ఇగోలకూ చోటు వుండదు

నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ వంటి సామాజిక న్యాయం విధానాలపట్ల ద్రవ్య సంస్ధలకు అభ్యంతరం వుండదు. పరిశ్రమల్లో 75 శాతం స్ధానికులకు రిజర్వేషన్ విధానాలను ద్రవ్యసంస్ధలు అనుమతించవు. కాదూ కూడదని చట్టం చేస్తే రాష్ట్రంలో పరిశ్రమలకు అప్పు దొరకదు

సంస్కరణలకు వ్యతిరేక దశలో వున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఖరి అంతర్జాతీయ ద్రవ్యసంస్ధలకూ, కేంద్ర ప్రభుత్వానికీ నచ్చదు.. ‬

సంస్కరణలకు అనుకూలంగా చట్టాలను మార్చుకుంటూ వస్తున్న మోదీ ప్రభుత్వం జగన్ దుందుడుకు తనానికి గట్టిగానే చెవిమెలిపెట్టే వాతావరణం కనబడుతోంది. 

సామాజిక న్యాయం, సంకషేమాలతోపాటు సంస్కరణలను కూడా జగన్ భుజాన మోయకపోతే మోదీ ప్రభుత్వానికి ఎపి ప్రభుత్వానికి మధ్య ఆర్ధిక సూత్రబద్ధమైన వైరుధ్యంవారిని ప్రత్యర్ధులగా మార్చే అవకాశం వుంది.

నిజమైన పుణ్యక్షేత్రం!!


రాజహంసలు, గూడబాతులు, మంచు కొంగలు…పేరు ఏదైనా కాని సైబీరియా నుంచి వచ్చే పక్షులకు పుట్టింటి వారి వలె పురుడుపోసి తల్లీబడ్డల్ని అల్లుడినీ భద్రంగా సాగనంపే “పుణ్యక్షేత్రం” 5-8-2018 ఆదివారం నాడు మరోసారి దర్శనమైంది.

ఆహారమైన క్రిమి కీటకాలవేటలో రాత్రంతా షికార్లు చేసి పగటిపూట తల్లకిందులుగా వేలాడుతూ నిద్రపోయే గబ్బిలాలకు గూడై నిల్చిన “రాధేయపాలెం” చెట్టుని ఆవెంటనే దర్శించుకున్నాము. 

ఇదంతా రాజమండ్రికి 20 కిలోమీటర్లలోపు దూరంలోనే! గ్రేకలర్ ముక్కు, మచ్చలు వున్న తెల్లకొంగలు జంటలు జంటలుగా జూన్ జులై ఆగస్టునెలల్లో సైబీరియా నుంచివస్తాయి. పుల్లా, పుడకా ముక్కున కరచి, పదిలపరచుకుని, సురక్షితమైన స్ధావరాల్లో గూడుకట్టుకుంటాయి. గుడ్డుపెట్టిన కొంగ దాన్ని పొదిగి పిల్లను చేసే వరకూ మగకొంగ మేతను ఏరుకు వస్తుంది. పిల్లకు రెక్కలు బలపడి ఎగరడం నేర్చుకునే వరకూ తండ్రి కొంగ గూడులోనే వుండి పిల్లను కాపాడుకుంటుంది. తల్లికొంగ మేతను ఏరుకొచ్చి తండ్రీబిడ్డల కడుపునింపుతుంది. రెక్కలొచ్చిన బిడ్డలు, తల్లిదండ్రులూ డిసెంబర్ జనవరి నెలలలో వెళ్ళిపోతాయి.

కుటుంబ బాధ్యతల్లో పనివిభజనకు ఇంతకంటే మరొక రోల్ మోడల్ వుండదు.

చిన్నపాటి అలికిడికే బెదరిపోయే మూగజీవులు పుణ్యక్షేత్రం గ్రామం చెరువు చుట్టూ గట్టంతావున్న చెట్లనిండా సైబీరియానుంచి వచ్చే పక్షుల గూళ్ళు కట్టుకుంటున్నాయంటే ఈ ఊరి జనం మీద ఆ పక్షుల నమ్మకానికి భరోసాకి ఆశ్చర్యమనిపిస్తుంది. పక్షులను వేటాడే వారిని ఊరినుంచి పంపివేయడం పుణ్యక్షేత్రంలో తరతరాల సాంప్రదాయం. గుడ్లు పొదగడానికి సరైన శీతోష్ణాలు, పౌష్టికాహారాలు లభించడంతో పాటు వాటిని కాపాడుకునే ఊరి కట్టుబాటూ, పుణ్యక్షేత్రాన్ని సైబీరియా కొంగలకు పుట్టిల్లుగా మార్చేసింది.

ఇదంతా పత్రికలలో, టివిలలో చాలాసార్లు వచ్చింది. నేనుకూడా స్యూస్ ఫీచర్ గా ఈనాడులో, ఈటివిలో, జెమినిటివిలో ప్రెజెంట్ చేశాను. మోతుబరి బొప్పన బ్రహ్మాజీరావుగారు, డాక్టర్ గన్నిభాస్కరరావుగారితో కలిసి లోకసంచారం చేస్తున్నపుడు, ఆ గ్రామంలో డాక్టర్ గారికి ఇదంతా వివరించాను. ఆయన స్వయంగా ఫొటోలు తీశారు.

బ్రహ్మాజీ గారు గబ్బిలాల చెట్టుగురించి గురించి చెప్పగా చక్రద్వారబంధం రోడ్డులో వున్న రాధేయపాలెం దారిపట్టాము. ఊరికి ముందుగానే వున్న చెట్టుకి నల్లతోరణాలు వెలాడుతున్నట్టు నిద్రపోతున్న గబ్బిలాలు కనిపించాయి.

ఈ రెండు సన్నివేశాలలో పుణ్యక్షేత్రం, రాధేయపాలెం గ్రామాల వారి భూతదయ, జీవకారుణ్యం కనిపిస్తున్నాయి.

ఈ సంచారంలో – లోకమే శబ్ధసంగీతాల మయం అని నాకు అర్ధమైంది. దోమలు, తేనెటీగలు, వడ్రంగిపిట్టలు, చిలుకలు, పావురాలు, కాకులు, పక్షులు…నడిచే – పాకే – ఎగిరే క్రిమికీటకాలు, జీవుల పాటల్ని వినగలిగితే మన చెవులు, శరీరం, మనసూ ఆలకించగలదని అనుభవమైనట్టు కొన్ని క్షణాలు అనిపించింది.

కీటకాల, పక్షుల, పిట్టల ప్రతీ కదలిక, ఆట, వేట, ఒరిపిడి, రోదన, సంతోషం, ఆనందాల్లో ఒక లయవుంటుందని, ఆ లయ నుంచే సంగీతం పుట్టుకొచ్చిందని అర్ధమైంది.

జనంరొదలేని ప్రశాంతతలోనే లయ వినపడుతుంది. అది అబలలైన మూగజీవాలక ఆ లయే భరోసా ఇస్తుంది. ప్రకృతి తన సృష్టి ని తాను కాపాడుకోవడం ఇదే! రాధేయపాలెం, పుణ్యక్షేత్రాల మహిమ ఇదే!!

– పెద్దాడ నవీన్

కేన్సర్ : ఏమిటి ఎందుకు ఎలా


కేన్సర్ అంటే ఏంటి?

అపారమూ, అసంఖ్యాకమైన కణాల సముదాయమే మానవ దేహం.

శరీరం లోపలి భాగాల పెరుగుదల, వాటి పని సామర్ధ్యం కణాల చైతన్యం మీదే ఆధారపడి వుంటుంది.

నిరంతర చైతన్య ప్రక్రియలో వున్న కణాలు నశిస్తాయి. కొత్త కణాలు పుడుతూ వుంటాయి

కొన్ని ప్రత్యేక పరిస్ధితుల వల్ల, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల, అవసరానికి మించిన కణాలు పుట్టవచ్చు. అవి పూర్తిగా ఎదగకుండా మిగిలిపోయినపుడు “కంతి” గా స్థిరపడతాయి. వీటిని ట్యూమర్లు అంటాము.

స్వభావాన్ని బట్టి వీటిని బినైన్ ట్యూమర్ అనీ, మెలిగ్నంట్ ట్యూమర్ అనీ పిలుస్తారు.

మెలిగ్నంట్ ట్యూమరే కేన్సర్!

ఈ కేన్సర్ కణం ఏ శరీరభాగం నుంచైనా, ఏ కణం నుంచైనా మొదలవ్వవచ్చు! ఇది రక్తనాళాల ద్వారా ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. చుట్టుపక్కల వున్న ఇతర కణాలను నాశనం చేస్తుంది.

సాధారణ జీవకణాలు కేన్సర్ కణాలుగా ఎందుకు మారిపోతాయో ఖచ్చితంగా తెలియదు. జీన్స్ లో జరిగే కొన్ని మార్పులు ఇందుకు మూలం కావచ్చు.

రోజురోజుకీ మారుతున్న లైఫ్ స్టయిల్, ఆహారపు అలవాట్లు, ఇతర అలవాట్లు ఇందుకు కారణం కావచ్చు!

వయసు పెరిగే కొద్దీ కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువౌతున్నాయి.

కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కేన్సర్ కారకమైన “ కార్సినో జీన్స్ “ నుంచి రక్షణ పొందవచ్చు.

కేన్సర్ అంటే…

అంటు వ్యాధికాదు

ఏ విధంగానైనా కూడా ఒకరి నుంచి మరొకరికి వచ్చేది కాదు.

మొదటి దశల్లోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు

పొగ తాగవద్దు

ఊపిరి తిత్తుల కేన్సర్ వచ్చిన వారిలో 90 శాతం మందికి,

ఇతర కేన్సర్లు వచ్చిన వారిలో 30 శాతం మందికి పొగతాగడమే కేన్సర్ కారణమని, అధ్యయనాలు చెబుతున్నాయి.

కేన్సర్ వచ్చిన వారిలో 3 శాతం మందికి ఆల్కహాల్ అందుకు కారణం.

ఇందువల్ల చుట్ట బీడి సిగరెట్, లిక్కర్, సారా, స్పిరిట్ తాగడం ఆపెయ్యాలి.

పొగతాగే వారి పక్కన వుండే వారికి కూడా హాని జరుగుతుందని మరచిపోకూడదు.

పండ్లు కూరల నుంచి రక్షణ

కేబేజి, కాలిఫ్లవర్ లాంటి కూరగాయల్లో కేన్సర్ నుంచి రక్షించే గుణాలు వున్నాయి. పీచు పదార్థాలు ఎక్కువగా వున్న ఆహారం పెద్దపేగుల్లో కేన్సర్ ను కొంతవరకూ నివారిస్తుంది. “ఎ”, “సి” విటమిన్లు అధికంగా వున్న ఆహారపదార్ధాలు కేన్సర్ ను నివారించడానికి ఉపయోగపడతాయి. తాజాపళ్ళు, తాజా కూరగాయలు ఉన్న ఆహారం అన్ని విధాలా మంచిది.

బరువు తగ్గాలి

శరీర అవసరానికి మించిన బరువు కొన్ని రకాల కేన్సర్ కి దారితీస్తుంది. మితిమీరి తినడం మానుకోవాలి. వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు బరువుని తగ్గిస్తాయి. డాక్టర్ సలహాతో వీటిని అమలు చేయడం మంచిది.

కొవ్వు, మసాలాలు వద్దు!

వేపుళ్ళు, కారం, మసాలాలు ఎక్కువగావున్న ఆహారం వల్ల జీర్ణాశయం, ఆహారనాళాలకు కేన్సర్ సోకే అవకాశం వుంది.

చేప, చర్మం తీసిన చికెన్, మీగడలేని పాలు తీసుకోవడం మంచిది. కొవ్వుపదార్థాలు తక్కువగావుండే ఆహారం మంచిది.

వెస్ట్రన్ దేశాల్లో పెద్దపేగుల కేన్సర్ ఎక్కువ. వారు ప్రొటీన్లు ఎక్కువ, ఫైబర్లు తక్కువ వున్న ఆహారం తినడమే అందుకు కారణం.

మహిళలు – కేన్సర్

మనదేశంలో మహిళల కేన్సర్ అంటే అది గర్భాశయ కేన్సర్ లేదా రొమ్ము కేన్సర్ అయివుంటుంది.

లక్షణాలు

తెల్లబట్ట కావడం దీన్నే వైట్ డిశ్చార్జ్ అంటున్నాము.

బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం

బహిష్టు కాని సమయంలో రక్తస్రావం

లైంగికచర్య తరువాత రక్త స్రావం

ఎలాంటి స్త్రీలలో గర్భాశయ కేన్సర్ లేదా సెర్వికల్ కేన్సర్ కు అవకాశాలు ఎక్కువ?

చిన్నవయసులో పెళ్ళిజరిగినవారికి,

చిన్నవయసులో పిల్లలుపుట్టినవారికి,

హెచ్చుమంది పిల్లల్ని కన్నవారికి,

అల్పాదాయ వర్గాలవారికి,

గర్భాశయ కేన్సర్ లేదా సెర్వికల్ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఈ కేన్సర్ ను ప్రారంభదశకుముందు లేదా తొలిదశలో నిర్ధారించే అవకాశాలు వున్నాయి.

గర్భాశయం లోపలిగోడలను సూక్ష్మంగా పరిశీలించే సెర్వికల్ పాప్స్మియర్ టెస్టు ద్వారా కేన్సర్ రాగల అవకాశాలను కొన్నేళ్ళు ముందుగానే గుర్తించవచ్చు. అసాధారణమైన కణాలు ఈ పరీక్షలో కనబడినట్టయితే భవిష్యత్తులో కేన్సర్ రాగల అవకాశం తెలుస్తుంది. నివారణచర్యల ద్వారా వ్యాధిని నిరోధించవచ్చు.

రొమ్ముకేన్సర్

50 ఏళ్ళుపైబడిన స్త్రీలలో, పిల్లలు పుట్టనిస్త్రీలలో, 12 ఏళ్ళ వయసుకిముందే మెనుస్ట్రేషన్ ప్రారంభమైనవారిలో, 35ఏళ్ళ వయసుదాటాక మొదటిబిడ్డ పుట్టిన స్త్రీలలో, అధికబరువు వున్నస్త్రీలలో, రక్తసంబంధీకులలో ఎవరికైనా రొమ్ముకేన్సర్ వున్న స్త్రీలలో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశంవుంది.

తొలిదశలోనే నిర్ధారించే పద్ధతులు

తమనుతామే పరిశీలించుకోవడం, డాక్టర్ వద్దకువెళ్ళి పరీక్ష చేయించకోవడం, మమ్మోగ్రఫీ ద్వారా పరీక్ష చేయించుకోవడం ద్వారా రొమ్ము కేన్సర్ ను మొదటిదశలోనే గుర్తించవచ్చు.

రొమ్ముకేన్సర్ ను మొదటేలోనే గుర్తిస్తే పూర్తిగా నయంచేసుకునే అవకాశం వుంది. రొమ్మును తొలగించే అవసరంరాదు.

స్వియ పరీక్ష

స్నానంచేసేటప్పుడు, శరీరం తడిగావున్మప్పుడు కుడి రొమ్మును ఎడమచేత్తో, ఎడమరొమ్మును కుడిచేత్తో క్రమపద్ధతిలో తడిమిచూసుకోవాలి.

మెన్సెస్ అయిన తరువాత వారంలోపులో ఈపరిశీలన చేసుకోవాలి. మెనుస్ట్రేషన్ ఆగిపోయినవారు నెలలో ఏదో ఒకతేదీ నిర్ణయించుకుని క్రమంతప్పకుండా ఇలా పరీక్షించుకోవాలి.

వక్షంలో కంతులు, వుండలు చేతికితగులుతాయి. ఇవన్నీ కేన్సర్ కారకాలు కావు. అయితే, క్రమంతప్పని పరిశీలనల్లో కంతులు వుండల లో పెద్దపెద్ద మార్పులు గమనిస్తే అపుడు డాక్టర్ వద్దకు వెళ్ళాలి

అద్దంముందు నిలబడికూడా పరిశీలించుకోవచ్చు!

అద్దంఎదురుగా నిటారుగా, రిలాక్స్ డ్ గా నిలబడి భుజాలు దించి, చేతులు పైకెత్తివుంచి వక్షోజాల అరారంలో సైజులో మార్పులు వున్నాయో లేదో గమనించాలి. రొమ్ముల మీద ముడుతలు, సొట్టలవంటి మార్పులు వచ్చాయేమో చూసుకోవాలి.

వేళ్ళతో పరీక్ష

బొటనవేలు, చూపుడువేళ్ళతో చనుమొనలను నొక్కి ఏదైనాద్రవం వస్తూందా అని గమనించాలి! బిడ్డకు పాలు ఇస్తున్న తల్లికి ఈలక్షణం వుంటే ఫరవాలేదు. చనుపాలు ఇవ్వని స్త్రీలలో ఈలక్షణం వుంటే డాక్టర్ ను సంప్రదించాలి.

జీర్ణాశయ కేన్సర్ కారకాలు

పొగతాగే అలవాటు, వేపుడుఆహారం, ఊరగాయపచ్చళ్ళు, కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు

జీర్ణాశయ కేన్సర్ లక్షణాలు

ఆకలితగ్గడం, బరువుతగ్గడం, పొట్టలోనొప్పి, పొట్టనిండినట్టు, పొట్టబరువుగావున్నట్టు అనిపించడం, తేనుపులు, అజీర్ణం, వాంతులు…ఇవన్నీ జీర్ణాశయ కేన్సర్ లక్షణాలు.

పరీక్షా పద్ధతులు

ఎండోస్కోపీ ద్వారా జీర్ణాశయంలో కంతులు, పుండ్లను గుర్తించవచ్చు. బయాప్సీ అంటే చిన్నభాగాన్ని కోతపెట్టి పరీక్షకు పంపి నిర్ధారణ చేసుకోవచ్చు. రేడియేషన్ ద్వారా, మందులద్వారా, సర్జరీద్వారా జీర్ణాశయ కేన్సర్ ని నయంచేయవచ్చు.

నోరు మరియు గొంతు కేన్సర్

పొగాకు వాడకం, సిగరెట్, చుట్ట, బీడి, గుట్కా, ఖైని, పాన్, ముక్కపొడుం, లిక్కర్, ఆల్కహాల్, చుట్టను కాలుతున్న వైపు నోట్లో పెట్టికుని పొగపీల్టే అడ్డచుట్ట మొదలైనవాటివల్ల నోటికేన్సర్, గొంతుకేన్సర్ రావచ్చు.

లక్షణాలు

నోట్లో తగ్గనివాపు మాననిపుండు కంతి, ఎర్రని లేదా తెల్లనిమచ్చలు, మెడవద్ద బిళ్లలు, కంతులు, తగ్గనిగొంతుమంట, నోటిదుర్వాసన, గొంతుబొంగురుపోవడం, తరచుముక్కుదిబ్బడ, ముక్కునుంచి రక్తంకారడం, తినేటప్పుడు గొంతునొప్పి మొదలైన లక్షణాలు వుంటే అది గొంతుకేన్సర్ లేదా నోటికేన్సర్ అని అనుమానించవచ్చు.

(సంకలనం : పెద్దాడ నవీన్)

జాతరలు…ఒక మతాతీత విశ్వాసం


(పెద్దాడ నవీన్)

జంగారెడ్డిగూడెం గంగానమ్మ జాతర, తాడువాయి వీరభద్రుడి తిరనాళ్ళ, నిడదవోలులో కొటసత్తెమ్మ మొక్కు, గోదావరి కుడి గట్టున గుబ్బలమంగమ్మ గుడి, రాజమండ్రిలో సోమాలమ్మ కాపలా, లోవలో తలుపులమ్మ తల్లిదయమతంతో నిమిత్తంలేని ఇన్ని జాతర్లు, మరెన్ని సంబరాలు నమ్మకానికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే / మొక్కుతీర్చుకునే మనిషి నిబద్ధతకీ ఆనవాళ్ళుఅన్నిమతాలవారూ తీర్చుకునే మొక్కబళ్ళు

ఇవాళ 14-2-2016 సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళినీ, మొన్న హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లినీ చూశాము

 జీవితాన్ని కలుషితం చేసుకున్న మనంనైతికతను కోల్పోయిన మనుషులంఅసంతృప్తులను చల్లబరచుకోడానికో శూన్యాల్ని పూడ్చుకోడానికో మతాన్ని కౌగలించుకున్నాంమనిషి ఉనికిని ఆధ్యాత్మికత ద్వారా సిద్ధాంతీకరించే ప్రయత్నం చేసే మతం మీద నాకు తృణీకారమైతే లేదుగాని, మతం మీదకంటే గ్రామ దేవతలంటేనే ప్రేమ గౌరవాలు వున్నాయి. 

పెద్దపెద్ద కళ్ళతో పసుపు పచ్చ శోభతో మూడడుగులు కూడా ఎత్తులేని మహంకాళి తల్లి (చాలా మంది గ్రామదేవతలు రెండు, మూడు అడుగులకి ఎత్తుకి మించి వుండరు) ప్రజల నమ్మకాల్లో ఎవరెస్టుకి మించిన ఎత్తులో వున్నారు. 

జీవనవిధానంలో ఒకవిధమైన ప్రాకృతిక ధర్మాన్ని, నిరాడంబరతనీ, సొంత నైతికతనీ పాటించే మనిషి సాంఘిక స్వయంభువత్వమే మతాతీత విశ్వాసం. అక్కడ అన్నంలో బిరుసైన మొరటుతనం వున్నా, బలి ఇచ్చే కోడీ మేకా దున్నల చావు వాసన ఆవరించివున్నా ఏదో పవిత్రత అనుభూతిలోకి వస్తూనే వుంటుంది. 

జంగారెడ్డిగూడెం గంగానమ్మ జాతర, తాడువాయి వీరభద్రుడి తిరనాళ్ళ, నిడదవోలులో కొటసత్తెమ్మ మొక్కు, గోదావరి కుడి గట్టున గుబ్బలమంగమ్మ గుడి, రాజమండ్రిలో సోమాలమ్మ కాపలా, లోవలో తలుపులమ్మ తల్లిదయకోరుకొండ, వాడపల్లిఇలా ఎన్నెన్నో తీర్థాలు, తిరణాళ్ళుసంబరాలుఇవన్నీ మతంతో నిమిత్తంలేనివి ఇవన్నీ నమ్మకానికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే / మొక్కుతీర్చుకునే మనిషి నిబద్ధతకీ ఆనవాళ్ళుఅన్నిమతాలవారూ తీర్చుకునే మొక్కబళ్ళు

 రాజమండి ఇస్కాన్ టెంపుల్ లో పరిమళాలు బాగుంటాయి. పాతసోమాలమ్మ గుడిలో కూర్చుంటే ఇది నాది అనిపిస్తుంది. కంచిమఠం లో గంభీర ప్రశాంతత కంటే అర్ధంకాని మంత్రాలు అతి తక్కువగా వుండే హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో, సికిందరాబాద్ మహంకాళి గుడిలోఅసలు ఏగ్రామదేవతల గుడిలో అయినా మనుషుల అలికిడి అలజళ్ళే నచ్చుతాయి. 

మామూలు మనిషిని కాస్తదూరంగా వుంచే మతంకంటే, కష్టమొచ్చినపుడు చేయి పట్టుకున్నట్టు భరోసా ఇచ్చే మతాతీతమైన విశ్వాసమే నాకు ఇష్టంగా వుంటుంది.

 మొక్కుకోవడానికి ఒకసారి, మొక్కు చెల్లించుకోడానికి మరోసారి జనులు తరలి వచ్చే యాత్రలో ఖర్చయ్యే ప్రతి రూపాయీ మన చుట్టూ వున్న ఎకనామిక్స్ ఎలా, ఎంతగా స్టిమ్యులేట్ చేస్తూందో గుడి చుట్టూ వున్న దుకాణాల్ని కాసేపు గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

నోస్టాల్జియా ఒక తియ్యని గాయం!


(గోదావరి జనం యాస, జీవితం ఆత్రేయపురం పరిసరాల లొకేషన్లు ఇందులో

హైలైట్ మిగిలిందంతా హ్యూమన్ ఎమోషన్లే!)

దట్టించి, కిక్కిరిసి జీవితాన్ని కమ్ముకున్న కాలం తిరుగుతున్నట్టు కాక కాలిపోతున్నట్టు వుంది. తాతలు తండ్రులు పిల్లలకు బతుకు ఇచ్చిన ఊరిలాగ, ఊరి చెరువులాగ, పంటచేను లాగ, ఎడ్లబండిలాగ, మనుషుల మూలాలు, జీవితాల వేర్లు దగ్ధమైపోతున్నట్టు వుంది.

నేలమీద కాలిజాడలనే పడనివ్వని పరుగులో ఎన్ని సహజమైన ఆందాలను, అయినవారి మధ్య బంధాలను కోల్పోతున్నామో అనుకున్నపుడు నిట్టూర్పే మిగులుతుంది.

ఏది పోయిందో ఏది పోబోతోందో తెలియనివ్వని ఆధునిక మాయలో కొట్టుకుపోతున్న తరాలను చూస్తూ మనిషిలో గూడుకట్టుకున్న బెంగ కూడా ఒక తియ్యని గాయమే అవుతుందని ”శతమానం భవతి” చూశాక అనుభవమౌతుంది.

గతించిన కాలం మిగిల్చిన దుఖం కూడా ఒక ఉద్వేగభరితమైన ఆనందాన్ని ఇస్తుందని ”శతమానం భవతి” చూశాక అనుభవంలోకి వస్తుంది.

కుదిరితే మీరు కూడా #ZEEసినిమాలు లో వస్తున్న ఈ సినిమా చూడండి! బాగుంటుంది.