నాకు MC ఒక రోల్ మోడల్


17-8-2022

నెహ్రూ ఆలోచనా విధానానికి రిఫరెన్స్ బుక్ లాంటి MC – మానికొండ చలపతిరావు గారు నెలకొల్పిన వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ 65 వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నాకు సత్కారం జరిగింది. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో MC గారి ఫొటో సమక్షంలో జర్నలిస్టులు పౌరప్రముఖులు

సత్కరించిన సీనియర్ జర్నలిస్టులలో నేను మొదటివాడిని.

సన్మానాలు సత్కారాలకు నేను చాలా…అంటే చాలా దూరంగా వుంటాను. 40 ఏళ్ళ జర్నలిస్ట్ కెరీర్ లో నాకు బలవంతంగా / ఆకస్మికంగా చేసిన సన్మానాలు 6 మాత్రమే!

మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధే విధానంగా పంచవర్షప్రణాళికలతో దేశాన్ని ప్రగతి పథం వైపు నెహ్రూ మళ్ళించారు. నేహ్రూ మోడల్ డెవలప్ మెంటు గా నెహ్రూ ఆలోచనా విధానంగా అది అది అభివృద్ధి సిద్ధాంతమైంది.

అలాంటి వాతావరణంలో జర్నలిస్టుగా ఎదిగిన తరం మొదట్లో MC వున్నారు. చివరిలో నాలాంటి వాళ్ళం వున్నాము. ఆయన తెలుగువారు, అయినా ఇంగ్లీషులో నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ గా నెహ్రూ ఆలోచనా సరళిని దేశవ్యాప్తంగా స్ర్పెడ్ చేయడంలో విశేష ప్రభావం చూపించారు.

నెహ్రూ గారి మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధను అర్ధం చేసుకున్న అవగాహనతో “మేము సమాజానికి కాపలాకుక్క” బాధ్యతను చేతనైనంత వరకూ నిర్వహించాము. మా తరానికి నెహ్రూ ఆదర్శవంతమైన సిద్ధాంత కర్త. ఆయన్ని ప్రజలముందుంచిన MC ఒక రోల్ మోడల్ జర్నలిస్ట్.

హైదరాబాద్ వెళ్ళి ఆయన్ని కలుద్దాము అనుకున్నాను. కుదరలేదు. 1983 లోనో 84 లోనో ఆయన చనిపోయారు.

MC జర్నలిస్టుల సంక్షేమం హక్కుల గురించి ఉద్యమించి వుండకపోతే ఆయన చరిత్ర “ప్రధానికి సన్నిహితంగా మెసిలిన పాత్రికేయుడు” అన్న వాక్యంతో ముగిసిపోయి

వుండేది.

వ్యక్తిగతంగా MC నాకు రోల్ మోడల్… ఆయన నెహ్రూ విధానాలను బాగా అర్ధం చేసుకుని ప్రజల్లోకి శక్తివంతంగా తీసుకువెళ్ళారు. నేను సరళీకృత ఆర్ధిక విధానాలను బాగా అర్ధం చేసుకుని వాటివల్ల భవిష్యత్తులో రాబోయే మంచి చెడులను 30 ఏళ్ళ క్రితమే రాయగలిగాను. ఈ టాపిక్స్ మీద రామోజీరావు గారు రెండు సార్లు నాతో చాలాసేపు చర్చించారు. జర్నలిస్టు సహచరుడు, సోషలిస్టు కీర్తిశేషులు బిసి నారాయణ గారు

నేను లిబరలైజేషన్ పర్యవసానాలపై కథనాలు రాసిన కాలంలో ఒక సారి “ మిక్స్ డ్ ఎకానమీ మీద MC కూడా ఇంతే అధారిటేటివ్ గా రాసేవారు” అని చెప్పారు.

ఇవాళ సమావేశం ముగిశాక “యూట్యూబ్ న్యూస్ వ్లోగర్” రామ్ నారాయణ్ “ గురూగారూ మీరు ముప్పైఏళ్ళ క్రితం రాసినవన్నీ ఇపుడు చూస్తున్నాము” అని ప్రస్తావించినపుడు నన్ను నేనే కౌగలించుకున్నట్టు అనిపించింది.

ఒక్కసారి కూడని MC తో నేను బాగా కనెక్టయిన విషయం బిసి నారాయణ గారి వల్ల అపుడు తెలిసింది. రామ్ నారాయణ్ వల్ల ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది.

ఈ కార్యక్రమకర్త యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, సహచర జర్నలిస్టు శ్రీరామమూర్తి సందర్భం చెప్పి మీరు కొందరికి సన్మానంచేయాలి తప్పక రండి అని పొద్దున్న కూడా గుర్తు చేశారు. మెయిన్ స్ట్రీమ్ లో వున్న జర్నలిస్టులకు నా చేతులమీదుగా సన్మానం అనుకుని వెళ్ళాను. శ్రీరామమూర్తి కొంచెం ట్రిక్కిష్ గా పిలిచారు.

సహచర జర్నలిస్టులు కృష్ణకుమార్, భూషన్ బాబు, గన్నికృష్ణ , పంతం కొండలరావు, కందుల దుర్గేష్, ఆదిరెడ్డి వాసు గార్లు పత్రికా రంగం పెడధోరణులు, పాత్రికేయుల ఆర్ధిక భారాల గురించి ఆవేదన వెలిబుచ్చారు.

మిశ్రమ ఆర్ధిక వ్యవస్థలో జర్నలిస్టుగా పుట్టి, పెరిగిన నేను లిబరలైజేషన్ ని కూడా అర్ధం చేసుకుని నా బ్లాగులో రాయగలుగుతున్నాను. ఫేస్ బుక్ మొదలైన సోషల్ మీడియాలో దాన్ని కొద్దిమందిలో కైనా తీసుకువెళ్ళగలుగుతున్నాను. ఆర్ధిక విధానాల్లో మౌలిక మౌన మార్పువచ్చినా ఆ మూలాలను నేపధ్యంలోకి తీసుకోకుండా పనిచేయడమే జర్నలిస్టులు ప్రజలకు కనెక్ట్ కాలేకపోతున్నారేమో నని, అంటే ఆట స్థలం మారిపోయాక కూడా పాత ప్లేగ్రౌండ్ లోనే మేము ఆడేస్తున్నామేమో నని నా అనుమానం.

సన్మాన సమావేశంలో నేను ఇదే చెప్పాను.

⁃ పెద్దాడ నవీన్

జీవనశూన్యంలో నైతికతను వొంపే తీర్ధయాత్ర!


జీవనశూన్యంలో నైతికతను వొంపే తీర్ధయాత్ర!

(పెద్దాడ నవీన్ 19-7-2015)

మూఢభక్తితోకానీ, చేసినతప్పులన్నీ రద్దయిపోతాయన్న అత్యాశ వల్లగానీ, ఓ సారి చూసివద్దాం అన్న కుతూహలం వల్లగానీ, అలవాటుగా పెరుగుతున్న యాత్రావినోదంగాకానీ, ప్రజల్లో ఆలయాల సందర్శన పెరుగుతూవుంది.

ఇవాళ అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయ సందర్శన తో సహా కొంతకాలంగా కుటుంబసమేతంగా నేను చేస్తున్న తీర్ధయాత్రల్లో చాలా విషయాలు గ్రహిస్తున్నాను.

జీవితాన్ని ఆక్రమించుకుంటున్న శూన్యాన్ని పుణ్యక్షేత్తాలూ, తీర్ధయాత్రలూ నింపుతున్నట్టున్నాయి. దర్శనాలు, పూజా క్రతువుల ద్వారా ఒక నిబద్ధతను, ధార్మిక ప్రసంగాల వల్ల ఒక ప్రాతిపదికను, ఆధ్యాత్మిక భావాల వల్ల తాపత్రయాలు వీలైనంత వొదిలించుకోవాలన్న తాత్వికతనూ, ఎంతోకొంత ప్రజలు నింపుకుంటున్నారు.

నిజానికి ఇవన్నీ ఎంతో కొంత భారతీయ సమాజపు భావజాలంలోనే వున్నాయి.

తరం నుంచి మరో తరానికి ఈ భావాలను రీఇన్ ఫోర్స్ చేసుకోవడమే తీర్ధయాత్రల రద్దీ పెరగడానికి మూలం. గ్రామాల్లో ఆలయాలు ప్రత్యక్షంగా సంఘజీవనాన్ని పటిష్టం చేయడంతోపాటు ఊరి ఆరోగ్య సంరక్షణకు ప్రాధమిక కేంద్రాలుగా కూడా వుండేవి. ఇపుడు గ్రామాలు అంతరించిపోతున్నాయి. సమాచార, రవాణా వసతులు పెరిగే గ్లోబల్ వాతావరణం కళ్ళముందుకి వచ్చేసింది. చిన్నా చితకా అంతరించిపోయి మెగావే మిగలడం గ్లోబల్ లక్షణమే.

ఆప్రకారమే సింహాచలం, అన్నవరం, విజయవాడ, శ్రీశైలం, తిరుమల లాంటి ”పెద్ద” ఆలయాలు చేసుకున్న పుణ్యం అంతా ఇంతాకాదు. బస్సులు, కార్లు, రైళ్ళు, విమానాలకు ప్రజల్ని ఈ ప్రాంతాలకు చేర్చడం మీదుండే ఇంట్రెస్టు అంతా ఇంతాకాదు.

ఏమైతేనేమి పూజాక్రతువులనుంచి, ధార్మిక ఆలోచనలనుంచి, ఆధ్యాత్మిక చింతనల నుంచీ ప్రజలు భక్తి భావాలకంటే జీవితాల్లో నైతికతను నింపుకుంటున్నారనీ, నైతిక బలాన్ని సుసంపన్నం చేసుకుంటున్నారనీ అర్ధమౌతోంది.

ప్రపంచాన్ని పరిచయం చేసుకోడానికి క్షణక్షణం అవకాశమున్న కమ్యూనికేషన్ యుగంలో మనుషుల అవగాహనలకు హేతుబద్దతే ప్రాతిపదిక కావడంలో ఆశ్చర్యం లేదు. ఆర్జిత సేవల విషయంలో సిబ్బందినీ అర్చకుల్నీ ప్రశ్నించే లక్షణం బాగా పెరిగింది. చెల్లించిన సేవలపై నిలదీయడనికి అది వారికి డబ్బు ఇచ్చిన ధీమా!

ఎన్ని అసౌకర్యాలనైనా ఓర్చుకుని సహించే దిగువమధ్య తరగతివారు సర్వదర్శనం క్యూలలో అవసరమైతే ఎవరినైనా నిలదీయడానికి సంకొచించని నిర్మొహమాట స్వభావం ”ప్రశ్నించే” అలవాటు పెరుగుతోందనడానికి ఒక సంకేతం.

బ్యాలెట్ బాక్సుల్లో ఈ ”ప్రశ్నలే” ఫలితాల అంచనాలను తారుమారు చేసేవని అర్ధంచేసుకోవచ్చు.

ఆలయాలకు సకుటుంబాలుగా వచ్చే యాత్రికుల్లో చాలా సందర్భాల్లో టూర్ మేనేజర్లు ఆ ఇంటి గృహిణులు కూతుర్లు కోడళ్ళే. ఇది స్త్రీ స్వాభావికమైన మేనేజీరియల్ స్కిల్లే.

ఇవన్నీ పక్కనపెట్టేయండి…రాశులుపోసినట్టు వుండే మనుషుల జీవన సౌందర్యం తీర్ధయాత్రల్లో తప్ప, ఆలయ సందర్శనల్లోతప్ప ఇంకెక్కడ కనబడుతుంది? అసలు మనుషుల్ని మించిన దేవతలూ, దేవుళ్ళూ ఇంకెవరున్నారు? అందుకే దీన్నొక బ్రాండుగా, ఐకాన్ గా ”ముక్కోటి దేవతలు”అన్నారు. #GodavariPost

”పుష్యమి కార్తెలో వాన – ఊరపిచుక నైనా తడపదు”


ఈ సామెత గుర్తురాక కోసం ముగ్గురు స్నేహితులకు ఫోన్ చేశాను. ఈ ఉదయం లేచి పేపర్ చదువుతూండగా పెద్దశబ్దంతో వాన. ఇక ఇవాళ పనులన్ని ఆగిపోయినట్టే అని డిసైడైపోయి, వానచూస్తూ కుర్చోవచ్చని సెటిలైపోయాను. ఈ కాసిని అక్షరాలు టైప్ చేసినంత సేపుకూడా వానలేదు. ఆకస్మికంగా ఆగిపోవడం, చిటపడలాడించే ఎండరావడం ఒకేసారి జరిగాయి.

కేలెండర్ చూద్దునా! పుష్యమి కార్తెకు రెండురోజులు ముందు పునర్వసు కార్తె చివరన ఉన్నామని అర్ధమైంది. ఈ కార్తలో వర్షాలు ఇంతే! ఇప్పటికే పడిన వర్షాలకు ఇంకిపోయిన నేల మీద (పేరుగుమీద మీగడ లాంటి) మెత్తటి పొరను కన్సాలిడేట్ చేయడమే – దీన్నే ‘ఇవక’ వేయడం అంటారు. ఇదే ఈ కార్తెలో ఎపుడైనా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చే వానల ప్రయోజనం!

అర్ధం కాలేదా? నా క్లాస్ చదవడానికి రెడీ అయిపోండి 😀😀…ఈ కార్తెలు వ్యవసాయ పంచాంగానికి మూలాధారాలు…గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధకు కేలెండర్లు.

మనకి 27 నక్షత్రాలు వున్నాయి కదా! ఒకో నక్షత్రమూ ఒకో కార్తె! ఒకో కార్తె కు 13/14 రోజులు వుంటాయి. తెలుగు సంవత్సరాదినుంచి అప్పటి వరకూ ఎన్నిరోజులో ఆసంఖ్యను 14 తో భాగిస్తే వచ్చే నంబరు ఏనక్షత్రానిదో చూస్తే అపుడు ఆకార్తెలో వున్నట్టు అన్నమాట! అర్ధం కాలేదా? వొదిలెయ్యండి పెద్ద ప్రమాదమేదీ లేదు.

పర్యావరణం దెబ్బతిని రుతువులు గతులు తప్పడం వల్ల ఏ కార్తెలో జరగవలసినవి ఆకార్తెలో జరగడం లేదు. వ్యవసాయమే మారిపోయింది. రైతులే కార్తెల్ని మరచిపోయారు.

అయితే, ఆయా కార్తెల్లో వాతావరణం ప్రజల మీద ఎలాంటి ప్రభావం కలుగజేస్తూందో సామెతలుగా మిగిలిపోయాయి…అవికూడా వెతికితే తప్ప కనబడని జ్ఞాపకాల మూటలైపోయాయి.

సాయంత్రం పుణ్యక్షేత్రం అనే ఊరివద్ద ఒక స్నేహితుని పొలం లోకి వెళ్ళాను . షూ కారులోనే వదిలేసి కాసేపు నడిచేసరికి అంగుళం మందాన డార్క్ గ్రే కలర్ షూ వేసుకున్నట్టు కాళ్ళు మట్టిని తొడుక్కున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన వానలకు నేల కడుపు నిండింది. తరువాత పడే వానలు లోనికి దిగకుండా, ఎండలకు లోపలి నీరు ఆవిరైపోకుండా పుష్యమి వానలకు నేలమీద పేరుకునే ఇవక పొర ఫిల్టర్ గా అడ్డుపడుతుందన్నమాట! –అయిపోయింది😀

#GodavariPost

భారతీయ సమాజాన్ని ఉద్వేగపరచే చంద్రయాన్ – 2


చందమామ చెక్కిలి మీటితే తడితగిలిన మాట గుర్తుకొస్తే, ఆనిర్ధారణ చేసిన యూరీ గెగారిన్ – మనసులో ఒక ఉద్వేగమైపోతాడు. భూమాత చుట్టూ తిరుగుతున్న చందమామ ఏకాంతం నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ పాదముద్రతో ముగిసిపోయిందన్న జ్ఞాపకం 50 ఏళ్ళతరువాత కూడా ఉత్తేజభరితమే!

ఒకదానిని మించిన మరొక స్వదేశీ రాకెట్‌ తయారుచేస్తూ, చంద్రయానాలను, మంగళయానాలను ఘనంగా నిర్వహించిన ఇస్రో చరిత్ర జనం ఎమోషన్లలో కదలాడుతూ వుంటుంది.

రాకేష్‌ శర్మ సోవియట్‌ నౌకలో విహారం చేస్తూ ‘సారే జహాసె అచ్ఛా’ అన్నందుకే మురిసిపోయిన భారతదేశం, 39 ఏళ్ళ తరువాత కూడా ఇపుడు పులకరించి పోతున్నట్టు వుంది.

మరో 3 ఏళ్లకు మన స్వదేశీ నౌక ముగ్గురు భారతీయులతో అంతరిక్ష యానం జరిపబోతున్నందుకు ఇపుడే గర్వంతో ఒళ్ళు జలదరిస్తున్నట్టుంది.

భారత్ మొదటి చంద్రయానానికీ, (ఆరాత్ర) 15-7-2019 తొలిఘడియల్లో ప్రయాణమయ్యే చంద్రయాన్ 2 కీ ప్రయోగం స్థాయిలోనూ, పరిశోధన రీతిలోనూ చాలా పెద్దతేడా ఉన్నది.

ఈ సారి భారత్‌ అక్కడ ల్యాండర్‌, రోవర్లను దింపబోతున్నది. సాంకేతికంగా మనకంటే ఎంతో ముందున్న ఇజ్రాయెల్‌ విఫలమైన చోట, గెలవాలని భారత్‌ సంకల్పించింది. ఈ ప్రయోగం సంక్లిష్టతను బట్టి , ‘ఇస్రో’ శివన్‌ దీనిని ఓ భయానక ప్రక్రియగా అన్నారు.

జులై 15న జీఎస్‌ఎల్‌వి–మార్క్‌ 3 రాకెట్‌ శ్రీహరి కోటనుంచి బయలుదేరి చంద్రునివద్దకు ప్రయాణం మొదలెడితే, సెప్టెంబరు ఆరు లేదా ఏడోతేదీన ల్యాండర్‌ అక్కడ వాలబోతున్నది.

ఇప్పటివరకూ ఎవరూ కన్నెత్తిచూడని, ఏ ప్రయోగమూ స్పృశించని చంద్రుని దక్షిణ ధృవం సమీపాన దిగబోతున్నాం. కాస్త ఎక్కువ మంచుతో ఖనిజాలతో నిండిన ఈ ప్రాంతం కొత్త అన్వేషణలకు వీలుకల్పిస్తుంది. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించగానే ఆర్బిటార్‌నుంచి వేరుపడిన ల్యాండర్‌ నెమ్మదిగా అక్కడి నేలను తాకి, అందులోనుంచి ఐదువందల మీటర్ల వరకూ కదలగలిగే రోవర్‌ బయటకు వస్తుంది.

ఆర్బిటార్‌ సంవత్సర కాలం పనిచేస్తుంది కానీ, సూర్యుని అత్యధిక రేడియేషన్‌ కారణంగా ల్యాండర్‌, రోవర్ల జీవితకాలం మాత్రం పద్నాలుగు రోజులే. ఈ మూడూ స్వతంత్రంగానూ, సమన్వయంతోనూ పనిచేస్తూ, చంద్రుని ఉపరితలంలోని నీటినీ, ప్రకంపనలను పసిగడతాయి. తవ్వకాలు జరిపి ఖనిజాలు, హీలియం జాడల వివరాలు అనేకం శోధిస్తాయి.

3.85 లక్షల కిలోమీటర్ల ప్రయాణంలో జీఎస్‌ఎల్‌వి పలుమార్లు తన దిశను మార్చుకోవడానికి విభిన్న కోణాల్లో పేలుతూ కాలుతూ సాగే విన్యాసాన్ని అటుంచితే, ఆర్బిటార్‌ నుంచి వేరుపడిన ల్యాండర్‌ చంద్రుని నేలమీదకు అతినెమ్మదిగా జారిపడే ఆ 17 నిముషాల కాలం ఈ మొత్తం ప్రయోగంలో అతి కీలకమైన, ప్రమాదకరమైన దశ.

2008లో యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, నాసా సహకారంతో జరిగిన తొలి చంద్రయానంలో నీటి జాడలు కనిపెట్టిన మనం, ఇప్పుడు ఓ కొత్త ప్రాంతంలో కాలూని ఎన్ని రహస్యాలు ఛేదిస్తామో చూడాలి.

పదివేలకోట్ల విలువైన ఈ ప్రాజెక్టు అవసరాల్లో 60శాతం ప్రైవేటు రంగం నుంచే తీరబోతున్నందున కొత్త ఉపాధులకు ఊతం వస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రాజెక్టులో భాగస్వామి కాకుండా, రోదసిలో మనకంటూ ఓ అంతరిక్ష కేంద్రాన్ని కట్టుకోబోతున్నట్టు ఇస్రో ఇప్పుడు బహిరంగంగా చెప్పి ఉండవచ్చును కానీ, ఇందుకు సంబంధించిన కృషి మూడేళ్ళుగా సాగుతున్నది.

చిన్నదో, పెద్దదో మనకంటూ ఓ కేంద్రాన్ని నిర్మించుకోవడం మానవయానానికీ, విహారాలకు సిద్ధపడుతున్న భారతదేశానికి అవసరం. వ్యోమగాముల తరలింపు, మార్పిడి వంటి ప్రక్రియలు దీనివల్ల సులభమవుతాయి.

మనకు నచ్చిన, అవసరాలకు తగిన మరిన్ని ప్రయోగాలు యథేచ్ఛగా చేసుకోవచ్చు. రోదసి కార్యక్రమానికి సంబంధించి ఒక విస్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగిపోతున్న ఇస్రో శాస్తవేత్తలూ, అధికారులూ, సమస్త సిబ్బందీ జిందాబాద్! జిందాబాద్! జిందాబాద్!

నీటికి కటకట 


ప్రాణంనిలిపి వుంచుకోడానికి అనివార్యమైన నీరూ ఆహారాలు అంతరించుకుపోతున్న దయనీయ స్దితి సమాజమంతటికీ విస్తరించరించే తొలిదశ దుర్భిక్షం, తరువాత దశ కరువు.. రాయలసీమలో దుర్భిక్షం ఇపుడు కరువుదిశగా అడుగులు వేస్తోంది 

రాయలసీమలో కరువు

  

ఇది గౌరవభంగం కూడా…


పార్లమెంటులో ప్రశ్నించడానికీ, ప్రభుత్వంలో ప్రస్తావించడానికీ వీలులేకుండా ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం దయాదాక్షిణ్యాల ఫైలు లో విభజన హక్కుల్ని కుడా కూరేసి చంద్రబాబు చూస్తూండగానే ప్రధాని చైర్మన్ గా వున్న నీతిఆయోగ్ కాళ్ళకిందికి తోసేశారు…..

http://www.telugu360.com/te/ap-right-is-now-at-neethi-ayoogs-mercy/ 

 

ఎపికి మెట్రో రైలు కుదరదు 


ప్రపంచమే మార్కెట్ అయిపోయాక లాభాలే తప్ప ప్రజాప్రయోజనాలు వుండవు. ప్రభుత్వాలే కాళ్ళావేళా పడినా ‘డబ్బు’ నష్టానికి ఒప్పుకోదు. విజయవాడ మెట్రోరైలు పట్టాలు ఎక్కదు. తలతాకట్టు పెట్టుకుంటేతప్ప రైతుపొలాన్ని సింగపూర్ వాడిక ఇచ్చేస్తేతప్ప నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కి హోదాగానో, పాకేజిగానో ఉదారంగా మోదీ ఇవ్వడానికి ‘డబ్బు’ ఒప్పుకోదు. 

http://www.telugu360.com/te/union-government-rejects-vijayawada-metro-proposal/ 

 

విలాసవంతమైన భోజనం 😀😀


అన్నంలో కలుపుకుని తినడానికి రకరకాల కూరలు పులుసులు సాంబారుల శాఖాహార విందుభోజనంలో ముందుగా మొఘలాయీ వంటకమైన మసాలా దినుసుల పులావ్, బిర్యానీలను వడ్డిస్తున్నారు. వాటిని తిన్నాక ఆతర్వాత అన్నంలో కలుపుకు తినే అనుపాకాల రుచి తెలియదు. ముందుగా పులిహోర తింటే ఆ రుచితో పాటు ఇతర అన్ని వంటకాల రుచులూ ఎంజాయ్ చేయవచ్చని నా అనుభవం ద్వారా గట్టిగా చెబుతున్నాను.
ఇవాళ మధ్యాహ్నం ఒక కాన్ఫరెన్సులో శాఖాహార విభాగంలో ప్లేటు ప్లేటు పట్టుకుని మెనూ వెతుకుతూ వెతుకుతూ వెళ్ళగా ఈ మధ్య రుచి చూడని మునగకాడల ఉలవచారు కనబడింది. మిగిలినవాటిలో కొత్తదనమేమీలేదు. పాలగోవిందు కమ్మటి గడ్డపెరుగు. చెయ్యకడిగిన కాసేపటి తరువాత కూడా రుచుల ఫీలింగ్ నిలుపుకోడానికి విందుభోజనం తరువాత ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్, కిళ్ళీ మొదలైనవి వేటినీ తినను. 
ఇంతకీ ఇవాళ నా మధ్యాహ్నం మెనూ ఏమిటంటే ఉలవచారు, పెరుగు, ముందుగా పెద్ద ఉల్లిపాయల ఆవకాయ…అలా ఇవాళ పెద్దపెద్ద ఉల్లిపాయలు కలిసిన విలాసవంతమైన భోజనం చేయగలిగాను 

ఎగిరిపోతే ఇంత బాగుంటుంది!


ఎత్తుతక్కువ అంచులు, తక్కువ కోత శక్తి, విస్తారమైన వరదమైదానాలు, వున్న నదులను వృద్ధనదులు అంటారు. ఆఫ్రికాలో నైలునది, పాకిస్ధాన్ లో సింధునది, ఇండియాలో గంగ,గోదావరులకు ఈ లక్షణాలు వున్నాయి. గోదావరి ఏడాదిలో ఆరు నెలలు ముదురు గోధుమరంగులో మూడు నెలలు లేత గోధుమరంగులో మూడునెలలు లేత నీలం, లేత ఆకుపచ్చ రంగులు కలిసిన రంగులో వుంటుంది.

ఇవాళ ఈవినెంగ్ వాక్ సమయానికి వానతుంపరలు మొదలయ్యాయి. కారులో వాకింగ్ చేస్తూ చేస్తూ పుష్కరఘాట్ కి చేరుకునేసరికి నదిమీదుగా వీస్తున్న గాలి-నేలమీద కాళ్ళు వుంచే ఎక్కడికికో తెలిపోతున్న అనుభూతిని ఇచ్చింది అక్కడనిలబడితే చాలు ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అనుభవమౌతుంది. అప్పుడే ఫోన్ చేసిన ఒకఫ్రెండ్ మైల్డ్ గా గాలివీస్తున్న శబ్దం వినబడుతోంది ఎక్కడ అని అడిగారు. గోదావరి ఒడ్డున అని చెప్పగానే ఔనా అదేనా నన్ను తాకుతున్న హాయి అన్నారు. 

గోదావరి పక్కన వుండటమంటే అంత రొమాంటిక్ గా వుండటం! గోదావరి అంటే అంతటి భావుకత!!
ఫ్లడ్ లైట్ల వెలుగులో మెరుస్తున్న గోదావరి, నదికే నీరిచ్చే అడవులనుంచి కొట్జుకు వచ్చే ఖనిజలవణాలన్నీ నిరంతరం మేటలు పడుతూ పొరలుపొరలుగా సాగరంలోకి తరలిపోతూన్న వేళ పారదర్శకమైన నీటినుంచి నదీగర్భం గోధుమ రంగులో కనిపిస్తున్నట్టు అనిపించింది. 

 

అమరావతి డిజైన్ రాజమౌళిగారికి అప్పగించండి!


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి డిజైన్ల బాధ్యత రాజమౌళిగారికి అప్పగించాలని మనవి. ఇది వ్యంగ్యం కాదు. వెటకారం కాదు. సీరియస్ గానే చేస్తున్న విన్నపం. 

తెలంగాణా సోదరుల న్యాయమైన డిమాండ్ ప్రకారం రాషా్ట్రన్ని విభజించాలని మొదటినుంచీ కోరుకున్న కోస్తా ఆంధ్రుల్లో నేను ఒకడిని. సమైక్యతా ప్రదర్శనలు జరుగుతున్న కాలంలో నా పోస్టుల వల్ల సీమాంధ్రులతో బండబూతులు తిట్టించుకున్న ఫేస్ బుక్ వాళ్ళలో నేనొక ప్రముఖుడినే.😀😀(ఆంధ్రప్రదేశ్ కు ఆర్ధిక ఇబ్బందులు వుండని విధంగా వాటాలు తేల్చకుండా రాత్రికి రాత్రే సామను బయటపడేసినట్టు చీల్చేసిన సోనియా కాంగ్రెస్ ను ఎప్పటికీ క్షమించలేను)
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రభుత్వకార్యాలయాల నిర్మాణం కోసం 5000 ఎకరాల భూమిని 50:50 దామాషాలో డెవలపర్లకు ఇచ్చేస్తే ప్రభుత్వానికి ఆఫీసు భవనాలు ఫ్రీగా వచ్చేస్తాయి. మిగిలిన సగం స్ధలాన్నీ డెవలర్లు అమ్ముకుని లాభాలతో సహా పెట్టుబడులు రాబట్టు కుంటారని అప్పట్లో ఒక పోస్టు పెట్టాను(ఇపుడు వెతికాను కానీ కనిపించడంలేదు) దాన్ని మిత్రులు వెటకారంగానే భావించారు. అప్పట్లో నన్ను సీమాంధ్రులు శత్రువుగా భావిస్తున్నందువల్ల నా భావనలో సీరియన్ నెస్ ని వివరించే ఓపిక లేకపోయింది. 
సీడ్ కేపిటల్…ప్లానర్…డిజైన్…చీఫ్ డెవలపర్…స్విస్ ఛాలెంజ్, కన్సార్టియమ్ లాంటి టెర్మినాలజీ వినిపిస్తున్నా, ఇపుడు జరిగిందేమిటి? డెవలప్ మెంటుకి ఇచ్చేయడమే కదా? అప్పుడు నేను స్ధూలంగా చెప్పింది ఇదేకదా? ఇందులో వెటకారం ఏమీ లేదుకదా? 
డెవలపర్ ఏంచేస్తాడు? తనకి తెలిసిన డిజైన్లే కదా వేసిఇస్తాడు. సింగపూర్ వాడు వాళ్ళ కళాదర్శకులతో అమరావతి బొమ్మలు గీయించి తెచ్చారు.ఇందులో తెలుగుతనం తేదని ఓఓఓ చించేసుకోవడంలో అర్ధముందా??
అమరావతిని సింగపూర్ లా కాకుండా అమరావతిని అమరావతిలాగే డిజైన్లు గీయడం మనవాళ్ళ వల్లే కుదురుతుంది. బీభత్స దర్శకుడు బోయపాటి శీను రాజమండ్రిలో గోదావరి హారతి వేదికను అందంగా తీర్చి దిద్దలేదా? 

ముఖ్యమంత్రి ఆలోచనల నుంచి సింగపూర్ బొమ్మను చెరిపేసి తెలుగు అమరావతిని ఊహలకు ఎక్కించడం చిన్నవిషయం కాదు. బాహుబలిని నిర్మించిన రాజమౌళి గారికి ఇది మరీ కష్టం కాదు.
మరో ప్లానుతో ముఖ్యమంత్రి సింకయితే ఆడిజైన్ ప్రకారమే రాజధానిని నిర్మించేలా సింగపూర్ ని ఒప్పించడం అసాధ్యం కాదు. 
మనకి డబ్బులు లేవుగనుక రాజధానిని డెవలప్ మెంటుకి ఇవ్వడమే బెటరన్న అప్పటి నా సణుగుడు నిజమయ్యింది కదా! తెలుగుతనం, ఇండియా కూడా లక్షణం వుండేలా డిజైన్ మార్చడానికి ఎవరైనా భారీగా పూనుకోవాలంటున్న నా తాజా సణుగుడు కూడా నిజమవ్వాలని ఆశ ఇది వెటకారం కానేకాదని మనవి