జాతరలు…ఒక మతాతీత విశ్వాసం


(పెద్దాడ నవీన్)

జంగారెడ్డిగూడెం గంగానమ్మ జాతర, తాడువాయి వీరభద్రుడి తిరనాళ్ళ, నిడదవోలులో కొటసత్తెమ్మ మొక్కు, గోదావరి కుడి గట్టున గుబ్బలమంగమ్మ గుడి, రాజమండ్రిలో సోమాలమ్మ కాపలా, లోవలో తలుపులమ్మ తల్లిదయమతంతో నిమిత్తంలేని ఇన్ని జాతర్లు, మరెన్ని సంబరాలు నమ్మకానికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే / మొక్కుతీర్చుకునే మనిషి నిబద్ధతకీ ఆనవాళ్ళుఅన్నిమతాలవారూ తీర్చుకునే మొక్కబళ్ళు

ఇవాళ 14-2-2016 సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళినీ, మొన్న హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లినీ చూశాము

 జీవితాన్ని కలుషితం చేసుకున్న మనంనైతికతను కోల్పోయిన మనుషులంఅసంతృప్తులను చల్లబరచుకోడానికో శూన్యాల్ని పూడ్చుకోడానికో మతాన్ని కౌగలించుకున్నాంమనిషి ఉనికిని ఆధ్యాత్మికత ద్వారా సిద్ధాంతీకరించే ప్రయత్నం చేసే మతం మీద నాకు తృణీకారమైతే లేదుగాని, మతం మీదకంటే గ్రామ దేవతలంటేనే ప్రేమ గౌరవాలు వున్నాయి. 

పెద్దపెద్ద కళ్ళతో పసుపు పచ్చ శోభతో మూడడుగులు కూడా ఎత్తులేని మహంకాళి తల్లి (చాలా మంది గ్రామదేవతలు రెండు, మూడు అడుగులకి ఎత్తుకి మించి వుండరు) ప్రజల నమ్మకాల్లో ఎవరెస్టుకి మించిన ఎత్తులో వున్నారు. 

జీవనవిధానంలో ఒకవిధమైన ప్రాకృతిక ధర్మాన్ని, నిరాడంబరతనీ, సొంత నైతికతనీ పాటించే మనిషి సాంఘిక స్వయంభువత్వమే మతాతీత విశ్వాసం. అక్కడ అన్నంలో బిరుసైన మొరటుతనం వున్నా, బలి ఇచ్చే కోడీ మేకా దున్నల చావు వాసన ఆవరించివున్నా ఏదో పవిత్రత అనుభూతిలోకి వస్తూనే వుంటుంది. 

జంగారెడ్డిగూడెం గంగానమ్మ జాతర, తాడువాయి వీరభద్రుడి తిరనాళ్ళ, నిడదవోలులో కొటసత్తెమ్మ మొక్కు, గోదావరి కుడి గట్టున గుబ్బలమంగమ్మ గుడి, రాజమండ్రిలో సోమాలమ్మ కాపలా, లోవలో తలుపులమ్మ తల్లిదయకోరుకొండ, వాడపల్లిఇలా ఎన్నెన్నో తీర్థాలు, తిరణాళ్ళుసంబరాలుఇవన్నీ మతంతో నిమిత్తంలేనివి ఇవన్నీ నమ్మకానికీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే / మొక్కుతీర్చుకునే మనిషి నిబద్ధతకీ ఆనవాళ్ళుఅన్నిమతాలవారూ తీర్చుకునే మొక్కబళ్ళు

 రాజమండి ఇస్కాన్ టెంపుల్ లో పరిమళాలు బాగుంటాయి. పాతసోమాలమ్మ గుడిలో కూర్చుంటే ఇది నాది అనిపిస్తుంది. కంచిమఠం లో గంభీర ప్రశాంతత కంటే అర్ధంకాని మంత్రాలు అతి తక్కువగా వుండే హైదరాబాద్ పెద్దమ్మ గుడిలో, సికిందరాబాద్ మహంకాళి గుడిలోఅసలు ఏగ్రామదేవతల గుడిలో అయినా మనుషుల అలికిడి అలజళ్ళే నచ్చుతాయి. 

మామూలు మనిషిని కాస్తదూరంగా వుంచే మతంకంటే, కష్టమొచ్చినపుడు చేయి పట్టుకున్నట్టు భరోసా ఇచ్చే మతాతీతమైన విశ్వాసమే నాకు ఇష్టంగా వుంటుంది.

 మొక్కుకోవడానికి ఒకసారి, మొక్కు చెల్లించుకోడానికి మరోసారి జనులు తరలి వచ్చే యాత్రలో ఖర్చయ్యే ప్రతి రూపాయీ మన చుట్టూ వున్న ఎకనామిక్స్ ఎలా, ఎంతగా స్టిమ్యులేట్ చేస్తూందో గుడి చుట్టూ వున్న దుకాణాల్ని కాసేపు గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ఎదుగుతున్న తెలుగు e పుస్తకం


ఆత్మకథలు, రాజకీయ చరిత్రలుఅంతగా లేని ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తి సుదీర్ఘ రాజకీయ అనుభవాలు కూడా చరిత్రలో ఒక పార్శ్వమే. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో కీలక ఘట్టాల గురించి ఆసక్తిదాయకమైన వివరాలు ఇందులో వున్నాయి.
ఒక టెక్నాలజీ నుంచి మారిన జన జీవనశైలి అచ్చు పుస్తకాన్ని వెనక్కి పింపించింది. అయితే మరో టెక్నాలజీ మాయోమంత్రమో అన్నంత అద్భుతంగా సర్వర్లలో నిక్షిప్తమై వున్న పుస్తకాలను గాలిలోనుంచి తీసి కళ్ళముందు వుంచుతోంది. మొబైల్ గాడ్జెట్లు, స్మార్ట్ ఫోన్లు జేబుల్లోకి చేరిపోతూండటంతో ప్రేక్షకులు గా మారిన ఒకనాటి పాఠకులు, కొత్తగా రూపుదిద్దు కుంటున్న చదువరులు తిరిగి e (ఎలక్ట్రానిక్) పాఠకులుగా మారుతున్నారు.
ఎదుగుతున్న తెలుగు e పుస్తకం
  

గోదావరిలో నీటి ఎద్దడి 


  
గోదావరి డెల్టాలో రెండో పంటకు నీటి ఎద్దడి పదమూడేళ్ళనాటి తీవ్రతకు మించి వుండగలదని ఇరిగేషన్ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఇది కనీసం మూడువేల కోట్లరూపాయల వ్యవసాయిక ఆర్ధిక వ్యవస్ధను ప్రభావితం చేస్తుంది. అయితే తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడులు సాధించి చరిత్రను తిరగ రాయాలని రైతులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాజెక్టు కమిటీ భావిస్తోంది. కమిటీ, ఇరిగేషన్ శాఖ సంయుక్తంగా రైతుల్ని ఏమేరకు మోటివేట్ చేయగలరు అన్నదాన్ని బట్టే ధాన్యాగారమైన గోదావరిజిల్లాల్లో రెండో పంట స్ధితీగతీ వుంటాయి.
http://www.telugu360.com/te/godavari-deltas-in-water-crisis/

వెన్నల కాలం 


శీతోష్ణాల సమస్ధితి వల్ల శరీరానికి అలసటలేదు. పెద్దగా మెడికేషన్ లేకపోయినా వారంలోనే వైరల్ ఫీవర్ తగ్గడానికి క్లయిమేటే కారణం అనిపిస్తోంది. ఏమైతేనేమి హైదరాబాద్ లో వారంరోజులు వృధాపోయాయి. అసలే చెమట పట్టని హైదరాబాద్…ఆపై వేడితక్కువ వెన్నెల ఎక్కువ అయిన శరదృతువు. ఆకులు రాలేదీ, రంగురంగుల డిజైన్ల శీతాకోక చిలుకలు గుంపులు గుంపులు గా సంచరించే కాలం వచ్చేసింది. 

రాజమండ్రిలో మాదిరిగానే నిజాంపేటలో కూడా నా ఇంటికి 350 మీటర్ల దూరంలోనే పార్కు వుంది. అది పచ్చటి రౌండ్ పార్క్. ఇది రాతిమీదఎర్రమట్టి, ఇసుక పరచిన స్వేర్ పార్కు. ఇక్కడ వడలిపోయినట్టు వున్న పెద్దమొక్కల ఆకుల తొడిమలు నిస్సత్తువకు వచ్చేశాయి. రేపో మాపో ఆకులు రాలడం మొదలయ్యేలా వుంది. 
పచ్చదనపు మృధుత్వాన్ని చూస్తూ తాకలేకపోతున్నా వెన్నెల కాలంలో నిలబడటమో నడూస్తూ వుండిపోవడమో అద్భుతమైన అనుభవం. ఈసారి ఆ అనుభవాలు హైదరాబాద్ లో దొరుకుతాయోలేదో చూడాలి మరి. కూడాపడే ఆకతాయి కుక్కలను అదలించడానికి చిన్న కర్ర, చలిగా మారుతున్న చల్లదనం నుంచి ఊపిరితిత్తులను వెచ్చగా వుంచడానికి ఒక ఫెల్టు క్యాప్, వాకింగ్ షూలను సిద్ధం చేసుకోవాలి. ఇదేమీ సమస్య కాదుకాని జ్వరపడ్డాక కూడా బుద్దిరాదా? పైగా ఈ పిచ్చి వేషం పేరు ”వెన్నెల వాకింగా” అని నిలదీసే గృహిణికి చెప్పవలసిన సమాధానం వెతకడమే కష్టం అనిపిస్తోంది.

  

మూడేళ్ళకు మళ్ళీ కీచురాళ్ళ సంగీతం !


మబ్బులు తేలిపోయాయి. నిర్మలాకాశంలో సగం చంద్రుడు. ముసురు వెలిశాక వుండే చల్లదనం…గాలి ఆడని ఉక్కపొత…శరీరాన్ని కొంత సౌకర్యంగా కొంత అసౌకర్యంగా వుంచుతున్నట్టు వుంది. అన్నిటికీ మించి కీచురాళ్ళు సంగీతం, కీటకాల రొద మూడు సీజన్ల తరువాత ఇప్పుడే రౌండ్ పార్కలో వినిపించింది…మీ ఊళ్ళో కప్పల మేళం వినబడుతూందా అని సెల్లార్ లో తారసపడిన శ్రీరామపురం నుంచి వచ్చిన పాల అబ్బాయిని అడిగితే ఇంకెక్కడి కప్పలు చైనా ఎక్స్ పోర్ట్ అంటగా అనేశాడు. ముందుటేడాదే వానల్లో కప్పలగోల వినబడింది. నిరుడూ ఈ ఏడాదీ ఆ మోతే లేదు. చేను మీదకంటే ఇళ్ళల్లోనే దోమలు పెరిగిపోయాయని కూడా చెప్పాడు. 
  

ఆదిలోనే హంసపాదు


ఏడాదిలోకావలసిన పనులను ఆరునెలలలోనే గొంతు మీద కూర్చుని పూర్తి చేయించిన అనర్ధమే ఇదని జలవనరులశాఖలో సిబ్బందిని ఎవరిని కదిలించినా తిట్టుకుంటున్నారు

http://www.telugu360.com/te/river-interlinking-aqueduct-breaches-within-hours-of-launch/ 

  

హర్ష రుతువు కేరింత!


ఇది భాద్రపదమాసం లాగేవుంది. పట్టణంలో తట్టుకోలేనంత, పొలంలో చాలీచాలనంత హర్షరుతువులాగే వుంది. నేల అలంబన మీద, నాలుగు చినుకుల ఊతాన్ని అందుకుని పచ్చదనం వెల్లివిరుస్తోంది. 

వేలవేల రంగుల్లో వెలుగు సోకిన వర్ణమే ధగధగలాడుతుంది. బొమ్మలు గీసే ప్రకృతి ఇపుడు ఫోకస్ లైటు ముందుకి ఆకుపచ్చ రంగుని తీసుకొచ్చినట్టుంది. ఇది కనిపించని మసకవెలుగుల సూర్యకాంతి తో కలసి కొత్త ఛాయను తెచ్చింది. ఇది బూడిదరంగు రోడ్డుమీద, ఆకాశపురంగు ఆస్పత్రిమీద, గోధుమరంగు ఇంటిమీద వ్యాపించి కొత్త శోభను పులిమినట్టుంది. 
గాలిలో కలసిపోయిన రంగుల శోభ గుమ్మాలనుంచీ, కిటికీలనుంచీ వెంటిలేటర్లనుంచీ ఇళ్ళలో ఆవరించి, టివిలో బొమ్మతో సహా ప్రతి వస్తువుకీ 

వర్షపు శోభను పూసినట్టు వుంది. మంత్రించిన పారదర్శకతను చిలకరించడం ఇదేనేమో!
రెయిన్, రెయినీ డేస్ మధ్య సమతూకం పోయి చాలాఏళ్ళయింది. వాన కురిసి కురిసి ఆగుతోంది…ఆగి ఆగి కురుస్తోంది…తెరలు తెరలుగా వర్షం పడుతోంది. 
నాకయితే ఇది నాలుగైదేళ్ళతరువాత మళ్ళీ వర్షరుతువులో ఒక కేరింత అనిపిస్తోంది. 
ఆదివారం శుభోదయం

నేలకోత


తేలికగా కోతకు గురయ్యే నేలలమీద కుండపోత వానల వల్ల నీటి జాలులు ఆకస్మికంగా వరదకాల్వలైపోతాయి. రాజమండ్రి దగ్గరలో చక్రద్వారబంధం అనే చిన్న ఊరిలో ఈ మధ్యాహ్నం కురిసిన భారీవానకు చిన్న వరద కాల్వే తయారైంది. రోడ్డు కింద నేలను కోసేస్తోంది. ఇది ఎర్ర ఇసుక నేలల వాలు ప్రాంతం. వాననీటిని నేలలోనే ఇంకిపోయేలా చూడటానికి పొలాలను మడులుగా విభజించి కరకట్టలు (గట్లు) వేసేవారు. వ్యవసాయానికి అడ్డుకాని కాలంలో తుప్పలు పొదలను యధేచ్చగా పెరగనిచ్చేవారు. అవి వానాకాలంలో నేలకోతను నివారించేవి. భూసారం కొట్టుకుపోకుండా ఆపేవి

ఇపుడు కంటికి విశాలంగా కనిపించేలా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకోసం భూమిని చదునుచేసి వుంచుతున్నారు. ఫలితంగా చిన్నవానకే నేలకోత తప్పడంలేదు. ఎంతోకొంత భూసారం కొట్టుకుపోక ఆగడం లేదు.
  

పండగంటే!!!


గత్యంతరం ఒకటుంటుందన్న స్పృహ కూడా లేకుండా జీవన గమనాలు గంతలు కట్టుకున్న చూపుల వెంట అలవాటైపోయిన సర్కస్ నడకలా సునాయాసంగానే గమ్యం చేరుకుంటూనే వుంటాయి. తండ్రివో, తల్లివో, కూతురివో, కొడుకువో, పనివాడివో, యజమానివో, దొరవో, వెధవవో…ఎవరివైనా సరే ఒక ఆర్బిట్ లో ప్రవేశించాక ఏ కక్ష్యలో పరిభ్రమణం వారిదే.

ఈ ప్రయాణంలో విసుగునీ, భారాన్నీ, విరక్తినీ తొలగించడానికో ఏమో, 
– ప్రయాసపడి భారాన్ని మోసేవారందరికీ ద్వారాన్నీ మార్గాన్నీ తానేనని దైవకుమారుడు ఇచ్చిన భరోసా…
– సర్వశక్తిమంతుడైన దైవం ఒక్కడే, మరే ఆరాధన అయినా అవిశ్వాసమే అన్న ప్రవక్త కనువిప్పూ…
– సర్వ సంశయాలూ విడిచి పెట్టి తననే శరణుకోరమని గీతాకారుడు ఇచ్చిన అండా…
మనిషి ఇచ్ఛను దేవుడి అధీనం చేయడానికి దారులు వేశాయి. 

ఇందుకు ప్రలోభంగా లభించే మనసు ప్రశాంతతా, వేడుక వాతావరణమూ పండగే! పండగే!!
కుడుములు లంచమిచ్చి, పనిముట్లు పూజలోపెట్టి ,కోర్కెలు తీర్చమనే వేడికోలు ఇంటిల్లపాదికీ సంబరమే!!

  

నీళ్ళు వచ్చేశాయి


ఇప్పటికిప్పుడే నీళ్ళు చాలవని తెలిసికూడా పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని ఒకసారి జాతికి అంకితంగా, మరోసారి ఇబ్రహీంపట్టణం వద్ద సభగా, ఆవెంటనే పట్టిసీమవద్ద ప్రారంభోత్సవంగా…మొత్తం మీద అనేక ఈవెంట్ల మెగా ఈవెంటుగా ముఖ్యమంత్రి ఎందుకు మార్చేస్తున్నారన్నది సూటిగా సమాధానం దొరకని ప్రశ్న. 

ఇతరవిషయాలు ఎలా వున్నా “నీళ్ళు వచ్చేశాయి” అన్న భారీ ప్రచారం రాజధాని ఏరియా అంతటా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పెద్ద ఊపునిస్తుంది.

అనుసంధానం ఘనత బాబుదే! తక్షణ ప్రయోజనం ఎవరికి ?