Search

Full Story

All that around you

Category

గోదావరి పోస్ట్

All about The River Godavari regeion

నీళ్ళు వచ్చేశాయి


ఇప్పటికిప్పుడే నీళ్ళు చాలవని తెలిసికూడా పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని ఒకసారి జాతికి అంకితంగా, మరోసారి ఇబ్రహీంపట్టణం వద్ద సభగా, ఆవెంటనే పట్టిసీమవద్ద ప్రారంభోత్సవంగా…మొత్తం మీద అనేక ఈవెంట్ల మెగా ఈవెంటుగా ముఖ్యమంత్రి ఎందుకు మార్చేస్తున్నారన్నది సూటిగా సమాధానం దొరకని ప్రశ్న. 

ఇతరవిషయాలు ఎలా వున్నా “నీళ్ళు వచ్చేశాయి” అన్న భారీ ప్రచారం రాజధాని ఏరియా అంతటా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పెద్ద ఊపునిస్తుంది.
http://www.telugu360.com/te/అనుసంధానం-ఘనత-బాబుదే-తక్/

  

ఆంధ్రకేసరి జయంతి నేడే(మాగంటి మురళీమోహన్ గారికి ఈ పోస్టు అంకితం)


రాజమండ్రి విమానాశ్రయానికి ప్రకాశం పంతులుగారి పేరు పెట్టనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాలకుముందు ప్రకటించారు. ఆయన స్ధానికుడు కానందున విమానాశ్రయానికి మరో పేరు ఆలోచిస్తున్నామని పుష్కరాలతరువాత రాజమండ్రి ఎంపి మాగంటి మురళీమోహన్ చెప్పారు. చరిత్రజ్ఞానం లేకపోవడం నేరం కాదు. కానీ, చరిత్రను ధ్వంసం చేసే ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం మన దౌర్భాగ్యం. 

అయ్యా మురళీ మోహన్ గారూ! మీరూ ఎక్కడినుంచో దిగబడినవారే! దయచేసి రాజీనామా చేసి స్ధానికుల్నే ఎన్నుకునే అవకాశం మాకు ఇవ్వండి అని నిలదీస్తే ఆయన తల ఎక్కడ పెట్టుకుంటారు? 
ఒంగోలుదగ్గర వినోద రాయునిపాలెంలో పుట్టి, దరిద్రంలో పెరిగి, ప్లీడరుగా రాజమండ్రిలో జీవితం ప్రారంభించి, మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై ,బారిస్టరుగా ఎదిగి, మద్రాసుకి మకాం మార్చి, ఎడాపెడా సంసాదిస్తూ బ్రిటీష్ కమీషన్ అధ్యక్షుడుగా వచ్చిన సైమన్ వెనక్కి పొమ్మన్న స్వాతంత్రోద్యమంలో తుపాకీతో వస్తున్న పోలీసులకు దమ్ముంటే కాల్చు అని గుండె చూపి, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవిన్యూ మంత్రి అయ్యి, ప్రజల కు చేరువగా పాలనను చేర్చడానికి తాలూకాల నుంచి ఫిర్కాలను విభజించి, విజయవాడవద్ద కృష్ణా నదిపై బేరేజీని పునర్నిర్మించి, రాష్ట్రం విడిపోయాక కర్నూలునుంచే పదమూడునెలలు టెంటుల్లో పాలన సాగించి, వాల్తేరులో అసెంబ్లీని నిర్వహించి, ఆంధ్రరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా పునర్నిర్మిత మయ్యేవరకూ 85 ఏళ్ళు (23 -8-1872 – 20 -5-1957)జీవించి సొంతఇల్లుకూడా లేని ముఖ్యమంత్రిగా పేదరికంలో హైదరాబాద్ లో పేదరికంతో మరణించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 143 వజయంతి ఈరోజే. 
పాలనలో తెలివినికాక హృదయాన్ని చూపిన తెలుగు నాయకులు టంగుటూరి ప్రకాశం పంతులుగారు, నందమూరి తారక రామారావుగారు తప్ప మరెవరూలేరు. సమస్యలపై ఆ ఇద్దరూ ఓట్ల లెక్కల్ని కాక సమస్యల పరిష్కారానికి తోచిన పరిష్కారాలను, హృదయపూర్వకమైన ఉద్వేగాలతోనే నిర్ణయాలు తీసుకున్నారు.

ఇద్దరూ ఎవరు ఏమనుకున్నా తాము నమ్మినదే త్రికరణశుద్దిగా ఆచరించిన ధీరులు.

ఇద్దరూ ఎత్తుపల్లాలు చూసినవారే…అవసానకాలంలో ఒకరిని పేదరికం, మరోకరిని పట్టించుకునే వారు లేని ఒంటరితనం వేటాడింది. మరుగుజ్జు నాయకులకు తెలియకపోయినా ఉత్తేజభరితాలైన వారి జ్ఞాపకాలు ప్రజల హృదయాల్లో పరంపరగా విస్తరిస్తూనే వుంటాయి. 

 

విలాసవంతమైన భోజనం 😀😀


అన్నంలో కలుపుకుని తినడానికి రకరకాల కూరలు పులుసులు సాంబారుల శాఖాహార విందుభోజనంలో ముందుగా మొఘలాయీ వంటకమైన మసాలా దినుసుల పులావ్, బిర్యానీలను వడ్డిస్తున్నారు. వాటిని తిన్నాక ఆతర్వాత అన్నంలో కలుపుకు తినే అనుపాకాల రుచి తెలియదు. ముందుగా పులిహోర తింటే ఆ రుచితో పాటు ఇతర అన్ని వంటకాల రుచులూ ఎంజాయ్ చేయవచ్చని నా అనుభవం ద్వారా గట్టిగా చెబుతున్నాను.
ఇవాళ మధ్యాహ్నం ఒక కాన్ఫరెన్సులో శాఖాహార విభాగంలో ప్లేటు ప్లేటు పట్టుకుని మెనూ వెతుకుతూ వెతుకుతూ వెళ్ళగా ఈ మధ్య రుచి చూడని మునగకాడల ఉలవచారు కనబడింది. మిగిలినవాటిలో కొత్తదనమేమీలేదు. పాలగోవిందు కమ్మటి గడ్డపెరుగు. చెయ్యకడిగిన కాసేపటి తరువాత కూడా రుచుల ఫీలింగ్ నిలుపుకోడానికి విందుభోజనం తరువాత ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్, కిళ్ళీ మొదలైనవి వేటినీ తినను. 
ఇంతకీ ఇవాళ నా మధ్యాహ్నం మెనూ ఏమిటంటే ఉలవచారు, పెరుగు, ముందుగా పెద్ద ఉల్లిపాయల ఆవకాయ…అలా ఇవాళ పెద్దపెద్ద ఉల్లిపాయలు కలిసిన విలాసవంతమైన భోజనం చేయగలిగాను 

త్రీడి సౌండ్ + హెచ్ డి పిక్చర్ = థ్రిల్లర్ ఎఫెక్ట్ 


ఈ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు వినిపించిన శబ్దం 
సకిలిస్తున్న ఒక డైనోసార్ నేను వున్నవైపు చిన్నగా నడిచి వస్తున్నట్టు అనిపించింది. 

అదిపాతిక అడుగుల ఎత్తున వున్న రెండంతస్ధుల భవనం స్లాబుమీదినుంచి తీసినఫొటో ఇది. రిన్నోవేషన్ కోసం బిల్డింగ్ లో ఫ్లోర్ ను పగలగొడుతున్నారు. పెద్దపెద్ద గదులనుంచి వస్తున్న రీసౌండు ఈదురుగాలులతో కలిసిపోయి ఎప్పుడూ వినని ధ్వనులు వినిపించాయి. 
ఎటుచూసినా దట్టంగా ఎదిగిన ముదురు ఆయిల్ పామ్ తోటలు.త్రీడి డిజిటల్ డాల్ఫీ సౌండ్ ఎఫెక్టుతో హైడెఫినిషన్ మూవీ చూస్తున్న యాంబియెన్స్ మల్లవోలులో ఈ బిల్డింగ్ దగ్గర వుంది. 
సాంప్రదాయికంగా మెట్టవరి, కందులు, పెసలు, మినుములు, నువ్వులు, వేరుశెనగ లాంటి వర్షాధార పైర్లు మెట్టనేలల్లో పండించేవారు. వాటికవే విస్తరించిన తాడిచెట్లు దట్టంగా వుండేవి. దీన్ని బట్టి కాస్త పోషిస్తే పామ్ జాతికి చెందిన కొబ్బరి, కోక్, ఆయిల్ పామ్ లాంటి తోటలకు అనువైన నేలలుగా గుర్తించారు. హెచ్చు ఎకరాలున్న పెద్దరైతులు తప్ప సగటు రైతులు కొత్త తోటల ప్రయోగాలు చేయలేకపోయారు. 
1997 పెనుతుఫానుకి కోససీమ కొబ్బరితోటలు ధ్వంసమయ్యాక పామ్ జాతి తోటల సాగు తూర్పుగోదావరి జిల్లాలో ఎర్రగరప నేలలకు ఒక ఉద్యమంలా విస్తరించింది. అడవిలా పెరిగిన ఈ ఆయిల్ పాయ్ తోటల వయసు పదహారు పదిహేడేళ్ళే…
ఇది రాజానగరానికీ, అనపర్తికీ మధ్య మల్లవోలులో ఈరోజు ఉదయం నేను తీసిన ఫొటో 

  

ఎగిరిపోతే ఇంత బాగుంటుంది!


ఎత్తుతక్కువ అంచులు, తక్కువ కోత శక్తి, విస్తారమైన వరదమైదానాలు, వున్న నదులను వృద్ధనదులు అంటారు. ఆఫ్రికాలో నైలునది, పాకిస్ధాన్ లో సింధునది, ఇండియాలో గంగ,గోదావరులకు ఈ లక్షణాలు వున్నాయి. గోదావరి ఏడాదిలో ఆరు నెలలు ముదురు గోధుమరంగులో మూడు నెలలు లేత గోధుమరంగులో మూడునెలలు లేత నీలం, లేత ఆకుపచ్చ రంగులు కలిసిన రంగులో వుంటుంది.

ఇవాళ ఈవినెంగ్ వాక్ సమయానికి వానతుంపరలు మొదలయ్యాయి. కారులో వాకింగ్ చేస్తూ చేస్తూ పుష్కరఘాట్ కి చేరుకునేసరికి నదిమీదుగా వీస్తున్న గాలి-నేలమీద కాళ్ళు వుంచే ఎక్కడికికో తెలిపోతున్న అనుభూతిని ఇచ్చింది అక్కడనిలబడితే చాలు ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అనుభవమౌతుంది. అప్పుడే ఫోన్ చేసిన ఒకఫ్రెండ్ మైల్డ్ గా గాలివీస్తున్న శబ్దం వినబడుతోంది ఎక్కడ అని అడిగారు. గోదావరి ఒడ్డున అని చెప్పగానే ఔనా అదేనా నన్ను తాకుతున్న హాయి అన్నారు. 

గోదావరి పక్కన వుండటమంటే అంత రొమాంటిక్ గా వుండటం! గోదావరి అంటే అంతటి భావుకత!!
ఫ్లడ్ లైట్ల వెలుగులో మెరుస్తున్న గోదావరి, నదికే నీరిచ్చే అడవులనుంచి కొట్జుకు వచ్చే ఖనిజలవణాలన్నీ నిరంతరం మేటలు పడుతూ పొరలుపొరలుగా సాగరంలోకి తరలిపోతూన్న వేళ పారదర్శకమైన నీటినుంచి నదీగర్భం గోధుమ రంగులో కనిపిస్తున్నట్టు అనిపించింది. 

 

కారొ్పరేట్లకే ఆర్జితాలు (శనివారం నవీనమ్) 


విస్తరిస్తున్నకార్పొరేటీకరణ, కుంచించుకుపోతున్న పబ్లిక్ సర్వీసులనుంచి మధ్యతరగతి ప్రజలను దూరం చేసి ఆర్ధిక భారాలను ఎలా మోపుతుందో పబ్లిక్ సర్వీసులను ఎలా నష్టపెడుతుందో అర్ధం చేసుకోడానికి గోదావరి పుష్కరాలు ఒక ఉదాహరణ.

భక్తివిశ్వాసాలతో ప్రజలు గోదావరి స్నానాలకు వెళ్ళినపుడు వారికి సదుపాయాలు కల్పించడం మాత్రమే ఇంతవరకూ ప్రభుత్వాలు చేసిన పని. ఈ సారి 24 గంటల న్యూస్ టివిల వల్ల వచ్చిన ప్రచారం,ప్రభుత్వం ప్రకటించిన సదుపాయాలు, ‘ఉచిత’ ఏర్పాట్లు, పుష్కరాలమీద విశేషమైన ఆసక్తి కుతూహలాలను పెంచేశాయి. వెళ్ళకపోతే ఏదో మిస్సవుతామన్న భావనను వ్యాపింపజేశాయి. ఇలా పెరిగిపోయిన రద్దీ కార్పొరేట్ కంపెనీలకు బ్రహాండంగా సొమ్ము చేసిపెట్టాయి. ముఖ్యమంత్రి పిలుపునకు స్పందించి ప్రజలు యధాశక్తి తాగునీళ్ళు ఆహార వితరణ చేయగా, నెస్లే, పెప్సీ, కోకాకోలా వగైరా సంస్ధలు టన్నుల కొద్దీ వాటర్ బాటిళ్ళను ఇన్ స్టాంట్ కాఫీ,టీ, సాఫ్ట్ డ్రింకులను బ్రహాండంగా అమ్ముకున్నాయి. తమతమ బా్రండులను ఖర్చులేకుండా ప్రచారం చేసుకున్నాయి. 
నిరుపేదల యధాశక్తి వితరణ చూసి సిగ్గుపడో ప్రేరణపొందో ఉచిత లేదా లాభాపేక్షలేని ధరకే సేవలు అందించడానికి కార్పొరేట్ లంటే మనుషులు కావు. అమ్మడానకి, కొనడానికి మనుషుల్ని బానిసలుగా చేసుకున్న పెట్టుబడిదారుల యంత్రబూతాలు. 
రాష్ట్రప్రభుత్వరంగ సంస్ధ అయిన ఆర్టీసీ రాజమండ్రిలో 300 బస్సుల్ని పన్నెండురోజులూ ఉచితంగా నడిపింది.తిరిగు ప్రయాణంలో సీట్లులేక నిలబడి వున్న వారినుంచి చార్జీలు తీసుకోకుండా తీసుకు వెళ్ళింది. పబ్లిక్ సంస్ధ అయిన రైల్వేలు చార్జీలు పెంచకుండా అదనపురైళ్ళునడిపి, సిబ్బందితో ఓవర్ టైమ్ చేయించి యాత్రీకులకు సేవచేసింది. ప్రయివేటు రంగంలో వున్న కంపెనీలు అదనపు విమానాలను హెచ్చుచార్జీలతో నడిపి సొమ్ము చేసుకున్నాయి. 

యాత్రికులనే మార్కెట్ గా చేసుకుని ఔత్సాహికులను ఎక్కించుకుని రాజమండ్రి నెత్తిమీద రౌండ్లు వేసి హెలికాప్టర్ సర్వీసులు సొమ్ము చేసుకున్నాయి. 
సో్తమత వున్నవారు చెల్లింపుల మీద సేవలను కొనుక్కుంటే అభ్యంతరమెందుకు అన్న ప్రశ్న సమజసమే అనిపిస్తుంది. ప్రభుత్వం తటస్ధంగా వుండి, 

సమాన అవకాశం వుండివుంటే ప్రభుత్వ ప్రయివేటు రంగం సంస్ధల మధ్య పోటీ నాణ్యమైన సేవలకు ధరల నియంత్రడకు దారితీసేవి. ప్రయివేటు రంగం మీద నియంత్రణ లేని ప్రభుత్వం , ప్రభుత్వంరంగం సర్వీసులను ఉచితం చేయడం వల్ల ఈ సర్వీసులు అందరికీ సరిపోకపోవడం వల్ల ప్రయివేటు రంగం దోపిడీకి ప్రభుత్వమే తలుపు తీసినట్టయింది. పుష్కరకాలంలో హైదరాబాద్, రాజమండ్రి మధ్య ప్రయివేట్ బస్సులు ఒక పాసింజర్ కు మూడువేల రూపాయల వరకూ కూడా వసూలు చేయడమే ఇందుకు ఉదాహరణ. 
పుష్కరకాలంలో నేషనల్ హైవేలమీద టా్రఫిక్ జామ్ లను నిలువరించడానికి టోల్ ఫీజు వసూలు చేయవద్దని ముఖ్యమంత్రి అడిగారు. ఓగంట పాటు వొదిలారేమో కాని ఆతరువాత ఏటోల్ గేటూ ఫీజు వసూలు ఆపలేదు. ఎందుకంటే ఫీజు వసూలు ఆయా కంపెనీల హక్కు. ఆర్టీసితో ఉచిత సర్వీసులు చేయించడం ప్రభుత్వ అధికారం. ముఖ్యమంత్రి ఆ అధికారాన్ని ఉపయోగించుకున్నారు. ఫలితంగా ఆర్టీసి నష్టపోయింది
ఆమొత్తమెంతో ఆనషా్టన్ని ప్రభుత్వం ఎప్పటికి బర్తీ చేస్తుందో ముఖ్యమంత్రికే తెలియదు.  

పిచ్చుక లంక 


వందల సంవత్సరాలుగా గోదావరినుంచి ఇసుక, మట్టి రేణువులు పొరలు పొరలుగా ఏర్పడిన, ఏర్పడుతున్న అనేకానేక వరద మైదానాలలో ఇదొకటి. ఇది కాటన్ బేరేజి ధవిళేశ్వరం ఆర్మ్ కి కుడి చివర వుంది. వరదకాలంలో ఈ మైదానం మీద చిన్న చిన్న మేటలుగా పేరుకుపోయిన ఒండ్రుబురద ఎండకు ఎండీ మంచుకి మెత్తబడే దీర్ఘకాలిక ప్రక్రియలో నదికి అంచు/గట్టు/కట్టగా మారుతుంది. కుమ్మరి చక్రానికిఈ పా్రసెసే మూలం అనిపిస్తూంది. 

ఈ ఫొటోలో మధ్యలో కాలిబాట వున్న పుంతే గోదావరి గట్టు. కుడివైపు జిగురుగా వుండే చిత్తడి నేల. ఎడమవైపంతా పిచ్చుకలంక! గట్టునుంచి లంక పది మొదలు పదిహేను అడుగుల లోతు వుంటుంది. పొదలు, మొక్కలు చేట్లతో అలుముకున్న లంకలో ఆకుపచ్చతనమే తప్ప మట్టీ, నేలా కనిపించడం లేదు. దీని విస్తీర్ణం 48 ఎకరాలు. చాలా కాలంక్రితం రామానాయుడుగారు స్టూడియో కట్టడానికి పిచుకలంకను చూసి చాలదనుకునో ఏమో విశాఖకు వెళ్ళిపోయారు. రాజమండ్రిని రాషా్ట్రనికి టూరిజం హబ్ చేస్తామని ముఖ్యమంత్రి అన్నాక ఇపుడీ లంక ఎలావుందో చూద్దామని ఒక మిత్రుడితో కలసి వెళ్ళాను. లంక చివర అద్భుతమైన దృశ్యం…అది గోధుమ రంగులో వున్న గోదావరి రేవులో స్నానానికి దిగుతున్నట్టున్న సూర్యుడిని ఎంత సేపు చూసినా విసుగురాని సంధ్య కాంతి.

ప్రశాంతంగా మెల్లిగా నడుస్తున్న నదిలోతు అక్కడ పాతిక అడుగుల పైమాటే!

చుట్టూ పురుగుపట్టి ఎండిపోయిన దొండపాదులు. చూస్తూండగానే రెండు జెర్రిగొడ్లు మెత్తగా పాక్కుంటూ పొదల్లోకి పోయాయి.చెవుల నిండా కీచురాళ్ళు, కీటకాల నిర్విరామ సంగీతం. లంకనిండా తాచులు, జెర్రిగొడ్లే వున్నాయి. వాటినితొక్కితే తప్ప ఏమీ చేయవు. నేలంతా తెల్లిసర మొక్కేకదా పాము పౌరుషాన్ని చంపేసింది అని పాండు చెప్పాడు. 3/4 పాంటు చేతిలో కర్రవున్న పాండుది బొబ్బర్లంక ఇతనికి సొంత బైక్ వుంది. సెల్ ఫోన్ వుంది. ఇతను ఒక కౌలు రైతు కొడుకు. ఏమీ చదువుకోలేదు. డ్యూటీకి రాగానే చొక్కావిప్పేసి బైక్ డిక్కీలో దాచేస్తాడు. లంకలో సాయంత్రం దాకా గేదుల్ని మేపుకుని చొక్కాతొడుక్కుని గేదెల వెనుక నుండి బైక్ డ్రయివ్ చేస్తూ వాటిని ఇంటికి తోలుకుపోతాడు. 
   
    
   

భక్తి, శ్రద్ధల నదీ స్నానం!


కాలధర్మం చెందిన, అయిన వారి జ్ఞాపకాలను సృ్పశించే సామూహిక క్రతువే గోదావరి పుష్కరాల్లో పిండ ప్రధానమని అనుభవమయ్యింది. నా ఉనికికి మా కుటుంబ ఉనికికి క్షేతా్రలు బీజాలు అయిన నా తల్లిదండ్రులు, అత్తమామలు, వారి పెద్దల పట్ల ఒక భక్తి శ్రద్ధలు వ్యక్తపరచడానికి తొమ్మిదోరోజు అయివుండటం వల్ల అన్న శా్రద్ధం పెట్టాను. పూర్వీకుల పేరు నిలబెట్టేది దానమో, ధర్మమో, సంతానమో కనుక ఏదో ఒకటి అయివుండాలి కనుక వారసుడిగా ఒక బాధ్యత నిర్వర్తించానన్న సంతృప్తి మిగిలింది.

గతరాత్రి చాలా సేపు పెద్దలతో నా కున్న జ్ఞాపకలు గుర్తువచ్చాయివారిపట్ల నేను అనుచితంగా ప్రవర్తించిన కొద్ది పాటి సందర్భాలు తలపునకు వచ్చాయి. క్షమాపణలు చెప్పడానికి వారెవరూ లేకపోవడం కొంత దు:ఖానికి కారణమైంది.ఈ ఉద్వేగం పేరు 

పరితాపమో పశ్చాత్తపమో! ఇలా హృదయాన్ని స్వచ్ఛపరచుకున్నాక నదీ స్నానంతో లౌకికమైన క్రతువుని కూడా పూర్తి చేయాలనిపించింది. 
సర్ ఆర్ధర్ కాటన్ గారికి నా తండ్రి పెద్దాడ రామచంద్రరావుగారికి ఇతర కుటుంబ పెద్దలకు పిండ ప్రధానాలు చేయాలన్నాను. కాటన్ గారిగురించి కొత్తగా చెప్పనవసరంలేదు. నాతండ్రిగారు యోధుడు,త్యాగి ఆదర్శవంతమైన జీవితాన్ని ఆచరించిన హీరో. మిగిలిన వారందరూ కుటుంబాలకు మూల స్ధంభాలు. అయితే ఈ ఆర్డర్ లో పిండప్రధానం కుదరదని బ్రాహ్మణుడు తేల్చేశారు. నాతండ్రి, ఆయన తండ్రి ఆయన తండ్రి, నా తల్లి…నా మామ ఆయన తండ్రి, ఆయన తండ్రి, నా అత్త…ఆతరువాతే కాటనైనా మరెవరేనా అని వివరించారు. రాజమండ్రి వచ్చి ఇతరుల సమన్వయలోపం వల్ల అన్యాయంగా పుష్కరాల్లో చనిపోయిన వారి కి కూడా పిండాలు వెయ్యడం వీలుకాలేదు. వారి కుటుంబీకులు ఇపుడు చావు మైలలో వుంటారు కనుక ఇపుడు వారికీ శా్రద్ధాలు పెట్టడం కుదరదు అన్నారు. 
గోత్రనామాల దగ్గర మళ్ళీ చిన్న హర్డిల్…నా గోత్రం చెప్పగానే జంధ్యం ఏదీ అని అడిగారు. మానాన్నగారు నాస్తీకుడు అయి వుండటం వల్ల నాకు వొడుగు చేయించని సంగతి చెప్పాను. సరే శూద్రుడికి చేసినట్టే చేస్తాను అన్నారు. మామగారి గోత్రం చెప్పినపుడు ఇంటర్ కేస్టన్నమాట అన్నారు. దీనికి రెమిడీ వుంది పుష్కరాల తరువాత కలవండి అదీ ముగించేద్దాం అన్నారు. సరే అన్నాను (ఇలా చాలాసార్లయింది. నేను వెళ్ళిందీ లేదు..వెళ్ళేదీ లేదు) 
ప్రోటోకాల్ ఆర్డర్ ప్రకారమే మా కుటుంబాల పెద్దలకు ఇతరుల కోటాలో కాటన్ గారికీ పిండప్రధానం చెశాను.
ఉనికి గీసిన గిరులు దాటి వ్యక్తిత్వాలను విస్తరించుకున్న మనుషులను కాలమే గుర్తుంచకుంటుంది. వారిముద్రలు అంత తేలికగా చెదరవు, చెరగవు.

బాటచేసిన వారినీ, దారిచూపిన వారినీ మరచిపోము. స్మృతి ధాతువును గుండెలో ప్రతిష్టించుకుంటాము. ఇది గాఢమైన ఉద్వేగం…ఈ ఎమోషన్ కి ఒకరూపం పుష్కర స్నానం. 
మనసుల్లో విస్తరిస్తున్న ఎడారుల, ఆశల్లో మొలుస్తున్న ముళ్ళ మొక్కలు, ఊహల్లో అలుముకుంటున్న దుర్భిక్షాలవల్లనో ఏమో గోదావరిని చూస్తేనే ఒక మహదానందం.. ఏదో తన్మయత్వం…స్నానఘట్టం మెట్టుమీద నిలుచుండటమంటే మనుషులూ, గోదావరీ హద్దుగా గీసుకున్న ఆధీనరేఖమీదనో, చెలియలికట్ట నడుమనో ఆగి పరస్పరం గౌరవించుకుంటున్నట్టు అనిపిస్తుంది. మెట్టుదిగితే ఒక చిరు స్పర్శ అనుభవమౌతుంది. నడుములోతు దిగితే ఆలల ఊగిసలాటలో చిన్న సయ్యాట అనుభూతిలోకి వస్తుంది. అపారమైన జలరశులను చూస్తే అణగారిపోయిన ఆర్ద్రతలు 

చెమరుస్తున్నట్టు అనిపిస్తుంది. 
మానవ కల్మషాలు ధరించిన గోదావరీ నమస్కారం

అంతా ”కంటో్రల్” లోనే వుంది 


సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి)ని విస్తృతంగా వినియోగిస్తున్న అతిపెద్ద ఈవెంటు గోదావరి పుష్కరాలే! 

ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో అధికారులు యధేచ్చగా స్మార్ట్ ఫోన్లు, టాబ్ లెట్ పిసిలు వాడుతున్నారంటే పాలనాయంతా్రంగంలో బాగా పెరిగిన ఐటి ప్రాధాన్యతని అర్ధం చేసుకోవచ్చు. 
ప్రతీఘాట్ కూ ఎస్ పి హోదాగల పోలీసు ఉన్నతాధికారులను ఇన్ చార్జ్ లు గా నియమించారు. పుష్కరఘాట్లతో సహా రాజమండ్రిలో ముఖ్యకూడలులను హైస్పీడ్ కనెక్టివిటీ వున్న కెమేరాలతో అనుసంధానం చేశారు.
పుష్కరఘాట్లు, సంబంధిత కేంద్రాల చుట్టూ పర్యటనలు, సమీక్షా సమావేశాల కాలాన్ని మినహాయిస్తే మిగిలిన సమయమంతా ముఖ్యమంత్రి సెంట్రల్ కంటో్రలు రూమ్ లోనే వుంటున్నారు. రాజమండ్రిని 360 డిగ్రీల కోణాల్లో ఎటుకావాలంటే అలా చూసే ఆపరేటర్ పనీ, ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకుని నిర్ణయాలుతీసుకునే అధికారిపనీ, విధాననిర్ణయం చేసే నాయకుడి పనులతో చంద్రబాబు ఏకకాలంలో మూడు పాత్రలు పోషిస్తున్నారు. 
తొక్కిసలాటలో 27 మంది దుర్మరణం పాలైనతర్వాత షాకయినా త్వరలోనే తేరుకుని పరిస్ధితిని అధికారుల, నాయకుల జడత్వం నుంచి విడిపించి తన చేతుల్లోకి తెచ్చుకున్నారు. పుష్కరయాత్రీకుల సదుపాయాలు, రక్షణ గాడినపడ్డాయనుకున్నాక ముఖ్యమంత్రి ఇతరవిధుల నిర్వహణ కూడా మొదలు పెట్టారు. 
పుష్కరయాత్రికుల నుంచి మూడు పద్ధతుల్లో నుంచి ఫీడ్ బేక్ తీసుకుంటున్నారు. ముద్రించిన సర్వే పేపర్లను యాత్రికులకు ఇచ్చి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం, ఘాట్లతో లింక్ అయివున్న సెల్ టవర్ లలో కనిపించే మొబైల్ ఫోన్ నెంబర్లలో రాండమ్ గా నెంబర్లను ఎంచుకుని కాల్ చేసి ఫీడ్ బేక్ తెలుసుకోవడం, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (IVRS) ద్వారా యాత్రీకులే కాల్ చేసి ఫీడ్ బ్యాక్ ఇవ్వడం..టాయిలెట్లలో నీళ్ళకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. పారిశుద్యం తాగునీటి వసతి మెరుగుదలకు ఈ ఫీడ్ బ్యాక్ బాగా ఉపయోగపడిందని రోజుకి 50 వేలమందినుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నామని కంటో్రల్ రూమ్ అధికారి ఒకరు చెప్పారు. 
సమాచారాన్ని ప్రజలకు ఇవ్వడానికీ, ప్రజలనుంచి సమాచారాన్ని అందుకోడానికీ గోదావరి పుష్కరాలను సోషల్ మీడియాలో అధికారులు ప్రవేశపెట్టారు. రాజమండ్రి మెయిన్ పోలీస్ కంటో్రల్ రూమ్ ను 9491235816 నెంబర్ ద్వారా వాట్సప్ తో అనుసంధానం చేశారు. ఇదే కంటో్రల్ రూమ్ ని @APPOLICE100 హేండిల్ తో ట్విట్టర్ కి కనెక్ట్ చేశారు. అలాగే @gpmmc2015 ట్విట్టర్ హేండిల్ నుంచి ఫేస్ బుక్ లో gpmmcrjy ప్రొఫైల్ నుంచి ప్రజలు గోదావరి మహా పుష్కరాల విశేషాలు తెలుసుకోవచ్చు. 

Blog at WordPress.com.

Up ↑