రణమా! శరణమా!!


వైద్య ఆరోగ్య విశ్వాలయానికి ఎన్ టి ఆర్ పేరు తొలగించినందుకు మనస్తాపంతో రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్ష స్ధానం నుంచి వైఎల్ పి (డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్) వైదొలగడం ఒక సందేశంలా వుంది.

ప్రభుత్వాన్ని నడుపుతున్న వారి అడ్డగోలుతనాన్ని వ్యతిరేకించే వారు రణమో శరణమో తేల్చుకోవాలని వైఎల్ పి పిలుపు ఇచ్చినట్టు అనిపిస్తోంది.

ఆరోగ్యమంటే ప్రజారోగ్యమని, వైద్య సేవలను కిందికి తీసుకువచ్చినపుడే ఇది సాధ్యమౌతుందని ఇందుకు వైద్యవిద్యలను విజ్ఞానాలను సమన్వయంగా క్రోడీకరించాలని ఎన్ టి ఆర్ తలపెట్టారు.

రాష్ట్రంలో మెడికల్ కాలేజిలు, నర్సింగ్ కాలేజిలు, ఇతర పారా మెడికల్ కాలేజీల అవి వున్న ప్రాంతపు యూనివర్సిటీల పరిధిలో వుండేవి. ఒకే రాష్ట్రంలో వున్న వైద్య విద్యా సంస్ధల కాలెండర్లలో తేడాలు పైచదువులకు వెళ్ళే సందర్భాల్లో విద్యార్థుల్ని అడ్డుపెట్టేవి. ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో వుండేవారు. ఈ రంగంలో వున్న పెద్దలు అకడమీషియన్లు సమస్యను వివరించినపుడు
ఎన్ టి ఆర్ – రాష్ట్ర వ్యాప్తవ్యాప్తంగా అన్ని వైద్య, పారా వైద్య విద్యా సంస్ధల్నీ ఒకే పాలనా పర్యవేక్షణలో వుండేలా
వైద్య విశ్వవిద్యాలయాన్ని స్ధాపించారు. యూనివర్సిటీకి అవసరమైన మెడికల్ కాలేజిని, టీచింగ్ హాస్పిటల్ నీ విజయవాడలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రభుత్వానికి స్వాధీనం చేసింది.

తరువాత ఇదే నమూనాతో మరికొన్ని రాష్ట్రాలు కూడా రాష్ట్రమంతటికీ ఒకే హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పుకున్నాయి. ఇది వైద్యవిద్యల్లో దేశానికే ఒక దిక్సూచిగా నిలచిన డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ చరిత్ర. వై ఎస్ ఆర్ పేరు పెడుతున్న జగన్ తో సహా ఎవరైనా ఈ చరిత్రను మార్చగలరా?

మూడు దశాబ్దాల్లో వేల వేల మంది డాక్టర్లుగా, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లుగా, డెంటల్ సర్జన్లుగా, ఫిజియో ధెరపిస్టులుగా నర్సులుగా, పారామెడికల్ టెక్నీషియన్లుగా ఈ యూనివర్సిటీ నుంచి డిగ్రీలు తీసుకున్నారు. యూనివర్సిటీ పేరు మారిపోవడంతో వారి పరిస్ధితి ఏమిటి? మాతృసంస్ధతో లింకు తెగిపోయిన ఇలాంటి మెడికల్ అనాథలు బహుశ మరేరాష్ట్రంలో మరే దేశంలో కూడా వుండరుగాక వుండరు.

జగన్ లాంటి పాలకుల చేతిలో పడితే 1000 ఏళ్ళుగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విలసిల్లుతూ వుండేదా? తక్షశిల, నలందా విశ్వవిద్యాలయాల పేర్లు మనకు తెలిసేవా?
బెనరస్ హిందూ విశ్వవిద్యాలయం, ఆలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ, రవీంద్రుడి విశ్వభారతి యూనివర్సిటీలు ఏమైపోయేవి?

ఎవరైనా మంచి పనులు చేస్తే చరిత్రలో మిగిలిపోతారు. చరిత్ర పుస్తకానికి పేరు మార్చేద్దామనుకునే వారు, చిల్లర మనుషులుగా, వివేక వికాసాలు లేని తుంటరులుగా చరిత్రహీనులైపోతారు.

ప్రభుత్వ దుందుడుకు, తుంటరి పనులకు ఎవరైనా స్పందించవలసిందే. వైఎల్ పి రియాక్షన్ ఒక సందేశంగా వుంది. ఎన్ టి ఆర్ కుటుంబీకులతో సహా ఆయన అభిమానులు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా రియాక్ట్ కావలసిందే!

మరో విషయం కూడా గుర్తుకొస్తున్నది. ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రంలో వున్న బిజెపి ప్రభుత్వం బాహాటంగా ఉల్లంఘిస్తున్న సందర్భంలో కామినేని శ్రీనివాస్, ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇలా రియాక్ట్ అయివుంటే కథ మరోలా వుండేది.

ఆ ఇద్దరూ, మరెందరో కూడా సందర్భానికి వచ్చినపుడు ప్రతిస్పందించలేదు. వైఎల్ పి రియాక్ట్ అయ్యారు. అదే ఆయనకు వాళ్ళకు తేడా!

ఇంతకీ! డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని జగన్ ప్రభుత్వం వుంచుతుందా? కూల్చేస్తుందా?? #nrjy

హోదా పై మాయమాటలు వొద్దు !


హోదా” సంజీవనీ మంత్రం కాదని వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతూవుండి వుండవచ్చు. ”పెద్దకొడుకునై ఆంధ్రప్రదేశ్ కష్టం తీరుస్తా” అని తిరుపతి సభలో నమ్మబలికి అధికారం ఎక్కాక మూగనోము పట్టిన నరేంద్రమోదీ నమ్మకం కూడా అదే అయివుండవచ్చు. కానీ, ప్రత్యేక హోదా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించగలదని విద్యావంతులు, ఆలోచనాపరులు, మేధావులు, రాజకీయాలతో సంబంధం లేని తటస్ధవాదులు నమ్ముతున్నారు. వైఎస్ జగన్ మోహన రెడ్డిని వ్యతిరేకించే వారు కూడా ఆయన నిరాహార దీక్షను శ్రద్ధాసక్తులతో పరిశీలిస్తూ వుండటమే ఇందుకు పెద్ద సాక్ష్యం. 

http://www.telugu360.com/te/special-status-the-rescue-mantra-for-ap/  

 

ఆయనే దేవుడు…ఆయనే దెయ్యం 


ముందే నిర్ణయించుకున్న మూసలతో రాతల్ని కొలిచే పాఠకులున్న క్షేతంలో…ఆరో వర్ధంతినాడు రాజశేఖరరెడ్డిగారిని ప్రస్తుతించడమంటే ఆయన అభిమానులతోనూ, వ్యతిరేకులతోనూ బూతులు తిట్టించుకోవడమే…నాలో పాత్రికేయ లక్షణం ఎంత మిగిలివుందో ఒక సారి చూసుకుందామని తిట్టింగుకోడానికి మిత్రుడు గోపాల్ ప్రేరణతో సిద్దమైపోయాను. వైఎస్ గురించే రాశావు చంద్రబాబు అంత పుడింగా అనే వాళ్ళకి సమాధానం ఇవ్వలేను ఎందుకంటే వాళ్ళు సమయమూ సందర్భమూ ఎరుగని మూర్ఖులు కాబట్టి ….

http://www.telugu360.com/te/ysr-is-god-he-is-the-demon/

   
 

ఉల్లాసమై లోనికి పాకిన జనంసవ్వడి 


కోటిలింగాల రేవులో ఈ రోజుమధ్యాహ్నం మా చిన్నోడు, నా భార్య, నేను పుష్కరస్నానం చేశాము. వాతావరణం ఆహ్లాదకరంగావుంది.మనసుకి తృప్తిగా అనిపించింది. 
తిరుపతి నుంచి మిత్రుల రాకవల్ల మొదటి రోజు స్నానం తలపెట్టలేదు. ఆరోజు విషాదంవల్ల ఉత్సుకత పోయింది. రెండోరోజు గోదావరి స్నానం అన్నమాటే అనుకోలేదు. 

నాభార్యకు కాలిలో రక్తప్రసరణ కు సంబంధించిన సమస్య వుంది. పాతిక మీటర్లదూరం నడవాలన్నా కష్టమే. రామ్ నారాయణకి ఫోన్ చేసి తక్కువ దూరం నడిచే ఘాట్ ఎక్కడ అని అడిగితే, కారు మాఇంటి దగ్గర పెట్టి వెళ్ళొచ్చు అన్నాడు. నా భార్య కాలి సమస్య చెప్పినపుడు పాస్ వుందిగా బాగా దగ్గరగా వెళ్ళొచ్చు అన్నాడు…లేదులే అనగానే అయితే మేడమ్ ని టూవీలర్ మీద నేను దింపుతాను అన్నాడు. అవసరమైతే అడుగుతా అని చెప్పాను.
ప్రశాంతంగా స్నానం చేసే టప్పుడు కూడా ఈ ఫోన్ అవసరమా అని ఆవిడఅనగానే ఫోన్ కట్టేసి మంచంమీద పడేశాము.పాస్ కూడా ఇంట్లోనే వదిలేశాను. 
(పుష్కరాల కాలంలో అధికారులతో సమానంగా ప్రజల మధ్య వుండే రాజమండ్రి విలేకరులకు కూడా బంధు మిత్రులు వుంటారు. వారిని గోదావరి స్నానాలకు తీసుకు వెళ్ళడం కూడా బాధ్యతే కదా! గత పుష్కరాల్లో ఒకో విలేకరికీ ఐదుగురు చొప్పున వెళ్ళేలా విఐపి పాసులు ఇచ్చారు. ఈ సారి అలాగే పాస్ లు ఇస్తారని ఆశపడ్డాము. సబ్ కలెక్టర్ ని అడిగితే అసలు పాసులే లేవన్నారు…విఐపి పాస్ లు, వివిఐపి పాస్ లు ఆహోదా అవసరంలేని చాలా మంది దగ్గర కనబడుతున్నాయి. 
విలేకరులకి గతంలో లా విఐపి పాస్ లు ఇచ్చి వుంటే అన్నిపాస్ లమీదా కలిపి అన్ని రోజుల్లోనూ మహా అయితే రెండువేలమంది విఐపి ఘాట్ లలో స్నానం చేస్తారేమో! మూడుకోట్ల మంది స్నానం చేసే చోట ఈ రెండువేల మందీ ప్రజలకు మందీ భారమైపోతారా? విలేకరులకి ఈ పాటి ప్రివిలేజ్ ఇవ్వరా? ప్రభుత్వం తరపున పాస్ లు ఇచ్చిన సబ్ కలెక్టర్ గాని మంత్రులు గాని రాజమండ్రి మీడియాను విశ్వాసంలోకి తీసుకుపోకపోవడం, ఊరందరికీ విఐపి పాస్ లు ఇచ్చి, ఎవరికీ పాస్ లు ఇవ్వడం లేదని అబద్ధం చెప్పడం అవమానంగా బాధగా అనిపించి మేము, బంధు మిత్రులు ఘాట్ లకు వెళ్ళడానికి ఈ పాస్ వాడకూడదని నిర్ణయించుకున్నాను. ఇలాంటి సందర్భాల్లో,మనకి కూడా పాస్ లు వుండవా అని చిటపటలాడిపోకుండా ఇట్ హేపెన్స్ అని నవ్వేసే నా భార్యా పిల్లలకీ నేను ఎల్లవేళలా కృజ్ఞుడినే. వాళ్ళ సపోర్టే నా డిగ్నిటీని గౌరవాన్ని కాపాడుతూంటాయి)
మా సెంటర్ లో వుండే ఆటో డ్రయివర్ గోవింద్ తో వీలైనంత తక్కువగా నడిచే దూరం వున్న ఘాట్ కి తీసుకు వెళ్ళమన్నాము..పోలీసుల కంటపడకుండా ఇరుకు సందులు తిప్పుతూ బాగా దగ్గరగా తీసుకు వెళ్ళాడు. 
గోదావరి గట్టుకి ఆనుకుని వున్న కొటిలింగాల పేటంటే చిత్తడిగావుండే ఒండ్రు నేల. సామిల్లుల నుంచి పచ్చి కలపవాసన, నేలనుంచి కలప ధూళి మురిగిన వాసన, గాలివీచినపుడల్లా చిన్నగా సోకి ఆగిపోయాయి. గట్టు ఆవతల మహాజనసందోహాల సందడి రంగురంగుల ఉల్లాసంగా లోపలికి పాకుతున్నట్టు అనిపించింది.
అతి పెద్దదైన కోటిలింగాల రేవు చాలా చాలా చాలా బాగుంది. నిర్వహణ ఇంకా ఇంకా ఇంకా బాగుంది. ఇంత చక్కటి ఘాట్ ను ఇచ్చిన ప్రభుత్వానికి అధికారులకు కృతజ్ఞతలు. ఇంతటి సొత్తుని పుష్కరాలు ముగిశాక అందంగా ప్రయోజనవంతంగా నిలుపుకోవలసిన నిర్వహించుకోవలసిన బాధ్యత రాజమండ్రి పౌరసమాజానిదే
చాలా సేపు స్నానం చెశాము. తిరిగి వచ్చేటపుడు ఆటోకోసం ఎక్కువ దూరం నడవవలసి వచ్చింది. నా భార్య కాలి నెప్పితో చాలా సేపు అవస్ధపడింది. మంచిది కాదని తెలిసినా పెయిన్ కిల్లర్ వేసుకున్నాకగాని ఆమెకు నిద్రపట్టలేదు.
ఇవాళ కేవలం స్నానం చేసి వచ్చాము పుష్కర / తీర్ధ విధులు నిర్వహించడానికి హైదరాబాద్ నుంచి మా పెద్దోడు వచ్చాక మరోసారి వెళ్ళాలి. ఈ రేవుకే వెళ్దామనుకుంటున్నాము.

నీరు వుంది…కనబడటం లేదు, అంతే! (గోదావరి మహిమ కథ) 


స్నాన ఘట్టాలు ఎంత అందంగా కట్టినా నీళ్ళే లేని గోదావరిలో పుష్కరస్నానాలు చేయడం ఎలా? 

ఈ ఫొటోను చూసినవారెవరికైనా కలిగే అనుమానం ఇదే!
రోజూ సగటున 8 లక్షల మంది యాత్రీకులు పుష్కరస్నానాలు చేయగలరని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్న రాజమండ్రిలో మొత్తం 22 ఘాట్లలో సగం ఘాట్లలో దిగువ మెట్టు వద్ద అడుగులోతు నీరుకూడా లేదు. మిగిలిన ఘాట్లలో నేల, ఎండుతున్న బురదనీటి గుంటల్లావుంది. 
గత పుష్కరాలనాటికంటే ఇపుడు ఎక్కువనీరే గోదావరిలో వుంది….అయితే కనబడటం లేదు అంతే…ఘాట్ లలో సివిల్ నిర్మాణాలు చివరిదశలో వుండటం వల్ల వాటికి అంతరాయం లేకుండా వచ్చిన నీటిని వచ్చినట్టే ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్ మెంటు -కాటన్ బ్యారేజి తలుపులు తీసి సముద్రం లోకి వదిలేస్తున్నారు.
జూలైనెలలో గోదావరి నిండుగా ప్రవహిస్తూంది. ఈ సీజన్ లో సాధారణంగా బేరేజికి వున్న మొత్తం 175 తలుపులూ తెరిచే వుంచుతారు. 2002 వ సంవత్సరం నుంచీ ఇంత వరకూ 13 ఏళ్ళుగా జూలైనెలలో తేదీల వారీగా బేరేజి డిశ్చార్జిని విశ్లేషిస్తే గత పుష్కరాలో సగటున 25 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇపుడు అది 65 వేల క్యూసెక్కులు వుంది. అంటే ప్రస్తుతం సగటున ఒక సెకెనుకి 65 వేల ఘనపుటడుగుల నీరు సముద్రంలోకి వెళ్ళిపోతోంది.
30 వేల క్యూసెక్కుల చొప్పున నీరు విడుదలయిన గత పుష్కరాల్లో 15 రోజులపాటు బేరేజీ తలుపులన్నీ మూసివేయగా సగానికి పైగా మెట్లు మునిగిపోయాయి. మెట్లు దిగి సౌకర్యవంతంగా స్నానం చేయడానికి చాలినంత నీటి మట్టం స్నానఘట్టాల్లో కి చేరింది. ఇపుడు 65 వేల క్యూసెక్కుల్నీ బేరేజి తలుపులు మూసి బిగబడితే గోదావరి ఎగదన్ని స్నాన ఘట్టాలను నీళ్ళతో నింపేస్తూంది. 
ఇందువల్లే పుష్కరాలు ప్రారంభమయ్యే జూలై 14 వతేదీకల్లా దిగువ మెట్ల వద్ద మూడునుంచి నాలుగు అడుగులు నీరు తీసుకురాగలమని సూపరింటెండెంటింగ్ ఇంజనీరు సుగుణాకరరావు వివరించారు. 
లక్షలాది మంది పుష్కరయాత్ర సౌకర్యంగా చేయడానికి రకరకాల ఏర్పాట్ల నిమిత్తం ప్రభుత్వం చేసే పనులన్నీ ఒకఎత్తయితే, పుణ్యస్నానాలకు సమృద్ధిగా నదినీటిని గట్టుకి తెచ్చే వాటర్ మేనేజిమెంటు ఒకఎత్తు. అయితే సివిల్ అధికారులకు వచ్చినంత ప్రచారం వాటర్ మేనేజిమెంటు విభాగానికి రాదు. 
ఫిబ్రవరిలో వచ్చే శివరాత్రి నాటికి ఏనది అయినా ఎండిపోయే వుంటుంది. గోదావరి అందుకు మినహాయింపేమీ కాదు. అయితే రాజమండ్రిలో మాత్రం శివరాత్రికి ఓరోజు ముందే మాయచేసినట్టు, మంత్రమేసినట్టు స్నాన ఘట్టాలన్నీ నీళ్ళునిండి వుంటాయి. అది రెండోపంటకు బొటాబొటీగా గోదావరి నీరు ఇచ్చేసీజన్. అయినా భక్తి స్నానాల సెంటుమెంటు మీద గౌరవంతో పొలాలకు నీరు ఆపేసి బేరేజి తలుపులు మూసేసి గోదావరిని గట్టుకి ఎగదన్నించే వాటర్ మేనేజిమెంటు చిన్న అద్భుతమే! 
వాటర్ మేనేజిమెంటు మీడియాలో పేపర్లలో వివరంగా రాదుకనుక తెల్లారేసరికల్లా మెట్లమీదకి నీరు రావడాన్ని”శివలీల”అనుకోవడం విన్నాను. అలాంటి భక్తులే ఇపుడు దీన్ని”గోదావరి మహిమ” అంటే అదేమీ ఆశ్చర్యంకాదు! 

  

నిస్సహాయులు ఏమిచేస్తారు 


వ్యాపారానికి ఆకలి బానిసైనపుడు ముడుపులు అందుకుని తటస్ధత నటించిన యంత్రాంగం ఆకస్మికంగా ఆయుధాన్ని అందుకుని ఆకలినే కాల్చేసిన బీభత్స నాటకంలో అచేతన మూలుగైపోయింది. ఆగనిరోదనైపోయింది..

ఆరుతడికి కూడా గతిలేని రెండో పంట కాలంలో నెత్తుటి ఊటమొదలైంది. చుట్టూ ఇరవై కళేబరాలను పరచుకుని రక్తసింహాసనం మీద కొత్త ఏలుబడి మొదలైంది
ఈతచాపలో చుట్టినా, భయపెట్టడానికి కోటగుమ్మానికి కట్టినా, వాడి శరీరం ప్రశ్నిస్తూనే వుంటుంది

ధర్మగంటలు మోగని పాలన, హృదయం లేని ప్రభువు, సానుభూతి నరంతెగిపోయిన సభ్యసమాజం ఎక్కడా వర్ధిల్లకూడదు. మూసినగుమ్మం ముందు పడిగాపులు పడవలసి రోజుల ఎవరికీ రాకూడదు పెద్దలే పిల్లలకు తలకొరివి పెట్టేరోజులు ఎప్పుడూ వుండకూడదు. 

స్మగ్లర్లని అదుపుచేయడం చేతకాక కూలీలలు కాల్చేసిన ఎన్ కౌంటర్ లో ఇరవై మంది చచ్చిపోవడంకంటే ఒక పూనకంగా దీన్ని సమర్ధిస్దున్న ప్రజల సంఖ్య పెరిగిపోతూండటమే దిగులుగా వుంది. మానవీయ విలువలకు చెదపట్టేస్తున్నంత భయంగా వుంది. ఇవాళ చట్టాన్ని వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తే అదే రేపు ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తుందన్న స్పృహలేకపోవడం బాధిస్తోంది.

నిస్సహాయులు ఏమిచేస్తారు నడిరోడ్డు మీద నిలబడి శాపనార్ధాలు పెడతారు…ఏడుదోసిళ్ళ దుమ్ము ఎత్తిపోస్తారు…(ఈపోస్టు అదే) 

జనబలం వున్నా సహనం నిబ్బరంలేని జగన్ 


లేచి నిలబడితే చాలు ”లక్షకోట్ల అవినీతీ ఇక కూర్చో” అనే హేళన…శాసనసభలో జగన్ అవస్ధ దయనీయంగా వుంది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వున్నపుడు ఆయన్ని వై ఎస్ రాజశేఖరరెడ్డి సభలో ఇంతే దారుణంగా అవమానించేవారు…దెబ్బకు దెబ్బ అని చప్పట్లు కొట్టుకోడానికి ఇది ఉద్వేగభరితమైన సినిమా సన్నివేశం కాదు. పరిహాసం పాలైన / పాలౌతున్న సభామర్యాద.

అరవైఏడుమంది సభ్యులు అంటే జగన్‌పార్టీకి అది గౌరవప్రదమైన బలమే. అయినా ఆ పార్టీ పరిస్థితి కాంగ్రెస్‌కంటె ఏ మాత్రం మెరుగ్గా లేదు. జగన్‌ మూటగట్టుకున్న అప్రతిష్ఠ ఆ పార్టీకి పెద్ద గుదిబండగా మారింది. అంతేకాకుండా శాసనసభలో జగన్ వ్యవహారశైలి ప్రజాప్రయోజనాల మీద దృష్టిగా కాక చంద్రబాబుని సహించేదిలేదన్న ఉడుకుమోతుతనంగానే వుంది. అధికారంలోకి రావడానికి సహనం అవసరమన్న కనీస సూత్రాన్ని కూడా ఆయన పట్టించుకోరని స్పష్టంగా తెలిసిపోతోంది. ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించడానికి ఏమి చేయాలో ఆయనకు అంతు బట్టడం లేదు. తనకు గణనీయమైన ఓట్లను ఇచ్చిన ప్రజలలో విశ్వాసం కలిగించడానికి, ఇవాళ కాకపోతే రేపైనా విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని కార్యకర్తల్లో కలిగించడానికి నాయకుడికి ఎంతో నిబ్బరమూ ముందుచూపూ ఉండాలి. రాజశేఖరరెడ్డి స్మృతి మీద ఆధారపడి నెగ్గుకువచ్చిన జగన్‌కు మున్ముందు ఆ ఆసరా ఉండదు.  జ్ఞాపకాన్ని సుదీర్ఘకాలం కొనసాగించడం కష్టం. ఆయన సొంత వ్యక్తిత్వం మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. జగన్‌కు ఉన్న అవినీతి ముద్ర ఆయనకు తీవ్రమయిన ప్రతిబంధకం కాకపోవచ్చు. అవినీతి పరురాలని నిర్ధారణ అయినా కూడా జయలలితకు ఆదరణ ఏమీ తగ్గలేదు.

2002 హింసాకాండ తరువాత నరేంద్రమోదీ ప్రతిష్ఠ దేశవ్యాప్తంగా ఎంతగా దిగజారిందో తెలిసిందే. దాన్నుంచి ఆయన తేరుకోవడమే కాదు, దాని నుంచి కూడా లబ్ధిపొంది, అభివృద్ధి వాది అన్న సానుకూల ముద్రను కూడా తోడు చేసుకుని ఆయన ఇవాళ ప్రధానమంత్రి కాగలిగాడు. సరి అయిన వ్యూహమూ, సహనమూ ఉంటే జగన్‌ తన ప్రతికూల ముద్రను కూడా అధిగమించవచ్చు. అయితే ఆయన స్వభావం ఇందుకు సహకరిస్తుందా ??? అనుమానమే!!!