రణమా! శరణమా!!


వైద్య ఆరోగ్య విశ్వాలయానికి ఎన్ టి ఆర్ పేరు తొలగించినందుకు మనస్తాపంతో రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్ష స్ధానం నుంచి వైఎల్ పి (డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్) వైదొలగడం ఒక సందేశంలా వుంది.

ప్రభుత్వాన్ని నడుపుతున్న వారి అడ్డగోలుతనాన్ని వ్యతిరేకించే వారు రణమో శరణమో తేల్చుకోవాలని వైఎల్ పి పిలుపు ఇచ్చినట్టు అనిపిస్తోంది.

ఆరోగ్యమంటే ప్రజారోగ్యమని, వైద్య సేవలను కిందికి తీసుకువచ్చినపుడే ఇది సాధ్యమౌతుందని ఇందుకు వైద్యవిద్యలను విజ్ఞానాలను సమన్వయంగా క్రోడీకరించాలని ఎన్ టి ఆర్ తలపెట్టారు.

రాష్ట్రంలో మెడికల్ కాలేజిలు, నర్సింగ్ కాలేజిలు, ఇతర పారా మెడికల్ కాలేజీల అవి వున్న ప్రాంతపు యూనివర్సిటీల పరిధిలో వుండేవి. ఒకే రాష్ట్రంలో వున్న వైద్య విద్యా సంస్ధల కాలెండర్లలో తేడాలు పైచదువులకు వెళ్ళే సందర్భాల్లో విద్యార్థుల్ని అడ్డుపెట్టేవి. ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో వుండేవారు. ఈ రంగంలో వున్న పెద్దలు అకడమీషియన్లు సమస్యను వివరించినపుడు
ఎన్ టి ఆర్ – రాష్ట్ర వ్యాప్తవ్యాప్తంగా అన్ని వైద్య, పారా వైద్య విద్యా సంస్ధల్నీ ఒకే పాలనా పర్యవేక్షణలో వుండేలా
వైద్య విశ్వవిద్యాలయాన్ని స్ధాపించారు. యూనివర్సిటీకి అవసరమైన మెడికల్ కాలేజిని, టీచింగ్ హాస్పిటల్ నీ విజయవాడలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రభుత్వానికి స్వాధీనం చేసింది.

తరువాత ఇదే నమూనాతో మరికొన్ని రాష్ట్రాలు కూడా రాష్ట్రమంతటికీ ఒకే హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పుకున్నాయి. ఇది వైద్యవిద్యల్లో దేశానికే ఒక దిక్సూచిగా నిలచిన డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ చరిత్ర. వై ఎస్ ఆర్ పేరు పెడుతున్న జగన్ తో సహా ఎవరైనా ఈ చరిత్రను మార్చగలరా?

మూడు దశాబ్దాల్లో వేల వేల మంది డాక్టర్లుగా, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లుగా, డెంటల్ సర్జన్లుగా, ఫిజియో ధెరపిస్టులుగా నర్సులుగా, పారామెడికల్ టెక్నీషియన్లుగా ఈ యూనివర్సిటీ నుంచి డిగ్రీలు తీసుకున్నారు. యూనివర్సిటీ పేరు మారిపోవడంతో వారి పరిస్ధితి ఏమిటి? మాతృసంస్ధతో లింకు తెగిపోయిన ఇలాంటి మెడికల్ అనాథలు బహుశ మరేరాష్ట్రంలో మరే దేశంలో కూడా వుండరుగాక వుండరు.

జగన్ లాంటి పాలకుల చేతిలో పడితే 1000 ఏళ్ళుగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విలసిల్లుతూ వుండేదా? తక్షశిల, నలందా విశ్వవిద్యాలయాల పేర్లు మనకు తెలిసేవా?
బెనరస్ హిందూ విశ్వవిద్యాలయం, ఆలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ, రవీంద్రుడి విశ్వభారతి యూనివర్సిటీలు ఏమైపోయేవి?

ఎవరైనా మంచి పనులు చేస్తే చరిత్రలో మిగిలిపోతారు. చరిత్ర పుస్తకానికి పేరు మార్చేద్దామనుకునే వారు, చిల్లర మనుషులుగా, వివేక వికాసాలు లేని తుంటరులుగా చరిత్రహీనులైపోతారు.

ప్రభుత్వ దుందుడుకు, తుంటరి పనులకు ఎవరైనా స్పందించవలసిందే. వైఎల్ పి రియాక్షన్ ఒక సందేశంగా వుంది. ఎన్ టి ఆర్ కుటుంబీకులతో సహా ఆయన అభిమానులు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా రియాక్ట్ కావలసిందే!

మరో విషయం కూడా గుర్తుకొస్తున్నది. ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రంలో వున్న బిజెపి ప్రభుత్వం బాహాటంగా ఉల్లంఘిస్తున్న సందర్భంలో కామినేని శ్రీనివాస్, ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇలా రియాక్ట్ అయివుంటే కథ మరోలా వుండేది.

ఆ ఇద్దరూ, మరెందరో కూడా సందర్భానికి వచ్చినపుడు ప్రతిస్పందించలేదు. వైఎల్ పి రియాక్ట్ అయ్యారు. అదే ఆయనకు వాళ్ళకు తేడా!

ఇంతకీ! డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని జగన్ ప్రభుత్వం వుంచుతుందా? కూల్చేస్తుందా?? #nrjy

కూల్చివేత…ప్రాధాన్యతా!ప్రతీకారమా! దృష్టిమళ్ళింపా! టైంపాసా! (శనివారం నవీనమ్)


రాష్ట్ర ప్రభుత్వం “ప్రజావేదిక”ను కూల్చివేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వుంటున్న అక్రమ నిర్మాణ నివాసాన్ని కూల్చివేయడాన్ని కూడా తప్పుపట్టవలసిన పని లేదు…

అయితే, రాష్ట్రవ్యాప్తంగా కరకట్టలను ఆక్రమించుకుని నివశిస్తున్న లక్షకు పైగా ఇళ్ళ మాటేమిటి? పోనీ విజయవాడలోనే కరకట్ట మీద వుంటున్న పదిహేను వేల నివాసాల మాటేమిటి? వాటిలో నివశిస్తున్న పేద కుటుంబాలకు పునరావాసం ఎలా అన్న ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం లేదు.

Read more

10 శాఖల్లో e పాలన


త్వరత్వరగా మారిపోతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో యువతరం ఎప్పుడూ ముందు ఉండలన్న ముఖయమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో చిన్నగా మొదలైన e పాలన ఊపందుకుంటోంది.

రాష్ట్ర ప్రగతికి అందరి సహాయ సహకారాలు అందిపుచ్చుకోవడం ద్వారా ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుంది. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు అందుబాటులో ఉండటంలో భాగంగా గూగుల్‌ హాంగవుట్‌ ద్వారా రాష్ట్ర ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. హాంగవుట్‌లో ఔత్సాహికులకు ఆయన సమాధానాలు ఇస్తున్నారు. తద్వారా నూతన సాంకేతక విధానానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ- ఆఫీస్‌ దేశ పరిపాలనా రంగంలోనే విప్లవాత్మకమైన పరిణామానికి నాంది పలికింది. పారదర్శకతతో కూడిన సుపరిపాలనను అందించడమేగాక, ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టడానికి సాంకేతికత తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణమాఫీ , రేషన్‌ పంపిణీ, గ్యాస్‌ సరఫరా, విద్యుత్‌ వంటి పథకాలకు ఆధునికతను జోడించారు. ఆన్‌లైన్‌ పరిజ్ఞానాన్ని అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించింది. మరో 10 కొత్త సంక్షేమ పథకాలను ఆన్ లైన్ లో ప్రవేశ పెట్టి రాష్ట్రంలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఇదే విజయవంతమైతే అర్హులకే సంక్షేమ ఫలాలు దక్కడంతో పాటు అనర్హులను తేలిగ్గా ఏరివేయవచ్చు.

ఎలకా్ట్రనిక్ కార్యాలయం
ఎలకా్ట్రనిక్ కార్యాలయం అమలులో భాగంగా ఫైళ్ళ నిర్వహణను ఆన్‌లైన్‌లోనే చేపట్టనున్నారు. ఫైళ్ళ తయారీతో పాటు ప్రాసెసింగ్‌, డిజిటల్‌ సంతకం సాయంతోనే చివరికి ఫైల్‌ను ఆమోదించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు సైతం ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా ఈ- ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. కేవలం ఇ (ఎలకా్ట్రనిక్) మెయిల్‌ వినియోగం గురించి తెలిసేవారికి ఈ- ఆఫీస్‌ను వినియోగించడం చాలా తేలికని అధికారులు తెలిపారు. తొలుత 10 ప్రభుత్వ శాఖల్లో ఈ కార్యాలయాన్ని అమల్లోకి తీసుకువస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం కూడా ఇందులో ఉంది.

అలాగే కీలకమైన ఆర్థిక శాఖతో పాటు సంక్షేమ శాఖలైన సాంఘిక, గిరిజన, బీసీ, మైనార్టీలను ఆన్‌లైన్‌ చేశారు. న్యాయశాఖ, గృహ నిర్మాణం, పౌరసరఫరాలు, వ్యవసాయంతో పాటు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలోనూ ఆన్‌లైన్‌ వ్యవస్థ అమలవుతుంది. ఆన్‌లైన్‌ కార్యాలయ వ్యవస్థలో మొత్తం ఆరు విభాగాలుంటాయి. అందులో భాగంగా ఈ-ఫైల్‌, నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌, ఈ- లీవ్‌, ఈ- టూర్‌, పర్సనల్‌ ఇన్ఫర్మేషన్‌, కొలబ్రేషన్స్‌ అండ్‌ మెసెజింగ్‌ సర్వీసెస్‌ ఉంటాయి

. ఈ-ఫైల్‌: అన్ని ఫైళ్ళను వరుస క్రమంగా నిర్వహిస్తుంది. సంబంధిత ఉద్యోగులు, అధికారులు అందరికీ అందుబాటులో ఉండేలా ఈ విధానం పని చేస్తుంది.

నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (కేఎంఎస్‌): నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం అనేది కేంద్రీకృత సమాచార వ్యవస్థగా పనిచేస్తుంది.చట్టాలు, విధానాలు, మార్గదర్శకాలు వంటి ప్రతి అంశం నాలెడ్జ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలో పొందుపరచడం జరుగుతుంది.

సెలవు నిర్వహణ విధానం (ఈ-లీవ్‌): ఉద్యోగుల సెలవులకు సంబంధించిన వివరాలన్నీ దీనిలో నమోదవుతాయి. సెలవు దరఖాస్తు, మంజూరు వంటి ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు నమోదు చేయడం జరుగుతుంది.

ఎలకా్ట్రనిక్ టూర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఈ- టూర్‌): విధి నిర్వహణలో భాగంగా సంబంధిత శాఖల్లోని అధికారులు, ఇతర సిబ్బంది ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారో ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. అలాగే పర్యటన సందర్భంగా ఎదురైన విషయాలను నమోదు చేయడం జరుగుతుంది.

పర్సనల్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (పీఐఎంఎస్‌ ): ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు పీ ఐ ఎం ఎస్‌లో నమోదు చేయడం జరుగుతుంది. అలాగే రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి నిల్వ చేస్తారు.

కొలబ్రేషన్‌ అండ్‌ మెసేజింగ్‌ సర్వీసెస్‌ (సీఎఎంఎస్‌): సంబంధిత శాఖలో పరస్పర సమాచారం చేరవేతకు సీ ఎఎంఎస్‌ సర్వీసును వినియోగిస్తారు. సందేశాల చేరవేతతో పాటు ఉద్యోగుల పే స్లిప్పులు, జీపీఎఫ్‌, ఇన్‌కంట్యాక్స్‌ వంటివన్ని ఈ- సేవల్లో ఉంటాయి.

సెంట్రలైజ్డ్‌ సర్వీస్‌: ఎలక్ట్రానిక్‌ కార్యాలయానికి సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్ర సర్వర్‌లో నిక్షిప్తమై ఉంటుంది. అధికారులు ఎక్కడినుంచైనా వాటిని పరిశీలించవచ్చు. అలాగే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి పర్యటనల్లో ఎవరైనా అర్హులకు మేలు చేయాలనుకుంటే అక్కడికక్కడే తక్షణ నిర్ణయం తీసుకోవచ్చు. అనర్హులను సైతం ఎక్కడికక్కడే గుర్తించవచ్చు. సంబంధిత సమాచారం అత్యంత భద్రంగా ఉండటానికి పలు రక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. అధికారులకు ప్రత్యేక కోడ్‌తో పాటు వేలిముద్రలు, కనుపాపల ఆధారాలు తీసుకున్న తర్వాతే కంప్యూటర్‌ తెరుచుకుంటుంది. దీనితో చిన్నపాటి తేడా కూడా వచ్చేందుకు అవకాశం లేదు. అలాగే డిజిటల్‌ సంతకాలు సైతం దుర్వినియోగమయ్యే అవకాశం ఏమాత్రం లేదు. ప్రస్తుతం దాదాపు అన్ని ఫైళ్ళను కంప్యూటరీకరించారు. మరో ఏడు నెలల కాలానికి చెందిన ఫైళ్ళు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. అవి కూడా పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మొత్తం పరిపాలనను ఈ- ఆఫీస్‌ద్వారానే చేయగలుగుతారు.

ఈ- ఆఫీస్‌ ప్రయోజనాలు: e పాలన నిస్సందేహంగా పారదర్శకతను పెంచుతుంది. ఫైళ్ళ కదలికలో రెడ్ టేపిజాన్ని అరికడుతుంది. ప్రజలు ‘కష్టమర్లయ్యే’ సందర్భాలలో లోపల ఏంజరుగుతూందో తెలుసుకోడాని వారు ఇపాలనలో ఇంటరాక్టు కావలసి వుంది అందుకు వారి డేటా సర్వర్లకు అవసరమౌతుంది. ఆధార్ కార్డే ఇందుకు ఆధారమౌతుంది. ఎలకా్ట్రనిక్ కార్యాలయంతో బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ప్రత్యేకించి పౌరులకు వేగవంతమైన పారదర్శ కమైన సేవలు లభ్యమవుతాయి. పని సామర్థ్యం మెరుగవడంతో పాటు నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి. క్లౌడ్‌ సర్వీస్‌తో ఉద్యోగులు ఎక్కడ్నుంచైనా పనిచేసుకునే అవకాశం ఉంది. డిజిటల్‌ సంతకం వినియోగంతో ఫైళ్ళ ట్యాంపరింగ్‌కు ఏమాత్రం అవకాశం ఉండదు. సంబంధిత శాఖల్లోని అధికారులు ఎన్ని గంటలు పనిచేశారో తెలుసుకోవడంతో పాటు ఎన్ని ఫైళ్ళను క్లియర్‌ చేశారనేది తెలుకోవచ్చు. నోట్‌ ఫైల్‌లోని అంశాలకు సంబంధించిన జీవోల ప్రతులు, ఆర్టికల్స్‌ను వాటితో పాటే అనుసంధానించగలిగితే అన్ని స్పష్టంగా చూసుకునే అవకాశం ఉంటుంది.‘గ్రామం మొదలుకుని సచివాలయం వరకూ ప్రతి దశలోనూ ‘ఈ-కార్యాలయం’ విధానాన్ని అమలు చేయడం వల్ల ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత పెరుగుతుంది. దస్త్రాలు వేగంగా పరిష్కారమవుతాయి. ఏ అధికారైనా తన శాఖకు సంబంధించిన దస్త్రాలను ఎక్కడి నుంచైనా పరిష్కరించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం పది శాఖల్లో ఈ విధానం ప్రారంభమవ్వడం శుభపరిణమం. మిగతా శాఖల్లో కూడా వీలైనంత వేగంగా ఈ విధానాన్ని ప్రారంభించాలి. 2015 మార్చి 31కల్లా అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ‘ఈ-కార్యాలయం’ విధానాన్ని అమలు చేసి దేశంలోనే తొలి ‘ఈ-సచివాలయం’గా ఆంధ్రప్రదేశ్‌ సచివాలయానికి గుర్తింపు తీసుకురావాలన్న చంద్రబాబు ఆకాంక్ష నెరవేరుతుందని ఆశిద్దాం.

e(ఎలకా్ట్రనిక్) పాలనలో ప్రజలు తెలుసుకోవలసిన సమాచారానికి # (హాష్ టాగ్) ని కూడా జోడిస్తే నాలాంటి వయసుమళ్ళిన వారి వల్ల కాదేమోగాని ఇంటర్ నెట్ పరిజ్ఞానమున్న వారు టాబ్లెట్ పిసిలు, ఫోబ్లెట్లు, స్మార్ట్ ఫోన్ లలో కూడా గవర్నమెంటుని చూడవచ్చు, అర్ధంచేసుకోవచ్చు, నిలదీయవచ్చు.