పండగంటే!!!


గత్యంతరం ఒకటుంటుందన్న స్పృహ కూడా లేకుండా జీవన గమనాలు గంతలు కట్టుకున్న చూపుల వెంట అలవాటైపోయిన సర్కస్ నడకలా సునాయాసంగానే గమ్యం చేరుకుంటూనే వుంటాయి. తండ్రివో, తల్లివో, కూతురివో, కొడుకువో, పనివాడివో, యజమానివో, దొరవో, వెధవవో…ఎవరివైనా సరే ఒక ఆర్బిట్ లో ప్రవేశించాక ఏ కక్ష్యలో పరిభ్రమణం వారిదే.

ఈ ప్రయాణంలో విసుగునీ, భారాన్నీ, విరక్తినీ తొలగించడానికో ఏమో, 
– ప్రయాసపడి భారాన్ని మోసేవారందరికీ ద్వారాన్నీ మార్గాన్నీ తానేనని దైవకుమారుడు ఇచ్చిన భరోసా…
– సర్వశక్తిమంతుడైన దైవం ఒక్కడే, మరే ఆరాధన అయినా అవిశ్వాసమే అన్న ప్రవక్త కనువిప్పూ…
– సర్వ సంశయాలూ విడిచి పెట్టి తననే శరణుకోరమని గీతాకారుడు ఇచ్చిన అండా…
మనిషి ఇచ్ఛను దేవుడి అధీనం చేయడానికి దారులు వేశాయి. 

ఇందుకు ప్రలోభంగా లభించే మనసు ప్రశాంతతా, వేడుక వాతావరణమూ పండగే! పండగే!!
కుడుములు లంచమిచ్చి, పనిముట్లు పూజలోపెట్టి ,కోర్కెలు తీర్చమనే వేడికోలు ఇంటిల్లపాదికీ సంబరమే!!

  

ఊహా, ఉద్వేగం – రంగే!హోళీ వెలవని జ్ఞాపకమే!!


రంగులు పలకరిస్తాయి…రంగులు పరవశింపజేస్తాయి…రూపాలనుంచి విడిపోయిన రంగులు ఒక ఉద్వేగం…రూపాలు కౌగలించుకున్న రంగులు మరో ఎమోషన్.. 
రంగుల్లేకపోతే ఊహలూ లేవు…అసలు మనిషి ఊహలు అనువాదమయ్యేది రంగుల్లోనే…

చెప్పలేనంత కృతజ్ఞతతో దేవుణ్ణీ, అంతుచిక్కని భయంతో దెయ్యాన్నీ సృష్టించుకున్న మనుషులు మిగిలిన అన్ని ఉద్వేగాలకూ రూపాల్ని అనుభవాలు అనుభూతల నుంచే తీర్చిదిద్దుకున్నరు. 

మనసన్నాక తుళ్ళింతా వుంటుంది. దానికి రంగూ రూపూ ఊపూ ఇచ్చిన మనిషి సృజనాత్మకత ప్రకృతినుంచి నేర్చుకున్నదే. ఇలా మనకొచ్చిన వాటిలో “హోలీ”ఒక రోమాంఛిత/రొమాంటిక్ వేడుక

ఉత్తరాదినుంచి “హోలీ” తెలుగునాట కాలు మోపి పడుచుపిల్లలకే పరిమితమైన “కోలాటం”తో కాలుకదిపి స్ధిరపడిపోయింది. ఈవాతావరణం రాజమండ్రిలో కనిపించని రోజుల్లో, 2001 లో కృష్ణుడు పెరిగిన బృందావనంలో (వృందావన్) నేనొక్కణ్ణీ హోలీ ఆట చూశాను. 

ఆసయమంలో న్యూఢిల్లీలో లక్ సభ స్పీకర్ (బాలయోగి గారు) నివాసంలో 14 రోజులు అతిథి గా వున్నాను. హోలీకి ముందురోజు స్పీకర్ పిఎ సత్తరాజుగారు వృందావన్ వెళ్తారా బాగుంటుంది అని అడిగారు. నా కూడా ఇంకెవరూ లేరు. ఏమీతోచనితనం వల్లా, కుతూహలం వల్లా సరేనన్నాను. 

కృష్ణజన్మస్ధానమైన మధుర, కృష్ణుడు పెరిగిన వృదావనం, హోలీ పండుగల గురించి ఆరాత్రి ఇంటర్ నెట్ లో సెర్చ్ చేసి ప్రింట్లు తీసుకున్నాను. నా కోరిక ప్రకారం ఇంగ్లీషు వచ్చిన కేబ్ డ్రైవర్ ని ఏర్పాటు చేశారు.

కారు రంగుల్లో తడిసిపోయింది. ముందుగా మధురలో కేశవదాస్ స్వామి (కృష్ణుడు) ఆలయానికి వెళ్ళాను. కూడా డ్రయివర్ వున్నాడు. అతని దగ్గర సత్తిరాజు గారు ఇచ్చిన ఉత్తరం వుంది. దానివల్లే పండగ రష్ లో కూడా మాకు క్యూతో నిమిత్తంలేని ప్రత్యేక దర్శనం దొరికింది. పాలతో కృష్ణుడికి స్నానం చేయించి ఒళ్ళు తుడితే అవకాశం కుదిరింది. ఆవాతావరణం శుభ్రంగాలేదు. పండితుల ను చూస్తే వీళ్ళు స్నానాలు చేసి చాలా రోజులయ్యిందేమో అనిపించింది. ఆమాటే అంటే డ్రయివర్ నన్ను చాలా కోపంగా చూశాడు.

అక్కడి నుంచి పదకొండింటికి వృందావన్ చేరుకున్నాము. కృష్టుడు పెరిగిన ఆ ఊరిలో బాగా తీర్చిదిద్దిన పెద్దతోట. ముదురు ఆకుపచ్చ ఆకులు. బూడిదరంగు కాండాలు. వేళ్ళతో నొక్కితే స్పర్శకు అందిన మెత్తని అనుభవం …ఒక మనిషిని ముట్టుకున్నంత మృదువుగా అనిపించింది. 

ఆచెట్లలో మామిడి రావి బాదం చెట్లను గుర్తుపట్టగలిగాను. అన్నీ పూల మొక్కలే ఎన్నోరంగురంగుల పూలు. గుంపులు గుంపులుగా మనుషలు. రంగులు పూసుకుంటూ…పులిమించుకుంటూ… అక్కడ ఉత్సాహమంతా పడుచు అమ్మాయిలూ, స్త్రీలదే. 

నల్లటి నారంగూ, ఆకారాల వల్ల ఉత్తరభారతీయుల మధ్య నేను ప్రత్యేకంగా కనబడుతాను. అక్కడ ప్రతీ ఒక్కరూ నన్ను కుతూహలంగా చూసినవారే. చాలమంది పలకరింపుగా నవ్విన వారే. ఒకావిడ వచ్చి ఏదో అని చేత్తో నొసటిమీదా చెంపల మీద రంగు పూసేసింది. బహుశ హిందీలో ఆమె నాకు శుభాకాంక్షలు చెప్పిందేమో. 

తరువాత అందరూ నన్ను రంగుల్లో ముంచేశారు. నాకూ రంగులు ఇచ్చారు. ఆరంగలు నా అసలు రంగుని కప్పేశాయి. రెండుగంటల సమయంలో నేనున్న చెట్టుకింద భోజనాలకు చేరిన ఒక కుటుంబంలో పెద్దావిడ నాకు రెండు ఆలూ పరాటాలు ఇచ్చింది. ఒకటే తీసుకున్నాను. అదితినేశాక రెండోది కూడా తీసుకుని వుంటే బాగుండేది అనిపించింది. ఆకలివల్ల కాదు అపరిచితునిపట్ల కూడా ఆదరణ చూపగల స్త్రీ అర్ధ్రతను గాఢంగా అనుభూతి చెందడానికే…

మంచుకురిసే హేమంతరుతువూ, కొత్తపూత పట్టే వసంతరుతువూ ఇచ్చే ఆహ్లాదం అంతా ఇంతాకాదు. ఈ సంతోషం ఓపలేనిదై, మనుషుల్లో రంగులై పొంగి, నృత్యమై నడుము ఊపి, చూపరులను ఉత్తేజభరితులను చేసి చిన్నగా చిందేయించిన అనుభవాన్ని బృందావనంలో పొందగలిగాను 

యవ్వనంలో ఆవేశం, ప్రేరకమై మనిషిని వదలని ఒక కాంక్ష ను కుదిపేయడం అపుడే అనుభూతి చెందగలిగాను.

అంతరాలు అరమరికలు లేని స్నేహోల్లాసపు మనిషితనానికి హోలీ ఒక ప్రతీక అని అపుడే అర్ధం చేసుకున్నాను. మూడ్, యాంబియన్స్ (కూడా) ఎంత ఎగ్జయిట్ మెంటు ఇస్తాయో చూపించే రొమాంటిక్ వేడుక కాబట్టే  “హోలీ” ఎవరికైనా పండగే! –   

మిత్రులందరికీ హోలీ శుభాకాంక్షలు!!!

(ఈ జ్ఞాపకం వయసు పద్నాలుగేళ్ళు . ఇప్పటికీ ఆ అనుభూతి అంతే గాఢంగా వుండటం నేను ఒక ఎమోషనల్ మనిషినని అర్ధమైపోతూనే వుంది. వయసు పెరుగుతున్న నా ఆరోగ్యానికి ఇది మంచో చెడో తెలీదు 🙂





❤️ సంక్రాంతి తలపోత


⭐️ హేమంత రుతువు : మనుషుల్ని ఆర్ధికంగా, హార్ధికంగా సుఖసంతోషాల్లో వుంచడంలో శారీరక మానసిక కారణాలతోపాటు వాతావరణం పాత్ర కూడా వుంటుంది.

⭐️ తొలిపంటను చేతికందించి గాదెల్ని పూర్ణకుంభాలు చేసేది, శరీరాల అలసట తొలగించి చలిలో నునువెచ్చటి వాంఛల్ని మీటేదీ హేమంత రుతువే!

⭐️ కమ్మరం, కుమ్మరి, వడ్రంగం వగైరా వృత్తులు అంతరించిపోవడమో, రూపాంతరమైపోవడమో జరిగి సంక్రాంతి కళ, రూప విన్యాసాలు కూడా మారిపోయాయి.

⭐️ గుడి అరుగులమీద గుడుగుడుగుంచాలు, చెరువుగట్టు మీద చెమ్మచెక్కలు, రచ్చబండ మీద అచ్చనగాయలు, జ్ఞాపకాల్లోతప్ప ఇపుడు కనిపించడమేలేదు.

⭐️ పెద్దఅరుగులమీద చుట్టూ పిల్లల్ని కూర్చోబెట్టుకుని కథలు చెప్పిన మామ్మలు టివిలకు, పిల్లలు ట్యూషన్లకు అతుక్కుపోతున్నారు.

⭐️ ఏ ఊళ్ళోనూ పల్లె లేదు. రచ్చబండలు చెక్కభజనలు ఏరువాకల వెన్నెల్లో ఆటలులేవు ఎదురయ్యేవి బక్కచిక్కిన బసవన్నలే…సినిమా పాటల హరిదాసులే.

⭐️ అయినా…రుతువులు గతులు తప్పి పంట కేలెండర్లు మారిపొతున్నా మనుషులు,మనసుల ప్రకృతి తప్ప, ప్రకృతి ఆకృతి మారడం లేదు…మారదు.

⭐️ నమ్రత తప్ప ఏమీతెలియని కాలువలు సాగిపోతూనే వున్నాయి. మనిషిలో మాలిన్యాన్ని గుండెలో దాచుకున్న తల్లిలా గోదావరి ప్రవహిస్తూనే వుంది.

⭐️ తాతలు గతించాకా వారి రూపులు వారసుల్లో వున్నట్టే, తరాలూ వేషభాషలు మారినా ఒక జాతి సంస్కృతీ సంప్రదాయాలు రూపాంతరమైనా సజీవంగా కొనసాగుతూనే వుంటాయి.

⭐️ ఇంట్లో సంబరమైతే అది వేడుక…ఉరంతా కేరింతైతే అది పండగ…దాదాపు నెలరోజుల హేమంత రుతుశోభకు పరాకాష్ట, ఉపసంహారమూ సంక్రాంతి పండుగే!