నిజమైన పుణ్యక్షేత్రం!!


రాజహంసలు, గూడబాతులు, మంచు కొంగలు…పేరు ఏదైనా కాని సైబీరియా నుంచి వచ్చే పక్షులకు పుట్టింటి వారి వలె పురుడుపోసి తల్లీబడ్డల్ని అల్లుడినీ భద్రంగా సాగనంపే “పుణ్యక్షేత్రం” 5-8-2018 ఆదివారం నాడు మరోసారి దర్శనమైంది.

ఆహారమైన క్రిమి కీటకాలవేటలో రాత్రంతా షికార్లు చేసి పగటిపూట తల్లకిందులుగా వేలాడుతూ నిద్రపోయే గబ్బిలాలకు గూడై నిల్చిన “రాధేయపాలెం” చెట్టుని ఆవెంటనే దర్శించుకున్నాము. 

ఇదంతా రాజమండ్రికి 20 కిలోమీటర్లలోపు దూరంలోనే! గ్రేకలర్ ముక్కు, మచ్చలు వున్న తెల్లకొంగలు జంటలు జంటలుగా జూన్ జులై ఆగస్టునెలల్లో సైబీరియా నుంచివస్తాయి. పుల్లా, పుడకా ముక్కున కరచి, పదిలపరచుకుని, సురక్షితమైన స్ధావరాల్లో గూడుకట్టుకుంటాయి. గుడ్డుపెట్టిన కొంగ దాన్ని పొదిగి పిల్లను చేసే వరకూ మగకొంగ మేతను ఏరుకు వస్తుంది. పిల్లకు రెక్కలు బలపడి ఎగరడం నేర్చుకునే వరకూ తండ్రి కొంగ గూడులోనే వుండి పిల్లను కాపాడుకుంటుంది. తల్లికొంగ మేతను ఏరుకొచ్చి తండ్రీబిడ్డల కడుపునింపుతుంది. రెక్కలొచ్చిన బిడ్డలు, తల్లిదండ్రులూ డిసెంబర్ జనవరి నెలలలో వెళ్ళిపోతాయి.

కుటుంబ బాధ్యతల్లో పనివిభజనకు ఇంతకంటే మరొక రోల్ మోడల్ వుండదు.

చిన్నపాటి అలికిడికే బెదరిపోయే మూగజీవులు పుణ్యక్షేత్రం గ్రామం చెరువు చుట్టూ గట్టంతావున్న చెట్లనిండా సైబీరియానుంచి వచ్చే పక్షుల గూళ్ళు కట్టుకుంటున్నాయంటే ఈ ఊరి జనం మీద ఆ పక్షుల నమ్మకానికి భరోసాకి ఆశ్చర్యమనిపిస్తుంది. పక్షులను వేటాడే వారిని ఊరినుంచి పంపివేయడం పుణ్యక్షేత్రంలో తరతరాల సాంప్రదాయం. గుడ్లు పొదగడానికి సరైన శీతోష్ణాలు, పౌష్టికాహారాలు లభించడంతో పాటు వాటిని కాపాడుకునే ఊరి కట్టుబాటూ, పుణ్యక్షేత్రాన్ని సైబీరియా కొంగలకు పుట్టిల్లుగా మార్చేసింది.

ఇదంతా పత్రికలలో, టివిలలో చాలాసార్లు వచ్చింది. నేనుకూడా స్యూస్ ఫీచర్ గా ఈనాడులో, ఈటివిలో, జెమినిటివిలో ప్రెజెంట్ చేశాను. మోతుబరి బొప్పన బ్రహ్మాజీరావుగారు, డాక్టర్ గన్నిభాస్కరరావుగారితో కలిసి లోకసంచారం చేస్తున్నపుడు, ఆ గ్రామంలో డాక్టర్ గారికి ఇదంతా వివరించాను. ఆయన స్వయంగా ఫొటోలు తీశారు.

బ్రహ్మాజీ గారు గబ్బిలాల చెట్టుగురించి గురించి చెప్పగా చక్రద్వారబంధం రోడ్డులో వున్న రాధేయపాలెం దారిపట్టాము. ఊరికి ముందుగానే వున్న చెట్టుకి నల్లతోరణాలు వెలాడుతున్నట్టు నిద్రపోతున్న గబ్బిలాలు కనిపించాయి.

ఈ రెండు సన్నివేశాలలో పుణ్యక్షేత్రం, రాధేయపాలెం గ్రామాల వారి భూతదయ, జీవకారుణ్యం కనిపిస్తున్నాయి.

ఈ సంచారంలో – లోకమే శబ్ధసంగీతాల మయం అని నాకు అర్ధమైంది. దోమలు, తేనెటీగలు, వడ్రంగిపిట్టలు, చిలుకలు, పావురాలు, కాకులు, పక్షులు…నడిచే – పాకే – ఎగిరే క్రిమికీటకాలు, జీవుల పాటల్ని వినగలిగితే మన చెవులు, శరీరం, మనసూ ఆలకించగలదని అనుభవమైనట్టు కొన్ని క్షణాలు అనిపించింది.

కీటకాల, పక్షుల, పిట్టల ప్రతీ కదలిక, ఆట, వేట, ఒరిపిడి, రోదన, సంతోషం, ఆనందాల్లో ఒక లయవుంటుందని, ఆ లయ నుంచే సంగీతం పుట్టుకొచ్చిందని అర్ధమైంది.

జనంరొదలేని ప్రశాంతతలోనే లయ వినపడుతుంది. అది అబలలైన మూగజీవాలక ఆ లయే భరోసా ఇస్తుంది. ప్రకృతి తన సృష్టి ని తాను కాపాడుకోవడం ఇదే! రాధేయపాలెం, పుణ్యక్షేత్రాల మహిమ ఇదే!!

– పెద్దాడ నవీన్

నోస్టాల్జియా ఒక తియ్యని గాయం!


(గోదావరి జనం యాస, జీవితం ఆత్రేయపురం పరిసరాల లొకేషన్లు ఇందులో

హైలైట్ మిగిలిందంతా హ్యూమన్ ఎమోషన్లే!)

దట్టించి, కిక్కిరిసి జీవితాన్ని కమ్ముకున్న కాలం తిరుగుతున్నట్టు కాక కాలిపోతున్నట్టు వుంది. తాతలు తండ్రులు పిల్లలకు బతుకు ఇచ్చిన ఊరిలాగ, ఊరి చెరువులాగ, పంటచేను లాగ, ఎడ్లబండిలాగ, మనుషుల మూలాలు, జీవితాల వేర్లు దగ్ధమైపోతున్నట్టు వుంది.

నేలమీద కాలిజాడలనే పడనివ్వని పరుగులో ఎన్ని సహజమైన ఆందాలను, అయినవారి మధ్య బంధాలను కోల్పోతున్నామో అనుకున్నపుడు నిట్టూర్పే మిగులుతుంది.

ఏది పోయిందో ఏది పోబోతోందో తెలియనివ్వని ఆధునిక మాయలో కొట్టుకుపోతున్న తరాలను చూస్తూ మనిషిలో గూడుకట్టుకున్న బెంగ కూడా ఒక తియ్యని గాయమే అవుతుందని ”శతమానం భవతి” చూశాక అనుభవమౌతుంది.

గతించిన కాలం మిగిల్చిన దుఖం కూడా ఒక ఉద్వేగభరితమైన ఆనందాన్ని ఇస్తుందని ”శతమానం భవతి” చూశాక అనుభవంలోకి వస్తుంది.

కుదిరితే మీరు కూడా #ZEEసినిమాలు లో వస్తున్న ఈ సినిమా చూడండి! బాగుంటుంది.

ఎగిరిపోతే ఇంత బాగుంటుంది!


ఎత్తుతక్కువ అంచులు, తక్కువ కోత శక్తి, విస్తారమైన వరదమైదానాలు, వున్న నదులను వృద్ధనదులు అంటారు. ఆఫ్రికాలో నైలునది, పాకిస్ధాన్ లో సింధునది, ఇండియాలో గంగ,గోదావరులకు ఈ లక్షణాలు వున్నాయి. గోదావరి ఏడాదిలో ఆరు నెలలు ముదురు గోధుమరంగులో మూడు నెలలు లేత గోధుమరంగులో మూడునెలలు లేత నీలం, లేత ఆకుపచ్చ రంగులు కలిసిన రంగులో వుంటుంది.

ఇవాళ ఈవినెంగ్ వాక్ సమయానికి వానతుంపరలు మొదలయ్యాయి. కారులో వాకింగ్ చేస్తూ చేస్తూ పుష్కరఘాట్ కి చేరుకునేసరికి నదిమీదుగా వీస్తున్న గాలి-నేలమీద కాళ్ళు వుంచే ఎక్కడికికో తెలిపోతున్న అనుభూతిని ఇచ్చింది అక్కడనిలబడితే చాలు ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అనుభవమౌతుంది. అప్పుడే ఫోన్ చేసిన ఒకఫ్రెండ్ మైల్డ్ గా గాలివీస్తున్న శబ్దం వినబడుతోంది ఎక్కడ అని అడిగారు. గోదావరి ఒడ్డున అని చెప్పగానే ఔనా అదేనా నన్ను తాకుతున్న హాయి అన్నారు. 

గోదావరి పక్కన వుండటమంటే అంత రొమాంటిక్ గా వుండటం! గోదావరి అంటే అంతటి భావుకత!!
ఫ్లడ్ లైట్ల వెలుగులో మెరుస్తున్న గోదావరి, నదికే నీరిచ్చే అడవులనుంచి కొట్జుకు వచ్చే ఖనిజలవణాలన్నీ నిరంతరం మేటలు పడుతూ పొరలుపొరలుగా సాగరంలోకి తరలిపోతూన్న వేళ పారదర్శకమైన నీటినుంచి నదీగర్భం గోధుమ రంగులో కనిపిస్తున్నట్టు అనిపించింది. 

 

పిచ్చుక లంక 


వందల సంవత్సరాలుగా గోదావరినుంచి ఇసుక, మట్టి రేణువులు పొరలు పొరలుగా ఏర్పడిన, ఏర్పడుతున్న అనేకానేక వరద మైదానాలలో ఇదొకటి. ఇది కాటన్ బేరేజి ధవిళేశ్వరం ఆర్మ్ కి కుడి చివర వుంది. వరదకాలంలో ఈ మైదానం మీద చిన్న చిన్న మేటలుగా పేరుకుపోయిన ఒండ్రుబురద ఎండకు ఎండీ మంచుకి మెత్తబడే దీర్ఘకాలిక ప్రక్రియలో నదికి అంచు/గట్టు/కట్టగా మారుతుంది. కుమ్మరి చక్రానికిఈ పా్రసెసే మూలం అనిపిస్తూంది. 

ఈ ఫొటోలో మధ్యలో కాలిబాట వున్న పుంతే గోదావరి గట్టు. కుడివైపు జిగురుగా వుండే చిత్తడి నేల. ఎడమవైపంతా పిచ్చుకలంక! గట్టునుంచి లంక పది మొదలు పదిహేను అడుగుల లోతు వుంటుంది. పొదలు, మొక్కలు చేట్లతో అలుముకున్న లంకలో ఆకుపచ్చతనమే తప్ప మట్టీ, నేలా కనిపించడం లేదు. దీని విస్తీర్ణం 48 ఎకరాలు. చాలా కాలంక్రితం రామానాయుడుగారు స్టూడియో కట్టడానికి పిచుకలంకను చూసి చాలదనుకునో ఏమో విశాఖకు వెళ్ళిపోయారు. రాజమండ్రిని రాషా్ట్రనికి టూరిజం హబ్ చేస్తామని ముఖ్యమంత్రి అన్నాక ఇపుడీ లంక ఎలావుందో చూద్దామని ఒక మిత్రుడితో కలసి వెళ్ళాను. లంక చివర అద్భుతమైన దృశ్యం…అది గోధుమ రంగులో వున్న గోదావరి రేవులో స్నానానికి దిగుతున్నట్టున్న సూర్యుడిని ఎంత సేపు చూసినా విసుగురాని సంధ్య కాంతి.

ప్రశాంతంగా మెల్లిగా నడుస్తున్న నదిలోతు అక్కడ పాతిక అడుగుల పైమాటే!

చుట్టూ పురుగుపట్టి ఎండిపోయిన దొండపాదులు. చూస్తూండగానే రెండు జెర్రిగొడ్లు మెత్తగా పాక్కుంటూ పొదల్లోకి పోయాయి.చెవుల నిండా కీచురాళ్ళు, కీటకాల నిర్విరామ సంగీతం. లంకనిండా తాచులు, జెర్రిగొడ్లే వున్నాయి. వాటినితొక్కితే తప్ప ఏమీ చేయవు. నేలంతా తెల్లిసర మొక్కేకదా పాము పౌరుషాన్ని చంపేసింది అని పాండు చెప్పాడు. 3/4 పాంటు చేతిలో కర్రవున్న పాండుది బొబ్బర్లంక ఇతనికి సొంత బైక్ వుంది. సెల్ ఫోన్ వుంది. ఇతను ఒక కౌలు రైతు కొడుకు. ఏమీ చదువుకోలేదు. డ్యూటీకి రాగానే చొక్కావిప్పేసి బైక్ డిక్కీలో దాచేస్తాడు. లంకలో సాయంత్రం దాకా గేదుల్ని మేపుకుని చొక్కాతొడుక్కుని గేదెల వెనుక నుండి బైక్ డ్రయివ్ చేస్తూ వాటిని ఇంటికి తోలుకుపోతాడు. 
   
    
   

భక్తి, శ్రద్ధల నదీ స్నానం!


కాలధర్మం చెందిన, అయిన వారి జ్ఞాపకాలను సృ్పశించే సామూహిక క్రతువే గోదావరి పుష్కరాల్లో పిండ ప్రధానమని అనుభవమయ్యింది. నా ఉనికికి మా కుటుంబ ఉనికికి క్షేతా్రలు బీజాలు అయిన నా తల్లిదండ్రులు, అత్తమామలు, వారి పెద్దల పట్ల ఒక భక్తి శ్రద్ధలు వ్యక్తపరచడానికి తొమ్మిదోరోజు అయివుండటం వల్ల అన్న శా్రద్ధం పెట్టాను. పూర్వీకుల పేరు నిలబెట్టేది దానమో, ధర్మమో, సంతానమో కనుక ఏదో ఒకటి అయివుండాలి కనుక వారసుడిగా ఒక బాధ్యత నిర్వర్తించానన్న సంతృప్తి మిగిలింది.

గతరాత్రి చాలా సేపు పెద్దలతో నా కున్న జ్ఞాపకలు గుర్తువచ్చాయివారిపట్ల నేను అనుచితంగా ప్రవర్తించిన కొద్ది పాటి సందర్భాలు తలపునకు వచ్చాయి. క్షమాపణలు చెప్పడానికి వారెవరూ లేకపోవడం కొంత దు:ఖానికి కారణమైంది.ఈ ఉద్వేగం పేరు 

పరితాపమో పశ్చాత్తపమో! ఇలా హృదయాన్ని స్వచ్ఛపరచుకున్నాక నదీ స్నానంతో లౌకికమైన క్రతువుని కూడా పూర్తి చేయాలనిపించింది. 
సర్ ఆర్ధర్ కాటన్ గారికి నా తండ్రి పెద్దాడ రామచంద్రరావుగారికి ఇతర కుటుంబ పెద్దలకు పిండ ప్రధానాలు చేయాలన్నాను. కాటన్ గారిగురించి కొత్తగా చెప్పనవసరంలేదు. నాతండ్రిగారు యోధుడు,త్యాగి ఆదర్శవంతమైన జీవితాన్ని ఆచరించిన హీరో. మిగిలిన వారందరూ కుటుంబాలకు మూల స్ధంభాలు. అయితే ఈ ఆర్డర్ లో పిండప్రధానం కుదరదని బ్రాహ్మణుడు తేల్చేశారు. నాతండ్రి, ఆయన తండ్రి ఆయన తండ్రి, నా తల్లి…నా మామ ఆయన తండ్రి, ఆయన తండ్రి, నా అత్త…ఆతరువాతే కాటనైనా మరెవరేనా అని వివరించారు. రాజమండ్రి వచ్చి ఇతరుల సమన్వయలోపం వల్ల అన్యాయంగా పుష్కరాల్లో చనిపోయిన వారి కి కూడా పిండాలు వెయ్యడం వీలుకాలేదు. వారి కుటుంబీకులు ఇపుడు చావు మైలలో వుంటారు కనుక ఇపుడు వారికీ శా్రద్ధాలు పెట్టడం కుదరదు అన్నారు. 
గోత్రనామాల దగ్గర మళ్ళీ చిన్న హర్డిల్…నా గోత్రం చెప్పగానే జంధ్యం ఏదీ అని అడిగారు. మానాన్నగారు నాస్తీకుడు అయి వుండటం వల్ల నాకు వొడుగు చేయించని సంగతి చెప్పాను. సరే శూద్రుడికి చేసినట్టే చేస్తాను అన్నారు. మామగారి గోత్రం చెప్పినపుడు ఇంటర్ కేస్టన్నమాట అన్నారు. దీనికి రెమిడీ వుంది పుష్కరాల తరువాత కలవండి అదీ ముగించేద్దాం అన్నారు. సరే అన్నాను (ఇలా చాలాసార్లయింది. నేను వెళ్ళిందీ లేదు..వెళ్ళేదీ లేదు) 
ప్రోటోకాల్ ఆర్డర్ ప్రకారమే మా కుటుంబాల పెద్దలకు ఇతరుల కోటాలో కాటన్ గారికీ పిండప్రధానం చెశాను.
ఉనికి గీసిన గిరులు దాటి వ్యక్తిత్వాలను విస్తరించుకున్న మనుషులను కాలమే గుర్తుంచకుంటుంది. వారిముద్రలు అంత తేలికగా చెదరవు, చెరగవు.

బాటచేసిన వారినీ, దారిచూపిన వారినీ మరచిపోము. స్మృతి ధాతువును గుండెలో ప్రతిష్టించుకుంటాము. ఇది గాఢమైన ఉద్వేగం…ఈ ఎమోషన్ కి ఒకరూపం పుష్కర స్నానం. 
మనసుల్లో విస్తరిస్తున్న ఎడారుల, ఆశల్లో మొలుస్తున్న ముళ్ళ మొక్కలు, ఊహల్లో అలుముకుంటున్న దుర్భిక్షాలవల్లనో ఏమో గోదావరిని చూస్తేనే ఒక మహదానందం.. ఏదో తన్మయత్వం…స్నానఘట్టం మెట్టుమీద నిలుచుండటమంటే మనుషులూ, గోదావరీ హద్దుగా గీసుకున్న ఆధీనరేఖమీదనో, చెలియలికట్ట నడుమనో ఆగి పరస్పరం గౌరవించుకుంటున్నట్టు అనిపిస్తుంది. మెట్టుదిగితే ఒక చిరు స్పర్శ అనుభవమౌతుంది. నడుములోతు దిగితే ఆలల ఊగిసలాటలో చిన్న సయ్యాట అనుభూతిలోకి వస్తుంది. అపారమైన జలరశులను చూస్తే అణగారిపోయిన ఆర్ద్రతలు 

చెమరుస్తున్నట్టు అనిపిస్తుంది. 
మానవ కల్మషాలు ధరించిన గోదావరీ నమస్కారం

గోదావరి డెల్డా అంటే చిలవలు పలవలుగా పాకిన ఈనెల్ని అల్లుకున్న  పచ్చని ఆకు 


తూర్పుగోదావరిలో, కోనసీమలో, పశ్చిమగోదావరిలో ఏ కాల్వకింద ఊరుకి వెళ్ళవలసిన అవసరమో ఆలోచనో తట్టగానే చల్లగా పడవ ప్రయాణం మొదలుపెట్టేసినట్టువుంటుంది. పారేనీరూ, కదలని చెట్టూ పలకరిస్తున్నాయనిపిస్తుంది. 

బ్యారేజి మీద బస్సు వెళుతున్నపుడు అఖండ గోదావరి జలరాశి మీదుగా వీచే నైరుతిగాలి మొహాన్నితాకినపుడు, లోనికి చేరినపుడు ఏదో పట్టరాని సంతోషంలో ఉక్కిరి బిక్కిరౌతున్నట్టు వుంటుంది. సహ ప్రయాణికుల మాటల్లో హావభావాల్లో కష్టసుఖాలు వినబడినపుడు, కనబడినపుడు మనం జీవితంలోనే వున్నామన్న స్పృహ వస్తుంది. బొబ్బర్లంక కూడలిలో సిపిఎం సభల ప్రచారం పాటలో దరువు మోత హుషారెక్కించింది. ఆపక్కనే చొక్కా బొత్తాలూడిపోయి, పుల్లయిస్ చీకుతున్న  పిల్లాడి మొహంలో ప్రపంచాన్నే జయించిన తృప్తికనబడింది.

విజ్జేశ్వరంలో బస్ ఫుల్లు. కాసేపటికి కోడిపెంట వాసనరాగానే సమిశ్రగూడెం దగ్గరున్నామని అర్ధమైపోయింది. ఖాళీ అయిన కిటికీ పక్క సీటులో కూర్చుంటే కనబడే దృశ్యాల అందాన్ని హైడెఫినెషన్ కెమెరాలు కూడా చూపించలేవు. పదకొండో తేదీ సోమవారం నాడు డి ముప్పవరం, కానూరు, తీపర్రు, కాకరపర్రు, అజ్జరం, పెరవలి.., సాయం సంధ్య వేళ అదేదారిలో రాజమండ్రికి తిరుగు ప్రయాణం చేసినప్పటి ముచ్చట ఇది. 

కొత్తగా తారుపరచుకున్నరోడ్డు మీద మెత్తగా బస్సు వేగంగా పాకుతున్నపుడు ఇది కాటన్ దొర బృదం తిరిగిన కాల్వగట్టేనన్న జ్ఞాపకం ఆ మహనీయుణ్ణి మరోసారి స్పురణకు తెచ్చింది. నీరుపల్లమెరుగుననే ప్రాధమిక సూత్రంలో గ్రావిటేషన్ ఫోర్సుని పురుకూస వుండలు విసిరి వాలు కనిపెట్టి ఆమార్గంలోనే కాలువలు తవ్వించిన ‘నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం’ టెక్నాలజీ మరోసారి అబ్బురమనిపించింది. 
పట్టని/నిండిన చోటునుంచి తొలగిపోడానికి నేలమీద నీరు ఏర్పరచుకున్న జాలు కాలక్రమంలో పశువులకు పుంతై, మనుషులకు దారై వర్షాకాలంలో పెద్ద అసౌకర్యమై, కాటన్ దొర చేతిలో గ్రావిటేషన్ కెనాలై, పర్యవేక్షణా నిర్వహణా యంత్రాంగాలకు రహదారులైన కాలక్రమంలో అందరికీ తార్రోడ్డయిన కాల్వగట్టు జీవిత చరిత్రగుర్తుకొచ్చింది. 


పొలాల పక్కనే టూవీలర్ మెకానిక్ షెడ్లు, మూడు చోట్ల సెకెండ్ హాండ్ కార్ల పార్కులు/సేల్సు పాయింట్లు చూస్తే జీవనశైలిలో యాంత్రిక సౌకర్యం కనిపిస్తూంది. ఆషెడ్ల చుట్టూ వున్న కొబ్బరాకు దడులు చూస్తే గోదావరి డెల్టా నేటివిటీ అర్ధమౌతుంది. 

ఒకో ఊరిలో  గుంపులు గుంపులుగా వీపున బరువైన బ్యాగులతో దిగే పలచటి కాలేజి అమ్మాయుల్ని చూస్తే  ఉచిత చదువు ఇచ్చిన ఎన్ టి ఆర్, వృత్తి విద్యాకోర్సులకు ఫీజు రీఎంబెర్స్ మెంటు ఇచ్చిన రాజశేఖరరెడ్డి గార్లమీద గౌరవమొచ్చింది. అబ్బాయిలు, అమ్మాయిల యూనీఫారాలు చూస్తే పూడ్చేసిన ప్రభుత్వ విద్యా సమాధుల మీద పూలకుండీల్లా అలంకరించిన ఆక్రమించుకున్న నారాయణ చైతన్య బ్రాండ్ల చదువులే తలపునకు వచ్చాయి. 

పంటకోసిన వరిచేలు పోలీసు అంటకత్తిరిలాగా, హైస్కూలు కుర్రాడికి తండ్రి చేయించిన సమ్మర్ క్రాఫులాగా వున్నాయి. 

పెళ్ళి ముచ్చట్లు, పలకరింపుల విషాదాలు, ఆస్పత్రి కష్టాలు, అప్పులతిప్పలు…ఇలాంటి ఈతి బాధలెన్నో అర్ధమైనట్టూ, అర్ధమవనట్టూ ప్రయాణికుల ముచ్చట్లలో వినబడుతూనే వున్నాయి.

కృష్ణా డెల్టా చూశాను, నాగార్జున సాగర్ కుడి ఎడమకాల్వల కింద ఊళ్ళు చూశాను. ప్రతీ ఇరిగేషన్ ప్రాజెక్టూ సిరిసంపదలను ఇచ్చేవే…అందుకు మూలాలైన పాడిపంటలు కృష్ణా, గోదావరి డెల్టాల్లో వున్నంత పదిలంగా దేశంలోనే ఎక్కడా లేవేమోనని నా అనుమానం. ఈ ప్రత్యేకత నైసర్గిక ఉనికి నుంచీ, నేల స్వభావం నుంచి వచ్చినవే. ఈ డెల్టాలు సముద్రతీరంనుంచి సగటున 70 కిలోమీటర్లలోపుదూరంలో, తీరానికి, నేషనల్ హైవేకీ మధ్యలో వున్నాయి. పంటకి అవసరంలేకపోయినా మాగాణుల్లో కాస్తయినా తీపినీరు లేకపోతే ఉప్పునీరు చేరి చేలు చౌడుబారిపోతాయి. నేల స్వభావం / సాయిల్ టెక్చర్ మారకుండా సహజ ప్రవాహాలే డెల్టాలను కాపాడుతున్నాయి. 

పట్టిసీమలో ఎత్తిపోతల పధకం వల్ల గోదావరి డెల్టాలో చివరి భూముల స్వభావం మారిపోతుంది. చౌడునేలలు మధ్యకంటా పాకిపోతాయి అని విజ్జేశ్వరంలో దిగిన రైతు పెరవలి సీతారామయ్యగారు వివరించారు. ఆయన తో సహా పశ్చిమగోదావరి జిల్లా వాళ్ళంతా ఏకపక్షంగా తెలుగుదేశాన్నే గెలిపించారు. అయితే ఈ సమస్యను ముఖ్య మంత్రికి చెప్పడానికి ఒక్కడంటే ఒక్కడు జిల్లా నాయకుడు కూడా లేడని ఆపెద్దాయన చాలా బాధపడ్డాడు. ఇది చెబుతున్నపుడు ఆయన కళ్ళలో దిగులుతడి మెరిసింది. 

పాలకులు గతులు తప్పుతున్నా, రుతువులన్నీ వేసవులౌతున్నా, పంట కేలెండర్లు మారిపొతున్నా మనుషులు,మనసుల ప్రకృతి తప్ప, ప్రకృతి ఆకృతి మారడం లేదు…మారదు.

నమ్రత తప్ప ఏమీతెలియని కాలువలు సాగిపోతూనే వున్నాయి. మనిషిలో మాలిన్యాన్ని గుండెలో దాచుకున్న తల్లిలా గోదావరి ప్రవహిస్తూనే వుంది. 
తాతలు గతించాకా వారి రూపులు వారసుల్లో వున్నట్టే, తరాలూ వేషభాషలు మారినా ఒక జాతి సంస్కృతీ సంప్రదాయాలు రూపాంతరమైనా  సజీవంగా కొనసాగుతూనే వుంటాయి. 

వీటన్నిటికీ మించి నీలిశూన్యంలో పరిమళాలు అల్లుతున్న గాలి నన్నుతాకడం గొప్ప అనుభవం…ఒక్కడినే అయిన నాలో వున్న నీటినీ,నేలనీ,గాలినీ,నిప్పునీ, ఆకాశాన్నీ…మూడుగదుల ఇల్లుదాటి స్వచ్ఛమైన ఒక ‘స్పేస్’లోకి రాగానే పంచభూతాలు పలకరించడమే నా ఆనందోద్వేగమనీ అనుభవయ్యింది.



పదే పదే మొదటికొస్తున్న కథ!మళ్ళీ మళ్ళీ చెట్టెక్కనున్న ‘పోలవరం’ బేతాళుడు? 


(శనివారం నవీనమ్)

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం శంకుస్ధాపన చేస్తున్న “పట్టిసీమ”ఎత్తిపోతల పధకంమీద ప్రశ్నలు, అనుమానాలూ వున్నాయి. ఎనభై టి.ఎమ్‌.సిల నీరు కేవలం కొన్ని పంపుల ద్వారా తోడి కృష్ణా డెల్టాకు సరఫరా చేసే పరిస్థితి ఉంటే పదహారు వేల కోట్లను వ్యయం చేసి పోలవరం పెద్ద ప్రాజెక్టు నిర్మించవలసిన అవసరం ఏమిటి? గోదావరిలోకాని, కృష్ణలో కాని ఒకే టైమ్‌ లో వరద వస్తే ఆ నీటిని ఎక్కడకు తరలిస్తారు? గోదావరి నుంచి నీటిని తీసుకువెళ్లి కృష్ణా డెల్టాలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేసే అవకాశం లేనప్పుడు ఎలా వినియోగి స్తారు? మోకాలికి, బోడిగుండుకు లింకు పెట్టినట్లు, పట్టిసీమకు, రాయలసీమ నీటికి లింకు పెట్టి ప్రాజెక్టుపై హడావుడిగా నిర్ణయం చేయవలసినంత పరిస్ధితి ఏమిటి?

కృష్ణా డెల్టాకు లిఘ్ట ద్వారా తరలించి, అప్పుడు కృష్ణనీటిని రాయలసీమకు వాడుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. వినడానికి బాగానే ఉంటుంది. కాని ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై స్పష్టత వుందా? శ్రీశైలం కాని, సాగర్‌ కాని రెండు రాష్ట్రాలకు సంబందించిన ప్రాజెక్టులు అన్న విషయం మర్చిపోకూడదు. నిజంగానే ప్రభుత్వం అనుకున్నట్లు జరిగితే కొంత ఉపయోగం ఉండవచ్చు. కాని అందుకు గ్యారంటీ ఏమిటి? అలాంటప్పుడు ప్రభుత్వం జారీ చేసిన జి.ఓలో రాయలసీమ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? గోదావరి డెల్టాల్లో రెండో పంటకు ఇప్పటికే చాలడంలేదు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం వల్ల ఈ సమస్య మరింత జటిలంకాదా?

పోలవరం మరో పదేళ్లకు కూడా పూర్తి అవుతుందన్న నమ్మకం లేకే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారా? అయితే ఆవిషయం బహిరంగంగా చెప్పగలుగుతారా?

ఆంద్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు ప్రాణప్రదమైంది. పోలవరం ప్రాజెక్టు వస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చాలా భాగానికి నీటి ఎద్దడి సమస్య తీరడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాని ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిజంగా పూర్తి అవుతుందా? లేక గందరగోళంగా మారుతుందా అన్నది పెద్ద ప్రశ్న.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టి.అంజయ్య (కాంగ్రెస్‌) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్లు గడచిపోయాయి. చివరికి అది వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పనిమొదలైంది. కిరణ్‌ కుమార్‌ రెడ్డి టైమ్‌లో కొంత ముందుకు వెళ్లింది.ఇప్పుడు అది నిధుల కొరత తో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.

అది ఎప్పటికి అవుతుందో తెలియని పరిస్థితిలో ఎపి ప్రభుత్వం హడావుడిగా మరో 1300 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టింది. భారీ ప్రాజెక్టులు వెంటనే ఫలితాలు ఇవ్వవని గతంలో చంద్రబాబు అంటూండేవారు. ఇది మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై అప్పట్లో ఆయన వైఖరి. ఇపుడు ఆయన స్టాండ్ మార్చకున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఎన్ టి ఆర్, వై ఎస్ ఆర్ లు ఈ రంగంలో తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతులే ఒక కారణం కావచ్చు.

ఎన్‌.టి.రామారావు పెద్ద ఎత్తున భారీ నీటి పారుదల ప్రాజెక్టులు చేపడితే, అంతకన్నా ఎక్కువ స్థాయిలో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చేపట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.వైఎస్ జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిపోయినా అసలు ప్రాజెక్టులు రాకపోవడం కన్నా ఏదోరకంగా అవి వస్తే మంచిదేనన్న సమర్ధన సామాన్యుల నుంచి కూడా వచ్చిందంటే సాగునీటి పారుదల రంగాన్ని గతపాలకులు ఎంతగా నిర్లక్ష్యం చేశారో అర్ధం చేసుకోవచ్చు.

పులిచింతల ప్రాజెక్టు రావాలని దశాబ్దాల తరబడి పత్రికలు ఎన్ని వందల వేల కధనాలు రాశాయో! పులిచింతల అవసరాన్ని నేనే ఈనాడులో పదిహేను సార్లయినా రాశాను.

చివరికి అది వైఎస్‌ హయాంలో ముందుకు రావడం, అది ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చి నీటినినిల్వ చేసే దశకు రావడం జరిగింది. అది లేకుంటే విభజన నేపధ్యంలో కృష్ణా డెల్టా తీవ్రమైన సమస్యలను ఎదుర్కునేది. అలాగే హంద్రీ నీవా ప్రాజెక్టు విషయంలో ఎన్‌.టిఆర్‌ చొరవ తీసుకున్నా, వైఎస్‌ రాజశేఖరరెడ్డి వచ్చాకే ఆ ప్రాజెక్టు బాగా ముందుకు వెళ్లింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆ స్కీము కింద నీటిని ఇచ్చి చెరువులు నిండేలా చేయడం హర్షణీయమే. అలాగే వెలిగొండను చంద్రబాబు టైమ్‌ లో ఆరంభించినా, రాజశేఖరరెడ్డి టైమ్‌ లో స్పీడ్‌ గా పనులు సాగాయి కాని ఇప్పుడు ఆ పనులు మందగించాయన్న భావన ఉంది. ఇవన్ని ఎందుకు ప్రస్తావించవలసి వస్తున్నదంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రాంతానికి ఇవి అన్ని ప్రాణాధారాలు అవుతాయి. వ్యవసాయం అధికంగా ఉన్న ఆ ప్రాంతానికి ఇవి జీవగర్రలు అవుతాయి. అందులోను రాష్ట్రం విడిపోయాక ఈ ప్రాజెక్టులన్ని చేపట్టడం దుస్సాధ్యం అయ్యేది.

ఈ తరుణంలో పోలవరం ప్రాజెక్టుకు సంబందించి నిధుల మంజూరు చూస్తే చాలా అధ్వాన్నంగా ఉంది. ఇప్పటికే నాలుగైదు వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టుకు కేవలం వంద కోట్లను కేంద్రం కేటాయించడం ఏమిటో అర్దం కాదు.

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత పోలవరం డామ్‌ కు ఏడాదికి కనీసం నాలుగువేల కోట్లు కేటాయించకపోతే, ఖర్చుచేసి పనులు వేగంగా జరిగేలా చూడకపోతే పదేళ్లయినా ఇది పూర్తి కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఏ ధైర్యంతో 2018 నాటికి పూర్తి అవుతుందని చెబుతున్నారో తెలియదు. చంద్రబాబు నాయుడు దేశంలోనే అతి సుదీర్ఘమైన అనుభవం కలిగిన తక్కువ మంది సి.ఎమ్‌.లలో ఒకరు. ఇప్పుడు ఆయన రాజనీతిజ్ఞతతో వ్యవహరించి మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప ప్రతి దానికి రాజకీయం ఆపాదించి నష్టపోకూడదు.

పట్టిసీమ ప్రాజెక్టుపై విపక్ష వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ సభ్యులు కాని,ఆ పార్టీ నేత జగన్‌ కాని మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా విని వారికి సంశయాలు తీర్చి ఉంటే సామాన్యుల సందేహాలుకూడా తొలగిపోయివుండేవి. కాని జగన్‌ మాట్లాడుతుంటే అసహనం చంద్ర బాబులో కనబడింది. పట్టిసీమపై చర్చలో మూడుసార్లు జగన్‌ మాటా ్లడుతున్నప్పుడు చంద్రబాబు అడ్డుకున్న తీరు, ఆయన మాట్లాడిన వైనం, వాడిన పదజాలం ఆశ్చర్యం కలిగిస్తాయి. సాక్షి తనకు వ్యతిరేకంగా వార్తను పట్టిసీమ చర్చకు లింకు పెట్టి అసలు జగన్‌ ను మాట్లాడ నివ్వకుండా చేయడంలోనే చంద్రబాబు కక్ష బయటపడింది. టిఆర్‌ ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ శాసనసభలో టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి అడ్డుపడిన తీరుకు, ఇక్కడ ఎపి శాసనసభలో జగన్‌ కు చంద్రబాబు అడ్డుపడిన తీరుకు పెద్ద తేడా లేదనిపిస్తుంది.  ఇది చంద్రబాబు, జగన్‌ ల సమస్య కాదు. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంలో ప్రజాప్రయోజనాలేమీలేవు.

చంద్రబాబు తన హయాంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి శాశ్వత కీర్తి ప్రతిష్టలు గడించుకోవాలని, తాత్కాలిక ప్రయోజనాలకోసం తెలుగుదేశం, బిజెపిలు పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచెయ్యకూడదని కోరుకుందామా?

మనలో మనమే మాట్లాడుకునే ఉద్వేగపు భాష – ప్రయాణం


కోరుకొండ, గోకవరం, సీతపల్లి, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు, ప్రాంతాల గిరిజనుల వేషధారణలో పెద్దమార్పు వచ్చింది. అబ్బాయులు జీన్ పాంట్లు, రెడీ మేడ్ షర్టుల్లో, అమ్మాయిలు వదులు వదులు పంజాబీ డ్రెస్సుల్లో గాగ్రాల్లో, అక్కడక్కడా లెగ్గింగ్స్ లో కనిపించారు. యువతీయువకుల మొహాల్లో బండతనం అంతరించి నున్నగా నాజూగ్గావున్నయి. టివిడిష్ లు మోటారు బైకులు విరివిగా కనిపించాయి. చవకైన రెడిమేడ్ దుస్తుల దుకాణాలు కూడావున్నాయి.

ఫిబ్రవరి 6, 2015 శుక్రవారం ఉదయం పదకొండున్నరకు రాజమండ్రిలో బయలుదేరి భద్రాచలం చేరుకునే వరకూ రోడ్డుకి ఇరువైపులా గమనించిన విశేషాలు ఇవి. డాక్టర్ గన్ని భాస్కరరావుగారి కారులో వారితోపాటు ఈ ప్రయాణం సాగింది. గోకవరం లో డాక్టర్ బదిరెడ్డి రామారావు గారి ఇంట్లో భోజనం చేసి వారిని కూడా వెంటబెట్టుకుని పన్నెండున్నరకు ప్రయాణం మొదలు పెట్టాము. ఈ ప్రయాణంలో రోడ్డుకి రెండువైపులా గమనించిన విశేషాలు ఇవి.

రోజూకంటే ముందు విందు భోజనం చేయడం వల్ల కునుకుతున్నపుడు ఎసి కారులోని చల్లదనాన్ని చలి ఆక్రమించుకున్నట్టు అనిపించింది. మారేడుమిల్లి జోన్ లో ఎంటరయ్యామని కళ్ళుతెరవకుండానే అర్ధమైంది. శ్రీమతి మణి ఆతిధ్యపు మగత కాసేపు కళ్ళు తెరవనీయలేదు. ఘాట్ రోడ్డుకి వచ్చాక వంపుల ప్రయాణానికి నిద్రతేలిపోయింది.

రోడ్డుని డబుల్ రోడ్డుగా విస్తరించారు. రోడ్డు బాగుంది. పనిచేస్తూ రెండు బుల్ డోజర్లు కనిపించాయి. పాతవాటిలా కాకుండా కాంపాక్టుగా వున్నాయు. రోలర్ లకు వైబ్రేషన్ వుంటటం వల్ల కంకర, ఇసుక, తారు ఖాళీలు లేకుండా సర్దుకుని సాలిడ్ రోడ్ అవుతుంది.

కొండవాలులు సరే చదునైన నేలలో ఎక్కడోగాని సారవంతమైన భూములు లేవు. జొన్న, బుడమ వొడ్లు లాంటి పైర్లు పలచగా కనిపించాయి. పొడిపారినట్టున్న ఎర్రమన్ను నేలమీద నానారకాల అడవి చెట్లు మొక్కలు పొదలు నల్లటి షేడ్లతో ముదురు ఆకుపచ్చ రంగులో గిడసబారిపోయినట్టు వున్నాయి. మనుషులేకాదు కుక్కలు, మేకలు, ఆవులు, ఎద్దులు కూడా సౌష్టవంగా లేవు. అలాగని బక్కచిక్కిపోయి కూడా లేవు. మొత్తం ఆప్రాంతపు జీవ చైతన్యంలోనే ఒక లాంటి గిడసబారినతనం వున్నట్టు అనిపించింది. జాళ్ళు అక్కడక్కడా గుంతల్లో పేరుకున్న కుళ్ళునీళ్ళు తప్ప పాములేరు, నాగులేరుల్లో ప్రవాహాలు లేవు. శబరినది మాత్రం మందమైన ప్రవాహంతో నిండుగా వుంది

చింతూరులో టీ తాగడానికి ఆగాము. ఒకప్పుడు వ్యాపారాలన్నీ గిరిజనేతరులవే..గిరిజనులు కూడా స్వయంగా వ్యాపారాలు చేసుకోవడం ప్రారంభమైంది. గిరిజనేతరుల వ్యాపారాల్లో పనిచేసే గిరిజనుల సంఖ్య పెరిగింది. అన్నిటికి మించి ఇరువురి మధ్యా ఆధిపత్య, పరాధీన భావనల్లో చనువు స్నేహభావాలు పెరిగాయి. ఒక గిరిజన యువకుడి (మొహం చూస్తే తెలిసిపోతుంది) టీదుకాణం ముందు నుంచుని పరిసరాలను పరిశీలించినపుడు ఇదంతా అవగతమైంది. ఆయువకుడు ఒక చెవికి పోగుపెట్టుకున్నాడు. ఫాషనా? మీ ఆచారమా అని అడిగితే ఫాషనే అన్నాడు. మూకుడులో వడల పిండి వేసేటప్పుడు ఆయువకుడు చెయ్యితిప్పడం ఒక నాట్య విన్యాసమంత కళాత్మకంగా కష్టంగా వుంది.

భద్రాచలం పట్టణంలో ప్రవేశించాక ఎడమవైపు కనిపించిన ‘తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ప్రయాణ ప్రాంగణం భద్రాచలం’…బోర్డు చూడగానే ఒక అనుబంధపు నరం మెలితిరిగినట్టు అనిపించింది. రాష్ట్రవిభజన తరువాత తెలంగాణాలోకి వెళ్ళడం ఇదే మొదటిసారి. ఊరి చివర పొలంలో వున్న మూర్తిరాజు గారి మకాం లోకి వెళ్ళి కాఫీ తాగుతూ తెలంగాణా లో ఎలావుంది పాలనబాగుందా అని అడిగినపుడు టౌను తెలంగాణా కిలోమీటరు లోపువున్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు.

అక్కడినుంచి ఆలయదర్శనం..నా మిత్రులు ప్రముఖులు కావడం మూలాన మేము క్యూలో వేచివుండకుండా నేరుగా గర్భగడిలోకి వెళ్ళే సదుపాయాన్ని స్ధానికులు కల్పించారు. గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నాము.

స్ధల, కాలాల పరిధిని దాటి అనంతంగా జీవించే స్మృతే దేవుడు…వందల తరాల తరువాత కూడా కొనసాగే ఎమోషనే భక్తి… సీత, లక్ష్మణ, హనుమంతుల తోడుగా రాముడు ఈ మాటే చెప్పాడనిపించింది ఏ పటాటోపమూ లేకపోవడం వల్లనేమో ఈయన ఫ్రెండ్లీ దేవుడయ్యాడని బోధపడింది. కాసేపైనా ఒక అలౌకిక ప్రశాంతత ఏప్రార్ధనా మందిరంలో అయినా వుంటుంది. గుడి, చర్చి, మసీదు ప్రతీచోటా ఇలాగేవుంటుంది. పోనీ దీన్నేదేవుడి మహిమ అనుకుందాం!

దారిలో “తానీషా కల్యాణ మండపం” ఓక్షణం గగుర్పరచిన మత సామరస్యపు స్ఫూర్తి అయింది. షాదీఖానాను కాకుండా ఓసంపన్నులైన నవాబుగారు కొన్నేళ్ళ క్రితమే ఈ కల్యాణ మండపాన్ని కట్టించారట!

టూరిజం హొటల్ లో చిన్నస్వామి రాజు గారి కి 84 వపుట్టిన రోజు అభినందన కార్యక్రమం. మేము వెళ్ళింది వారికి శుభాకాంక్షలు చెప్పడానికే…బుకేలు అందించి అడవిలో ఘాట్ లో ప్రయాణించవలసి వుందన్న వాస్తవాన్ని నైస్ గా మా హోస్టుల చెవిన వేసి కారెక్కేశాము.

మెలికలు తిరిగిన ఘాట్ రోడ్ లో ముందు ఎలాంటి రోడ్ వొంపు వుందో డ్రైవర్ కి తెలియడం ముఖ్యంగా రాత్రివేళ ఎంతైనా వుపయోగం సురక్షితమైన ప్రయాణానికి అదే దోహదకారి అవుతుంది. విశాలమైన బిఎం డబ్లూ్య – ఎస్ యువి కారు విశాలమైన డాష్ బోర్డుమీద జిపిఎస్ నావిగేటర్ ఇలా డ్రైవర్ అబ్బాస్ కి నిరంతరాయంగా దారి చూపిస్తూనే వుంది.

ఉదయం పదకొండున్నరకు రాజమండ్రినుంచి బయలుదేరి రాత్రి పదిన్నరకు ఇలా ఇల్లు చేరుకున్నాము.

సీతపేట కొండమీద దీపాలముగ్గు కనబడింది..గాలికి చెట్టూచెట్టూ రాసుకుని ఎండిన ఆకులు రాజుకుని గాలివీచిన మేరకు తగలబడిపోతూండటం దూరానికి దీపాల హారంలా కనిపిస్తూంది.

ఆకాశం నిర్మలంగా వుంది. పౌర్ణమి తరువాత మూడో రోజు కావడం వల్ల చంద్రుడు పూర్ణబింబమై వున్నాడు. దాదాపు ప్రయాణమంతా ఎడమ కిటికీ నుంచి చూస్తూనే వున్నాను. ఎక్కడోగాని నక్షత్రాలు కనిపించకపోవడంవల్లో, నేనేంటి అడవిగాచిన వెన్నెలనైపోయాను అనుకోవడవల్లో గాని తదియనాటి చంచమామ ఆయన కాస్తఎర్రగా వున్నాడు..

– పెద్దాడ నవీన్