ఏమోమరి!


పుష్కరాల్లో 5 వరోజున రాజమండ్రి బస్ స్టాండ్ లో బస్సుల రాక, పోక లేక గంటల తరబడి ప్రయాణీకులు నరకయాతన పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత రాత్రి 2 నుంచి ఐదున్నర వరకూ అక్కడే వుండి ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు వెళ్ళిపోయేలా దిద్దుబాటు చేశారు.

ఇది వేలాది మంది యాత్రికులకు ఊరటే…ఈ పని చేయడానికి ముఖ్యమంత్రే స్వయంగా తరలి రావాల? 
అలా అయితే రాజమండ్రిలో కేంపు చేసివున్న 30 వేలమంది పోలీసులు, 20 వేల మంది ఉద్యోగులు, పదిమంది మంత్రులు, ఆయా శాఖల సెక్రెటరీలు, కమీషనర్లు, 24 గంటలూ కెమేరాలు పనిచేసే కంటో్రలు రూములు ఏం చేస్తున్నట్టు? 
ఇంత మందీ మార్బలం పనికిమాలింది అనుకోవాలా? అధినాయకుడు సవయంగా రంగంలో దిగితే తప్ప కదలని తుప్పుపట్టిపోయిన యంతా్రంగమనుకోవాలా? ప్రతీసారీ నాయకుడే దిగిరావడం సాధ్యమేనా? సాధ్యమే అనుకుంటే ఇలాంటి బృదం ప్రత్యక్షంగా నాయకుడికి పరోక్షంగా ప్రజలకి భారం కాదా???
టీమ్ తో పనిచేయకుండా తానే పని చేయడం నాయకుడి లక్షణమా? 

నిపుణుడి లక్షణమా? 

నీరు వుంది…కనబడటం లేదు, అంతే! (గోదావరి మహిమ కథ) 


స్నాన ఘట్టాలు ఎంత అందంగా కట్టినా నీళ్ళే లేని గోదావరిలో పుష్కరస్నానాలు చేయడం ఎలా? 

ఈ ఫొటోను చూసినవారెవరికైనా కలిగే అనుమానం ఇదే!
రోజూ సగటున 8 లక్షల మంది యాత్రీకులు పుష్కరస్నానాలు చేయగలరని అంచనాతో ఏర్పాట్లు చేస్తున్న రాజమండ్రిలో మొత్తం 22 ఘాట్లలో సగం ఘాట్లలో దిగువ మెట్టు వద్ద అడుగులోతు నీరుకూడా లేదు. మిగిలిన ఘాట్లలో నేల, ఎండుతున్న బురదనీటి గుంటల్లావుంది. 
గత పుష్కరాలనాటికంటే ఇపుడు ఎక్కువనీరే గోదావరిలో వుంది….అయితే కనబడటం లేదు అంతే…ఘాట్ లలో సివిల్ నిర్మాణాలు చివరిదశలో వుండటం వల్ల వాటికి అంతరాయం లేకుండా వచ్చిన నీటిని వచ్చినట్టే ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్ మెంటు -కాటన్ బ్యారేజి తలుపులు తీసి సముద్రం లోకి వదిలేస్తున్నారు.
జూలైనెలలో గోదావరి నిండుగా ప్రవహిస్తూంది. ఈ సీజన్ లో సాధారణంగా బేరేజికి వున్న మొత్తం 175 తలుపులూ తెరిచే వుంచుతారు. 2002 వ సంవత్సరం నుంచీ ఇంత వరకూ 13 ఏళ్ళుగా జూలైనెలలో తేదీల వారీగా బేరేజి డిశ్చార్జిని విశ్లేషిస్తే గత పుష్కరాలో సగటున 25 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇపుడు అది 65 వేల క్యూసెక్కులు వుంది. అంటే ప్రస్తుతం సగటున ఒక సెకెనుకి 65 వేల ఘనపుటడుగుల నీరు సముద్రంలోకి వెళ్ళిపోతోంది.
30 వేల క్యూసెక్కుల చొప్పున నీరు విడుదలయిన గత పుష్కరాల్లో 15 రోజులపాటు బేరేజీ తలుపులన్నీ మూసివేయగా సగానికి పైగా మెట్లు మునిగిపోయాయి. మెట్లు దిగి సౌకర్యవంతంగా స్నానం చేయడానికి చాలినంత నీటి మట్టం స్నానఘట్టాల్లో కి చేరింది. ఇపుడు 65 వేల క్యూసెక్కుల్నీ బేరేజి తలుపులు మూసి బిగబడితే గోదావరి ఎగదన్ని స్నాన ఘట్టాలను నీళ్ళతో నింపేస్తూంది. 
ఇందువల్లే పుష్కరాలు ప్రారంభమయ్యే జూలై 14 వతేదీకల్లా దిగువ మెట్ల వద్ద మూడునుంచి నాలుగు అడుగులు నీరు తీసుకురాగలమని సూపరింటెండెంటింగ్ ఇంజనీరు సుగుణాకరరావు వివరించారు. 
లక్షలాది మంది పుష్కరయాత్ర సౌకర్యంగా చేయడానికి రకరకాల ఏర్పాట్ల నిమిత్తం ప్రభుత్వం చేసే పనులన్నీ ఒకఎత్తయితే, పుణ్యస్నానాలకు సమృద్ధిగా నదినీటిని గట్టుకి తెచ్చే వాటర్ మేనేజిమెంటు ఒకఎత్తు. అయితే సివిల్ అధికారులకు వచ్చినంత ప్రచారం వాటర్ మేనేజిమెంటు విభాగానికి రాదు. 
ఫిబ్రవరిలో వచ్చే శివరాత్రి నాటికి ఏనది అయినా ఎండిపోయే వుంటుంది. గోదావరి అందుకు మినహాయింపేమీ కాదు. అయితే రాజమండ్రిలో మాత్రం శివరాత్రికి ఓరోజు ముందే మాయచేసినట్టు, మంత్రమేసినట్టు స్నాన ఘట్టాలన్నీ నీళ్ళునిండి వుంటాయి. అది రెండోపంటకు బొటాబొటీగా గోదావరి నీరు ఇచ్చేసీజన్. అయినా భక్తి స్నానాల సెంటుమెంటు మీద గౌరవంతో పొలాలకు నీరు ఆపేసి బేరేజి తలుపులు మూసేసి గోదావరిని గట్టుకి ఎగదన్నించే వాటర్ మేనేజిమెంటు చిన్న అద్భుతమే! 
వాటర్ మేనేజిమెంటు మీడియాలో పేపర్లలో వివరంగా రాదుకనుక తెల్లారేసరికల్లా మెట్లమీదకి నీరు రావడాన్ని”శివలీల”అనుకోవడం విన్నాను. అలాంటి భక్తులే ఇపుడు దీన్ని”గోదావరి మహిమ” అంటే అదేమీ ఆశ్చర్యంకాదు!