రణమా! శరణమా!!


వైద్య ఆరోగ్య విశ్వాలయానికి ఎన్ టి ఆర్ పేరు తొలగించినందుకు మనస్తాపంతో రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్ష స్ధానం నుంచి వైఎల్ పి (డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్) వైదొలగడం ఒక సందేశంలా వుంది.

ప్రభుత్వాన్ని నడుపుతున్న వారి అడ్డగోలుతనాన్ని వ్యతిరేకించే వారు రణమో శరణమో తేల్చుకోవాలని వైఎల్ పి పిలుపు ఇచ్చినట్టు అనిపిస్తోంది.

ఆరోగ్యమంటే ప్రజారోగ్యమని, వైద్య సేవలను కిందికి తీసుకువచ్చినపుడే ఇది సాధ్యమౌతుందని ఇందుకు వైద్యవిద్యలను విజ్ఞానాలను సమన్వయంగా క్రోడీకరించాలని ఎన్ టి ఆర్ తలపెట్టారు.

రాష్ట్రంలో మెడికల్ కాలేజిలు, నర్సింగ్ కాలేజిలు, ఇతర పారా మెడికల్ కాలేజీల అవి వున్న ప్రాంతపు యూనివర్సిటీల పరిధిలో వుండేవి. ఒకే రాష్ట్రంలో వున్న వైద్య విద్యా సంస్ధల కాలెండర్లలో తేడాలు పైచదువులకు వెళ్ళే సందర్భాల్లో విద్యార్థుల్ని అడ్డుపెట్టేవి. ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో వుండేవారు. ఈ రంగంలో వున్న పెద్దలు అకడమీషియన్లు సమస్యను వివరించినపుడు
ఎన్ టి ఆర్ – రాష్ట్ర వ్యాప్తవ్యాప్తంగా అన్ని వైద్య, పారా వైద్య విద్యా సంస్ధల్నీ ఒకే పాలనా పర్యవేక్షణలో వుండేలా
వైద్య విశ్వవిద్యాలయాన్ని స్ధాపించారు. యూనివర్సిటీకి అవసరమైన మెడికల్ కాలేజిని, టీచింగ్ హాస్పిటల్ నీ విజయవాడలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రభుత్వానికి స్వాధీనం చేసింది.

తరువాత ఇదే నమూనాతో మరికొన్ని రాష్ట్రాలు కూడా రాష్ట్రమంతటికీ ఒకే హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పుకున్నాయి. ఇది వైద్యవిద్యల్లో దేశానికే ఒక దిక్సూచిగా నిలచిన డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ చరిత్ర. వై ఎస్ ఆర్ పేరు పెడుతున్న జగన్ తో సహా ఎవరైనా ఈ చరిత్రను మార్చగలరా?

మూడు దశాబ్దాల్లో వేల వేల మంది డాక్టర్లుగా, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లుగా, డెంటల్ సర్జన్లుగా, ఫిజియో ధెరపిస్టులుగా నర్సులుగా, పారామెడికల్ టెక్నీషియన్లుగా ఈ యూనివర్సిటీ నుంచి డిగ్రీలు తీసుకున్నారు. యూనివర్సిటీ పేరు మారిపోవడంతో వారి పరిస్ధితి ఏమిటి? మాతృసంస్ధతో లింకు తెగిపోయిన ఇలాంటి మెడికల్ అనాథలు బహుశ మరేరాష్ట్రంలో మరే దేశంలో కూడా వుండరుగాక వుండరు.

జగన్ లాంటి పాలకుల చేతిలో పడితే 1000 ఏళ్ళుగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విలసిల్లుతూ వుండేదా? తక్షశిల, నలందా విశ్వవిద్యాలయాల పేర్లు మనకు తెలిసేవా?
బెనరస్ హిందూ విశ్వవిద్యాలయం, ఆలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ, రవీంద్రుడి విశ్వభారతి యూనివర్సిటీలు ఏమైపోయేవి?

ఎవరైనా మంచి పనులు చేస్తే చరిత్రలో మిగిలిపోతారు. చరిత్ర పుస్తకానికి పేరు మార్చేద్దామనుకునే వారు, చిల్లర మనుషులుగా, వివేక వికాసాలు లేని తుంటరులుగా చరిత్రహీనులైపోతారు.

ప్రభుత్వ దుందుడుకు, తుంటరి పనులకు ఎవరైనా స్పందించవలసిందే. వైఎల్ పి రియాక్షన్ ఒక సందేశంగా వుంది. ఎన్ టి ఆర్ కుటుంబీకులతో సహా ఆయన అభిమానులు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా రియాక్ట్ కావలసిందే!

మరో విషయం కూడా గుర్తుకొస్తున్నది. ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రంలో వున్న బిజెపి ప్రభుత్వం బాహాటంగా ఉల్లంఘిస్తున్న సందర్భంలో కామినేని శ్రీనివాస్, ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇలా రియాక్ట్ అయివుంటే కథ మరోలా వుండేది.

ఆ ఇద్దరూ, మరెందరో కూడా సందర్భానికి వచ్చినపుడు ప్రతిస్పందించలేదు. వైఎల్ పి రియాక్ట్ అయ్యారు. అదే ఆయనకు వాళ్ళకు తేడా!

ఇంతకీ! డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని జగన్ ప్రభుత్వం వుంచుతుందా? కూల్చేస్తుందా?? #nrjy

కూల్చివేత…ప్రాధాన్యతా!ప్రతీకారమా! దృష్టిమళ్ళింపా! టైంపాసా! (శనివారం నవీనమ్)


రాష్ట్ర ప్రభుత్వం “ప్రజావేదిక”ను కూల్చివేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వుంటున్న అక్రమ నిర్మాణ నివాసాన్ని కూల్చివేయడాన్ని కూడా తప్పుపట్టవలసిన పని లేదు…

అయితే, రాష్ట్రవ్యాప్తంగా కరకట్టలను ఆక్రమించుకుని నివశిస్తున్న లక్షకు పైగా ఇళ్ళ మాటేమిటి? పోనీ విజయవాడలోనే కరకట్ట మీద వుంటున్న పదిహేను వేల నివాసాల మాటేమిటి? వాటిలో నివశిస్తున్న పేద కుటుంబాలకు పునరావాసం ఎలా అన్న ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం లేదు.

Read more

నా మీద అసహనంతో వున్న మిత్రునికి….


ఆశనిరాశల మధ్య, ఉద్రేక ఉద్వేగాల మధ్య, నిరీక్షణలు నిస్పృహల మధ్య కొట్టు మిట్టాడే కోటాను కోట్ల ప్రజల్లో నేనూ ఒకడి కాబట్టి, నా ఆలోచనలు స్పందనలు గడ్డకట్టుకు పోలేదు కాబట్టి, బతికుండగానే శవపేటికలో కూర్చోలేను కాబట్టి…

నువ్వు నన్ను మెసేజీల కొద్దీ తిట్టిన అనేక బూతుల్లో “ఎందుకు ఓ చించేసుకుంటున్నావు” అన్న ప్రశ్న ఒక్కటే నాకు ఆసక్తి కలిగించింది. ఆలోచిస్తే దొరికిన సమాధానమే ఇది. 

నిజమే! నేను ఏమీ చేయలేని వయసు పైబడుతున్న రోగగ్రస్తుణ్ణే! నాది పడకకుర్చీ ఉద్యమమే !! నేను నీ పక్షం కాదు. ఏపక్షమూ కాదు. నేను నేను సంఘజీవిని. సంఘంలో జరుగుతున్న మంచి చెడులను ఆలోచించకుండా, స్పందించకుండా వుండటానికి నేను మాడిపోయిన బల్బుని కాదు… 

నిన్ను నువ్వు వెలిగించుకో బాగుంటుంది!  శుభోదయం

పదే పదే మొదటికొస్తున్న కథ!మళ్ళీ మళ్ళీ చెట్టెక్కనున్న ‘పోలవరం’ బేతాళుడు? 


(శనివారం నవీనమ్)

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం శంకుస్ధాపన చేస్తున్న “పట్టిసీమ”ఎత్తిపోతల పధకంమీద ప్రశ్నలు, అనుమానాలూ వున్నాయి. ఎనభై టి.ఎమ్‌.సిల నీరు కేవలం కొన్ని పంపుల ద్వారా తోడి కృష్ణా డెల్టాకు సరఫరా చేసే పరిస్థితి ఉంటే పదహారు వేల కోట్లను వ్యయం చేసి పోలవరం పెద్ద ప్రాజెక్టు నిర్మించవలసిన అవసరం ఏమిటి? గోదావరిలోకాని, కృష్ణలో కాని ఒకే టైమ్‌ లో వరద వస్తే ఆ నీటిని ఎక్కడకు తరలిస్తారు? గోదావరి నుంచి నీటిని తీసుకువెళ్లి కృష్ణా డెల్టాలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేసే అవకాశం లేనప్పుడు ఎలా వినియోగి స్తారు? మోకాలికి, బోడిగుండుకు లింకు పెట్టినట్లు, పట్టిసీమకు, రాయలసీమ నీటికి లింకు పెట్టి ప్రాజెక్టుపై హడావుడిగా నిర్ణయం చేయవలసినంత పరిస్ధితి ఏమిటి?

కృష్ణా డెల్టాకు లిఘ్ట ద్వారా తరలించి, అప్పుడు కృష్ణనీటిని రాయలసీమకు వాడుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. వినడానికి బాగానే ఉంటుంది. కాని ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై స్పష్టత వుందా? శ్రీశైలం కాని, సాగర్‌ కాని రెండు రాష్ట్రాలకు సంబందించిన ప్రాజెక్టులు అన్న విషయం మర్చిపోకూడదు. నిజంగానే ప్రభుత్వం అనుకున్నట్లు జరిగితే కొంత ఉపయోగం ఉండవచ్చు. కాని అందుకు గ్యారంటీ ఏమిటి? అలాంటప్పుడు ప్రభుత్వం జారీ చేసిన జి.ఓలో రాయలసీమ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? గోదావరి డెల్టాల్లో రెండో పంటకు ఇప్పటికే చాలడంలేదు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం వల్ల ఈ సమస్య మరింత జటిలంకాదా?

పోలవరం మరో పదేళ్లకు కూడా పూర్తి అవుతుందన్న నమ్మకం లేకే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారా? అయితే ఆవిషయం బహిరంగంగా చెప్పగలుగుతారా?

ఆంద్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు ప్రాణప్రదమైంది. పోలవరం ప్రాజెక్టు వస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చాలా భాగానికి నీటి ఎద్దడి సమస్య తీరడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాని ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిజంగా పూర్తి అవుతుందా? లేక గందరగోళంగా మారుతుందా అన్నది పెద్ద ప్రశ్న.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టి.అంజయ్య (కాంగ్రెస్‌) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్లు గడచిపోయాయి. చివరికి అది వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పనిమొదలైంది. కిరణ్‌ కుమార్‌ రెడ్డి టైమ్‌లో కొంత ముందుకు వెళ్లింది.ఇప్పుడు అది నిధుల కొరత తో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.

అది ఎప్పటికి అవుతుందో తెలియని పరిస్థితిలో ఎపి ప్రభుత్వం హడావుడిగా మరో 1300 కోట్లతో పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టింది. భారీ ప్రాజెక్టులు వెంటనే ఫలితాలు ఇవ్వవని గతంలో చంద్రబాబు అంటూండేవారు. ఇది మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై అప్పట్లో ఆయన వైఖరి. ఇపుడు ఆయన స్టాండ్ మార్చకున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఎన్ టి ఆర్, వై ఎస్ ఆర్ లు ఈ రంగంలో తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతులే ఒక కారణం కావచ్చు.

ఎన్‌.టి.రామారావు పెద్ద ఎత్తున భారీ నీటి పారుదల ప్రాజెక్టులు చేపడితే, అంతకన్నా ఎక్కువ స్థాయిలో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చేపట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.వైఎస్ జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిపోయినా అసలు ప్రాజెక్టులు రాకపోవడం కన్నా ఏదోరకంగా అవి వస్తే మంచిదేనన్న సమర్ధన సామాన్యుల నుంచి కూడా వచ్చిందంటే సాగునీటి పారుదల రంగాన్ని గతపాలకులు ఎంతగా నిర్లక్ష్యం చేశారో అర్ధం చేసుకోవచ్చు.

పులిచింతల ప్రాజెక్టు రావాలని దశాబ్దాల తరబడి పత్రికలు ఎన్ని వందల వేల కధనాలు రాశాయో! పులిచింతల అవసరాన్ని నేనే ఈనాడులో పదిహేను సార్లయినా రాశాను.

చివరికి అది వైఎస్‌ హయాంలో ముందుకు రావడం, అది ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చి నీటినినిల్వ చేసే దశకు రావడం జరిగింది. అది లేకుంటే విభజన నేపధ్యంలో కృష్ణా డెల్టా తీవ్రమైన సమస్యలను ఎదుర్కునేది. అలాగే హంద్రీ నీవా ప్రాజెక్టు విషయంలో ఎన్‌.టిఆర్‌ చొరవ తీసుకున్నా, వైఎస్‌ రాజశేఖరరెడ్డి వచ్చాకే ఆ ప్రాజెక్టు బాగా ముందుకు వెళ్లింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆ స్కీము కింద నీటిని ఇచ్చి చెరువులు నిండేలా చేయడం హర్షణీయమే. అలాగే వెలిగొండను చంద్రబాబు టైమ్‌ లో ఆరంభించినా, రాజశేఖరరెడ్డి టైమ్‌ లో స్పీడ్‌ గా పనులు సాగాయి కాని ఇప్పుడు ఆ పనులు మందగించాయన్న భావన ఉంది. ఇవన్ని ఎందుకు ప్రస్తావించవలసి వస్తున్నదంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రాంతానికి ఇవి అన్ని ప్రాణాధారాలు అవుతాయి. వ్యవసాయం అధికంగా ఉన్న ఆ ప్రాంతానికి ఇవి జీవగర్రలు అవుతాయి. అందులోను రాష్ట్రం విడిపోయాక ఈ ప్రాజెక్టులన్ని చేపట్టడం దుస్సాధ్యం అయ్యేది.

ఈ తరుణంలో పోలవరం ప్రాజెక్టుకు సంబందించి నిధుల మంజూరు చూస్తే చాలా అధ్వాన్నంగా ఉంది. ఇప్పటికే నాలుగైదు వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టుకు కేవలం వంద కోట్లను కేంద్రం కేటాయించడం ఏమిటో అర్దం కాదు.

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత పోలవరం డామ్‌ కు ఏడాదికి కనీసం నాలుగువేల కోట్లు కేటాయించకపోతే, ఖర్చుచేసి పనులు వేగంగా జరిగేలా చూడకపోతే పదేళ్లయినా ఇది పూర్తి కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఏ ధైర్యంతో 2018 నాటికి పూర్తి అవుతుందని చెబుతున్నారో తెలియదు. చంద్రబాబు నాయుడు దేశంలోనే అతి సుదీర్ఘమైన అనుభవం కలిగిన తక్కువ మంది సి.ఎమ్‌.లలో ఒకరు. ఇప్పుడు ఆయన రాజనీతిజ్ఞతతో వ్యవహరించి మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప ప్రతి దానికి రాజకీయం ఆపాదించి నష్టపోకూడదు.

పట్టిసీమ ప్రాజెక్టుపై విపక్ష వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ సభ్యులు కాని,ఆ పార్టీ నేత జగన్‌ కాని మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా విని వారికి సంశయాలు తీర్చి ఉంటే సామాన్యుల సందేహాలుకూడా తొలగిపోయివుండేవి. కాని జగన్‌ మాట్లాడుతుంటే అసహనం చంద్ర బాబులో కనబడింది. పట్టిసీమపై చర్చలో మూడుసార్లు జగన్‌ మాటా ్లడుతున్నప్పుడు చంద్రబాబు అడ్డుకున్న తీరు, ఆయన మాట్లాడిన వైనం, వాడిన పదజాలం ఆశ్చర్యం కలిగిస్తాయి. సాక్షి తనకు వ్యతిరేకంగా వార్తను పట్టిసీమ చర్చకు లింకు పెట్టి అసలు జగన్‌ ను మాట్లాడ నివ్వకుండా చేయడంలోనే చంద్రబాబు కక్ష బయటపడింది. టిఆర్‌ ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ శాసనసభలో టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి అడ్డుపడిన తీరుకు, ఇక్కడ ఎపి శాసనసభలో జగన్‌ కు చంద్రబాబు అడ్డుపడిన తీరుకు పెద్ద తేడా లేదనిపిస్తుంది.  ఇది చంద్రబాబు, జగన్‌ ల సమస్య కాదు. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంలో ప్రజాప్రయోజనాలేమీలేవు.

చంద్రబాబు తన హయాంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి శాశ్వత కీర్తి ప్రతిష్టలు గడించుకోవాలని, తాత్కాలిక ప్రయోజనాలకోసం తెలుగుదేశం, బిజెపిలు పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచెయ్యకూడదని కోరుకుందామా?

జనబలం వున్నా సహనం నిబ్బరంలేని జగన్ 


లేచి నిలబడితే చాలు ”లక్షకోట్ల అవినీతీ ఇక కూర్చో” అనే హేళన…శాసనసభలో జగన్ అవస్ధ దయనీయంగా వుంది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వున్నపుడు ఆయన్ని వై ఎస్ రాజశేఖరరెడ్డి సభలో ఇంతే దారుణంగా అవమానించేవారు…దెబ్బకు దెబ్బ అని చప్పట్లు కొట్టుకోడానికి ఇది ఉద్వేగభరితమైన సినిమా సన్నివేశం కాదు. పరిహాసం పాలైన / పాలౌతున్న సభామర్యాద.

అరవైఏడుమంది సభ్యులు అంటే జగన్‌పార్టీకి అది గౌరవప్రదమైన బలమే. అయినా ఆ పార్టీ పరిస్థితి కాంగ్రెస్‌కంటె ఏ మాత్రం మెరుగ్గా లేదు. జగన్‌ మూటగట్టుకున్న అప్రతిష్ఠ ఆ పార్టీకి పెద్ద గుదిబండగా మారింది. అంతేకాకుండా శాసనసభలో జగన్ వ్యవహారశైలి ప్రజాప్రయోజనాల మీద దృష్టిగా కాక చంద్రబాబుని సహించేదిలేదన్న ఉడుకుమోతుతనంగానే వుంది. అధికారంలోకి రావడానికి సహనం అవసరమన్న కనీస సూత్రాన్ని కూడా ఆయన పట్టించుకోరని స్పష్టంగా తెలిసిపోతోంది. ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించడానికి ఏమి చేయాలో ఆయనకు అంతు బట్టడం లేదు. తనకు గణనీయమైన ఓట్లను ఇచ్చిన ప్రజలలో విశ్వాసం కలిగించడానికి, ఇవాళ కాకపోతే రేపైనా విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని కార్యకర్తల్లో కలిగించడానికి నాయకుడికి ఎంతో నిబ్బరమూ ముందుచూపూ ఉండాలి. రాజశేఖరరెడ్డి స్మృతి మీద ఆధారపడి నెగ్గుకువచ్చిన జగన్‌కు మున్ముందు ఆ ఆసరా ఉండదు.  జ్ఞాపకాన్ని సుదీర్ఘకాలం కొనసాగించడం కష్టం. ఆయన సొంత వ్యక్తిత్వం మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. జగన్‌కు ఉన్న అవినీతి ముద్ర ఆయనకు తీవ్రమయిన ప్రతిబంధకం కాకపోవచ్చు. అవినీతి పరురాలని నిర్ధారణ అయినా కూడా జయలలితకు ఆదరణ ఏమీ తగ్గలేదు.

2002 హింసాకాండ తరువాత నరేంద్రమోదీ ప్రతిష్ఠ దేశవ్యాప్తంగా ఎంతగా దిగజారిందో తెలిసిందే. దాన్నుంచి ఆయన తేరుకోవడమే కాదు, దాని నుంచి కూడా లబ్ధిపొంది, అభివృద్ధి వాది అన్న సానుకూల ముద్రను కూడా తోడు చేసుకుని ఆయన ఇవాళ ప్రధానమంత్రి కాగలిగాడు. సరి అయిన వ్యూహమూ, సహనమూ ఉంటే జగన్‌ తన ప్రతికూల ముద్రను కూడా అధిగమించవచ్చు. అయితే ఆయన స్వభావం ఇందుకు సహకరిస్తుందా ??? అనుమానమే!!!